నవంబర్ నెల “సాహో” మాస పత్రిక అందించిన బహుమతి. శారీరక మానసిక ఆరోగ్యాల కోసం “వృక్షాసనం“. శ్రీ ఇందూ రమణ గారికి ధన్యవాదాలతో. ఇక్కడ మిత్రుల కోసం 🌹❤🙂
“సాహూ” పాఠకులకు నమస్సులు. ప్రతి రోజు నిర్దిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన ప్రదేశంలో ఆశావహ దృక్పథంతో చేసే ప్రాణాయామం, యోగాసనాలు ఇటు శారీరక, అటు మానసిక ఆరోగ్యానికి చాల చాల అవసరం. గత మూడు నెలల సంచికల్లో మూడు రకాల ప్రాణాయామాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ మూడు రకాల ప్రాణాయామాలు అతి సులభతరంగా, పర్యవేక్షకులు లేకుండానే ఎవరికి వారు చేయదగినవి. ఉజ్జాయి, సీత్కారి, శీతలీ, భ్రామరి వంటి ప్రాణాయామాలు మాత్రం పర్యవేక్షకుల సమక్షంలోనే చేయాలి.
ఇక యోగాసనాలు చాల రకాలు. మానవ శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. దేని ప్రాధాన్యత దానిదే. బాహ్య, అంతర్గత అవయవాల సమ్మేళనము, జీవన క్రియలు కలిసి మానవ శరీరాన్ని నిర్మిస్తాయని మనకు తెలుసు.
తాటి చెట్టుని చూసి అబ్బా..ఎంత పొడుగ్గా, నిటారుగా నిలబడినట్లుందో అనుకుంటాం. మరి ఇప్పటికాలంలో మనం ఎంతమందిమి ఐదు నిముషాలు కదలకుండా నిటారుగా నిలబడుతున్నాం అని ప్రశ్నించుకుంటే..? చాల ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఈనాడు కాసేపు కూడా మనిషి నిలబడలేకపోతున్నాడు. నిలబడితే కాళ్ళు లాగేస్తున్నాయి , మోకాళ్ళు నొప్పులు అంటూ కుర్చీని వెతుక్కుంటాం. దగ్గర దూరం వెళ్ళాల్సినా, వాహనాల కోసం చూస్తాం కానీ నడుద్దాం అనుకోరు. ప్రతి పని మిషన్స్ చేస్తున్నాయి. ఇక శారీరక కదలికలు ఎక్కడివి. తినే ఆహారం కూడా అంతా కెమికల్స్ తో పండించినవి, జంక్ ఫుడ్.
ఇక నిటారుగా నిలబడడానికి శక్తి ఎక్కడినుంచి వస్తుంది. మరి నిలబడినా, నాలుగడుగులు వేసినా అలసట రాకుండా, కండరాలు శక్తి మంతం కావాలంటే తప్పకుండా “వృక్షాసనం” వేయాల్సిందే. వృక్షాసనం
వృక్షాసనం వేసే విధానం:
ఈ ఆసనం వేసిన వారు చూడడానికి నిటారుగా నిలబడిన చెట్టులా కనిపిస్తారు.
- ముందుగా కాసేపు రెండు కాళ్ళను దగ్గరికి చేర్చి సమతలంగా ఉన్న నేల మీద నిలుచోవాలి. నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ, చేతులు రెండు పైకెత్తి నమస్కారం చేస్తున్నట్లు నిలబడాలి.
- తర్వాత మెల్లగా కుడికాలిమీద నిలబడి, ఎడమ కాలుని ఎత్తి పాదాన్ని కుడి తొడమీద నొక్కి పట్టి నిటారుగా నిలుచోవాలి. కనీసం రెండు నిముషాల పాటు అయినా ఈ పొజిషన్లో నిలబడడానికి సాధన చేయాలి.
- తర్వాత ఎడమ కాలుతో నిలబడి, కుడి కాలుని నెమ్మదిగా ఎత్తి పాదాన్ని ఎడమ కాలి తొడమీద నొక్కి పెట్టి, రెండు చేతులు పైకి ఎత్తి నమస్కార భంగిమలో కొద్ది నిముషాలు సాధన చేయాలి.
4.ఒక్క కాలుతో నిలబడతాం కాబట్టి దీనినే ఏకపాద వృక్షాసనం అని కూడా అంటారు. - కొత్తగా సాధన చేసేవారు మొదట్లో గోడ ఆసరాగా చేసుకుని ఒక్క కాలిమీద నిలబడేలా ఈ ఆసనం వేయవచ్చు.
వృక్షాసనం – ఉపయోగాలు. - ఈ ఆసనం క్రమంగా వేస్తూ పొతే, మనం ఎంతసేపు నిలబడినా కాళ్ళు లాగవు.
- కండరాలకు, కీళ్ళకు శక్తి కలుగుతుంది.
- కాళ్ళు, చేతులు పూర్తిగా మన స్వాధీనంలో ఉంటాయి.
- చేతులు పైకెత్తి నిటారుగా నిలుచోవడం వల్ల ఛాతి భాగంలో కండరాలు బలపడి, ఛాతీని విస్తరింపచేస్తుంది ఈ వృక్షాసనం.
ఆసనాలు వేయడంతో పాటు, ఎముకలకు, కండరాలకు పుష్టి కలిగించే పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు ఉన్న ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర .. ఇక సాహు మనకు ఎదురేలేదు అనిపించి ఆరోగ్యకరమైన ఆనందం మనసొంతం అవుతుంది. పదండి మరి. వృక్షాసనం వేసేద్దాం.