“నేను చాలా చెడ్డదాన్ని”. ఎందుకో మీకు చెప్పాలి కదా. శ్రీమతి జ్వలిత గారి సంపాదకత్వంలో వెలువడిన “సంఘటిత” కవితా సంకలనంలో చోటు చేసుకున్న నా కవిత శీర్షిక అండి అది. స్త్రీ ని సాటి మనిషి గా గౌరవించే మంచి మనసున్న మగవారందరికీ ఈ కవిత అంకితం🙏🌹 శ్రీమతి జ్వలిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో🙏🌹
పరువంటూ కన్నబిడ్డ బొట్టు తుడిచేసే
కర్కోటపు నాన్నల వినాశనాన్ని కోరే
నేను చెడ్డదాన్నే …
ప్రేమించిందని కన్నకూతురి కుత్తుక
కోసిన కసాయి తండ్రిని తిట్టిన
నేను చెడ్డదాన్నే…
ప్రేమించలేదని అమ్మాయి ముఖాన్ని
ఆసిడ్ తో వికృతం చేసిన అగంతకుడిని శపించిన
నేను చెడ్డదాన్నే…
కట్నం తేలేదని కట్టుకున్న ఆలిని కాటికి పంపిన
భర్త కళేబరాన్ని కాకులు పొడవాలనుకున్న
నేను చెడ్డదాన్నే….
కాటికి కాలుజాపిన వాడైనా ఆడదేహం కనిపిస్తే
చొంగ కార్చే కామాంధుడి కళ్ళు పోవాలనుకున్న
నేను చెడ్డదాన్నే…
ఆలి గర్భం లో ఉన్నది ఆడపిండం అని తెలిసి
అమ్మతనాన్ని చిదిమేసే కర్కోటకుడి చేతులకు
బేడీలు పడాలనుకునే
నేను చెడ్డదాన్నే…
ఒంటరి ఆడపిల్లలపై దుర్మార్గపు జంతువుల్లా
దాడిచేసి, ఆపై సజీవదహనం చేసిన
మృగాళ్లను చంపాలనుకున్న
నేను చెడ్డదాన్నే…
వంటింటి కుందేలు, అంగడి బొమ్మ
సుఖం తీర్చేవస్తువు, చాకిరీ చేసే యంత్రం
మనసు ఉండకూడని, మగవాడు
మలచుకునే మైనపు ముద్ద…
ఈ బిరుదులన్నీ ఇచ్చి…
మనిషికి జన్మనిచ్చి మాతృత్వాన్ని ప్రసాదించిన
స్త్రీని దేవతలా కాకున్నా మనిషిలా కూడా
చూడని ఈ పితృస్వామ్య భావజాలాన్ని
నిరసించిన నేను నిజంగానే
చాల చెడ్డదాన్ని…