గజ్జల గుఱ్ఱం

అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో అనుకోని విపత్తు జరిగితే ఆ సంసారం ఏమైంది? ఈ త్రైమాసిక పత్రిక “బహుళ” లో “గజ్జల గుఱ్ఱం” కథ చదవండి. Jwalitha Denchanala మేడమ్ కి ధన్యవాదాలతో..

‘ఘల్లు..ఘల్లు..ఘల్లు…’ ఆ శబ్దానికి చిరు మందహాసం మురళి పెదాల మీద తొణికిసలాడింది. పదేళ్ల నుంచి ఇంట్లోనే కాదు, తన గుండెల్లో కూడా నర్తించే మువ్వల రవళి అది. సన్నగా నవ్వుకుంటూ దుప్పటి మరింత మీదకు లాక్కున్నాడు. పెళ్లి చూపుల్లో అతను మొదట చూసింది మోహన పాదాలే. పారాణి పెట్టుకున్న లేత తమలపాకుల్లాంటి పాదాలు కదులుతుంటే, కాలి పట్టీల మువ్వల స్వరం, మృదంగ నాదమై అతన్ని పులకింపజేసింది . ఆ క్షణమే మోహనను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మువ్వల చప్పుడుతో పాటు పక్క వాయిద్యాల్లా గిన్నెల చప్పుడు, వెనువెంటనే ఫిల్టర్ లోకి దిగిన చిక్కటి నిర్మలా కాఫీ పొడి డికాషన్ వాసన కూడా దుప్పటిలోనించే అతని ముక్కు పుటలను కమ్మగా తాకేసరికి పెళ్ళిచూపుల నాటి ఆలోచనలనుండి ఇహంలోకి వచ్చాడు. మోహన అడుగుల సవ్వడి దగ్గర పడడంతో గాఢనిద్ర నటిస్తూ కళ్ళు మూసుకున్నాడు
” శ్రీవారు నిద్ర నటించింది చాలు కానీ ఇక లేవండి. ఈ రోజు సుధాకర్ గారి ఇంటికి పోవాలి మీరు. గుర్తుందా?” అంది, గోడకి తగిలించి ఉన్న క్యాలండర్ వంక చూస్తూ. చప్పున లేచి కూర్చున్నాడు మురళి.
“ఆ..ఆ..ఒకవేళ నేను మర్చిపోయినా హోమ్ మినిస్టర్ మర్చిపోదు కదా. నా వెంటబడి మరీ గుర్తుచేస్తుంది”. నవ్వుతూ వెళ్ళి అర్ధగంటలో స్నానం చేసి రెడీ అయి వచ్చాడు. మోహన ఇచ్చిన గ్లాసు అందుకుని పొగలు గ్రక్కే కాఫీని తాగుతూ మధురమైన రుచిని ఆస్వాదించాడు. కాఫీతో పాటూ కాసిన్ని కబుర్లు కూడా కలబోసుకున్నారు ఇద్దరూ.
“సరే మోహన, సాయంత్రం నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు స్కూల్ దగ్గరకి వెళ్లి బాబుని తీసుకుని వచ్చేయి” అంటూ సైకిల్ మీద కూర్చుని, బాబుని ముందు ఉన్న చిన్న సీట్ మీద కూర్చోబెట్టుకున్నాడు. టాటా చెప్పి వెళ్లిపోయారు.
వాళ్లిద్దరూ అటువెళ్ళగానే ఇంట్లోకి వచ్చి తలుపేసింది మోహన. ఇక అంట్లపని చూడాలి అనుకుంటుండగానే తలుపు కొట్టిన చప్పుడైంది. ‘ఇంతలోనే ఎవరా..!’ అనుకుంటూ తలుపు తీసింది. పక్క వాటాలో ఉండే కుమారి, చేతిలో గ్లాసుతో తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. ‘మేసే గాడిదను వచ్చి కూసే గాడిద చెడగొట్టింది’ అన్నట్లు చేయాల్సిన పనికి అడ్డం వచ్చిన కుమారి వంక నీరసంగా చూసి, ముఖం మీద బలవంతంగా నవ్వును పులుముకుంది.
చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు అన్నట్లు తెచ్చిన గ్లాసును టేబుల్ మీద పెట్టి “అవును కానీ మోహన ..! మీ అయన పొద్దునే బయటికెళ్లినట్లున్నాడు. ఎక్కడో ఈ రోజు వంట” అంది. మీ ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలియాలి అన్నట్లు.
“సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే వెళ్ళాడక్కా” ఆమె వెళ్ళిపోతే తనపని తాను చేసుకోవాలనే ఆలోచనలో ఉంది మోహన. ఆమాట ఈమాట చెప్తూ ఎంతకూ వదిలేలా లేదామె. ఇక తప్పదని “కొంచెం తలనొప్పిగా ఉంది. కాసేపు పడుకుంటాను అక్కా” అంది నుదుటిపైనా వేళ్ళతో రుద్దుకుంటూ.
పొమ్మనలేక పొగ బెట్టిందట వెనకటికి ఒకామె. వెళ్ళమని చెప్పకుండా ఈ తలనొప్పి నటన నాకు తెలియదా అనుకుంటూ “నాక్కూడా పని ఉందిలే మోహన. తలనొప్పికి మాత్ర వేసుకుని వేడిగా కాఫీ తాగి పడుకోమరి. ఈ గ్లాసు తో కాస్త చెక్కర ఇవ్వు. పై వారం సరుకులు తెచ్చిన వెంటనే ఇచ్చేస్తాను” అడగడంలోనే తన నైపుణ్యాన్ని మేళవించిందామె.
ఇక తప్పదన్నట్లు వంటింట్లోకి వెళ్లి గ్లాసుతో చెక్కెర తెచ్చి, కుమారికి ఇచ్చింది మోహన.
గ్లాసు తీసుకుని వెళ్లిపోయిందామె. పక్క వాటా కుమారి, ఎదురు వాటా సుమతి ఇద్దరు మంచి దోస్తులు. ఆరు వాటాలు ఉండే లోగిలి అది. ఎవరింట్లో చీమ చిటుక్కుమన్నావారిద్దరికీ తెలియాలి. ఎదుటి వాళ్ళ గురించి అవాకులు చవాకులు మాట్లాడుకోవాలి. లేకుంటే వాళ్లకు నిద్ర పట్టదు. వాళ్ళ స్వభావం ఆ ఇంట్లో చేరిన కొత్తల్లోనే తెలుసుకుంది మోహన. అటువంటివారితో అతి చనువు ప్రమాదకరం అనుకుని, కాస్త దూరంగా ఉంటుంది వారితో. అదీ కాక కుమారి భర్త రాజారావు చూసే చూపులు చిరాకు తెప్పించేవి. పక్కవాటాలో నుంచి వాళ్ళ మాటలు ఎంతవద్దన్నా వినిపిస్తుండేవి. ఆ మాటల్లో తన కాలి పట్టీల గురించి వాళ్ళు ఎగతాళిగా అనుకుంటూ, తనని ‘గజ్జెల గుఱ్ఱం’ అనడం విని చాలా బాధా పడేది. వాళ్ళ మాటలు మురళికి చెప్పి పట్టీలు తీసేస్తానంది ఓసారి.
“ఆ పని మాత్రం చేయకు మోహన. మన పెళ్ళైన తర్వాత ఈ పదేళ్ళలో ఎప్పుడూ నీ కాళ్ళకు పట్టీలు లేకుండా నిన్ను చూడలేదు. ఆ పట్టీలకు ఉండే చిరు మువ్వల సవ్వడే నా జీవన రాగం. ఎవరో ఏదో వాగారని మన ఇష్టాన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. పట్టీలు లేకుండా ఎప్పుడూ కనిపించనని నాకు ప్రమాణం చేయి” అని ఆమె దగ్గర మాట తీసుకున్నాడు మురళి.
సాయంత్రం బాగాపొద్దుపోయాక ఇంటికి వచ్చాడు మురళి. అప్పటికే బాబు నిద్రపోయాడు. మురళికి ఇష్టమని నూనె వంకాయ కూర, రసం చేసి పెట్టింది మోహన.
“వాళ్ళ ఇంట్లో వ్రతానికి యాభై మందిదాకా వచ్చారు. జాంగ్రీలు , అరిసెలు, పాకం ఉండలు, చక్కిలాలు, వడలు అన్నీ చేయించుకున్నారు. పప్పు, సాంబారు, రసం, కూరలు సరేసరి. ఎప్పుడూ ఉండేవే.” కబుర్లు చెప్తూ కళ్యాణి వడ్డించిన వంకాయ కూర లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు.
“అదేంటో మోహన..! పొద్దున వాళ్ళింట్లో అన్నిరకాల వంటలు చేసినా, ఒక్కటీ నాకు తినాలనిపించలేదు. నువ్వు చేసిన ఈ వంకాయ కూర అద్భుతంగా ఉంది. ఇంకా నీ చేత్తో వడ్ఢస్తుంటే అమృతంగా మారింది. నువ్వు నాకు దొరికిన అదృష్టానివి” మోహన వంక ఆపేక్షగా చూసాడు మురళి.
“మరీ అంత పొగడకండి బాబు. తమరి దిష్టి తగిలేటట్టు ఉంది నాకు. అయినా మీరు వండినంత రుచిగా నేను వండలేను. మీ గొప్పతనం మీకు తెలియదు. ఎంత మంది మీ వంటను మెచ్చుకుంటుంటే విన్నదాన్ని నేను”. మోహన నవ్వులతో తాను కూడా శృతి కలిపాడు మురళి .
ఆ రోజు మోహన పుట్టిన రోజు. పొద్దున్నే లేచి తయారై, బాబుతో సహా అమ్మవారిగుడికి వెళ్లారు. తర్వాత నేరుగా ఇంటికి కాకుండా, ఓ చోటుకు తీసుకుపోతాను అంటూ మురళి ఆటోని పిలిచాడు. మోహన అడిగితే సస్పెన్స్ అని చెప్పాడు. ఆటో ఓ వెహికల్ షో రూమ్ ముందు ఆగింది. షోరూం వాళ్ళతో మాట్లాడి అంతకు ముందే సెలెక్ట్ చేసి పెట్టి ఉన్న నీలం రంగు స్కూటీకి డబ్బు చెల్లించి, స్కూటీతో సహా మోహన దగ్గరకు వచ్చి
“నీ పుట్టిన రోజుకు కానుక ఇది మోహన” అన్నాడు.
బాబు స్కూటీని చూసి ఎగిరిగంతేసాడు. మోహన సంబ్రమాశ్చర్యాలతో చూస్తూ, కలలో లాగా స్కూటీ ఎక్కి వెనుక కూర్చుంది. బాబుని ముందు కూర్చోబెట్టుకున్నాడు. స్కూటీ మీద ఇంటికి వస్తుంటే నీలి మేఘాల్లో తేలిపోతున్నట్లు పరవశించిపోయారు.
ఇంటికి వచ్చాక ఇద్దరు కలిసి వంట చేసారు. మోహన పుట్టిన రోజని నానబెట్టిన సగ్గుబియ్యం, దోరగా వేయించిన సేమియాలు పాలల్లో ఉడికించి, చక్కర కలిపి జీడీ పప్పులు, ఎండు ద్రాక్ష, పచ్చ కర్పూరం, యాలకుల పొడి కలిపి కమ్మని పాయసం చేసాడు. ఇంకా పరవశం వీడలేదు కల్యాణిలో. బాబు స్కూటీ చుట్టూ తిరుగుతూ కేరింతలతో చప్పట్లు కొడుతున్నాడు.
ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. పీటలు వేసి అరిటాకుల్లో నీళ్లు చల్లి వడ్డించుకున్నారు. పాయసం విడిగా కప్పుల్లో పోసింది. “స్కూటీ కొంటానని మాట మాత్రంగా కూడా నాకు చెప్పలేదు మీరు. అయినా నా కోసం అంటారేమిటి? బయట పనులకు తిరిగే మీకు అవసరం కానీ, అస్తమానం ఇంట్లో ఉండే నాకెందుకండి?” సాంబారు వేస్తూ అంది మోహన.
“బయట ఊర్లకి నేను ఎలాగూ బస్సులోనో, రైల్లోనో పోతాను. బాబుని స్కూల్లో దింపడానికి, పచారీ సామాన్లు తెచ్చుకోవడానికి, కూరగాయలకు అన్నిటికీ నువ్వే నడిచి వెళ్తావు కదా. ఆటోలో పొమ్మన్నా డబ్బు దండగ అంటావు. బండి నా కన్నా నీకే అవసరం. అందునా ఇది ఎలక్ట్రిక్ బండి. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే చాలు. ఒక రోజంతా తిరగ వచ్చు. పెట్రోల్ ఖర్చు కూడా లేదు.” అంటూ తనవైపే ఆపేక్షగా చూస్తున్న మురళిని చూసి మురిసిపోయింది మోహన.
సాయంత్రానికి మిగతా వాటాలవాళ్ళకు తెలిసిపోయింది మురళీ వాళ్ళు స్కూటీ కొన్నారని. ఒక్కొక్కరుగా వచ్చి బండిని చూడడం, శల్య పరీక్షలు చేయడం, కళ్యాణి అదృష్టానికి మెచ్చుకుని, లోలోపల అసూయతో రగిలిపోయారు.
“ఆ..అయినా ఆడదానికి ఈ స్కూటీలు ఎందుకు. మగరాయుడిగా ఊరిమీద తిరగాలా ఏమిటి? మా ఆయన అయితే అసలు ఒప్పుకోడు. ఆడది ఇంటిపని చేసుకుంటే చాలంటాడు” మాటల్లోనే అసూయని కక్కింది కుమారి. ఆమెకు వంతపాడింది సుమతి. వాళ్ళ మాటలకు బాధ పడింది మోహన. “మన తెలుగులో ఒక సామెత ఉంది కదా. ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అని. అది ఇలాంటి వాళ్ళ వల్లే వచ్చిఉంటుంది. ఆ శత్రువులు మన పొరుగు ఇండ్లల్లోనే ఉండడం మన దురదృష్టం. వాళ్ళ మాటలు పట్టించుకోను మోహన” అంటూ ఓదార్చాడు మురళి.
వారం రోజులు దగ్గరుండి బండి నడపడం నేర్పించాడు మోహనకి. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దరానేర్పించినన్’ అన్న చిలకమర్తి వారన్నట్లు పది రోజుల్లో బండి నడపడంలో ఉన్న మెళుకువలు అన్నీ గ్రహించేసింది మోహన. మురళి బైట ఊర్లకి వంటకి వెళ్ళినప్పుడు బాబుని స్కూటీలో స్కూల్ దగ్గర దింపి, ఇంటికి కావల్సిన సరుకులు తెచ్చుకునేది.
రోజులు వేగంగా దొర్లి పోతున్నాయి కాలం వెంబడి. ఎప్పుడూ ఒకటేగా ఉంటే కాలానికి విలువివ్వరనుకుందో లేక మార్పు నా సహజాతం అనుకుందో ఏమో కానీ, కాలం మారడానికే సిద్ధపడినట్లు ఉంది.
ఆ రోజు హైవే మీద స్కూటీ తోలుతోంది మోహన . మురళి ఆమె వెనుక కూర్చుని, ట్రాఫిక్ లో బండిని ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాడు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదకు రాగానే, ఎదురుగా గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న పెద్ద లారీ ఎదురు రాగానే కాస్త తడబడింది మోహన. అప్రమత్తమై పక్కకు తప్పుకునేలోగా రెప్పపాటులో జరిగిపోయింది ఘోరం. కన్నుమూసి తెరిచేలోగా లారీ వేగంగా వచ్చి స్కూటీని గుద్దుకుంది. ఎగిరిపడ్డారిద్దరూ. స్కూటీ మరోవైపుకు పడిపోయింది. మోహనకి చిన్న చిన్న గాయాలు. మురళి తీవ్రంగా గాయపడ్డాడు.
హాస్పిటల్లో బెడ్ మీద నిస్రాణంగా పడి ఉన్నాడు మురళి ఒళ్ళంతా కట్లతో. వారం రోజులు హాస్పిటలోనే ఉండాలన్నారు మురళిని. వారం రోజుల చికిత్స తర్వాత కాస్త కోలుకున్నాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఎడమకాలి మడమ దగ్గరి ఎముక విరగడంతో నడవడానికి కొంత కాలం పడుతుంది. కనీసం రెండు నెలలైనా కాలు కదపకుండా విశ్రాంతి తీసుకోవాలన్నారు డాక్టర్లు.
ప్రమాదం జరిగిపోయింది. ఇక కాలాన్నో,దైవాన్నో,విధినో నిందించి లాభం లేదు. మురళి మంచం మీద ఉంటే, తనకి అన్నీ సమయానికి అమరుస్తూ, కంటికి రెప్పలా కాచుకుంది మోహన. ఇద్దరి తరపునా బంధువులు పెద్దగా ఎవరూ లేరు. ఉన్నా రారు. ఎందుకంటే వాళ్ళు కలిమిలో లేరు. ఇక ఇరుగుపొరుగులు కొందరు సానుభూతి చూపారు. కుమారి, సుమతి లాంటి కొందరు వీళ్ళ పరిస్థితికి లోలోపల సంతోషించి, పైకి మాత్రం మొసలికన్నీరు కార్చినట్లు నటించారు.మోహన, మురళి. వారిద్దరే ఒకరికొకరు ఆత్మబంధువులైనారు.
ఆ రోజందుకో మురళి క్యాలెండరుచూడాలంటే తెచ్చిచ్చింది మోహన. తాను పెన్ తో రౌండ్ చుట్టిన రోజును చూసాడు. ఇంకా సరిగ్గా రెండు రోజులుంది. ఆ రోజు ముఖ్యమైన వారింట్లో పూజా కార్యక్రమానికి వంటకి వెళ్ళాలి తాను. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కంటే ఎక్కువ మొత్తం డబ్బు తీసుకుని ఉన్నాడు. ఇప్పుడు కాలు కదపడానికి లేదు. తనలాగే వంటలు చేసే ఇద్దరికి ఫోన్ చేసి, తన పరిస్థితి చెప్పాడు. వాళ్ళకి అదే రోజు వేరే చోట వంటకి వెళ్ళే పని ఉందన్నారు. ఏం చేయాలో పాలుపోలేదు మురళికి. అతని ఆందోళన అంతా గమనిస్తూనే ఉందిమోహన. జోడెడ్ల బండి ప్రయాణం అని సంసారాన్ని పోలుస్తారు. దంపతుల్లో ఒకరి పరిస్థితి బాగాలేనప్పుడు ఇంకొకరు సంసార రధ సారధిగా చేయూత అందిస్తే, ఆ ప్రయాణం సుఖవంతం, ఫలవంతం అవుతుంది. ఊర్లో అందరూ మురళి చేసే వంటలని మెచ్చుకున్నా, అతడు మాత్రం తను చేసే వంటలను ఇష్టంగా తినడం మోహనకి తెలుసు. తన మనసులో మెదులుతున్న ఆలోచనని మురళి కి చెప్పింది.
మొదట వద్దు అన్నా, అవతల వారికి ఇచ్చిన మాట పోతుంది, మాట పోయినా పర్వాలేదు కానీ, ఇంకో వంట మనిషి దొరకక వారు అవస్థ పడవచ్చు. అందుకే మోహన మాటని కాదనలేకపోయాడు మురళి.
ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగిందని కాలాన్ని నిందిస్తూ, మళ్ళీ ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చునే కన్నా, ధైర్యంగా ముందుకు వెళ్లడమే మంచిదనుకున్నారు. కీడెంచి మేలెంచడం మంచిదే, కానీ ప్రతిసారి కీడు జరుగుతుందని ఊహించుకోవడం అవివేకం.
ఆ రోజు పొద్దునే లేచి వంట చేసి, మురళి పడుకునే మంచం పక్కనే టేబుల్ మీద తనకి కావాల్సినవి అన్నీ అమర్చి పెట్టింది. స్నానం చేయడానికి సాయం చేసింది. ఆ రోజు బాబుని స్కూల్ కి పోకుండా మురళికి తోడుగా ఇంట్లోనే ఉండమంది. అన్నీ జాగ్రత్తలు చెప్పి, ముందు రోజే శుభ్రంగా తుడిచిపెట్టిన స్కూటీని తీసి చిన్న సంచిని ముందు పెట్టింది. మాట ఇచ్చిన వారి ఇంట్లో పూజ కార్యక్రమానికి ఏ ఇబ్బంది కలగకుండా వంట, ప్రసాదాలు చేసి రావడానికి తను మొదటిసారి బయలుదేరింది.
‘గజ్జెల గుఱ్ఱం ఊరిమీదకు బయలుదేరింది’ అని పక్కింటి కుమారి దంపతులు ఎంత మెల్లగా గుసగుసలాడుకున్నా అటు ఇంట్లో ఉన్నమురళికి, ఇటు బయటకు వెళుతున్న మోహనకి వినిపించాయి. అయినా ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. లోకులు పలుగాకులు అన్నారు ఎవరో పెద్దలు. ఈ రోజు గేలి చేసిన నోటితోనే, రేపు మళ్ళీ తమకి మంచి రోజులువస్తే, వాళ్ళే వచ్చి, తమని అహో, ఓహో అంటూ పొగుడుతారు. తమ అవసరాలకోసం వారు ఎంతకైనా దిగజారుతారు. అలాంటివారిని పట్టించుకోకూడదు అని వారిద్దరూ ఏనాడో నిర్ణయించుకున్నారు. నవ్వుకుంటూ మోహన స్కూటీని ముందుకు ఉరికించింది.