పద్యం ఎగురుతోంది ఆవేశంగా, గర్వంగా, ప్రేమగా….
“సృజన సాహితీ” పత్రికలో ప్రముఖ కవులు అవ్వారు శ్రీధర్ బాబు Sridhar Avvaru గారి కవిత్వ సంపుటి “ఎగురుతున్న పద్యం” గురించి నేను రాసిన సమీక్ష. “సృజన సాహితీ” సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Rao Kommavarapu గారికి ప్రత్యేక ధన్యవాదాలు . “ఎగురుతున్న పద్యం”తప్పకుండా చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.
కళ్ళ ముందు ఏదైనా దృశ్యం కదలాడితే సామాన్యులు ఎటువంటి భావం లేకుండా వెళ్ళిపోతారు. కానీ కొందరి మనసు ఆ దృశ్యం లేదా సంఘటన చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది అనుక్షణం . ఆ దృశ్యంలోని రంగు, రూపు, చైతన్యం, ప్రతి అణువు ఆ కొందరిని కదిలిస్తుంది. భావావేశానికి గురి చేస్తుంది. సంవేదనలకు తావునిస్తుంది. దృశ్యం కళ్ళ ముందు జరిగినా మనసు మాత్రం దృశ్యం తాలూకు అనుపావులనన్నిటినీ అక్షరాలుగా మూట కట్టి అనంత విశ్వంలోకి ఎగరేస్తుంది. అలా ఎగురుకుంటూ వెళ్లిన సంవేదనలన్నీ బీజాక్షరాలై కవి హృదయంలో పురుడుపోసుకుంటాయి కవితలుగా. అటువంటి దృశ్యాదృశ్య సంవేదనల సారమే కవులు అవ్వారు శ్రీధర్ బాబు గారి “ఎగురుతున్న పద్యం
అవ్వారు శ్రీధర్ బాబు గారు నెల్లూరు వాసులు. నేను పుట్టి పెరిగిన గడ్డ నెల్లూరు వాసులు. అందువల్ల సహజంగా కొంత అభిమానం నెల్లూరు సాహితీవేత్తలపైన మంచి గంధపు పూతలా. అవ్వారు శ్రీధర్ బాబు కవులుగా చిరపరిచితులు. పెన్నా రచయితల సంఘం, జాషువా కవితా పీఠం వంటి సాహితీ సంస్థలలో వారి సేవలు అనన్యసామాన్యం. డాక్టర్ శిఖామణి గారు ముందు మాటలో చెప్పినట్లు వారు ప్రకృతి ప్రేమికులు. సమాజ ప్రేమికులు. పల్లె ప్రేమికులు. పంట చేల ప్రేమికులు. తన ప్రేమను కవితా విహంగంగా మార్చి, సాహితీ వినువీధుల్లో ఎగురవేసిన ప్రకృతి ఆరాధకులు. సమాజ, సమకాలీన పరిస్థితులవల్ల కలిగిన అవేదనను, దుఃఖాన్ని కవితా మేఘాలుగా సృష్టించి, సాహితీ వినీలాకాశం నుంచి ఆవేదనాశ్రువులుగా పాఠకుల మనసులను తడిపే కవితాశ్రుబిందువులు అవ్వారు శ్రీధర్ బాబు కవితలు.
“ఎగురుతున్న పద్యం” కవిత్వపు సంపుటిలో 70 కవితలదాకా ఉన్నాయి. అన్నీ కవితలు ప్రముఖ పత్రికల్లో ప్రచురణ అయినవే. ఇంకా గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ సంపుటిలోని చాల కవితలు వివిధ కవితా పోటీల్లో బహుమతి పొందినవే. దీనిని బట్టే మనకు తెలుస్తోంది ఈ కవితా మాలికలను మనసులను దోచుకునే శక్తి మెండుగా ఉందని.
హృదయాలను కట్టిపడేసి కవితావేశంలోకి ఎగురవేసే కొన్ని కవితల గురించి ఇక్కడ ప్రస్తావిస్తే.. మండుతున్న ఎండఘాటుని/నల్లమబ్బొక్కటిచినుకు రాల్చి తరిమేసింది/ అడవిని కాల్చేస్తున్న కార్చిచ్చుని/వానజల్లు తడిపేసింది/ యోచించు..!/ ఎప్పుడు తిమింగలమే చేపలను మింగేయాలా..అవన్నీ ఏకమై తిమిగలాన్ని ముంచేయొచ్చుగా..!/ అంటారు కవి “విచక్షించు…” అనే కవితలో. ప్రతిసారి పెత్తనందారులది, నిరంకుశులదే కాదు కాలం. అప్పుడప్పుడు కాలం తిరగబడుతుంది. ఎప్పుడూ పెత్తనందారుల ఆటలు సాగవు, బానిసత్వం సాగదు అంటూ కవి బాధితుల పక్షాన నిలుస్తాడు. “బలవంతమైన సర్పం, చలిచీమల చేత చిక్కి చావదే” అన్న సుమతి శతకం ఈ కవితలో సింబాలిక్గా కనపడుతుంది. బలం, అధికారం,అహంకారం ఎప్పుడో ఒకప్పుడు చతికిలబడతాయి అనే ఆశా భావం కవిది.
పల్లె..విరబూసిన పూలచెట్టులా/విరగబడి నవ్వేసేది..!/ చెడ్డిలోనించి ప్యాంటు కొచ్చినట్లు/పల్లె నొదిలి నగరానికి వలస/ ఎన్నాళ్ళ నుండి మనసులో పెట్టుకుందో../ఎండ నా మెడకు కసిదీరా దూకుతోంది/
పల్లెల నిండా హరితవనాలు. ఎక్కడ చూసినా పచ్చదనమే. ఇక పల్లె మీద వాలాలంటే ఎంత భయం ఎండకు. పల్లెకు రక్షణగా, పల్లె జనాలకు అడుగడుగునా నీడనిస్తున్న చెట్లు రక్షణకవచాల్లా పల్లెను కాపాడుతున్నాయి. తల్లిలాంటి పల్లెనొదిలి నగరానికి వస్తే మాత్రం ఈ జనారణ్యంలో కాంక్రీట్ భవనాల నడుమ అంజనం వేసి చూసినా పచ్చదనం కనపడడం లేదు. భూతాపం పెరిగిపోతోంది. ఎండ కసిగా మనుషులను మాడ్చేస్తుంది అని ఆవేదన చెందుతాడు కవి “తప్పిపోయిన వనం” అనే కవితలో. నగరాల్లో ఉన్న కొద్దిపాటి చెట్లను కూడా భవన నిర్మాణాలకు అడ్డు వస్తున్నాయని చెట్లను ఖండాలుగా నరికి, పచ్చదనాన్ని అంతం చేస్తున్నారు అనేదానికి, ఇక్కడ ఖాండవ దహనం అనే మెటాఫర్ ని కవి వినియోగించినట్లు తెలుస్తోంది.
గుడి పక్కన నాకింకో దేవుడు..ప్రత్యేక్షం…!/హస్తం అశ్వమేథమై ఊరుకుతుంది/ఏకాగ్రత తథాగతుని ధ్యానాన్ని తలపిస్తుంది/తన ఆశీర్వాదం పరువై నిలుస్తుంది/
ఆ తెగిన చెప్పులను కుట్టే అతన్ని సూత్రధారి అని, మన పాదాలను రక్షించే చెప్పులను పాత్రధారి అని, వారిద్దరికీ మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలని అంటారు కవి “పాదాభివందనం” కవితలో. చిన్న చిన్న పనులతో కాయకష్టం చేసుకునే వారిపట్ల కవికి గల జాలి, కరుణ మనకి అన్యోపదేశంగా తెలుపుతాడు ఇక్కడ.
ఇంట్లో ఆనంద ప్రవాహం సాగాలంటే స్త్రీలు, దేశం సుభిక్షంగా ఉండాలంటే నదీ ప్రవాహాలు సక్రమంగా ఉంటూ కుటుంబాన్ని, దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి అని కవి ప్రఘాడ నమ్మకం ఈ కవితలో ప్రస్ఫుటమవుతుంది.
లాభానష్టాల లెక్కలేమో కానీ/పేగు ఆకలి…రొద తీర్చది ఎప్పుడు… ఎన్ని శిలలు కరిగి దోసిలి నిండాలి…!/ పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎర్ర లైట్ వెలిగినప్పుడు వాహనాలన్నీ ఆగిపోయి, పచ్చ లైట్ ఆదేశం కోసం చూస్తూ ఉంటాయి. నడుమన ఆ కాస్త సమయంలో ప్రతి వాహనం దగ్గరకు వచ్చి కిటికీ అద్దాలలోకి ఆశగా చూస్తుంటారు కొందరు. వారిలో ఆత్మాభిమానాన్ని చంపుకుని, ఆకలికి లొంగి చేయి చాపి అడుక్కునేవారు. చేయి చాపి అడగడానికి మనసు రాక, పెన్నులు, బొమ్మలు లాంటి ఏదో ఒక వస్తువులను కొనుక్కోమని బతిమాలేవాళ్ళు మనకి కనపడతారు. ఆ కోవకి చెందిన వారే కారుకి మాట్స్ అమ్మే వాళ్ళు. మాడ్చే ఎండలను, కూల్చే వడగాలులను లెక్క చేయక, కాలే కడుపు ఆకలి తీర్చడం కోసం కారు మాట్స్ కొనమని అర్దిస్తుంటారు. కారులో ఉండే మనుషులు ఎవరైనా కొంటారేమో అని ఆశ పువ్వులను కళ్ళ నిండా నింపుకుని తిరుగుతుంటారు. కారు లోపల ఉన్న మనిషి జాలితో కరిగి మాట్స్ కొనుక్కుంటే, ఆ పూటకు ఆకలి తీరినట్లే. అయితే బతుకే ఒక ఆకలి అయితే, కార్ల లోపల నల్ల అద్దాల వెనుక ఎన్ని జీవ శిలలు కరుణతో కరిగితే అతని దోసిలి నిండుతుంది అంటూ కవి కారు డోర్ మాట్స్ అమ్మే కుర్రాడిమీద తన జాలి వర్షాన్ని కురిపిస్తాడు “వాడని ఆశ పువ్వు” కవితలో. కారు లోపల ఉన్న మనుషుల హృదయాలను శిలలతో పోల్చి, అవి జాలితో కరిగితే కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వస్తువులు అమ్మి జీవించే వారి ఆకలి తీరేది అంటూ, ఏదైనా కారు ఆగిందో లేదో కానీ, నా కంటి బొట్టు జారింది అంటాడు. కారు డోరు కాదు, మనసు డోరు తెరిచి అటువంటి వాళ్ళను ఆదుకుందాం అంటూ తన అపారమైన జాలి, కరుణలను కురిపిస్తాడు ఈ కవితలో.
పతంగమొకటి ఎగురుతోంది/సూత్రం సరి అయినదో../దారం బలమైనదో/ ఆకాశంలో తారాడుతున్న మేఘంగా కన్పించిందది/ నేను పదాలను సరి చేసుకుని బలమైన ప్రశ్నల దారంతో పద్యాన్నొకటి సాహితీ లోకంలోకి ఎగురవేసాను/మనసులను చేరిందేమో../పద్యం రెట్టించిన ఉత్సాహంతో ఎగురుతోంది ఇంకా.. \/
సూత్రం, దారం రెండు బలమైనవి అయినప్పుడే పతంగం గాలికి ఎదురీగి దృఢమైన ఆత్మవిశ్వాసంతో నింగిన సంచరిస్తున్న విహంగంతో పోటీ పడుతూ, వినీలాకాశపు అంచులను తాకుతున్నట్లు నింగిలో కేరింతలు కొడుతూ ఎగురుతుంది. కవి సమాజానికి దారిదీపం వంటివాడు. సమాజ వైరుధ్యాలను కవితా దర్పణంలో చూపగల నేర్పరి. కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలను చూస్తూ సహించలేక ప్రశ్నల బాణాలను సూటిగా సంధించగల విలుకాడు. తన వాదన పఠిమతో ప్రజల మనసులను గెల్చుకుని, తాను విసిరేసిన సవాళ్ళను కవితాక్షరాలుగా లిఖించగల సూత్రధారి,పాత్రధారి. అంతిమంగా కవి సమాజ శ్రేయస్సును కోరుకునే మానవతావాది అని ఈ చిన్న కవితలో గొప్ప నిఘాడార్ధం గోచరమవుతుంది.
సాధారణంగా మనం గురువును దీపంతో పోలుస్తూఉంటాం. “వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు” అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారు. దీపం జ్ఞానానికి ప్రతీక. ఇక్కడ కవిని కూడా దీపంతో పోల్చవచ్చు. ఎందుకంటే గురువుకైనా, కవికైనా తాము వెలుగులు పంచాలంటే, పదుగురి మనస్సులో జ్ఞానజ్యోతిని వెలిగించాలంటే, తాము నిరంతరం జ్ఞానాన్వేషణ చేస్తూ ఉండాలి. కవులు అవ్వారు శ్రీధర్ బాబు నిస్సందేహంగా గొప్ప పాండిత్యం ఉన్న కవులు. పిల్లలకి వెలుగునిచ్చే దారిదీపంలాంటి ఉపాద్యాయుడు కూడా. భాధస్తప్తమైన తన మనసును ఒడ్డున పడ్డ చేపతో, నలిగిన వేలుతో పోల్చడం, నిరీక్షణ, వ్యతిక్రమం, సాంత్వన లేపనం లాంటి కవితా శీర్షికలు వారి అత్యుత్తమ అభిరుచి, ప్రతిభకు తార్కాణాలు. కవితా జ్యోతులతో వారు సాహితి లోకాన్ని వెలిగించడం కోసం వారు నిరంతరం జ్ఞానాన్వేషణ చేస్తూ ఉండాలని, వారు మరిన్ని కవితా మాలికలను ఎగురవేయాలని, మరెన్నో పురస్కారాలు పొందాలని కోరుకుంటూ..
“ఎగురుతున్న పద్యం”
ప్రతులకు
అవ్వారు శ్రీధర్ బాబు
85001 30770
సమీక్షకులు
రోహిణి వంజారి
9000594630