అబ్బయ్యా..అక్కా. . మా బడికాడి కుందేళ్ళ మందల చెప్తానన్నా కదా. మరి ఈ నెల [జులై] విశాలాక్షి మాసపత్రికలో “ఆనంద భైరవి” కత చదవండి. మీకు తెలస్తది. అట్నే నన్ను ప్రోత్సహిస్తున్న శ్రీ కోసూరి రత్నం సారుకి, శ్రీ ఈతకోటసుబ్బారావు సారుకి ధన్నివాదాలు. కతని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు చెప్తారుగా
రాత్రి తొమ్మిదైంది. ఆ పొయిలప్పుడు మోహనన్న ఫ్రెండ్ మురళి ఇంటికొచ్చాడు. పంచలో చేరి ఇద్దరు గుసగుసలాడుకుంటా ఉండారు. అమ్మ కుంపట్లో బొగ్గుల మీద నీళ్ళు చల్లి ఆర్పతా ఉండాది. నాయన ఈ రోజు పొద్దన నుంచి ఖర్చు పెట్టిన డబ్బు లెక్క ని చిన్న పుస్తకంలో రాస్తా ఉండాడు.
రైలు కట్ట కింద పొగతోటలో డాక్టర్ మధుసూధన శాస్త్రి వాళ్ళ ఇంటి పక్కన మురళి వాళ్ళ ఇల్లు ఉంది.
“మూడేళ్ళ ఇరవై ఒకటి. మూడేళ్ళ ఇరవై ఒకటి “. మూడో ఎక్కం చదవతా ఉండాను వెంకట్రామ అండ్ కో వాళ్ళ ఎక్కాల పుస్తకంలో చూసి. నా కళ్ళు పుస్తకం చాయ చూస్తా వుండాయి. నోరు ఆడతా ఉండాది. కానీ పంచలో అన్నావాళ్ళు ఏం మాట్లాడతా ఉన్నారా అని ఓ చెవిని అటేసి ఉంచాను.
“మోహనా..రేపు చీకటితోనే విజయమహల్ కాడికి వచ్చేయి. సిగరెట్టు పాకెట్స్, అగ్గిపెట్టలు ఏరుకుందాం ” మురళి ఎంత చిన్నగా చెప్పినా నాకు వినపడింది.
“అట్నే వస్తాలే రా. నువ్వు ఇంక మీ ఇంటికి పోరా..మా అమ్మ అరస్తది” అన్నాడు మోహనన్న.
అదన్నమాట సంగతి. పొద్దున నేను వాళ్ళతో విజయమహల్ హాల్ కాడికి పోవాలనుకున్నా. ఇక ఎక్కాలు చదవడానికి బుద్ధి పోలేదు. నాయన మిద్దె మీదకి పరుపు ఎత్తుక పోతా ఉన్నాడు. స్టీలు చెంబులో నీళ్ళు ఓ చేతిలో, మరో చేతిలో దిండు తీసుకుని నాయన వెనకే మెట్లు ఎక్కతా పోయాను.
దిండు మీద పక్కకు తిరిగే తలికి తూరుపక్క నుంచి సూరుడి లేత కిరణాలు నా చెంపకు తగిలాయి. గబ్బుక్కున లేచి మెట్లు దిగి కిందికి వచ్చా. అమ్మ కుంపట్లో బొగ్గులను విసనకర్ర తో విసరతా పాలు కాస్త ఉండాది. మోహనన్న ఇంట్లో ఏడ ఔపడాలా నాకు.
“ఆమ్మో..ఇంకేం ఉండాది..!ఈ పాటికి అన్నా, మురళి కలసి చానా సిగరెట్టు పెట్టెలు ఏరుకొని ఉంటారు” అనుకుంటా గబాల్న పళ్ళు తోముకుని ” మో.. మా ఫ్రెండ్ సురేఖ వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మి సైన్స్ నోట్స్ అడిగి తీసుకువస్తా ” అంటా అమ్మ పిలుస్తా ఉన్నా వినకుండా వీధిలోకి పరిగెత్తినా.
అప్పటికే కొందరు పిలకాయలు విజయమహల్ సినిమా హాల్ లోపల , హాల్ బయట సిగరెట్టు పెట్టలు, అగ్గిపెట్టలు ఏరుకుంటా ఉండారు. విజయమహల్ సినిమా హాల్ గేటు కాడ ఉండే వాచ్మాన్ ఇందుకూరుపేట సైదులు పిలకాయలను బయటకు పొమ్మని కసరతా ఉండాడు. నేను హాల్ వెనక వెతకతా ఉండాను. ఆ పొద్దు నా అదృష్టం ఏమో కానీ పది నిముషాల్లోనే రెండు చార్మినార్ సిగరెట్టు పెట్టెలు, గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టు పెట్టె ఒకటి దొరికాయి. ఓ పక్క మోహనన్న ఏడ నన్ను చూస్తాడో అని బెదరతా పెట్టెలను ఏతకత ఉండాను.
ఇంకొక్క రెండు సిగరెట్టు పెట్టెలు దొరికితే నా పంట పండినట్లే. సిగరెట్టు పెట్టెను, పెట్టెల్లో ఉండే తగరపు మెరుగు కాగితాన్ని బడికాడ ఉన్న రంగులరాట్నం దశయ్యకు ఇస్తే ఐదు సార్లు రంగులరాట్నంలో తిప్పుతాడు. ఐదు పెట్టెల కంటే తక్కువ ఇస్తే రంగులరాట్నం ఎక్కించుకోడు. మూడు పెట్టెలే దొరికాయి అని కాస్త నిరాశగా గౌనులో పెట్టెలను దాచి లగెత్తుకుంటా ఇంటికి వచ్చాను.
అమ్మ వంటింట్లో ఏదో పనిలో ఉండాది. నా కాడ సిగరెట్టు పెట్టెలు చూసిందంటే తొడ పాయసం పెట్టేస్తుంది. మెల్లగా పిల్లి మాదిరిగా అడుగులో అడుగు వేస్తా ఇంట్లోకి పోయి పుస్తకాల పెట్టెలో సిగరెట్టు పాకీలు పెట్టేసాను.
ఒంటేలు గెంట కొట్టగానే సునీతా, శిల్ప, సురేఖ అందరు రంగులరాట్నం కాడికి లాగెత్తినారు. ఐదు సిగరెట్టు పెట్టెలను ఇస్తేనే రంగులరాట్నం ఎక్కనిస్తాడు దశయ్య. ఆ పెట్టెలతో యేవో బొమ్మలు తయారు చేస్తారు వాళ్ళ ఇంటికాడ.
మూడు పెట్టెలను ముప్పై సార్లు చూసుకుని బాధగా బల్లమీద కూర్చొనివుండాను.
” మీ బైటకు రాకుండా ఈడ ఏం చేస్తా ఉండావు. అందరు రంగుల రాట్నం కాడ ఉండారు పామీ ” అనింది విజయ.
” నా కాడ డబ్బులు లేవు” అన్నా ఉదాసీనంగా
నా కాడ కూడా లేవులే. అయితే మా ఇంటి కాడికి పోదాం పామే ..ఆడ నీకో వింత చూపిస్తా ” అనింది ఆయమ్మి.
బడి కి దగ్గరగానే రాంమూర్తి నగర్ కి పోయే తోవలోనే వాళ్ళ గుడిసె ఇల్లు ఉండేది. వాళ్ళ ఇంటికి పోయినాం. విజయ వాళ్ళ నాయన కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ పక్కింటి గుడిసె లోకి తీసుకుపోయింది నన్ను. గుడిసె ముందరకు పోగానే నా కళ్ళు మెరిసిపోయినాయి. ఓ పక్క అత్యంత ఆశ్చర్యం, మరో పక్క ఆనందం ఏక కాలంలో కలిగాయి నాకు.
తెలుగు వాచకంలో, ఆంగ్ల బాషా పుస్తకంలో తప్ప ఇంత వరకు నిజంగా చూడని కుందేలు పిల్లలు నాలుగు ముద్దు ముద్దుగా ఉండాయి. రెండు తెల్లగా, రెండు తెలుపు, నలుపు మచ్చలతో ఉన్నాయి. చిన్న శబ్దం అయినా చెవులు రిక్కించి , ముక్కు పుటలను చిత్రంగా కదుపుతూ వాసనలు పసిగడుతూ, కళ్ళను అటు,ఇటూ గుండ్రంగా తిప్పుతూ, వాటి ముందు వేసిన ఆకులు, గెనుసు గెడ్డలను చిన్ని చిన్ని పళ్ళతో అవి కొరికి తింటుంటే నాకు భలే తమాషాగా అనిపించింది.
ఆ గుడిసెలో ఉండే చెంచమ్మ ” ఏందమే..కుందేలు పిల్లలను చూసేదానికి వొచ్చినారా ” అంటా ఓ తెల్ల కుందేలు పిల్లను ఎత్తి నా చేతిలో పెట్టింది.
తెల్లగా, మెత్తగా ఉన్న కుందేలు పిల్లను తాకడానికి మొదట భయం వేసింది నాకు. అది కూడా భయపడి బిత్తరగా చూసింది నా వంక. విజయ నవ్వతా ఉండాది నన్ను చూసి. కాసేపటికి నాకు, దానికి భయం పోయి, దాన్ని వొళ్ళో కూర్చోబెట్టుకుని మెత్తగా ఉన్న దాని ఒంటిని నిమరసాగాను.
నాలుగు పిల్లలను ఎత్తుకుని ముద్దాడాను. చానా సేపు వాటితో ఆడుకున్నాం. అలా ఎంత సేపు గడిచిందో నాకు, విజయకు తెలియలేదు.
” మీ బడి కాడికి పోకండా ఎంతసేపని ఆ కుందేళ్ళను ఆడిస్తారు. బడి అయినంక సందేళ వొచ్చి ఆడుకోండి” అనింది చెంచమ్మ .
అప్పటికి గాని ఈ లోకంలోకి రాలేదు మేమిద్దురం. ఒంటేలు గెంట అయిపోయి లోపలి బెల్ కొట్టీసి, మూడో పీరియడ్ కూడా అయిపోవచ్చింది. నాలుగో పీరియడ్ లెక్కలు. శేషగిరి అయివోరు. ఈ రోజు మూడో ఎక్కం అప్పజెప్పిచ్చుకుంటానన్నాడు. ఇంకేముండాదా..కాళ్ళల్లో ఒణుకు పుట్టింది నాకు అయివోరి బెత్తాన్ని తల్చుకుని.
కుందేలు పిల్లలను వొదిలేసి బడిలోకి ఉరుక్కుంటా పోయినాం. ఆ రోజు మా అదృష్ట్రం బాగుండాది. శేషగిరి అయివోరు బడికి రాలేదంట. కృపావతమ్మ టీచర్ గుణింతాలు రాపిస్తా ఉండాది. బతుకు జీవుడా అనుకుంటా క్లాస్ లోకి పోయి కూర్చున్నాం నేను, విజయ.
ఇంటి గంట కొట్టిన తర్వాత కూడా విజయ వాళ్ళ పక్కింటికి వెళ్ళి కుందేలు పిల్లలతో కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్ళాను. కుందేలు పిల్లల గురించి అమ్మ, నాయనకి ఎంత సేపు చెప్పినా నాకు తనివి తీరలేదు. వాటికోసం ఊరికాడ్నించి అల్వారి గెడ్డలు, గెనుసు గెడ్డలు[చిలగడ దుంపలు] తెమన్నా నాయన ని. ఆ రోజు మొదలుకొని రోజు ఒంటేలు గంటకి, ఇంటిగంట తర్వాత కుందేళ్ళకాడికి పోయి ఆడుకొని ఇంటికి పోయే వాళ్ళం నేను మా ఫ్రెండ్స్.
అట్టా తెలీకుండానే మూడు నెలల కాలం గడిచి పోయింది. నాలుగు కుందేలు పిల్లలు బాగా పెద్దవి అయినాయి. వాటిలో రెండిటిని వాళ్ళు ఎవరికో ఇచ్చేసారంట. నాకు చాల బాధేసింది. వాటి కోసరం రోజు నేను గెనుసు గడ్డలు, ముల్లంగి ఏదో ఒకటి తీసుకుపోయే దాన్ని.
ఆ రోజు రెండో పీరియడ్ అయినది మొదలుకొని ఒంటెలు గంట ఎప్పుడు కొడతారా అని చూస్తా ఉండాను నేను. కుందేళ్ళ కోసం రెండు క్యారట్లు తెచ్చాను. డబ్బులు జాస్తి అని క్యారట్లు ఎప్పుడూ కోనక్క రాడు నాయన. ఆ రోజు బజారులో కాస్త సలీసుగా[తక్కువ రేటుకు] వచ్చాయని తెస్తే నేను అమ్మకు తెలీకుండా కుందేళ్ళ కోసరం రెండు క్యారెట్లు తెచ్చాను.
ఒంటెలు గంట కొట్టడం ఆలస్యం. నేను, విజయ, సునీత లగెత్తుకుంటా చెంచమ్మ గుడిసె కాడికి పోయినాం. ఆడ కుందేళ్లు కనపడలేదు మాకు. వాళ్ళ గుడిసె ముందర ఓ గుడ్డ మీద ఎర్రగా ఏంటో ముద్దలు ముద్దలుగా పేర్చి ఉన్నాయి. నాకు ఏం అర్ధం కాలేదు. “చెంచవ్వా..! కుందేళ్ళు ఏడ కనపడడం లేదు అన్నాను. చెంచవ్వ కొడుకు రోశయ్య నవ్వతా
“ఇంకేడ కుందేళ్ళు మీ. ఈగో..ఈడ మాంసం కువ్వలు వోటియే. రెండు కువ్వలు ఎత్తక పోతావా నువ్వు..? కుందేలు మాంసం కూర చానా రుచిగా ఉంటది “అన్నాడు నా సాయి చూసి నవ్వతా….
నా చేతిలో ఉండే క్యారట్లు రెండు కింద పడిపోయినాయి. కాసేపు నాకు ఏం జరిగింది తెలియలేదు. ఎర్రగా ఉన్న ఆ నెత్తురు ముద్దలను చూడగానే నాకు సృహ తప్పింది.
మెల్లగా కళ్ళు తెరిచాను . మంచం మీద ఎప్పుడు పనుకున్నానో నాకు తెలియదు. ఇంటికి ఎట్టా వొచ్చానో కూడా నాకు తెలియదు. విజయ వాళ్ళ ఇంటికాడ నేను పడిపోయానని ఎవురో చెప్తే అమ్మ వాళ్ళంటికాడకి వొచ్చి నన్ను ఎత్తుకొని ఇంటికి తీసక వొచ్చిందట. అమ్మ, నాయన నా చాయ ఆత్రంగా చూస్తా ఉండారు. అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు కుందేళ్ళ సంగతి. ఇక దుఃఖం ఆగలేదు నాకు. నాయనను కావలించుకుని పెద్దగా ఎడ్చేసాను. నాయన చాల సేపు నా ఈపు నిమరతా సముదాయించాడు.
బాగా ఏడ్చి ఏడ్చి ముఖం వాచిపోయింది నాకు. వెక్కుతా వెక్కుతా ” నాయన.. బడి కాడ కుందేళ్ళను చెంపేసారు” అంటా మరోసారి ఏడుపేత్తుకున్నా
” వొళ్ళు వాటిని మాంసం కోసమే పెంచారు ఇన్ని రోజులు. నువ్వు ఎందుకు ఏడుస్తావు మీ ” అనింది అమ్మ.
” అయ్యో.. వాటిని చెంపేదానికి వాళ్ళకు మనసెలా ఒప్పింది అమ్మా..” అన్నాను
నాయన ఉండుకొని ” మీ.. మనకు వంకాయ, బెండకాయ ఎట్లనో వాళ్ళకు మాంసం కూరలు అట్లా. మనం చెట్లను తింటాం కదా. ఈ ప్రకృతిలో తిండి కోసం ప్రతి ప్రాణి ఇంకో ప్రాణి మీద ఆధారపడాల్సిందే” అంటా ఏదో చెప్తా ఉండాడు. నాకు అవేవి వినిపించేలా. అమాయకంగా చూసే కుందేలు పిల్లలే కళ్ళ ముందు మెదిలాయి.
వారం రోజులు గడిచినా నాకు బాధ పోలేదు. బడికి పోవడం, ఇంటికొచ్చి పుస్తకాలు చదవడం. ఏదో తెలియని నిరాసక్తి అములుకోని ఉండాది నాకు.
ఆ రోజు బడి నించి నేను వచ్చే తలికే నాయన ఇంటికి వొచ్చేసి ఉండాడు. అమ్మ ఉండుకొని బుజ్జమ్మ.. మనం తొందరగా రెడీ అవుదాం అనింది.
” ఎందుకుమా ” అన్నాను నేను ముఖంలో ఏ భావం లేకుండా.
సుబేదార్ పేటలో ఉన్న నర్తకి సినిమా హాల్లో కొత్త సినిమా వొచ్చి ఉండాడంట. మన ఎదురింటి ప్రమీల వొళ్ళు నిన్న రెండో ఆటకు పోయినారంట. సినిమా చానా బాగుందట. సంగీతం , పాటలు భలే ఉన్నాయి అట. మనం గూడా ఈ రోజు మొదటాటకు పోదాంమీ ” అనింది.
అమ్మ సినిమా అనేతలికి నా ముఖంలో ఒక మెరుపు మెరిసి మాయమైంది.
అమ్మ ఉండుకొని ” మీ నీకు ఇంకో సంగతి తెలుసా..! ” అనింది
“ఏంది మా అదే ” అన్నా నేను నెమ్మదిగా
” సినిమాకి మీ నాయన కూడా వస్తానన్నాడు ” అనింది అమ్మ నాయన చాయి చూస్తా. వాళ్లిద్దరూ కళ్ళతోనే ఏమో సైగలు చేసుకున్నారు.
అంతే.. ఆ మాట వినేతలికి నాకు ఎక్కడ లేని హుషారు వొచ్చింది. ఎందుకంటే నేను పుట్టి బుద్దెరిగాక నాయన ఎప్పుడూ మాతో సినిమాకు రాలేదు. ఆ టికెట్ డబ్బు రెండు రూపాయలు ఉంటే రెండు రోజులు కూరకు వస్తాయి. మీరు చూసి రండి అనేవాడు.
అటువంటిది ఈ రోజు నాయన నా కోసం, నా బాధని మరపించడం కోసం మాతో సినిమాకి వస్తున్నాడు. మొదటి సారి నాయనతో కలిసి సినిమాకి. ఆ ఆలోచనే నాకు కొత్త ఉల్లాసానిచ్చింది. అప్పటికే మా అత్తా వాళ్ళు రెడీ అయిపోయి మా ఇంటికాడికి వచ్చేసారు సినిమాకి పోయేదానికి.
“ఏ సినిమాకు మా ” అన్నాను నేను
“ఆనందభైరవి” అనింది అమ్మ
అంతే నేను ఇంతెత్తున ఒక్క ఎగురు ఎగిరి ” ఐ..ఆనందభైరవి ” అన్నాను.
మనసు ఆర్ద్రమైనది. యాస శైలి బాగున్నాయి.
Thanks madam
చాలా బాగుంది
Thanks andi
చాలా చాలా బాగుంది మేడమ్
Thank you sir