గారడి చక్రం

ఈ పక్షం “తంగేడు” పత్రిక లో నా కవిత “గారడి చక్రం”. “తంగేడు” పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🙏

ఓ క్షణం వెలుగు పూల సంబరం
మరుక్షణం చీకటి నీడల భయం
ఓ క్షణం శిఖరాగ్రం వైపు చూపులు
మరుక్షణం పాతాళంలోకి అడుగులు
ఓ క్షణం స్వేచ్చా పరిమళాలు
మరుక్షణం బందీ అయిన ఊపిరులు
ఓ క్షణం విజయోల్లాసం
మరుక్షణం ఓటమి సలుపుతున్న గాయం
ఓ క్షణం ఎక్కుతున్న ఆశల నిచ్చన
మరుక్షణం నిరాశ మిగిల్చిన వేదన
ఓ క్షణం నిండిన పూర్ణకుంభం
మరుక్షణం ఎండిన శూన్య శకలం
ఓ క్షణం వసంత శోభల చిగురు హరితం
మరుక్షణం శిశిరపు ముడుతల వార్ధక్యం
ఓ క్షణం పిండారబోసుకున్న వెన్నెల్లో విహారం
మరుక్షణం కాటుక పులుముకున్నకాళరాత్రిలో పయనం
ఓ క్షణం నమ్మిన ఆదర్శాల వెంట ఉరకలెత్తే గమనం
మరుక్షణం కూలిన ఆశయాల కుప్పమీద చలనం లేని శవం
ఇది జీవిత రహదారిలో కోరికల గుర్రాల వెంట
పరుగులు తీసే మనిషి మనసుకి కళ్లెం వేసి
కాలం తనచుట్టూ తిప్పుకునే అంతులేని వింతైన గారడి చక్రం
మనిషి జీవితం ..