శ్రీమతి వంజారి రోహిణి గారు విరచిత “కర్పూర దీపం” కథా సంవిధానం – అద్భుతం, అభినందనీయం, అజరామరం – ఒక చిన్న సమీక్ష *************************************************మరుగు దొడ్లను చేత్తో శుభ్రం చేసే వారిపై (మాన్యువల్ స్కావంజర్స్) వచ్చిన కథలు తెలుగు సాహితీ జగత్తులో చాలా అరుదు. కానీ వారి దుర్భర పరిస్థితులపై వారి దయనీయ జీవన స్థితగతుల గురించి హృదయం ద్రవించేలా కళ్ళకు హత్తుకునేలా “కర్పూర దీపం” కథ ద్వారా “దొడ్డెత్తే నరసమ్మ” ప్రధాన పాత్ర ద్వారా చిత్రీకరించన శ్రీమతి రోహిణి గారు సర్వదా అభినందనీయులు, చిరస్మణీయులు. ఈ కథ చదువుతున్నంత సేపూ నా కళ్ళల్లో కరి మబ్బులు దోబూచలాడాయి. అక్కడక్కడా అక్షరాలను తడిగా పలకరించాయి కూడా. విశ్వమానవ ప్రేమ, సమానత్వ భావనలతో, అచ్చమైన స్వచ్ఛమైన నెల్లూరి మాండలీకంలో విరచితమైన ఈ అసామాన్యమైన కథ తెలుగు కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ఆవిష్కరించబడింది. మాండలిక రచనల చేసి చిరస్థాయి కీర్తిని ఆర్జించిన తెలుగు రచయితలలో ఉత్తరాంధ్ర మాండలిక రచనా విన్యాసం గావించిన రావిశాస్త్రి గారు, చిత్తూరు ప్రాంత మాండలికాన్ని రాసిన నామిని సుబ్రమణ్యం నాయుడు గారు, తెలంగాణ మాండలికాన్ని విస్తృతంగా ప్రయోగించిన తెలిదేవర భానుమూర్తి గారు, అనంతపురం జిల్లా మాండలికాన్ని ఉపయోగించి సుసంపన్నం చేసిన సడ్లపల్లె చిదంబర రెడ్డి గారి అడుగుజాడలలో పయినించిన రోహిణి గారు నెల్లూరు జిల్లా మాండలికాన్ని విజయవంతంగా సమర్థవంతంగా ఉపయోగించిన మొట్టమొదటి రచయిత్రిగా తన సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకున్నారు.వంజారి రోహిణి గారు ఇప్పటి వరకూ 70 కథలూ అనేకానేక(వందకు పైగా) కవితలూ విస్తృతంగా సమీక్షా వ్యాసాలు వెలువరించారు. ఆమె రాసినవన్నీ అనేక ప్రముఖ పత్రికలలోనూ అంతర్జాల పత్రికలలోనూ ప్రచురింపబడ్డాయి. విశేషమేమిటంటే ఆమె రాసిన దాదాపు అన్ని కథలూ వాడిపోని తన బాల్యపు జ్ఞాపకాలను సంపెంగ మొగ్గలుగా చల్లటి మదిలోపల మానవత్వం అనే తడిగుడ్డను కప్పి భద్రపరచి వాటి సుగంధ పరిమళాన్ని మనకు తాజాగా అందించారు. వృత్తిరీత్యా సైన్స్ ఉపాధ్యాయిని అయిన రచయిత్రి ప్రాథమికంగా గొప్ప పాఠకురాలు. ప్రఖ్యాత రచయితలయిన బుచ్చిబాబు, చలం, గోపీచంద్ లాంటి వారి ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉంది. తన రచనల్లో నెల్లూరు జిల్లా జీవమైన మాండలిక భాషను అత్యంత సహజంగానూ, అలవోకగాను ప్రవేశపెట్టి వాటికి జవమూ జీవమూతో పాటు కళా ఖండాలనదగిన శాశ్వతత్వాన్ని చేకూర్చి పెట్టారు. రోహిణీ గారి రచనలోని మానవతా విలువలు, అభ్యుదయ భావాలు, ఆదర్శాలు, కవితాత్మక శైలిని పట్టి చూడడం ఈ సమీక్ష ముఖ్యోద్దేశం రచయత్రి రాసే రచనలో, ముఖ్యంగా కథ, కవిత్వం వ్యాసం వంటి రచనలో కవితాత్మక వచనం, లేదా కవితాత్మక శైలి చోటు చేసుకోవడానికి కారణాలేమై ఉంటాయి అని ప్రశ్నించుకున్నపుడు దొరికే మొట్ట మొదటి సమాధానం ఆమె సున్నిత మనస్కురాలు, సుకుమార భావుకురాలు కనక. భావుకత్వం లేనిదే ఒక రచయిత్రి ఎట్లా అవుతారు అని వెంటనే మరొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి సమాధానం మామూలు భావుకత్వం కంటే ఉన్నతమైన, ఉదాత్తమైన ఉత్తమమైన భావుకత్వం కలిగిన వారై వుండాలి, లేదా మౌలికంగా ప్రాథమికంగా ఆమె సామాజిక చైతన్యం నిండిన అభ్యుదయం మూర్తీభవించిన కవైనా అయుండాలని మరొక సమాధానం. ఇటువంటి సందర్భాల్లో రచయిత్రి నేపధ్యాల్లోకి, మూలాల్లోకి తొంగిచూస్తే ఈ కవితాత్మక శైలిలో రాయడానికి కారణాలు మనకు కొన్నయినా దొరుకుతాయి, తెలుస్తాయి.ఇక కథ లోనికి ప్రవేశిస్తే రచయిత్రి తన బాల్యంలో జరిగిన ఒక సంఘటనకు ప్రాణ ప్రతిష్ట చేశారు. బుజ్జమ్మ అనే పాప పాత్రలో దాగిన రచయిత్రి ఈ కథను మనకు వినిపిస్తూ ముందుకు నడిపిస్తారు. కరుణ రసాత్మకమైన ఈ కథలో ప్రధాన పాత్ర అయిన నరసమ్మ పేదరాలు, దళిత వర్గమైన మాదిగ కులానికి చెందిన పారిశ్యుధ్య కార్మికురాలు. ప్రతీరోజూ తన పరిధిలో ఉన్న ప్రతీ ఇంటిలోని మరుగుదొడ్డిలో నిండిన మలమూత్రాలను రెండు రేకుల సాయంతో తన చేతులతో ఎత్తి బకెట్లో పోసుకొని తీసుకువెళ్ళి పారబోసే వృత్తి ఈ నరసమ్మది. నరసమ్మ భర్త రిక్షా కూలీ. కల్తీ సారా తాగి అర్ధాంతరంగా తనువు చాలిస్తాడు. ఒక్కగానొక్క కూతురు రంగి భర్త ఎర్రయ్య మేస్త్రిగా చేస్తూ తన దగ్గర పనిచేసే శ్రీకాకుళం అమ్మాయితో వెళ్లిపోవడం వలన కూతురిని, కూతురి కొడుకైన సురేష్ భాధ్యతలు కూడా నరసమ్మ మోస్తూ ఉంటుంది. సురేష్ తన అమ్మమ్మ నరసమ్మతో కలిసి వచ్చినపుడు బుజ్జమ్మతో స్నేహం కుదురుతుంది. ఒకసారి సురేష్ పుస్తకంలో వేసిన చక్కని బొమ్మలను చూసీ ఆకర్షితురాలై తనకు కూడా వేయడం నేర్పించమని బుజ్జమ్మ తన రంగు పెన్సిల్లతో మారక ఒప్పందం చేసుకునేటప్పుడు మద్యలో ప్రవేశించిన పక్కవీధి స్వర్ణమ్మ సురేష్ ను బెదరగొట్టి పంపించేస్తుంది. దానికి ఖిన్నురాలైన బుజ్జమ్మ పక్కవీధి స్వర్ణమ్మ ను మనసులో తిట్టుకుంటూ ఇంటికి వెళ్తుంది. అయినా వారి స్నేహం కొనసాగుతూ ఉంటుంది. ఒకరోజు నరసమ్మ భుజ్జమ్మ తల్లి ఆదెక్కతో భోరున ఏడుస్తూ తన కూతురు రంగి మతం తీసుకొని కొడుకుతో కలిసి గుంటూరులో ఉన్న ఫాదర్ గారి ఇంటి దగ్గర పనిచేయటానికి వెళ్లిపోయిందని చెప్తుంది. కథ ఈ దశకు చేరుకున్నపుడు నవంబర్ మాసం చివరి రోజులలో వారం నుండి ముసురుపట్టి ఆకాశానికి చిల్లులు పడినట్లు కుండపోతగా వర్షాలు కురుస్తుంటాయి. ఇళ్లు రోడ్లు వరదపాలై పట్టణ ప్రజల బాధలు వర్ణనాతీతం. నర్సమ్మ వారం నుండి రాకపోవడంతో ఇండ్లల్లో మరుగుదొడ్లు నిండిపోయి దారుణమైన దుర్వాసనతో గృహస్థులు ఇబ్బందులు పడుతుంటారు. మగవారు ఏ కాలువ గట్టుకో వెళ్లగలిగినా స్త్రీల పరిస్థితి ఇక నరకప్రాయమే బయలుకు వెళ్లలేని సమస్య. నర్సమ్మ రాకపోవడం వలన కొంత బాధ మరికొంత కోపం కలగలిసి కొంతమంది మగవారిని ఆమె ఇంటికి వెళ్ళి పిలవడానకి పురమాయిస్తుంది. దారి చూపడానికి అక్కడికీ బుజ్జమ్మే తన తండ్రి సత్యం గారి వేలు పట్టుకుని నడుస్తుంది తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి గుడిసె పైకప్పుకి ఉన్న తాటిదూలం మీదపడి నిర్జీవిగా మారిన నరసమ్మ మృతదేహం వారికి కనిపిస్తుంది. చుట్టూతా రక్తం కారి ఎండి ముద్దలుగా మారి ఉంటుంది. ఆ స్థితికి తీవ్రంగా చలించిన వెళ్ళిన వారు మానవత్వంతో అన్ని భేదాలు పక్కన పెట్టి నరసమ్మ దేహానికి స్వంత చేతులతో మోసి అంత్యక్రియలు నిర్వహించి తను రుణాన్ని తీర్చుకొనే సన్నివేశంతో కథ ముగుస్తంది. హృదయవిదారకమైన నర్సమ్మ గాథలో ఈ చిట్టచివరి మలుపు సమాజాన్ని తట్టి లేపే మేల్కొలుపు.నరసమ్మ పాత్ర గురించి వర్ణిస్తూ రచయిత్రి కథలో ఒకోచోట ఇలా అంటారు “నరసమ్మ సన్నగా,పొడుగ్గా గెడకర్ర మాదిరి ఉంటాది. చింపిరి జుట్టు, చినిగిపోతే అతుకులేసి కుట్టుకున్న పాత పచ్చరంగు కోక కట్టుకోనుండాది. బొట్టులేని ముడుతలు పడ్డ నుదురు, ఎలిక తోకమాదిరి ఏలాడతా ఉన్న పొట్టి జడ. బొడ్లో దోపుకున్న ఒక్కాకు, చిల్లర డబ్బుల తిత్తి. ఎప్పుడు చూసినా రోట్లో ఏసి రుబ్బినట్లు తమలపాకు, వొక్కా నవలతా ఉండేతలికి నోరు, పళ్ళు ఎర్రగా ఔపడతా ఉండాయి. ఒక చేతిలో పెద్ద బొక్కెన, ఇంకో చేతిలో రెండు ఇనప రేకులు పట్టుకొని వొచ్చింది”. దొడ్డి కంపుతో నాకు వాంతికి వొచ్చినట్లయింది. పాపం నరసమ్మ రోజూ అందరి ఇళ్లల్లో గబ్బు ఎట్ట భరిస్తోందో. అందుకే కంపు వాసన తెలీకండా వొక్కాకు నమలతా ఉండాదిగామాల అనిపించింది.అప్పుటికే సగం బొక్కెన దొడ్డితో నిండి ఉండాది. కంపు భరించలేక వాకిట్లోకి లగెత్తిన. దొడ్డికంతా బొక్కనలో ఏసేసి మిగిలిన చెత్తని మొక్కట్టతో ఎత్తి చెత్తకుప్పలో ఏసి, పినాయిలు పోసి, దబర్లో ఉన్న నీళ్ళతో దొడ్డి కడిగేసి చేతులు కడుక్కోని వొచ్చింది నరసమ్మ.”నరసమ్మ కనిపిస్తేనే ఏడ ఆమె చేయి తగులుతుందో, బొక్కెన తగులుతుందో అని చీదరించుకుని దూరం దూరం జరిగిపోయే అందరూ ఈ రోజు నరసమ్మ జపం జేస్తా ఆమె గుడిసె కాడికి పోయేదానికి మల్లుకున్నారు”రచయిత్రి ఎంత సహజాతి సహజంగా ప్రధాన పాత్రకు రూపకల్పన చేశారో ఈ వర్ణన ద్వారా వారి ప్రతిబాకౌశలం, విభిన్న శైలి, మనోజ్ఞ శిల్పం, పీడితవర్గాల పట్ల ఆపేక్ష, దయార్ధ హ్రుదయం మనకు ప్రస్ఫుటమౌతాయి. శ్రీమతి రోహిణి గారు ఇలాంటి మరిన్ని గొప్ప కథలను, నవలలనూ రాసి సామాజిక భేదాల సమూల మార్పు కోసం తమవంతు దోహదం చేస్తారని., మరో వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, సావిత్రీబాయి ఫూలే లా మారగలరనీ మార్చగలరనీ…..సంతోషంతో ఆశిద్దాం, సగర్వంగా ఆహ్వానిద్దాంసహృదయతతో ఆదరిద్దాం@ డా. జెల్ది విద్యాధర్