విశాఖ సంస్కృతి పత్రిక కథల పోటీ లో గెలుపొందిన కథ వెనుక కథ “ఆ నలుగురు”.
ఆ నలుగురు..
అలా కలిశారు.. ఎవరా నలుగురు? ఎక్కడ కలిశారు?
రోహిత్ విసురుగా నెట్టేశాడు వేంకటేశుని. నేల మీద ధభీమని పడిపోయాడు వేంకటేశు. వాడి ఊత కర్రలు కాస్త దూరంగా పడ్డాయి.
“పోరా కుంటోడా..నీకు మాతో ఆటలు కావాల్సివచ్చిందా రా” కాలరెగరేసి విలాసంగా నవ్వుతూ అన్నాడు రోహిత్. వాడి మిత్ర బృందం నవ్వులు కూడా శృతి కలిసాయి.
రోహిత్ తోసిన తోపుకు కింద పడ్డ వెంకటేశు కళ్ళ నిండా దుమ్ము పడి మండసాగింది. చొక్కా మొత్తం ఎర్రమట్టితో నిండిపోయింది. మోచేతికి రాయి తగిలి చిందిన నెత్తురు కూడా చొక్కా మీద మంకెన పూల రంగునద్దుతోంది. కళ్ళు, ముక్కు నుండి ధారాపాతంగా కారుతున్న నీళ్ళు. అవమానం రోషంగా మారి “పొండిరా వెధవల్లారా. మీరేం నన్ను ఆటలో చేర్చుకోబల్లేదు” అని పాక్కుంటూ వెళ్ళి తన ఊత కర్రలు తీసుకుని మెల్లగా అక్కడ నుంచి ఇంటి దారి పట్టాడు వెంకటేశు.
రోజు కూలి చేసుకునే యాదయ్య, రవణమ్మల పెద్ద కొడుకు ఓబులేసుకు ఇటు కూలిపనులు రాలేదు, అటు చదువు రాలేదు. ఆకలి వేళ ఇంటికొచ్చి తినడం, ఊరు మీద బలాదూరుగా తిరగడం. అదే వాడి పని. రెండో బిడ్డ వెంకటేశు. పోలియో వచ్చి కాళ్ళు చచ్చుపడిపోయి ఈనపుల్లల్లా ఉంటాయి . ఏ రోజుకారోజు కూలి చేస్తే వచ్చే డబ్బు తిండిగింజలకే చాలకపాయె. ఇక వైద్యానికి డబ్బెక్కడదని వాడి కర్మానికి వదిలేసాడు వెంకటేశు తండ్రి. వెంకటేశుకి పదేళ్ళప్పుడు ఎవరో దయ గల దాత ఇచ్చిన ఊత కర్రలతో మెల్ల మెల్లగా నడక నేర్చుకున్నాడు. రవణమ్మ పోరు పడలేక వెంకటేశు ని వీధి బడిలో చేర్పించాడు యాదయ్య.
ఎవరు ఎట్టా ఉన్నా నా పని నాదేగా, ఎవ్వరికోసం నేను ఆగను అంటూ ముందు ముందుకి కదిలిపోతోంది కాలం గమ్యం తెలియని బాటసారిలా
***
ఆ రోజు ఇంటికి వస్తూనే “ఇక నేనా బడికి పోనే” అన్నాడు తన అవకరం మీద బాధ, జరిగిన అవమానం మీద కోపంతోమోచేతిని రుద్దుకుంటూ. బడి దగ్గర జరిగినది విన్న రవణమ్మ తల్లి మనసుకు అర్ధం అయింది వాడి బాధ.
“సరే లేరా. ఇకన బడికి పోబాకులే. మన నొసటన ఇట్లా రాసినాడు ఆ భగమంతుడు ” అనింది రవణమ్మ రోట్లో ఉప్పు, మిరపకాయ దంచుతూ.
గుడిసె ముందర కూర్చుని బీడీ కాలుస్తూ ఉన్నయాదయ్య “బడికి పొతే నీకంత కూడు దొరుకుద్ది కదరా.. పొననడానికి ఏం మాయరోగం వచ్చింది రా నీకు కుంటినాయాలా ” అన్నాడు బంగాకుని తుపుక్కున ఊస్తూ.
అప్పటికే ఆ రోజుటి కూలి డబ్బు మద్యంలా మారి యాదయ్య పొట్టలోకి చేరిపోయి రెండుగంటల పైనే అయింది.
బడిలో టీచర్లు కానీ, తోటి పిలగాళ్లు కానీ కుంటోడా అంటే వెంకటేశుకు రోషం వచ్చేది. కానీ ఇప్పుడు కన్నతండ్రి కూడా ‘కుంటోడా ‘ అనేతలికి రోషంతో పాటు దుఃఖం ముంచుకొచ్చింది తొమ్మిదోతరగతి చదివే వెంకటేశుకుకి.
ఏడుస్తా “నాకిట్ట అవిటితనం ఎందుకొచ్చిందే అమ్మా” అంట రమణమ్మను పట్టుకుని బావురుమన్నాడు వెంకటేశు. రవణమ్మ కూడా కొడుకుని పట్టుకుని ఏడవసాగింది.
” ఆపండహే.. మీ ఎదవ గోల ” అంటానే నేలమీదకి మగతగా ఒరిగిపోయినాడు యాదయ్య .
చీకట్లు ముసిరి గుడిసెల్లో బుడ్డిదీపాలు మిణుకు మిణుకుమంటా ఉన్నాయి. ఊరికి కాస్త దూరంగా, ఇంకా కరెంటు దీపాలకు కూడా నోచుకోని బీద బిక్కి ఉండే ప్రాంతం అది.
ఈత చాప మీద పడుకొని కప్పు చాయ చూస్తా వున్నాడు వెంకటేశు. ఉండుండి యాదయ్య గురక ఉరుములాగా వినపడుతోంది. లేచింది మొదలు పొద్దుగూకే వరకు కష్టపడతా ఉన్న రమణమ్మ కూడా ఒళ్ళు తెల్వకుండా నిద్రలో ఉంది. పై కప్పు సందుల్లో నుంచి కనపడతా ఉన్న ఆకాశం, చుక్కల వంక చూస్తా ఉంటే తన భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపించింది వెంకటేశుకు. తాను తన అన్న ఓబులేసు మాదిరి కాదు. తనకి కాస్తో, కూస్తో చదువు అబ్బింది. కానీ స్కూల్లో, ఇంట్లో రోజు తనకు అవమానాలే. అవిటివాడవని మాట పడని రోజు లేదు. అదే తానూ భరించలేకపోతున్నాడు.
‘పోనీ చచ్చిపొతే’ పక్కకి తిరిగి చూసాడు. గుడ్డి వెలుగులో అమాయకంగా నిద్రపోతున్న అమ్మ ముఖం కనిపించింది. అన్న ఇల్లు విడిచి తిరిగినా, అయ్య తాగొచ్చి కొట్టినా తాను ఉన్నాననే దైర్యం తోనే అమ్మ బతుకుతోంది. “కాకి పిల్ల కాకికి ముద్దు” అన్నట్లు తనని అవిటివాడినని ఎవరు ఈసడించుకున్న అమ్మ ఏ రోజు తనని పల్లెత్తి మాట అనలేదు. అమ్మని బాగా చూసుకోవాలి. గొప్ప పేరు తెచ్చుకోవాలి. అందుకు తాను ఏం చేయాలి. మనసులో ఆలోచనలు కందిరీగల్లా ముసురుతున్నాయి వెంకటేశుకు. ఒక స్థిర నిశ్చయానికి వచ్చినవాడిలా పక్కనే ఉన్న ఊత కర్రలు తీసుకుని లేచి నిలబడ్డాడు.
చీకట్లోనే తడుముకుంటూ తన గుడ్డలు రెండు జతలు సంచిలో కుక్కుకుని, దేవుడి పటం ముందర ఉన్న హుండీని మెల్లగా తీసి సంచిలో పెట్టాడు. కొడుకు పక్కనే ఉన్నాడు అనే భరోసాతో స్థిమితంగా పడుకుని ఉన్న రమణమ్మ పాదాలు పట్టుకుని నుదిటికి తాకించుకున్నాడు. కన్నీటిబొట్లు రాలి ఆమె పాదాల మీద పడ్డాయి. ఆమెకు మెలుకువ రాకముందే బయటపడాలని, చప్పుడు రాకుండా గుడిసె తలుపు తీసి బయట పడ్డాడు ఆ నిసి రాత్రి తన జీవితంలో వెలుతురును వెతుక్కుంటూ.
వెంకటేశు ఎక్కడకి వెళ్లాడని?
బిడ్డ కనపడలేదని ఆ తల్లి మనసు ఎంత క్షోభ పడిందో!
వెంకటేశు నడిచేది ఊత కర్రల సాయంతో. కాలం నడవడానికి ఎవరి ఊతం తీసుకోదు కదా. కాలం కలిసిరానప్పుడు క్షణమొక యుగంలా, కలిసివొచ్చినప్పుడు యుగాలు క్షణాల్లా గడిచిపోవడం మామూలే కదా. వెంకటేశు జీవితంలో కూడా రెండేళ్లు రెండు యుగాల్లా గడిచిపోయాయి.
ఇంటినుంచి బయటపడ్డంత తేలిక కాదు బయటిప్రపంచంలో బతకడం అని, పరమపదసోపాన పటంలో మాదిరి పైకి ఎక్కించే నిచ్చెనలు, పక్కనే పడదోసే పాములు ఉంటాయి అని తెలిసింది. అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు జీవిత పాఠాలను ఎన్నింటినో నేర్పాయి వెంకటేసుకు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీవితంలో విజయం సాధించి కానీ ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు.
తన జీవన యానంలో ఎందరినో కలిసాడు. కొందరి ఆగ్రహానికి, అవమానాలకు గురైనాడు. మరికొందరి దయాగుణానికి పాత్రుడైనాడు. ఇంటినుంచి దూరంగా వచ్చేసి, అలుపెరుగని బాటసారిలా ఊర్లు తిరిగాడు. తిరుపతి లో పరిచయమయ్యాడు ‘శంకరన్న’. వెంకటేశు పరిస్థితికి జాలి పడి వికలాంగుల కోటాలో ఆటో ఇప్పించి, డ్రైవింగ్ కూడా నేర్పించాడు. ఇప్పుడు అతను అవిటి వెంకటేశు కాదు. ఆటో వెంకటేశు. ఎడమ కాలు పూర్తిగా పనిచేయదు. కుడికాలు కాస్త కదులుతుంది. దానితోనే ఆటో డ్రైవింగ్ నేర్చుకోగలిగాడు అతను. ఆటోలో సీట్ మీద కూర్చుని ఎంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్నా ఒడుపుగా డ్రైవింగ్ చేసే నైపుణ్యాన్ని సంపాదించాడు అతను. ఎంత అర్ధరాత్రి ఎవరు అర్దించిన కాదనకుండా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేటోడు. పేద వాళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు, తనలాంటి అవిటివాళ్లను ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్ళవాడు.
“నేనుంటే నీకు ఇబ్బంది కదా శంకరన్నా” అంటే వినకుండా తనకు నా అనే దిక్కు లేదని, తన రూంలోనే వేంకటేశుని కూడా ఉండమన్నాడు శంకరన్న.
పొద్దున ఆటో తిప్పి, రాత్రి పూట తనకు ఇష్టమైన తన ఆగిపోయిన చదువును కొనసాగించాడు. ప్రైవేటుగా బి.కామ్ పూర్తి చేసాడు. బి.ఎడ్ పూర్తి చేసాడు. డి.ఎస్.సి. పరీక్ష రాసి టీచర్ కావాలని ఎదురు చూస్తున్నాడు వెంకటేశు.
ఆ రోజు పొద్దున వెంకటేశు టీ అంగడికి రాగానే బల్ల మీద కూర్చున్న ఒకతను టేబుల్ మీద ఉన్న టీ గ్లాస్ కోసం తడుముకుంటున్నాడు. వెంకటేశు టీ గ్లాస్ తీసి “ఇదిగో అన్నా నీ టీ గ్లాస్” అని అతని చేతికి అందించాడు వెంకటేశు.
“థాంక్స్ తమ్ముడు” అన్నాడతను. ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అతను తన పేరు జోసఫ్ అని, పుట్టుకతోనే అంధుడనని , తాను కూడా ఇంట్లోవాళ్ళకి భారం కాకూడదని ఇంటి నుండి బయటకు వచ్చి అక్కడక్కడా తిరుగుతూ ఈ రోజు ఇక్కడకి వచ్చానని చెప్పాడు. తనతో పాటు ఉన్న సంచిలో ఓ జత గుడ్డలు, తనకెంతో ఇష్టమైన సంగీత వాయిద్య పరికరం డ్రమ్ ఉంది. తాను పాటలు పాడతానని, అదే తనకు వచ్చిన ఏకైక విద్య అని చెప్పాడు.
” జోసఫ్ అన్నా నీది, నాది ఒకటే కథ. నాతో రా అన్నా” అని అతన్ని శంకరన్న రూంకి తీసుకువెళ్లాడు వెంకటేశు.
ఒక్కసారి పాట వింటే చాలు. టక్కున పట్టేసి తిరిగి ఆ పాట పాడేవాడు జోసఫ్. మనిషి ఒక లోపంతో పుట్టినా, బ్రతకడానికి మరో నైపుణ్యం ఆ మనిషిలోనే ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి, బయటకు తీసుకురాగలిగే ఆసరా దొరికినవారు జీవితంలో విజయం సాధిస్తారు. అవయవాలు అన్ని సక్రమంగా ఉన్న మనుషులు బద్దకంతో ఏమి సాధించలేకపోతే, దివ్యాంగులు నిరంతరం శ్రమించి, తమలో ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటారు. జోసఫ్ పాడే పాటలకు, అతని స్వరంలో ఉన్న నైపుణ్యానికి వెంకటేశు అబ్బురపడేవాడు. ఆ అబ్బురంలోనుంచే ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది వారికి.
ఆలోచన ఆచరణలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు. శంకరన్నతో పాటు ఊరిలో వారి గురించి తెలిసిన కొందరు చేసిన ఆర్థిక చేయూత మరింత పట్టుదలగా వాళ్ళ కార్యాచరణను ప్రేరేపించింది. వారికి తోడుగా మరో ఇద్దరు చేరారు. అంధుడైన పరమేశ్వర్. వీపు వికృతంగా పొడుచుకు వచ్చి గూనితో నడుం వంగిపోయిన పద్మ కూడా జోసఫ్, వెంకటేశులకు చేయూతగా వస్తామన్నారు.
అలా ఆ నలుగురు కలిశారు.
ఇప్పుడు వాళ్ళు ఏమి చేయబోతారో..!
తాము సంకల్పించిన పని విజయవంతం అవుతుందో లేదో అని వారందరి మనస్సులో ఆత్రుతగా ఉంది. వారంతా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది.
ఆ రోజు సాయంత్రం తిరుపతిలో లీలామహల్ సెంటర్ దగ్గర నాలుగు రోడ్ల కూడలి. జ్యోతి రావు పూలే మహాత్ముని విగ్రహం ముందర ఓ చిన్న ఎర్రటి తివాచీ. చిన్న టేబుల్ మీద అతి కొద్ది సంగీత పరికరాలు. బల్ల మీద ఓ పక్క జోసఫ్. మరో పక్క పరమేశ్వర్.
“వాతాపి గణపతింభజే” విగ్నేశ్వరుని ప్రార్ధనా గీతం పరమేశ్వర్ గొంతులోనుంచి పరవళ్లు తొక్కే గంగా ప్రవాహంలా సాగింది. ఘంటసాలే భువినుంచి దిగి వచ్చి పడుతున్నాడేమో అన్న అనుభూతి కలగక మానదు విన్నవాళ్ళకి. వెను వెంటనే “నమో వెంకటేశా, నా నమో తిరుమలేశా ” అంటూ జోసఫ్ పాట ఎత్తుకున్నాడు. ఇక వరుసగా ఎన్.టి.ర్., ఏ. ఎన్. ఆర్., పాటలు ” నీ ఇల్లు బంగారంగాను” , వందనం అభివందనం ” అంటూ పాటల మలయ మారుతం అవిరామంగా గంట సేపు సాగింది. దారిన పోయే జనం ఒకరిద్దరు ఐదో, పదో టేబుల్ ముందరి డబ్బాలో వేసిపోతున్నారు.
గొంతు ఎండిపోయింది జోసఫ్ , పరమేశ్వర్లకు. ఇంత సేపు కష్టపడితే వచ్చిన డబ్బు వంద రూపాయలు కూడా లేదు…! దిగులు మేఘాలు కమ్ముకున్నాయి వారిలో. అయినా తోలి ప్రయత్నంలోనే శిఖరాగ్రం చేరాలనుకోవడం అత్యాశ. తమ సంకల్పం చాల చిన్నది. పాటలు పాడి తమ పొట్ట పోసుకుంటూ, ఇంకొరికి చేతనైన సాయం చేయడం. మెట్టు మెట్టు ఎక్కాలి. గమ్యం చేరేదాకా వెనుతిరగకూడదు. నాగరాజా, పరమేశ్వర్లకి వేడి వేడిగా టీ అందించాడు వెంకటేశు.
కాస్తా అలుపు తీర్చుకుని మళ్ళీ తమ పాటల పరిమళాన్ని ఆ నాలుగు రోడ్ల కూడలంతా వ్యాపింపచేస్తున్నారు వారు. ఈ సారి ఇద్దరు కలసి
” పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్వరామి” వారి గాన మాధ్యుర్యం సుగంధ పరిమళంలా ఆ ప్రాంతమంతా వ్యాపిస్తోంది. శిశుర్వేత్తి, పశుర్వేత్తి అన్నట్లు ప్రకృతి పరవశించి వాళ్ళ పాటతో మమేకం చెంది పాట విన్న ప్రతి ఒక్కరి ఒడలు దేశభక్తితో పులకరించిపోయేట్లు సాగింది.
పాట పూర్తి అయింది. పాట అయిపోగానే చుట్టూ చేరిన జనాలు తమ దారిన వెళ్లిపోయారు. ఈ సారి టేబుల్ మీదకు పది, పరక వచ్చి చేరాయి. నిరాశగా కూర్చున్నారు అందరు. కాసేపు గడిచింది. ఈ రోజుకి ఇంతవరకు చాలులే అని వెళ్ళిపోదామని సర్ధుకోసాగారు.
రోడ్డు మీద కొంచెం దూరం ముందుకు వెళ్ళిన కారు వెనక్కి వచ్చి వీరి ముందు ఆగింది. ఓ వ్యక్తి కారు దిగి నేరుగా వచ్చి జోసఫ్ ని ను గుండెలకు హత్తుకున్నాడు. హఠాత్తుగా తనని ఎవరు హత్తుకున్నారో తెలియక తత్తరపాటు చెందాడు జోసెఫ్.
“ఎంత బాగా పాడారు మీరు. అన్ని సౌకర్యాలు ఉన్నమా స్టూడియోలో కొందరి గొంతులు శృతి తప్పుతాయి. కానీ ఏ సదుపాయాలు లేని ఈ రోడ్డు పక్కన మీరు అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. టీ తాగడానికి ఇక్కడ ఆగి మీ పాట విన్నాను.” అంటూ అక్షరాలా పదివేల రూపాయలు జోసఫ్ చేతిలో పెట్టి,
“నా పేరు సుదర్శన్. నేను పెద్ద సంగీత దర్శకుని దగ్గర సహాయకుడిగా పని చేస్తున్నాను. మీ కంఠ స్వరం అద్భుతంగా ఉంది. మిమ్మలిని ఆ దర్శకునికి పరిచయం చేస్తాను. ఇది నా విజిటింగ్ కార్డు. వీలు చూసుకుని హైదరాబాద్ కి రాండి “అంటూ కారు ఎక్కి వెళ్ళిపోయాడు అతను.
అప్పటిదాకా తాము విన్నది ఓ అద్భుతమైన కలలా అనిపించింది వారికి. తాము అవిటివారము. తాము సంకల్పించిన పనిలో విజయం సాధిస్తామా లేదా అని అప్పటివరకు వారు అనుభవించిన మానసిక వేదన, నిరాశ పటాపంచలై పోయి మనసు దూది పింజలా తేలికైంది వారికి. గూని పద్మ సంతోషంతో చప్పట్లు కొట్టింది.
సుదర్శన్ ఇచ్చిన పదివేల రూపాయల కంటే అతను చెప్పిన మాటలు వారి చెవ్వుల్లో అమృతాన్ని పోశాయి. వారికి బ్రతుకు పట్ల ఆశ, భవిష్యత్తు పట్ల భరోసా కలిగించాయి. ఆ నలుగురు అలా కలిశారు. అవిటితనం ఆనాధలు కావడమే వారిని ఒక్కచోట చేర్చింది.
“అరే వెంకటేశు.. ఇక్కడ ఉన్నారా మీరంతా..! నువ్వు రాసిన డి.ఎస్సీ. పరీక్ష ఫలితాలు వచ్చాయి. టీచర్ ఉద్యోగానికి ఎంపిక చేసిన లిస్ట్ లో నీ పేరు ఉంది” అన్నాడు శంకర్ చిరునవ్వుతో చూస్తూ.
“అవునా శంకర్ అన్నా..ఈ రోజు మా అందరికి చాల శుభదినం. పరమేశ్వర్ , జోసఫ్ అన్నల పాటని మెచ్చుకుని సినిమాలో అవకాశమిస్తానని ఓ పెద్దమనిషి ఇప్పుడే మాట ఇచ్చి వెళ్ళాడు ” అన్నాడు మెరిసే కళ్ళతో.
“అవునా. చాల సంతోషం. మీకు ఇంకో మంచి విషయం కూడా చెప్పాలి. మన వార్డు కౌన్సెలర్ జోసఫ్, పరమేశ్వర్ ల పాటలు విన్నాడట. త్వరోలోనే మహతి ఆడిటోరియంలో పాటలు పడే అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు” అన్నాడు. అందరి మనసులు ఆనందంతో పరవశించిపోయాయి ఆ క్షణం.
నేను ఆశక్తుడను. ఏమి చేయలేను అనుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసం, సత్సంకల్పంతో నిరంతరం ఆశావహ దృక్పథం తో కృషి చేసిన వారిని గెలుపు వెతుక్కుంటూ వచ్చింది ఇప్పుడు. వారికి ఉన్నది శారీరక లోపమే. కానీ వారి ఆత్మవిశ్వాసానికి వెయ్యి కళ్ళు, వారి పాటలకు కోటి ఆశల పల్లవులు ఉన్నాయి.