ఆ రెండు దీపాలే!

సారంగ పత్రికలో ప్రచురితం అయిన “ఆ రెండు దీపాలే” కవిత ఇక్కడ మీకోసం. శ్రీ అఫ్సర్ మొహమ్మద్ గారికి, శ్రీ సుధామ గారికి ధన్యవాదాలతో..🧨✨🍬

ఎర్రటి బొట్టు బిళ్ళ లాంటి టపాసను నట్టులో పెట్టి

నేలకేసి కొడితే పట్ మని పేలే నేలటపాసా నా బాల్యం

పక్కింటి భవంతి వాళ్ళు చిచ్చుబుడ్లు కాలిస్తే

చార్మినార్ సిగరెట్టు పెట్టిలోని తగరపు వెండి కాగితాన్ని కాల్చి

చిరచిరలాడే శబ్దంతో మండే ఎర్రటి వెలుగే నా దీపావళి చిచ్చుబుడ్డి

ఏడాదంతా చింతకాయలు పగలగొట్టి పుల్లలేరిన అమ్మ చెమట

చుక్కలే

రంగయ్య టైలర్ కుట్టించిన నా నూలు గౌనుమీది మెరుపుల చెమ్కీలు

దోటీ రాయితో సూటిగా కొడితే రాలిపడిన నెల్లికాయలే

నేను అందుకున్న ఎర్రెర్రని తియ్యతియ్యని ఆపిలు పండ్లు

పది పైసలు ఇస్తే చాలు కరీమ్ సాయిబు ప్రేమగా

నా చేతికి చుట్టే గులాబీ మిఠాయే నా ఖరీదైన రిస్టు వాచీ

ఏడాదికి ఒకసారి నాయిన సగ్గుబియ్యం తెస్తే

అమ్మ చేసిన పాయసం ఐదు వేళ్ళ చేతి గిన్నలో జుర్రుకుంటుంటే

పటుక్కున పంటికింద నలిగిన ముంతమామిడి పప్పే

నా కమ్మటి స్వర్గం కాజు బర్పీ

బడి దగ్గర పోటీలుపడి ఏరుకుని దారంతో గుచ్చి

మెడలో వేసుకుని మురిసిన పొగడపూల మాలే నా సువర్ణ కంఠాభరణం

ముదురాకుపచ్చరంగులో పాచి పట్టిన చేపట్టు గోడలమీద

నూనె పోసి వత్తులేసి వెలిగించిన రెండు దీపాలే

మా ఇంటినిండా కాంతులు చిమ్మే వెలుగు పూల జల్లులు.

రోహిణి వంజారి