“అరే..అక్కడేదో సభ జరుగుతోందే
వద్దువద్దు
అక్కడంతా కులం కంపు కొడుతోంది..
ఇక్కడెవరెవరో సమావేశమయ్యారే
బాబోయ్ !
ఇక్కడందరూ మతం మత్తులో జోగుతున్నారు..
ఆ గుంపు గోల ఏమిటో
నైతికత్వానికి తిలోదకాలిస్తున్నారే
అయ్యో .. దూరంగా పరిగెత్తాలి..
సభల్లో సమావేశాల్లో గుంపుల్లో
బొట్టు నుదుర్లు ఒట్టి నుదుర్లు
కట్టగట్టుకుని కొట్లాడుకుంటున్నాయి
కాట్ల కుక్కల్లా ..
మనిషి జాడ మాత్రం జాడే లేదు
ఏ చట్రంలో ఇరుక్కోను నేను..
మనిషి అయిపు కోసం పాకులాడుతున్నా
మానవత్వపుమనిషి ఆనవాలుకోసం
దేవులాడుకుంటున్నా..
ఓ ప్రపంచమా.. నీలో
మనిషెక్కడున్నాడో చూపు దయవుంచి..
ఆ మనిషి నెత్తి మీద పోస్తాను ధారగా
పన్నీటిని నా కన్నీటితో కలిపి “
రోహిణి వంజారి
13 – 1-2025