మిత్రులకు సాహూ కానుక. జనవరి నెల సాహూలో కపాలభాతి ప్రాణాయామం. ఇందూరమణ గారికి ధన్యవాదాలతో ..
ఆరోగ్యమే ఆనందం
“ఏ శ్వాసలో చేరితే.. గాలి గాంధర్వమౌతున్నదో, ఏ మోవిపై వాలితే..మౌనమే మంత్రమౌతున్నదో..ఆ శ్వాసలో నే లీనమై” మరి అంతగా మనం లీనం అవ్వాలంటే మన శ్వాస, మన మోము, మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలని. మన మనసు, దేహం ఆ స్వచ్ఛతను సాధించాలంటే సులభమైన మార్గం ప్రాణాయామం. గత రెండు నెలల్లో సరళ ప్రాణాయామం, అనులోమ..విలోమ ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ నెల మూడవ రకం ప్రాణాయామం “కాపాలభాతి” గురించి తెలుసుకుందాం. ఈ మూడు ప్రాథమికమైన, చాల తేలికగా చేయగలిగిన ప్రాణాయామాలు. ఉజ్జాయి,సీత్కారి, భ్రామరి లాంటి మిగతా ప్రాణాయామాలు యోగ నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది.
కాపాలభాతి ప్రాణాయామం
కాపాలభాతి ప్రాణాయామం చేయు విధానం
- పద్మాసనం లేదా వజ్రాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి
- ముక్కు రెండు పక్కల నుంచి వేగంగా గాలి పీల్చుతూ, అంతే వేగంగా గాలిని బయటకు వదులుతూ ఉండాలి. సాధన చేసే తొలిరోజుల్లో నిముషానికి 25 నుంచి 30 సార్లు చేయాలి.
- సాధనలో పట్టుచిక్కాక నిముషానికి దాదాపు 120 సార్లు గాలిని వేగంగా పీల్చుతూ, వదలాలి. తరువాత కాసేపు సాధారణంగా స్థితిలో గాలి పీల్చి వదలాలి.
- ఈ విధంగా 15 నుండి 20 సార్లు చేయాలి. ఈ కాపాలభాతిని ఖాళీ కడుపుతో చేయడం శ్రేయస్కరం. రక్తపోటు ఉన్నవారు ఈ కాపాలభాతి చేయకూడదు.
కాపాలభాతి వలన ఉపయోగాలు:
- ఊపిరితిత్తులు, ఉరఃపంజరం, గుండె కండరాలు శక్తివంతం అవుతాయి.
- తలనొప్పి, పార్శ్వపు నొప్పులు తగ్గుతాయి.
- వేగంగా శ్వాసిస్తున్నప్పుడు పొట్ట కండరాలు కూడా సంకోచ, వ్యాకోచాలు చెంది పొట్టలో అదనంగా చేరిన కొవ్వు తగ్గుతుంది.
- ఈ కాపాలభాతి ప్రాణాయామం వాళ్ళ మలబద్దకం, అతిమూత్ర వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
కాపాలభాతి ప్రాణాయామం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసుకున్నాం కదా. మరి ఎందుకు ఆలస్యం చేయడం. అతి సులువైన ప్రాణాయామాలు చేసి, ఆరోగ్యానికి దగ్గరగా, వైద్యులకు దూరంగా ఉందామా మరి. ప్రాణాయామంతో పాటు బోనస్ గా రెండు చిట్కాలు మీ కోసం. - వానాకాలం వచ్చేసింది కదండీ. చర్మం, జుట్టు గురించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం. పచ్చి మెంతులు మిక్సీలో వేసి పొడి చేసి, జల్లించుకుని మెత్తనిపొడిగా చేసుకోవాలి. ఈ మెంతుల పొడికి కలబంద ఆకు గుజ్జుని కలిపి తలకి, జుట్టుకి బాగా పట్టించి అర్ధ గంట తర్వాత తలకి పోసుకోవాలి. దీనివల్ల వర్షాకాలం జుట్టుకు కలిగే చికాకులు, తల్లో చుండ్రు మాయమై, జుట్టు పట్టు కుచ్చులా నిగనిగలాడుతుంది.
వంటింటి చిట్కా.
2.వర్షాకాలం ఉప్పు జాడీలో రెండు పచ్చి మిరపకాయలు వేసిపెడితే, ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉంటుంది.