ఉత్సవం

ఈ వారం “సృజన క్రాంతి” సాహితీ పేజీలో నా కవిత “ఉత్సవం” చదవండి. శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలు. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

చలి జూలు విదిలించి కొట్టే ఓ ప్రభాతంలో

ఉన్ని చొక్కానో, శాలువాతోనో

రహదారుల్లో ఆగని ఉదయపు నడకలు..

వెచ్చని నెగళ్ళ కోసం వెతుకులాటలు

ఇరానీ హోటల్లో పొగలు కక్కుతున్న గరం గరం చాయ్

తేనేటి కోసం తేనెటీగల్లా బారులు తీరిన జనం..

నిమ్మ, నారింజ, జామ, సీతాఫలాలు

సీజనల్ ఫలాలం మీ ఆరోగ్యానికి భరోసాలం

అంటూ లేత హరిత వర్ణపు స్వాగతాలు..

కువ్వలు కువ్వలుగా పండ్ల గుట్టలు బాటల వెంట

బొమ్మల కొలువులా తీర్చిన చిరు వ్యాపారుల తొలి సందడి ..

అమ్మ కొంగు కప్పుకుని చలికాచుకునే వేళ

బస్సు హారను విని బడికి పోనని మారాము చేసే పసివాడు

బిడ్డ ఎక్కిన బస్సు కనుమరుగయ్యాక

కొంగుతో కంటి తడిని తుడుచుకున్న తల్లి..

గూడు విడిచి రావడానికి బద్దకించిన చెట్టు మీది పిల్ల పక్షి

చిరుగు కొమ్మల్లో తీస్తున్న హిందోళ రాగం..

గల్లీ చివర ఒణుకుతూ కూర్చున్న తాత

నోట్లో బీడీతో ఊపిరుల్లోకి నింపుతున్న వెచ్చదనం..

చలిపులితో మాకు పనిలేదు

పనే మాకు ప్రత్యక్ష దైవమంటూ

క్యారేజీలు పట్టుకెళుతున్న కార్మిక కష్ట జీవులు..

మంచు బిందువులు చిరుతుంపరలై కురుస్తున్నవేళ

కొమ్మలు, ఆకులన్నీ చిరుగాలికి పరవశంతో ఊగుతుంటే..

తుషారబిందువుల్లో తొంగి చూస్తున్న తొలివెలుగు కిరణాలు

ఏడురంగుల ఇంద్రధనసై మురిపిస్తున్నవేళ.

హేమంతపు ఉషోదయపు నడక

నాకు ఉత్సవమై సాగింది దృశ్యాదృశ్యమై..

రోహిణి వంజారి

9000594630