ఆధారం

మొక్క మట్టిలో బలంగా నాటుకోవడానికి పనికి వచ్చే తల్లివేరుని నరికేస్తే, ఇక ఆ మొక్క మనుగడసాగించి పెద్ద చెట్టు కాగలదా..? ఏమవుతుందో తెలియాలంటే ఈ వారం “సహరి” ఆన్లైన్ వారపత్రికలో ప్రచురితం అయిన “ఆధారం” కథ చదవాల్సిందే. మీ అమూల్యమైన అభిప్రాయము తెలుపాల్సిందే..🙏🙏🌹🌹

“సహరి” సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🙏🌹🌹

“సువిధా.. ! నిజంగా నువ్వు చాల గ్రేట్. కంగ్రాట్స్ ” మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తూనే కరచాలనం చేసి చెప్పింది పల్లవి.
” థాంక్స్ ” అంది సువిధ నిరాసక్తంగా . ఎదుటి వాళ్ళ మనసులో ఏం ఉందో వారి ముఖం చూసి కనిపెట్టేసే నైపుణ్యం కలది పల్లవి.
“అదేంటి సువిధా..! రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయిన కొద్దిరోజుల్లోనే నువ్వు మన టీమ్ కి లీడర్ స్థాయికి ఎదిగావు. ప్రొఫెసర్ నిర్మల మేడం నిన్ను ఆకాశానికెత్తిసింది. టీమ్ మెంబెర్స్ అంతా నిన్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆ ఆనందం నీ ముఖంలో మచ్చుకైనా కనిపించడం లేదేం. అదే నన్ను టీమ్ లీడర్ని చేసి ఉంటే యెగిరి గంతులు వేసేదాన్ని ” అంది సువిధ వైపు అనుమానంగా చూస్తూ పల్లవి.
“అబ్బా..పల్లవి..అదేం లేదు లేవే” తన ముఖంలో మారుతున్న రంగులు పల్లవికి కనపడకుండా ఉండాలని జాగ్రత్త పడింది సువిధ .
” నువ్వు ఏం లేదు అన్నావంటే చాల ఉందని. ఏం జరిగింది చెప్పు నాకు. ఇంట్లో అంతా ఒకే కదా. టీమ్ లీడర్గా ఉండడం నీకు ఓకే కదా ” అంది రీసెర్చ్ పేపర్స్ సువిధకి ఇస్తూ
పల్లవి తనను వదలదు, ఇక తప్పదన్నట్లు ” ఆ తెలివితేటలు, పొగడ్తలు అంతా ఇక్కడే. ఇంటికి వెళ్ళితే నేను ఎందుకు పనికిరానిదాన్ని” సువిధకి ముఖం నిండా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయ్.
“అయ్యో..! ఏమైంది సువిధ ..? నాకు చెప్పకూడదా ఏం జరిగింది. ఇప్పుడు సమయం మూడే కదా. మా ఇంటికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం రా సువిధ ” అంది పల్లవి లాప్ టాప్ బాగ్ భుజానికి తగిలించుకుంటూ.
ఈ రోజెందుకో తనమనసు కూడా కాస్త విశ్రాంతి కోరుకుంటోంది. ఇంకేం ఆలోచించకుండా పల్లవితో పాటు వాళ్ళఇంటికి బయలుదేరింది సువిధ .
***
” అమ్మా.. ఈ దానిమ్మ మొక్క చూడండి. పూర్తిగా ఎండిపోయింది. పీకేస్తాను. వేరే మొక్క వేసుకోవచ్చు” అంది పనిమనిషి కమల కుండీలో నీళ్ళు పోస్తూ
” ఆగవే కమలా.. మా కోడలు మహారాణి సువిధ గారు ఆ మొక్కకి ఉన్న పొడవైన తల్లివేరుని కత్తిరించి, పక్క పక్కన ఉన్న పిల్లవేళ్ళతో మొక్కని పాతిపెట్టింది. ఇప్పుడు ఆ మొక్కని పెరికివేశామంటే వచ్చి రాద్ధాంతం చేస్తుంది” చేతులు తిప్పుతూ మూతివిరిచింది సువిధ అత్తగారు పరమేశ్వరమ్మ.
” అలా ఎందుకు చేసింది అమ్మగారు” అమాయకంగా అడిగింది కమల.
” ఎందుకా..ఏదో యూట్యూబ్ లో చూసిందట. తల్లివేరు తీసేసి పక్కల ఉన్న పిల్లవేర్లతో మొక్కని నాటితే అది గుబురుగా పెరిగి బోన్సాయ్ మొక్కలుగా చిన్న కుండీలోనే పూలు, కాయలు కాస్తుందట. తల్లివేరు ఆధారం కోల్పోయిన చెట్టు ఎలా బతుకుతుందో ఏమో..పిదప కాలం. పిదప బుద్దులు” ఈసడించుకుంది పరమేశ్వరమ్మ.
స్కూల్ బస్సు హారన్ శబ్ధానికి చదువుతున్న పేపర్ పక్కనపెట్టి ” అబ్బా..! కోడలి మీద పితూరీలు మొదలెట్టావా..?” అంటూ విసుగ్గా మనవరాళ్ళని తీసుకురావడానికి కిందికి వెళ్ళాడు రాఘవయ్య.
***
ఇంటి ముందర వరండా లో వేసిఉన్న కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చున్నారు సువిధ, పల్లవి. కాఫీ కప్పులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది పల్లవి. కప్పుల్లో నుంచి పొగలు కక్కుతున్న ఫిల్టర్ కాఫీని చూడగానే ప్రాణం లేచొచ్చింది సువిధకి.
“ఇప్పుడు చెప్పవే అర్చన. ఎందుకంత నిరాశగా మాట్లాడవు ఇందాక..? అసలేంటి నీ సమస్య..?” సూటిగా ప్రశ్నించింది పల్లవి.
గాఢంగా ఓ నిటూర్పు విడిచి “పల్లు.. ఏం చెప్పాలో, అసలు ఎలా చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు. నేను చెప్పేది వింటే నువ్వు నవ్వి ఇది కూడా ఓ సమస్యే నా అంటావు” అంది సువిధ దిగాలుగా
“అబ్బా..సువిధ..నేను ఏం అనుకోను. అసలేంటి నీ ప్రాబ్లెమ్ చెప్పు. నేను నీకేమైనా సాయం చేయగలిగితే అంతకంటే ఇంకేంకావాలి నాకు చెప్పు” ఆప్యాయంగా పల్లవి చేయి పట్టుకోవడంతో కళ్ళ నుంచి చెంపలమీదకి జారిన కన్నీటిని తుడుచుకుంటూ
“నేను ఏం పనిచేసినా మా అత్తగారికి నచ్చదు. నేను ఇల్లు చిమ్మితే, తను మళ్ళీ చిమ్ముతుంది. అదేంటి అత్తమ్మ..నేను చిమ్మాను కదా అంటే మూలల్లో దుమ్ము సరిగ్గా పోలేదు అంటుంది. ఇల్లు సర్దితే తను మళ్ళీ సర్దుతుంది. అదేమంటే నువ్వు సరిగా సర్దలేదు అంటుంది. ఒకటని కాదు నేను ఏ పని చేసినా ఆవిడకి నచ్చదు.
” మరి మీ మామయ్యకి, మీ వారికీ ఇదంతా తెలియదా సువిధ ..?” కాఫీ కప్పులు సింకులో వేసివస్తూ అంది పల్లవి.
“మామయ్య దినపత్రిక చదవడం, సెల్ ఫోన్ చూసుకోవడం చేస్తాడు. ఎప్పుడైనా ఆయన అత్తయ్యకి సర్దిచెప్పబోయినా ఆవిడ వినదు. మా వారు ఎప్పుడూ పనిలో బిజీ. ఇంటి విషయాలు పట్టించుకునే తీరికవుండదు తనకి. మేము ఎప్పుడైనా పెద్దగా మాట్లాడుకుంటే “అమ్మ చెప్పిన మాట వినలేవా” అంటూ నన్నే విసుక్కుండాడు” సువిధ ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనపడి
” మరి పొద్దున లేచింది మొదలు ఇంటిపని, వంట పని అంతా మీ అత్తమ్మ చేస్తుందా “అంది పల్లవి
” అదేంలేదు. పొద్దునే తను కాఫీ తాగి మార్నింగ్ వాక్ కి వెళ్ళుతుంది. ఇంటికి వచ్చి ఓ గంట సేపు మా ఆడపడుచుతో మాట్లాడుతుంది. నేను రాత్రి కూడా రీసెర్చ్ పని చేసుకుంటూ ఆలస్యంగా నిద్రపోవడంతో పొద్దున కాస్త ఆలస్యంగా నిద్రలేస్తాను. ఇక అప్పటి నుంచి పని కాలేదని ఒకటే కంగారు పడుతూ, విసుక్కుంటూ వంట మాత్రం చేస్తుంది. పిల్లలను రెడీ చేయడం, మిగతా పై పని అంతా నేను చేస్తాను. అయినా నేను పనిలో చాల నచ్చు అంటుంది. ప్రతిపనిలో వంక పెడుతుంది. పిల్లల ముందు కూడా నాకు కనీసపు విలువ లేకుండా తీసిపారేస్తుంది” గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనంత కన్నీటిరూపంలో బయటకు వచ్చింది సువిధకు.
” అయ్యో..సువిధ ..అలా బాధ పడకు. “కొందరంతే. ఎదుటి వాళ్ళు ఏం చేసినా వారికి అసలు నచ్చదు. అలాంటివారిని అసలు తృప్తి పరచలేము. మా అత్తగారు కూడా అంతే అనుకో. అయితే నాకు ఆ బాధ లేదు” అభావంగా అంది పల్లవి.
” అంటే ఏంటి పల్లవి. మీ అత్తగారు కూడా నిన్నిలా బాధ పెట్టారా..?” ఎప్పుడూ ఒకరి పర్సనల్ విషయాలను అడగడం ఇష్టం లేని సువిధకి ఆ రోజు మాత్రం పల్లవి కుటుంబం గురించి తెలుసుకోవాలనిపించింది.
“మా అత్తా, మామ వాళ్ళ పొలాలు ఉన్న పల్లెటూరిని వదిలిపెట్టి ఇక్కడకు రారు. వచ్చినా నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఆ నాలుగు రోజుల్లోనే నా పనిలో వంకలు పెట్టి సణుగుతూ ఉంటుంది మా అత్త. ఎలాగూ ఊరికి వెళ్ళిపోతారులే అని ఆమె మాటలను పట్టించుకునేదాన్ని కాదు నేను”.
” ఏమైనా నువ్వు అదృష్టవంతులాలివి పల్లవి. నీకు ఏ బాదరబందీ లేదు. నీ పనిలో వంకలు పెట్టేవాళ్ళు లేరు. నీ ఇష్టం వచ్చినట్లు హాయిగా బతకవచ్చు” అంది నిట్టూర్చుతూ సువిధ.
” సువిధ.. ఇప్పుడు మీరు ఉండే మీ సొంత ఇల్లు మీ వారి ఆఫీసుకి, మన రీసెర్చ్ సెంటర్ కూడా దూరమే కదా. పిల్లల స్కూల్ కి, మీ ఆఫీసుకి దగ్గరగా ఇల్లు తీసుకుని మనం విడిగా ఉందాం అని మీ వారికి ఖచ్చితంగా చెప్పు. అప్పుడు నీకు మీ అత్తగారి గొడవ ఉండదు. ఆలోచించు. ఎంత కాలం మాటలు పడతావు ” అంది పల్లవి జ్ఞానబోధ చేస్తున్నట్లు చేయి పెట్టి
” నిజమే పల్లవి..ఏదో ఒకటి చేయాలి. “ఇక బయలుదేరుతాను. ఆలస్యం అయితే మా అత్తయ్య ఊరుకోదు” అంటూ ఇంటికి బయలుదేరింది సువిధ.
***

” ఒచ్చావా తల్లీ. ఇంత ఆలస్యానికి కారణం ఏమిటో. చిన్నది అసలు నా మాట వినడంలేదు. నువ్వు వొచ్చి తినిపిస్తేనే అన్నం తింటా అంటూ మొండికేసి ఏడుస్తూ పడుకుంది. అయినా ఇంటిదగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అనే ధ్యాస ఉండదు నీకు” సువిధ ఇంట్లోకి అడుగు పెట్టీపెట్టకముందే దండకం ఎత్తుకుంది పరమేశ్వరమ్మ. ” అత్తయ్య..అది ” అంటూ చెప్పేలోగా ” అవునమ్మా..రీసెర్చ్ సెంటర్లో చాల పని ఉండింది అంటూ చెప్తావు. నేనేం చిన్న పిల్లనా. నీ పిల్లలతో పాటు పరుగులు తీయడానికి. ఒక్క క్షణం కుదురుగా ఉండరు ఇద్దరు. పొద్దస్తమానం వారి వెనుక పరుగులుపెట్టలేను నేను” మాటల స్థాయి నుంచి అరుపుల్లోకి మారింది పరమేశ్వరమ్మ స్వరం. ” అబ్బా..కోడలు పిల్ల ఇంటికి రాగానే మొదలెట్టావా నీ సణుగుడు. నీ దగ్గర ఎవరు ఉండలేరు పరమేశ్వరీ. బడి నించి వొచ్చిన పిల్లలకు ఇంత తినడానికి చేసి పెట్టడానికి నువ్వు ఎంత శ్రమ పడాలని” అత్తా, మామ వాదించుకుంటూనే ఉన్నారు.గుడ్ల నీరు కక్కుకుంటూ గమ్ముగా రూములోకి వెళ్ళిపోయింది సువిధ. స్నేహితురాలు పల్లవి చెప్పిన మాటలే మనసుని క్షణం స్థిమితంగా ఉండనీయక కల్లోలపరుస్తున్నాయి ఆమెని. ఆ రోజు రాత్రి తన నిర్ణయాన్ని భర్త శివరాంకి చెప్పింది సువిధ. కల్లో కూడా ఊహించని ఆమె నిర్ణయానికి హతాశయుడైనాడు శివరాం. పరిపరివిధాలా నచ్చజేప్పాలని చూసాడు సువిధని. “బయట నుంచి చూసేవారికి ఇది చాల తేలికైన సమస్య అనిపిస్తుంది శివ. కానీ దగ్గరుండి రోజు అనుభవించేవారికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. నేను ఎంత సర్దుకోవాలని మనసుకి నచ్చజెప్పుకున్నా అత్తమ్మ మాటలు అంత గాయపరుస్తాయి నన్ను” అంది సువిధ ఎక్కిళ్ళ మధ్య. ఇనుము విరిగితే కొలిమి వేడిలో కరిగించి అతికించవచ్చు. కానీ అద్దంలాంటి మనసు విరిగితే అతికించలేము. అటు అమ్మ, ఇటు భార్య. ఇద్దరు తనకు ముఖ్యమే. సున్నితమైన ఈ సమస్యని కాలానికి వదిలేసి, పూర్తిగా వారి మనసులు విరగక ముందే కొంతకాలం తాము అమ్మ, నాన్నలకు దూరంగా ఉండడమే మంచిది అనుకుని సువిధ నిర్ణయాన్ని అయిష్టంగా అంగీకరించాడు శివరాం. సువిధ పని చేసే రీసెర్చ్ సెంటర్ కి దగ్గరలో బాడుగకు ఇల్లు తీసుకుని వారంలోగా పిల్లలతో సహా ఆ ఇంట్లోకి మారిపోయారు సువిధ , శివరాంలు. “చూడండి. ఎలా మనలని వదిలేసి వెళ్లారో. మనం అంత కానీ వాళ్ళం అయిపోయామా. ఏదో చిన్న మాట అంటేనే తట్టుకోలేకపోయింది కోడలు పిల్ల” ముక్కు చీదుతూ అంది పరమేశ్వరమ్మ .

” బాగుంది పరమేశ్వరీ . సువిధ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి సణుగుతూ తను చేసే ప్రతిపనిలో లోపాలు వెతికావు.. ఇప్పుడు వాళ్ళు దూరం పోగానే బాధ పడుతున్నావు ఎందుకు. పిల్లల పని తగ్గిందిగా. నువ్వు కోరుకున్నది అదేగా. విశ్రాంతి తీసుకో” కొడుకు, కోడలు తీసుకున్న నిర్ణయం ఒక పక్క తనకి బాధగానే ఉన్నా భార్యకి సర్ది చెప్పాడు రాఘవయ్య. నేను ఎవరికోసం ఆగను అంటూ కాలం ముందుకు వెళుతోంది.
***
ఇల్లు తన రీసెర్చ్ సెంటర్ కి కాస్త దగ్గరలోనే ఉంది. అయినా ఇల్లు మారినప్పటినుండి కొత్త బాధ్యతలు పుట్టుకొచ్చాయి సువిధకి . అంతకుముందు కూరగాయలు, పచారీ సరుకులు మామయ్య తెచ్చేవారు. పిల్లలను దగ్గరుండి స్కూల్ బస్సు ఎక్కించడం, సాయంత్రం వీధిచివర ఆగిన బస్సు దగ్గర నుంచి ఇంటికి తీసుకురావడం ఆయనే చేసేవారు. ఇంటికొచ్చిన పిల్లలకి అత్తమ్మ ఏదోఒక టిఫిన్ చేసిపెట్టేది. శివరాం ఆఫీస్ నుంచి రాత్రి తొమ్మిదిపైన కానీ రాడు. ఇప్పుడు ఈ అదనపు బాధ్యతలు తనపై పడడంతో సమయం సరిపోక చాల విసుగ్గా ఉంది సువిధకి.
పొద్దున నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతోంది పరమేశ్వరమ్మ. మంచం మీద నుంచి లేవలేకపోయింది. స్టవ్ వెలిగించడం కూడా సరిగా రాని రాఘవయ్య ఎలాగో తంటాలు పడి అన్నం వండి, రసం పెట్టాడు. అలవాటు లేని పని తో రెండు సార్లు గిన్నె స్టవ్ మీద నుంచి దింపుతూ చేతులు కాల్చుకున్నాడు. మంచం మీద పడుకుని ఉన్న పరమేశ్వరమ్మ” సువిధ.. తల నెప్పిగా ఉంది. కాస్తా అమృతాంజనం తెచ్చి రుద్దు తల్లీ ” కలవరిస్తోంది.
” పరమేశ్వరీ..!ఏంటి నిద్రలో కలవరిస్తూ ఉన్నావు. కోడలు ఇంట్లో ఎక్కడ ఉంది ఇప్పుడు” అన్నాడు.
నీరసంగా లేచి కూర్చుని ” నిజమే అండి. ఇప్పుడు సువిధ ఉంటే నాకు బాగాలేదని ఎంత కంగారు పడేదో. నా కాళ్ళు పట్టేది. జలుబుకు ఆవిరి పట్టమంటూ వేడినీళ్ళ కాపడం పెట్టేది కాదండీ” భర్త వైపు దిగులుగా చూసింది ఆమె.
” ఇప్పుడు బాధ పడి ఏం లాభం..? వాళ్ళు ఉన్నప్పుడే నువ్వు కోడలుతో సర్దుకు పోతుంటే వాళ్ళు వెళ్లేవారు కాదు కదా” రాఘవయ్య గొంతులో బాధ అస్పష్టంగా ధ్వనించింది.
ఆ రోజు రీసెర్చ్ సెంటర్లో కాస్త పని ఆలస్యం అయ్యేసరికి కంగారుగా స్కూల్ దగ్గరకు వచ్చింది అర్చన. అప్పటికే పిల్లలందరూ వెళ్లిపోయినట్లు ఉన్నారు. స్కూల్ ఆవరణలో ఎవరు కనిపించలేదు. స్కూల్ మెయిన్ గేటు దగ్గర నిలబడి బిక్కుబిక్కు మంటూ చూస్తోంది పెద్ద పాప ప్రణతి.
“చెల్లి ఏది ప్రణు” అనగానే గేటు పక్కన అరుగు మీద పడుకుని ఉన్న చెల్లిని చూపించింది ప్రణతి. గబగబా ఆ పిల్ల దగ్గరకి వచ్చి “మహి..ఏమైంది రా నీకు” అంటూ పాప నుదిటిమీద చేయి వేసి చూసింది సువిధ.
ఆ పిల్ల ఒళ్ళు కాలిపోతోంది. ఒక్క క్షణం దిక్కు తోచలేదు సువిధకి. భర్త శివరాంకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వొచ్చింది. గబా గబా ఆటో మాట్లాడుకుని పిల్లలిద్దరినీ ఎక్కించుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకువెళ్లి పాపకి చెకప్ చేయించి మెడిసిన్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది. శివరాంకి ఫోన్ చేస్తే అప్పుడు కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏడుపు వొచ్చింది అర్చనకి. ఇంటిదగ్గర అత్తమామలతో ఉండి ఉంటే తాను వొచ్చేలోపల పిల్లలను వాళ్ళు చక్కగా చూసుకునేవారు. అత్తమ్మ అనే మాటలను పట్టించుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళ నుంచి వేరుపడి వొచ్చి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అనిపించసాగింది సువిధకి.
***
జ్వరం తగ్గి రెండు రోజులైంది పరమేశ్వరమ్మకి. అయినా నీరసం ఇంకా తగ్గలేదు. జ్వరం తగ్గినా బిడ్డలు దూరమైన మనోజ్వరం తగ్గక నాలుగు రోజుల్లోనే చిక్కి సగం అయింది పరమేశ్వరమ్మ. వరండాలో మంచం మీద కూర్చొని కొడుకు, కోడలు గురించే ఆలోచిస్తోంది. ” అమ్మా.. ఓ సారి ఇటు చూడండి” అంది పనిమనిషి కమల.
“ఏమిటే కమలా..! నాకు చాల నీరసంగా ఉంది” అంటూ మంచం మీదనుంచి లేవపోయి కళ్ళు గిర్రున తిరిగి మళ్ళీ మంచమ్మీద కూర్చుండిపోయింది పరమేశ్వరమ్మ.
“అదేనమ్మా..మొన్న ఈ దానిమ్మ చెట్టు ఎండిపోయింది పెరికేస్తాను అన్నాను కదా. ఇప్పుడు చూడండి..! చక్కగా చిగుర్లు పెట్టి ఎంత పచ్చగా, కళగా ఉందో” అంది కమల ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని.
మెల్లగా తలయెత్తి కుండివైపు చూసింది ఆమె. ఇన్ని రోజులు పరధ్యాసలో ఉండి తాను గమనించనే లేదు. చిన్న చిన్న కొమ్మలు పచ్చగా ఎదిగి కుండి అంతా పరచుకొని ఉన్నాయి. అంటే తన అంచనా తప్పేమో మరి.
“చూసారా అండీ..! మొక్కకి ప్రధాన ఆధారం అయిన తల్లి వేరుని కోసేసి పక్కన ఉన్న పిల్ల వేర్ల తో నాటితే ఆధారం కోల్పోయిన ఆ మొక్క ఇక బతకదు అనుకున్నాను. అయినా చూడండి పదిరోజుల ముందు ఎండిపోయింది అనుకున్న మొక్క మళ్ళాఎలా చిగురులు వేసిందో” అటుగా వొచ్చిన రాఘవయ్యకి కుండీలో నిగనిగలాడుతున్న దానిమ్మ మొక్కని చూపించింది పరమేశ్వరమ్మ
” నిజమే పరమేశ్వరీ..! తల్లి వేరు లేకుండా చేసినప్పుడు మొదట్లో ఆ మొక్క పక్కవేళ్ళతో నిలదొక్కుకోవడానికి చాల కష్టపడిఉంటుంది. బతకడానికి పోరాటమే చేసి ఉంటుంది. క్రమంగా పరిస్థితులకు తట్టుకుని నిలబడి, ఇప్పుడు చక్కగా ఎదుగుతోంది. ఈ మొక్కని చూస్తే నీకు ఏం తెలుస్తోంది చెప్పు ” అన్నాడు సాలోచనగా.
భర్త ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం అయింది పరమేశ్వరమ్మకి
” మరైతే ఈ మొక్క లాగే మన పిల్లలు కూడా మన నుంచి దూరంగా వెళ్ళి, కొన్ని రోజులు తంటాలు పడినా, తర్వాత మన అవసరం లేకుండానే వాళ్ళు బతకగలరంటారా..? ” భర్త కళ్ళలోకి అపరాధభావంతో చూసింది ఆమె.
“ఖచ్చితంగా అదే జరిగేది . ఇప్పుడు వాళ్ళకి మనం కాదు ఆధారం. ఈ ముదిమి వయసులో వాళ్ళే మనకు ఆధారం. నువ్వు మాటికి ముందు కోడలిని సూటిపోటి మాటలతో వేధించకుండా ఉంటే వాళ్ళు మనలను వదిలి వెళ్ళేవారు కాదు కదా. ఆలోచించు” అంటూ భార్యని ఓరకంట చూస్తూ సంచి తీసుకుని కూరలు తేవడానికి బజారు కి వెళ్ళాడు రాఘవయ్య.
***
” అత్తయ్య,మామయ్యలను వదిలి మనం దూరంగా వచ్చి పొరపాటు చేసామేమో అండీ” అంది సువిధ శివరాంకి భోజనం వడ్డిస్తూ.
“అయినా ఇప్పుడేమైంది సువిధ. వాళ్ళతో కలిసి అక్కడ ఉండద్దు అనే కదా నువ్వు కోరుకుంది ” సువిధ ముఖంలోకి చూస్తూ అన్నాడు శివరాం.
“అప్పుడు అత్తయ్య అనే మాటలు పడలేక అలా అనుకున్నాను అంది. ఇప్పుడు ఆలోచిస్తే మనకి వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు అనిపిస్తోంది” అంది సువిధ కాస్త ఆవేదనగా. మెల్లగా కరుగుతున్న భార్య మనసుని గ్రహించి
“అమ్మ అనే మాటలు సీరియస్ గా తీసుకోకుండా, ఏదో పెద్ద తరం ఆమె చెప్పింది వీలయితే చేస్తాం, లేదంటే సర్దిచెపుదాం అనుకోకుండా ఇద్దరూ తెగేదాకా తెచ్చుకుంటిరి. పాపం పిల్లలు కూడా నానమ్మ, తాత అంటూ ఎంత కలవరిస్తున్నారో. పసి దానికి బాలేకుంటే అమ్మ, నాన్న దగ్గరుండి దాన్ని ఎంత శ్రద్ధగా చూసుకునేవారో. వాళ్ళకి మనం కాదు సువిధ, వాళ్ళే మనకి ఇప్పుడు ఆధారం. ఆ పెద్ద తలకాయలు లేకుంటే ఇక మంచి,చెడు చెప్పేవారు ఎవరున్నారు మనకి. ఆలోచించు” అంటూ తినడం ముగించి పళ్ళేన్ని సింకులొ వేసి పిల్లల గదిలోకి వెళ్ళాడు శివరాం.
వారం రోజులు అపరాధం చేసినట్లు సిగ్గుపడి వెనక్కి చూడకుండా వెళ్లిపోయాయి.
ఆ రోజు ఆదివారం. అత్తగారి తలకి గోరింటాకు పెడుతోంది సువిధ. మనవరాళ్ళు రాఘవయ్యకి చెరోపక్క కూర్చుని ఆయన చెప్పే “ఐకమత్యమే మహాబలం” పంచతంత్రం కథ వింటున్నారు.
” నాన్న.. ఆ ఇంటి నుంచి మొత్తం సామాన్లు తెచ్చేసాం. ఇంటి ఓనర్ కి తాళాలు ఇచ్చేసి మా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వచ్చాను” అన్నాడు మెరుస్తున్న కళ్ళతో శివరాం.
శివరాం మాటలు చెవుల్లో అమృతం పోసినట్లు అనిపించాయి వారందరికి.

9 thoughts on “ఆధారం”

  1. చక్కనైన కథలు అందించగల నేర్పరి మా సోదరి
    వారి మస్తిష్కంలో జనించిన , మానవత్వపు విలువలతో కూడిన ,మరో ,అపురూపమైన కథనం

    ఈ ఆధారం.
    సోదరికి హృదయ పూర్వక అభినందనలు.

  2. గొర్తివాణిశ్రీనివాస్

    ఒకరికి ఒకరు ఆధారం అని చక్కగా చాటిచెప్పిన కధ.వంజారి రోహిణి గారికి అభినందనలు💐👌💐💐

  3. కధ బాగుంది రోహిణి. కలిసి ఉంటే కలదు సుఖం అని వూరికే చెప్పలేదు మన పెద్దవాళ్లు 👌👍

Comments are closed.