బాల చెలిమి జాతీయ కథల పోటీలు 2025 సంకలనంలో ఎంపికైన నా కథ “చిట్టి చేతులు – పెద్ద పనులు” చదవండి. మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా కథ పది మందికి చేరుతుంది. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. కథని నా పర్సనల్ website లో కూడా చదవవచ్చు.



నాన్న..ఎగ్జామ్స్ అయిపోయాక మమ్మల్ని పిక్నిక్కి తీసుకెళతానన్నావు కదా..? ఎప్పుడు వెళదాం చెప్పు..?” ఇంట్లోకి అడుగుపెట్టగానే తండ్రి కాళ్ళను చుట్టేస్తూ గారంగా అడిగింది చిట్టి.
“అవును నాన్న. ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇద్దరం బాగా రాసాము. మరి పిక్నిక్ తీసుకువెళతారా..?” అంటూ ఆశగా చూసాడు సతీష్. “తప్పకుండా రేపే వెళదాము. పెందలాడే తినేసి త్వరగా పడుకోండి మరి” అని నవ్వుతూ విమల ఇచ్చిన టీ తాగసాగాడు కరుణాకర్. “ఐ…! రేపు మనం పిక్నిక్ వెళుతున్నాము” అని ఎగిరి గంతులువేస్తూ తల్లిని చుట్టేశారిద్దరూ. చిట్టి రెండవ తరగతి, సతీష్ నాల్గవ తరగతి చదువుతున్నారు.
సముద్రపు ఒడ్డున ఇసుకలో కేరింతలు కొడుతున్నారు సతీష్, చిట్టి. విశాలమైన సముద్రం. దూరం నుంచి వేగంగా వచ్చిన అలలు క్రమంగా నెమ్మదించి ఒడ్డును చేరి పిల్లల కాళ్ళను తడిపి, వాళ్ళని చల్లగా పలకరించి వెళుతుంటే చిట్టీ, సతీష్ లకి భలే సరదాగా అనిపించింది. ఆ రోజు ఆదివారం కావడంతో చాలామంది బీచికి వచ్చున్నారు. పెద్దలు కూడా పిల్లలను గమనిస్తూ, ఇసుకలో కూర్చుని కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. చిట్టి, సతీష్ కాసేపు కెరటాలు మోసుకువచ్చే అలలను చూసారు. చప్పట్లు కొడుతూ, ఇసుకలో ఎగిరెగిరి గంతులు వేశారు. ఇసుకలో గవ్వలను, చిన్నిచిన్ని శంఖులను ఏరుతోంది చిట్టి. చెల్లితో పోటీపడి సతీష్ కూడా గవ్వలను ఏరుతున్నాడు. ఇసుకలో బొరియలు చేస్తూ పీతలు, వేగంగా కదులుతూ కొన్ని రకాల కీటకాలు కూడా కనిపించాయి వాళ్ళకి. గవ్వలు ఏరుకుంటూ ఒడ్డువెంట కొంత దూరం నడుస్తూ వెళ్ళారిద్దరూ.
కొంతమంది సముద్రంలోకి దిగి ఈత కొడుతున్నారు. కొంత మంది ఒడ్డుకు కాస్త దగ్గరగానే నీళ్ళల్లో మునుగుతూ ఆడుకుంటున్నారు. హఠాత్తుగా “నాన్నా” అంటూ అరిచింది చిట్టి. కాస్త దూరంలో జనాల మధ్య ఉన్న చిట్టి వైపు చూస్తూ కంగారుగా “ఏమైంది..?” అంటూ చిట్టి దగ్గరకి వచ్చాడు కరుణాకర్ . “అక్కడంతా ఎంత చెత్త ఉందో చూడండి నాన్నా..! పాపం ఈ చెత్తని చూసి సముద్రం దిగులు పడుతుంది కదా నాన్నా” అంది చిట్టి ముక్కు మూసుకుంటూ. ‘చిట్టి అమాయకంగా అడిగినా ఎంత అర్ధవంతమైన సందేహాన్ని వెలిబుచ్చింది’ అనుకున్నాడు కరుణాకర్. బీచిలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, పేపర్ ప్లేట్స్ పడి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా చెత్తతో నిండిపోయి ఉంది. కొందరు సముద్ర స్నానం ముగించి, ఒడ్డున కూర్చుని తమతో పాటు తెచ్చుకున్న స్నాక్స్ తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ, తమ కళ్ళ ముందే నిర్లక్ష్యంగా కూల్ డ్రింక్ బాటిళ్ళను విసిరిపారేస్తున్నారు.
రోజువారీ పనుల్లో అలసిపోయిన వారు కాసేపు సేదదీరడానికి, పిల్లలు పెద్దలు సెలవు రోజుల్లో వినోదంగా గడపడానికి ఆటవిడుపైన పర్యాటక స్థలం ఈ సముద్రపు ఒడ్డు. తమ కన్ను తామే పొడుచుకున్నట్లు, తమ ఆనందం కోసం వచ్చే ప్రదేశాన్ని తామే కలుషితం చేస్తున్నారు. చిన్నపిల్లలు పడవేస్తుంటే పెద్దవాళ్ళు కనీసం వద్దని కూడా చెప్పడంలేదు. పైగా వాళ్ళే కవర్లు, పేపర్ ప్లేట్లను పడవేస్తున్నారు. పెద్దవాళ్ళని చూసే కదా పిల్లలు నేర్చుకునేది. ఒక ఆలోచన వచ్చింది కరుణాకర్ కు. వెంటనే దాన్ని అమలుపరచాలనుకున్నాడు. కాస్త దూరంలో పార్కింగ్ చేసున్న తమ కారు దగ్గరకు వెళ్ళి, లాక్ తీసి, వెనుక సీట్ లో ఉన్న పెద్ద కవర్లు రెండు బయటకు తీసాడు. ఇంటినుంచి ఎక్కడకు వెళ్ళినా, దేనికైనా ఉపయోగపడతాయని కవర్లు తమ వెంట తేవడం అలవాటు అతనికి.
పెద్ద కవర్ ని పట్టుకున్నాడు కరుణాకర్. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులను ఏరుకొచ్చి, ఆ కవర్ లో వేయమన్నాడు సతీష్ ని. చిట్టిని పేపర్ ప్లేట్స్ ని ఎత్తి తన దగ్గర ఉన్న కవర్లో వేయమంది విమల. వాళ్ళిద్దరూ హుషారుగా వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో అక్కడ పడిఉన్న ప్లాస్టిక్ చెత్తని ఏరి కవర్లలో వేయసాగారు. వాళ్ళు చేసే పనిని మొదట కొందరు వింతగా చూసారు. చెత్తను అక్కడ పారేసిన వాళ్ళు తమ తప్పు తెలుసుకుని, తమపిల్లలను కూడా చెత్తను సేకరించి కవర్లలో వేయమన్నారు. పిల్లలందరూ హుషారుగా చెత్త ఏరసాగారు. సతీష్, చిట్టీలు మొదలుపెట్టిన పర్యావరణ పరిశుభ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది సముద్రం ఒడ్డున. ఒక అరగంట గడిచేసరికి సముద్రపు ఒడ్డున ఉన్న ప్రదేశమంతా చూస్తుండగానే శుభ్రంగా తయారైంది. “నాన్నా..మరి ఇప్పుడు సముద్రం చాల సంతోషపడుతుంది కదా” అంది చప్పట్లు కొడుతూ చిట్టి. “అవునురా చిట్టి తల్లీ” అంటూ చిట్టిని ఎతుక్కుని గిరగిరా తిప్పాడు కరుణాకర్. అందరూ వచ్చి కరుణాకర్, విమలల మంచి ఆలోచనను ప్రశంసించారు. సతీష్, చిట్టీలను మెచ్చుకున్నారు. పర్యావరణ పరిశుభ్రత సామాజిక బాధ్యతల్లో ఒకటి, ఆ బాధ్యతను పిల్లలకు చెప్పి చేయించడమేకాదు, సాటివారికి కూడా ఆదర్శంగా నిలిచిన కరుణాకర్, విమల దంపతులను గొప్ప తల్లిదండ్రులు అని కొనియాడారు.
ఇళ్ళముందర చేపల వలలు అల్లుకుంటున్న కొందరు స్థానిక జాలరి వాళ్ళను పిలిచి, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వచ్చే వ్యాధులు, నష్టాల గురించి వారికి వివరించాడు. సముద్ర తీరంలో చెత్త పేరుకుపోవడం వల్ల చేపలు, నత్తలు, ఇతర సముద్ర జీవులకు కలిగే నష్టాల గురించి చెప్పాడు. బీచికి సమీపంలో ఉండే మండలంలోని అధికారులను కలిసి, సముద్రతీరంలో పెద్ద డంపర్ బిన్ లను ఏర్పాటు చేయిస్తానని వారితో చెప్పాడు. బీచిలో చెత్త వేయకూడదు అని తెలుపడానికి ప్లకార్డు లను కూడా ఏర్పాటు చేయిస్తానని వారికి మాట ఇచ్చాడు. జాలరి కుటుంబాల వారు కూడా కరుణాకర్ మాటలకు చాల సంతోషించారు. ‘పరిశుభ్రతే దైవం’ అని నమ్మిన వాళ్ళు ఆ రోజు మంచి పని చేశామనే తృప్తితో ఇంటికి బయలుదేరారు చిన్నారి సతీష్, చిట్టీలతో సహా. మొత్తానికి ఆ రోజు బీచిలో చిట్టి చిట్టి చేతులు అన్ని కలిసి పెద్ద పనిని చేసాయి అని బీచికి వచ్చినవారందరు తృప్తి చెందారు. ప్రకృతి మనది. దానిని మనమే కాపాడుకోవాలి అని తెలుసుకున్నారు.