చంద్రకాంత చెలి

సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరాను
చెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా..

సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరాను

చెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా..

మరింత పక్కున నవ్వాయి చంద్రకాంత పూలు

రేపొద్దునకి వాడిపోతారు అంత నవ్వెందుకు

అని ఉడుక్కున్న నాకు ఊసులెన్నో చెప్పాయవి..

అరపూటే మా జీవితం అయితే ఏంటంట

మీలా కాదు మేము అంటూ గర్వంగా తలలూపాయి..

మీ మనుషులకే కదా బాధలు వేదనలు

బంధాలు బంధనాలు వేతలు వేధింపులు..

విద్వేషపు కొట్లాటలు మోసపూరిత దుర్మార్గాలు

తేనె పూసిన కత్తులు విషం నిండిన గొంతులు

వందేళ్ళ బతుకు ఉన్నా అరక్షణమైనా

తృప్తి లేని బతుకులు అందని వాటికోసం

ఆరాటాలు, అంతే లేని కోరికల గుర్రాలు..

మాతో మీకు పోలికెక్కడ..?

మా జీవితం అరపూటలోనే ముగిసిపోయినా

మీ కళ్ళకు వర్ణశోభితాలు అద్ది

మీ ఊపిరులకు ఆయువు పోసి

రాత్రంత వెన్నెల్లో తడిసి చందమామతో మురిసి

ఉదయానికి మా కర్తవ్యం ముగించి

ఆనందంగా వెళ్ళిపోతాం అంటూ

గమ్మత్తుగా బోలెడన్ని కబుర్లు చెప్పాయి

ఊదారంగు చంద్రకాంత చెలులు.. 💕

రోహిణి వంజారి

23-11-2022