గంగరాయి సెట్టు కింద ఇరగాలమ్మో..

నెల్లూరులో నరసింహకొండకు వెళ్లే దారిలో లోతైన చీకటి గుహ లాంటి చోట వెలసిన ఇరగాలమ్మ.. గ్రామ దేవత. ఇరుకళల అమ్మగా మారక ముందు నేను పసితనంలో కళ్లారా చూసిన జాతర. “గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో” కథ రూపంలో మార్చి నెల పాలపిట్టలో. గుడిపాటి వెంకట్ గారికి ధన్యవాదాలతో..
“గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..

” మొ..రవంత గొబ్బిరి చమురు చేతలో ఏస్తావా” ఇరబోసుకున్న తలను గీరుకుంటా అడిగినాది సుబ్బి.
“ఏం సుబ్బే..ఈ రోజు తలకుబోసుకుంటావా ఎట్టా” బియ్యంలో రాళ్ళేరతా ఉన్న అమ్మ చాట పక్కన బెట్టి, వంటింట్లోకి పోయి గూట్లో ఉన్న చమురు సీసా మూత తీసి కొబ్బిరి చమురు సుబ్బి చేతిలో ఏసింది. అవునంటా నవ్వతా తలూపింది సుబ్బి పచ్చగా గారపట్టిన పళ్ళన్నీ అవపడేలా.
“ఏందబ్బా..! ఈ రోజు అందరి స్నానాలు అయిపోయినా, ఇంకా దబర నిండా నీళ్ళు పోసి, నుసి పక్కకి జవిరి పొయ్యిలో కట్టెలు ఎగదోసిండాయనుకున్న. ఇందుకా..? ఈ రోజు ఏడకైనా పోవాల్నా” అనింది అమ్మ చమురు సీసాకి మూత పెడతా.
“ఈ పొద్దు పైటేల మా సంగంలో అందురుము ఇరగాలమ్మ జాతరకు పోతావుండాము. దేవళం కాడ పొంగళ్ళు పెట్టుకుంటాము. పైటేల నేను పనిలోకి రాను. అంట్ల గిన్నెలు ఉంటే ఇప్పుడే తోమేస్తాను. నాలుగు కుంకుడుగాయలు కూడా ఈవా” అనింది సుబ్బి దాసాని చెట్టు ఆకులు కోస్తా.
“బాగుంది సుబ్బే.. ఇదిగో సెనగ పిండి, పసుపు కూడా తీసుకో” తలస్నానం అయినాక స్నానాల దొడ్డిని శుద్ధంగా కడిగేసి పో ” అని అమ్మ సుబ్బి చేతికి చిన్న పళ్లెంలో రవ్వన్ని కుంకుడుగాయలు, ఇంత సెనగపిండి, పసుపు ఏసిస్తూ. సందులో తులిసికోట పక్కన ఉన్న రోట్లో కుంకుడుగాయలు, దాసానాకు రుబ్బతా ఉండాది సుబ్బి.
సుబ్బి చెల్లెలి మనవరాలు మస్తాను వొచ్చింది. “అవా .. నిన్ను బిన్నా పనిగానిచ్చి రమ్మన్నాడు చలమయ్య తాత. జాతర కాడికి పోయేదానికి ఆలిసిం అవ్వద్దంట” అంటా రోటిపక్కన కూలబడింది. ఆ యమ్మీ ఎడమ కన్ను కమిలిపోయి ఇంతలావున వాచిపోయి ఉండాది. నల్లటి ఒంటిమీద మరింత నల్లగా, బొగ్గుల్లో ఉడికిన గెనుసుగడ్డల మాదిరిగా బొబ్బలు ముఖం మీద, చేతులమీద అవపడతా ఉండాయి.
“ఏంది మస్తానా ఆ బొబ్బాల..? ” అమ్మ అడిగేలోపలే ఎన్నవలు పెడతా ఏడుపెత్తుకున్నాది ఆ ఎమ్మి.
“దాని కట్టం పగోడిగ్గూడా రాగూడదు అమ్మోరా..! తేపకో తూరి మా గుడిసి కాడికొచ్చి దాన్ని మనువాడతానని మా దుంపదెంచితే ఆ ఎంకడికిచ్చి ముడిపెడితిమి. పుడతానే అమ్మ, అబ్బలను పోగొట్టుకునింది.మా చెల్లెలు పోలమ్మ కూడా లేకుండాపోయే. నేను పాచిపని , ముసిలోడు రిక్షా తోలి దాచిపెట్టిన దుడ్లు రెండువేలు మనువప్పుడు ఇస్తిమి. పుస్తి కట్టిన కాడ్నించి సాంగెము సరిగ్గా జరపలేదని, కట్నం సాల్లేదని, దినాం దాని రకతం కళ్ళ జూస్తావుండారు అత్తా, ఆడబిడ్డ. ఆ దొంగ నా బట్ట ఎంకడు ఆడంగిలా ఆ ముండల మాటిని దీన్ని కొడతా ఉండాడు. ఈ అమ్మి కట్టం ఎప్పుడు తీరద్ధో “. మస్తాను సాయ చూస్తా. ముడతలు పడి ఉబ్బిన కళ్ళ నుంచి కారేనీళ్ళు ఆమె గొంతు ముడతల్లో కాల్వలు గట్టినాయి.
“నువ్వు దిగులుబడబాక సుబ్బే.. ఆ ఎమ్మికి మనమే కదా దైర్యం చెప్పాల్సింది” అంటా లోటాలో కాఫీ పోసి మస్తానుకి ఇచ్చింది అమ్మ.
పొద్దన ఏం తినిందో ఏమో, ఎంత ఆకలి మీదుండాదో కానీ అమ్మ లోటా చేతికీగానే ఊడుకుడుకు కాఫీ ఊదుకుంటా తాగేసింది మస్తాను. కాసేపు నిమ్మలించాక
” మీ..మస్తానా.. ఎన్ని దినాలు అట్టా దెబ్బలు తింటావు చెప్పా. గదిలో పెట్టి కొడితే పిల్లి అయినా పులి మాదిరిగా ఎదిరిస్తది. నువ్వు ఇప్పుడు సివంగి మాదిరి మారాలి. ఈ దినం పైటేల జాతరకు పోతా ఉండారు కదా..! ఇరగాలమ్మ అమ్మోరు నిన్ను చల్లగా చూస్తది. నువ్వు ధైర్యంగా ఉండుమె” అమ్మ మాటలు మస్తానుకి ఏం ఊరటనిచ్చాయో, ఏ ఆలోచనలను పోగేసాయో ఏమో, అర్ధమైనట్లు తల ఊపి “తాత బిన్నా రమ్మన్నాడంటా” కళ్ళు తుడుచుకుంటా ఎళ్ళిపోయింది.
***

“మా.. సాయంకాలం సుబ్బితో పాటు నేను కూడా ఇరగాలమ్మ దేవళం కాడికి పోతాను” అన్నాను చెక్క దువ్వెన, ఎర్ర రిబ్బన్లు తీసుకుని తలదువ్వుకుంటా.
“వద్దు లోకాలయ్య. నువ్వు బడికి పోవాలి కదా” అనింది అమ్మ జడ ఏస్తా.
“నువ్వెప్పుడూ ఇంతే. ఏడకి పోనీవు. పోయిన నెల్లో తూర్పు కనుపూర్లో ముత్యాలమ్మ జాతరకు సుజాత పిన్నమ్మ వోళ్ళతో పోతానంటే వొద్దన్నావు. వెంకటగిరిలో పోలేరమ్మ జాతరకు సూరయ్య తాతా వోళ్ళతో పోతానంటే పోనీలా నువ్వు” ఏడుపు నటిస్తా అనేతలికి
“మూలాపేటలోనే కదా. వేరే ఊరుకు పొయ్యేది లేదు. సుబ్బి కూడా తోడు ఉండాది కదా. ఈ తూరికి ఇరగాలమ్మ దేవళం కాడికి పోదుగానీలే చిట్టే” అన్నాడు నాయిన మంచానికి నవారు బిగిస్తా.
“ఐ…నేను ఇరగాలమ్మ జాతరకు పోతా ఉండాను” ఎగిరి గంతేసాను. “అబ్బా.. కూతురు ఒక మాట మీదుంటే ఇంక నా మాటెందుకు ఇంటారు ” మూతి వంకర్లు తిప్పతా అనింది అమ్మ.
తలకి పోసుకొని స్నానాల దొడ్డి కడిగేసి వచ్చింది సుబ్బి. ఉతికిన ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని ఇన్ని రోజులకి రవ్వంత శుద్ధంగా అవపడింది.
కుంకుమపొడి రంగు, అంచులకి బంగారు రంగు మెరుపు పట్టీ ఉన్న పావడ, చందనం రంగు బుంగ రెట్టల రవిక వేసుకుని, కాపు వీధి విజయ స్టోర్ లో కొన్న ఎర్ర గాజులు, మండపాలీదిలో చక్రపాణి అంగట్లో కొన్న రోల్డ్ గోల్డ్ దండ ఏసుకుని, బొట్టు బిళ్ళ పెట్టుకుని నేను రెడీ అయిపోయాను అప్పటికే.

“మీతోగూడా చిట్టి వస్తానంటున్నాది సుబ్బే” అనింది అమ్మ.
“బంగారంగా తీసకపోతాను చిట్టెమ్మని. సుబ్బరత్న, మస్తాను, వెంకటలక్ష్మి అందరు వస్తారు మాతోగూడా” అనింది సుబ్బి మెరిసే కళ్ళతో తడి తల ముడేసుకుంటా.
పసుపు రంగు కొత్త నూలు చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, వక్కపొడి పొట్లాలు అన్నీ సంచిలో వేసి సుబ్బిచేతికి ఇచ్చింది ఇరగాలమ్మకి సారె పెట్టమని. సేరు బియ్యం, కాలు సేరు పచ్చిశెనగపప్పు, బెల్లం కూడా మూటకట్టి అది కూడా సుబ్బి కాడ ఇచ్చి, జాతర కాడ కుదురుగా ఉండమని నాకు చెప్పింది అమ్మ. ఆడ కొనుక్కునేదానికి నాయిన రెండు రూపాయలు ఇచ్చినాడు. సుబ్బి, నేను సంగం దగ్గర ఉన్న వాళ్ళ గుడిసె కాడికి పోయినాము. యెద్దలరేవు సంగం మొదట్లో ఉండే జయమ్మ సారాయి అంగడి ఎనక సుబ్బి వాళ్ళ గుడిసె ఉండాది. దానికి అమ్మిడిగానే ఇంకో పది గుడిసెల్లో సుబ్బి వాళ్ళ చుట్టాలందరూ ఉండారు.
మేము పోయేతలికే సంగం కాడ చానా సందడిగా ఉండాది. ఆడోళ్ళంతా తలకలు పోసుకోని, రంగురంగుల చీరలు కట్టుకోని, బంతి, కస్తూరిపూలు, దొరువుల కాడ పెరిగే మాచిపత్రి ఆకు కలిపిన కదంబం పెట్టుకొని ఉండారు. సంగం మద్యలో ఉన్న వెంకటేశు టీ అంగడి కాడ ఉండే గ్రామఫోన్ రికార్డర్ నుంచి “నా కళ్ళు సేపుతుండాయి, నిను పేమించానని ” అంటా పాట పెద్దగా ఇనొస్తా ఉండాది.
సారాయి అంగడి పక్కన మంటేసి తప్పేట్లు సాపుజేసుకుంటా ఉండారు వీరయ్య, కొండయ్య, చిన్న చెంచయ్య ఇంకొందరు తప్పేట్లు గొట్టేటోళ్లు. జులపాల జుట్టు నడుము దాక ఇరబోసుకొని, బుర్ర మీసాలు తిప్పుకుంటా, ఒంటి నిండా నల్లరంగు పులుముకోని, ఇంత పొడుగునున్న ఎర్రటి జాటీకోలా, ఏపమండలు నడుముకు చుట్టుకోని, చూడంగానే భయంపుట్టేటట్టుఉన్న మనిషి లోటాని ఎత్తి, గట గటా సారాయి తాగతా ఉండాడు. పోతురాజు వేషగాడంట. రోజు నల్లగా మాసిన గుడ్డలేసుకునే సంగం మొగోళ్ళు ఆ పొద్దు పైటేల మడేలు సుబ్బయ్య ఉతికిన తెల్లటి పంచెలు, చొక్కాలు, ప్యాంట్లు ఏసుకొని ఉన్నారు.
సుబ్బితో గూడా నేను వాళ్ళ గుడిసెలోకి పోయినాను. సుబ్బి, చలమయ్యలకి పిలకాయలు లేరు. సుబ్బి తమ్ముడు కొడుకులు, అక్క పోలమ్మ మనవరాలు మస్తాను అందరిని సుబ్బి, చలమయ్య సాకతా ఉండారు. వీళ్ళు, చలమయ్య చెల్లెలు పిలకాయలు అంతా చేరి పదిహేను మందిపైనే గుడిసెలో ఉండారు. సత్తు గిన్నెలకి పసుపు పూసి కుంకుమ, సున్నపు బొట్లు పెట్టి, గిన్నిల చుట్టూ ఏపమండలు కట్టినారు. గిన్నెల్లో బియ్యం పోసినారు.
సంగం మొత్తం సందడి సందడిగా ఉండాది. ఆడోళ్ళందరూ పసుపు పూసిన సత్తు గిన్నెల పైన ఉన్న మట్టి బొచ్చలో ఒత్తులు ఎలిగిచ్చి దీపం తో సహా గిన్నెలను నెత్తిన పెట్టుకున్నారు. గిన్నెలచుట్టూ ఏపమండలు కట్టి ఉండారు. మొగోళ్ళు పసుపు గుడ్డల్లో బెల్లం గడ్డలు, బంతిపూలు, కడ్డీలు,టెంకాయ మూట కట్టి బుజాలకెత్తుకున్నారు. బుర్ర మీసాల నల్లటి మనిషి “ఇరగాలమ్మ తల్లికి జై ” అంటా పెద్దగా అరిచాడు. అందురు కూడా అతనికి వంత పాడతా “ఇరగాలమ్మ తల్లో, మా కన్న తల్లో, అమ్మోరు తల్లో మా కట్టాలు తీర్చవే మాయమ్మ తల్లో ” అంటా పాట ఎత్తుకున్నారు.
ఆ పాట అయిన ఎమ్మటే “అంకాలమ్మో, పోలేరమ్మో, గంగారాయిసెట్టు కింద అంకాలమ్మో.. ఓ..అంకాలమ్మ..” మునెయ్య బృందం పాట పాడేదానికి మల్లుకున్నారు. కాళ్ళకి గజ్జలు కట్టుకోని పాటకనుగుణంగా పాదాలు కదపతా నాట్యం జేస్తా ఉండారు మునెయ్య తో వొచ్చినోళ్ళు. తప్పేట్లు కొట్టేవాళ్ళు జోరుగా తప్పేట్లు వాయిస్తా ఉండారు. చల్లా ఏనాదులు ఏడాదికోతూరి కుశాలుగా జరుపుకునే వేడుక ఇరగాలమ్మ జాతర.
నేను మస్తాను చేయి పట్టుకుని నడస్తా ఉండాను. సంగం జనం ఆడ, మొగ అందరు కలిసి వంద మంది దాక పోగైనారు. అందరం సంగం కాడినుంచి విజయమహల్ సెంటర్ కాడికి వొచ్చాము. సోడాల రావమ్మా గోలిసోడా కొట్టి పోతరాజు వేషగాడికి ఇచ్చింది. సోడా తాగి, ఆ మనిషి చిందు ఎత్తుకున్నాడు. తప్పెట్ల జోరు పెరిగింది. ఇరగాలమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, సత్తెమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ ఈ అమ్మ తల్లులందరికి పోతురాజు తమ్ముడంట. పోయే తోవంతా పోతరాజు చిందులు తొక్కతానే ఉండాడు. ఆడోల్లు మధ్య మధ్యలో మట్టి బొచ్చలో చమురు పోస్తా, దీపం ఆరిపోకుండా చూసుకుంటా, నడస్తా ఉండారు. వీధుల్లో జనాలు మమ్మల్ని విచిత్రంగా చూస్తా ఉండారు. కొంతమంది మాకు టెంకాయలు,పసుపు,కుంకుమలు ఇచ్చినారు. దారి పొడుగూతా కర్పూరం ఎలిగిచ్చి హారతులు పడతా ఉండారు.
ఒకరిద్దరు కోడి పుంజుల కాళ్ళు కట్టేసి వాటిల్ని తలకిందులుగా పట్టుకొని ఉండారు. వాటిని నీళ్లతో తడిపి ఉండారు. అవి ఉండుండి రెక్కలు టప టప లాడిస్తా నీళ్ళని ఇదిలించుకుంటా చిన్న చిన్న కళ్ళను తెరుస్తా, మూస్తా ఉండాయి. ఎందుకు వాటిల్ని తెస్తావుండారు అని అడిగితే “కోడిపుంజులను ఇరగాలమ్మకి బలిస్తారు” అని సీనడు చెప్పాడు. నాకు రవంత దిగులు పుట్టింది ఓటిల్ని అట్టా చూసేతలికి.
అందరం విజయమహల్ రైలు గేటు దాటి ట్రంక్ రోడ్ మీదుగా కనకమహల్ సెంటర్ కాడికి, ఆడ నించి సుబేదారుపేట తట్టుకి పోయి రంగమహల్, శేషమహల్ సినిమా హాళ్ళమీదుగా నడిచి సుందర్ డీలక్స్ మీదుగా ములిముడి బస్టాండ్ సైడు పోయి, ఆడ్నించి సంతపేట మునిసిపల్ ఆఫీస్ ఎనక పక్కకి పోయి ఎడం పక్కకి తిరిగి రెండు పర్లాంగులు నడుచుకుంటా పోయినాం. అక్కడకి అమ్మిడిగానే ఇరగాలమ్మ గుడి.
ఆ తొవలోనే జొన్నవాడ, నరసింహకొండ వస్తాయని చలమయ్య చెప్పినాడు. అందరు చెప్పులు లేకుండా నడస్తా వుండాము. నా కాళ్ళకి సన్నకంకర రాళ్ళు గుచ్చుకుంటా నొప్పి పుడతా ఉండాది నాకు. తప్పెట్ల వొళ్ళు కొట్టే దరువుకి అనువుగా వీరంగమాడతా వస్తా ఉండాడు పోతురాజు వేషగాడు. మూలాపేట దగ్గర ఇంకో ఇద్దరు కూడా పోతరాజు వేషం వేసుకొని వచ్చారు. అందురు గుంపుగా చేరి చిందులు తొక్కడానికి మల్లుకున్నారు.
అంతా దేవళంకాడికి చేరినాము. దేవళం ఎనక స్వర్ణాల చెరువు ఉండాడంట. ఎప్పుడూ వినడమే కానీ చూడ్డం మాత్రం ఇదే మొదటి తూరి. అందరం స్వర్ణాల చెరువులోకి దిగి కాళ్ళు, చేతులు కడుక్కున్నాం. చాల ఉషారుగా చెరువు మెట్లు దిగినాన్నేను . “జాగ్రత్త చిట్టెమ్మ..చెరువు గట్టు మీద పాచి ఉండాది. జారిపడతావు అంటా నా రెక్క గట్టిగా పట్టుకున్నాది మస్తాను.
దేవళం ముందర పెద్ద ఏపచెట్టు, గంగరావి చెట్టు ఉండాయి. ఇసురుగా వీచే గాలికి పూనకం వచ్చినట్లు ఊగతా ఉండాయి చెట్ల కొమ్మలు. అందరూ నెత్తిమీది సత్తు గిన్నెలు కిందకు దించి, దీపాలను గుడికి ఏదాలంగా పెట్టినారు. సత్తు గిన్నెల్లో ఉన్న బియ్యాన్ని శుద్ధంగా కడిగినారు. దేవళం ముందర తావులో చెట్ల కింద ఇటికె రాళ్ళతో కట్టెల పొయ్యిలు పెట్టి వాటిమీద పెద్ద దబరల్లో నీళ్లు పోసి ఎసర్లు పెట్టినారు. ఉడుకుడుకు నీళ్ళల్లో బియ్యం పోశారు. రవ్వంతసేపటికే బియ్యం కుతకుతా ఉడుకుతున్న శబ్ధం భలే తమాషాగా ఉండాది. బెల్లం గడ్డలను రాయితో కొట్టి పొడి చేసి ఉడికిన అన్నంలో కలిపి, నెయ్యి, ఏలక్కాయల పొడి యేసి దబర్లో గెరిటి పెట్టి తిప్పతా ఉండారు. తియ్యటి పొంగలి వాసన దేవళం చుట్టూతా అములుకుంటోంది. ఆ వాసనకి నా ముక్కులు ఎగబీల్చుకపోతా ఉండాయి.
సుబ్బి, మస్తాను, వెంకటలక్ష్మి అందరు ఒకతట్టు ఉంటే, మస్తాను అత్త రవణమ్మ, ఆడపడుచు రంగి రవంత ఎడంగా కూర్చొని పొంగలి చేస్తా ఉండారు. మస్తాను మొగుడు ఎంకడు అటూ, ఇటూ తిరగతా ఉండాడు. చలమయ్య, వీరాస్వామి, యానాది, పెంచిలయ్య, కోళ్ళను నీళ్ళతో తడిపి , వాటి చిన్న మోకాల మీద పసుపు పూసి, కుంకాలు పెడతా ఉండారు.
నక్కలోళ్లు. సవరాలోళ్ళు దేవళం చుట్టూతా ప్లాస్టిక్ పట్టలతో కట్టిన చిన్న చిన్న అంగళ్ళు పెట్టిండారు. చెక్కబొమ్మలు, దువ్వెనలు, ఈర్పెనలు, పూసల దండలు, రబ్బరు బుడగలు, మట్టి బొమ్మలు, రిబ్బన్లు భలే భలే ఉండాయి. రంగుల రాట్నం కూడా ఉండాది. సుబ్బి ఆడబడుచు కూతురు ఏసులు, భాగ్యమ్మ కొడుకు పెంచిలి ఇంకొంతమంది పిలకాయలం ఆడ ఉన్న అంగళ్ళు చూస్తా తిరుక్కుంటున్నాం. సుబ్బి ఉండుకొని “చిట్టెమ్మా..పొంగళ్ళు చేయడం అయిపోనాది. దేవళంలోనకి పోదాము రాండి. ఇరగాలమ్మకి పొంగలి నైవిజ్జం బెట్టాలి” అరస్తా ఉండాది. నేను సుబ్బి మాటలు ఇనకుండా పెంచిలిగాడి చేయి పట్టుకుని దేవళం ఎనక తట్టుకి పోయినాను.
అంతే. ఒక్క తూరిగా ఒణుకు పుట్టేసింది నాకు. గుండె దడ, అదురుతో నాకు తెలీకుండానే పెద్దగా ఏడస్తా లగెత్తుకుంటా వొచ్చి సుబ్బిని గట్టిగా కావలించుకున్నాను.
” చిట్టెమ్మా.. ఏడస్తా ఉండావు దేనికా..? అంత గస పెడతా ఉండావు. ఓరిడమ్మా బడవా..!ఒరే పెంచిలిగా చిట్టెమ్మను కొట్టినావా ఎదవా నాయాల ” నన్ను పొదివి పట్టుకొని అరిచింది సుబ్బి.
“నేనేంచేయలేదు సుబ్బవ్వో.. సోర్నాల చెరువు కాడ పొట్టేళ్లు కోసేది చూసి బయపడింది చిట్టెమ్మ ” అన్నాడు వాడు ఎనక్కి చెయ్యి చూపిస్తా.
గుడి ఎనక తట్టుకు పోగానే పసుపు,కుంకుమ ముఖానికి పూసి, ఏపమండలు కట్టి ఉన్న మేకపోతు మెడని బండమీద ఆనించి కత్తితో ఒక్క ఏటు ఏసాడు ఒకాయన. తలకాయ ఎగిరి అల్లంత దూరంగా పడింది. చిక్కటి ఎర్రటి రక్తం మేకపోతు మొండెం నుంచి దూసుకొని ఎగిరి చుట్టూ ఉన్నవాళ్ళ మొహాలమీదకి ఎగజిమ్మింది . చానా సేపు మొండం తనకాలాడుకుని తనకాలాడుకుని కదలడం ఆగిపోయింది. అట్టా మేకపోతుని నరకడం నేను చూడడం తొలి తూరి. అది చూసి ప్రాణాలు పోయినట్టు అయింది నాకు. చానాసేపు ఏడస్తానే ఉండాను నేను.
“అయ్యో.. చిట్టెమ్మా.. నిన్ను సోర్నాల చెరువు తట్టుకి పోబాక అనిళ్లా నేనా. ఆడ కోళ్లు, పొట్టేళ్లను ఇరగాలమ్మకి బలి ఇస్తారు. ఇది ప్రతి తూరి చేసేదే. బెదురుకోమాక..” అంటా నన్ను సముదాయించింది. ఇంకా నాలో అదురు తగ్గలేదు. భయంతో నా గుండె టకటకా కొట్టుకుంటోంది. సుబ్బిని కావిలించుకొని చానా సేపు ఉండిపోయాను.
పొంగళ్ళు నైవేద్యం పెడుతున్నారు కదా. టెంకాయ కొట్టి కర్పూరం గూడా ఎలిగిస్తా ఉండారు. ఇక నోరులేని జంతువులను చంపడం ఎందుకు అని చాలాసేపు భయం, కోపం, దుఃఖం, జాలి అన్ని కలగలిసి ఏడ్చిన ఏడుపుకి నా ముఖం ఉబ్బి, ఎర్రగా కందిపోయింది. ఇవన్నీ చూసి బయపడతాననేమో అమ్మ నన్ను జాతరలకు పోతానంటే వొద్దనేది.
నన్ను జీవాలను బలిచ్చేకాడికి తీసకపోయినాడని పెంచిలిగాడి ఈపుని దబీ దబీమని బాదినాడు చలమయ్య తాత. నా వల్ల వాడికి దెబ్బలు పడ్డాయని నాకు చానా బాధ కలిగింది.
సుబ్బి నాకూడానే ఉండి గుడిలోపలికి తీసుకపోయింది. మెట్లు దిగి లోపలకి పోయినాం. అక్కడ చిమ్మ చీకటిగా ఉండాది. రవంతసేపు ఏమి అవపడలేదు మాకు. లోపల నూని దీపాల ఎలుగులో ఇరగాలమ్మ అమ్మోరి విగ్రహం నల్లగా, కనుగుడ్లు తెల్లగా చానా పెద్దవిగా చూడగానే గుండె దడ పుట్టేటట్లు ఉండాయి. రవంత భయం, రవంత భక్తితో ఇరగాలమ్మకి రెండుచేతులు ఎత్తి దణ్ణం పెట్టుకున్నాను.
***
గర్భగుడి బైట ఉన్న రాయి మీద టెంకాయలు కొట్టి, టెంకాయ చిప్పలు, పొంగళ్ళు నైవేద్యం పెట్టినారు. కొత్త చీరలు, గాజులు, పసుపుకుంకుమ పొట్లాలు ఇరగాలమ్మకి సారెగా ఇచ్చినారు. గుడిలో ఉన్న పూజారి అందరికి టెంకాయ నీళ్ళ తీర్ధం ఇచ్చి, పొంగలి ప్రసాదం పెడతా ఉండాడు. గుడి లోపలే ఎడం పక్క శివలింగం కూడా ఉండాది. అందురు ఆ తట్టుకి పోయి శివయ్యకు కూడా మొక్కతా ఉండారు.
ఇంతలో దేవళం ముందర మస్తాను పెద్దగా కేకలు పెడతా జుట్టిరబోసుకున్నాది.. కళ్ళు తేలవేసి గడగడా ఒనకతా ఊగిపోతా ఉండాది. మస్తానుకి పూనకం వొచ్చింది అని భయపడతా అందరు ఆ ఎమ్మి అమ్మిడికి చేరారు.
“అమ్మోరు తల్లో.. ఇరగాలమ్మోరు తల్లో..శాంతి..శాంతించు తల్లో..నీకేంకావాలి చెప్పు తల్లో..” పోత రాజు వేషగాడు మస్తాను చుట్టూ తిరగతా అరస్తా ఉండాడు.
” ఒరే పోతరాజు..నేను కోరుకున్నది చైయకపొతే మీ తలకాయలు ఎగిరిపోతాయి రో..” అంటూ పెద్దగా పెడబొబ్బలు పెడతా ఉండాది.
మస్తానుకి ఏమైందో అని నాకు భయమేసింది. రంగిని అడిగితే ” మస్తాను ఒంటిమీదకి ఇరగాలమ్మ పూనింది” అనింది.
పోతరాజు వేషగాడు ఉండుకొని ” ఇరగాలమ్మ తల్లే ..శాంతించు. నీకు పొంగళ్ళు పెట్టినాము. కోళ్లు, పొట్టేళ్లు కోసినాము. నీకు ఇంకేం కావాలి తల్లే..మమ్మల్ని కరుణించు. ఊర్లో చానా మందికి అమ్మోరు పోసి ఉండాది. అది తగ్గించు తల్లే..మమ్మల్ని కాపాడు తల్లే..” అంటా ఒంగి మస్తాను కాళ్ళకు దణ్ణం పెట్టినాడు. మస్తాను మొకానికి పసుపు పూసి రూపాయి కాసంత ఎర్రబొట్టు పెట్టింది సుబ్బి. టెంకాయ మీద కర్పూరం పెట్టి ఎలిగిచ్చి మస్తాను చుట్టూ దిగదుడిచి నేలకేసి కొట్టాడు వీరయ్య. టెంకాయ చిప్పలు ముక్కలుముక్కలుగా పగిలినాయి. అందరు మస్తాను చుట్టూ చేరి దణ్ణం పెడతా ఉండారు.
” ఒరే పోతరాజు తమ్ముడా.. ఊర్లో అమ్మోరు జబ్బు లేకుండా నేను చూసుకుంటా. ఈ మస్తాను అత్త రవణమ్మ , దాని కూతురు రంగి కి బుద్ధి చెప్పండిరా. కోడల్ని బంగారం మాదిరి చూసుకోవాలి. కొడుకు చేత ఏరు కాపరం పెట్టించాలి. కోడలి ఒంటి మీద దెబ్బ పడిందా రవణమ్మ నెత్తురు కక్కోని చస్తుందిరా. పూనకం ఎక్కువై తల చుట్టూరు తిప్పతా ఊగిపోతా ఉండాది మస్తాను. తప్పేట్లు కొట్టేవాళ్ళు మస్తాను చుట్టూ చేరి జోరుగా తప్పేట్లు వాయిస్తా ఉండారు.
భయంతో చేతులు జోడించి మస్తాను కాళ్ళమీద పడిపోయింది ఆ అమ్మి అత్త రవణమ్మ .”నువ్వు జప్పినట్లే చేస్తాము తల్లే. నా కోడలు మస్తాన్ని నా కూతురి మాదిరిగానే చూసుకుంటాను. మమ్మల్ని కరుణించు. శాంతించు తల్లే” ఓనకతా ఓనకతా అన్నాది. ఆడపడుచు రంగి కూడా మస్తాను కాళ్ళమీద పడింది భయం భయంగా.
పోతరాజు వేషగాడు దబర్తో నీళ్ళు తెచ్చి మస్తాను తలమీద కుమ్మరించాడు. మస్తాను ఒళ్ళు విరుచుకుని పడిపోయింది. అందరం ఆ అమ్మి చాయ చూస్తా ఉన్నాము భయంగా. పది నిమిషాల తర్వాత లేచి కూర్చుంది మస్తాను. ఏం ఎరగనట్లు జుట్టు ముడి ఏసుకోని “మనం ఇప్పుడు ఏడుండాం” అనింది అమాయకంగా . అందరి మనసులు తేలిక పడినాయి. బిత్తర మోకాలేసుకుని ఉన్న రవణమ్మ, రంగిల సాయ చూసి ముసిముసినవ్వులు నవ్వతా ఉండారు ఏనాది,వీరయ్య తాత. అందరం పొంగలి గిన్నెలు తీసుకున్నాం. కోళ్లు, మేకలు ,పొట్టేళ్లు కోసినోళ్లు కూడా వాటి కూరలు చేసి ఇరగాలమ్మకి నైవేద్యం పెట్టినారు.
నాకు ఒక పక్క సంతోషం, మరో పక్క బాధ. అప్పటికే చానా పొద్దు పోయింది. అందరం ఇళ్లకు పొయ్యేదానికి తిరుక్కున్నాం. నేను సుబ్బి చేతిని పట్టుకొని నడస్తా ఉండాను. తంబురా వాయిస్తా రోజు సంగంలో పాటలు పాడే బైరాగి తాత తత్వాలు పాడేదానికి మల్లుకున్నాడు.
“కష్టమేది..సుఖమేది.. కాటి కాడ అంతా ఒకటేలే
రాజేవురు..పేదెవురు బొందల గడ్డలో ఇరువురికి ఆరడుగుల చోటేలే”
బైరాగి తాత పాట పాడడం అయింది. నేను ఉండుకొని ” తాతా..మస్తాను ఒంట్లోకి నిజంగానే ఇరగాలమ్మ అమ్మోరు వొచ్చిందా” కళ్ళు పెద్దవి చేసుకొని బైరాగి తాతా చాయ చూస్తా అడిగా.
బైరాగి తాత నా సాయ ఒకతూరి చూసి, ఒక్క క్షణం కళ్ళు మూసి, తెరచి ” మస్తాను కష్టాలు తీరాలంటే ఆ అమ్మి ఒంటిమీదకి దేవుడో, దెయ్యమో రావాల్సిందే చిట్టెమ్మా ” అన్నాడు నా బుగ్గలు ఆపేక్షగా నిమరతా
బైరాగి తాత మాటలు నాకు అర్ధమైనట్టు, కానట్టు అనిపించాయి.
***

2 thoughts on “గంగరాయి సెట్టు కింద ఇరగాలమ్మో..”

  1. బసవరాజు అమరనారా

    గంగరాజు సెట్టు కింద ఇరగాలమ్మ .. కత…పరస (జాతర)చుట్టు మా బాల్యము నడచింది… కథావస్తువు బాగుంది వాస్తవం కండ్లముందు కదలాడింది…. ..ఊరిజాతరలు కళ్లముందు కదలాడింది.. మప్పిదాలు కృతజ్ఞతలు.. అమరనారా బసవరాజు హోసూరు

  2. మోచర్ల అనంత పద్మనాభరావు

    చాలా బాగా వ్రాసారు. నెల్లూరు యాసలో కథ పటిష్టంగా ఉంది. నిజమే మస్తానా బోధలు తీరాలంటే ఆమె వంటి మీదకి దేవుడో దెయ్యమో రావలసిందే. అభినందనలు 👏👏👏

Comments are closed.