ఏడాదేగా అయింది
నేర్చుకున్న పాఠాలు అప్పుడే మరిచావా..
పునఃశ్చరణ చేసుకోవడం పనికిమాలినదంటావా.
నిందలన్నీ ఎదుటివారిమీదకే నెట్టేస్తావా..
ఆత్మపరిశీలన అనవసరం అనుకున్నావా..
ఇకనైనా అప్రమత్తం కాకుంటే
నీ రక్షణ కోసం
సంభవామి యుగే యుగే అంటూ
దేవుడు వస్తాడో లేడో కానీ
నీ భక్షణ కోసం
సంభవామి పదే పదే అంటూ
సైతాను మాత్రం కొత్త శక్తులను కూడకట్టుకుని
కోటానుకోట్లుగా నీ ఊపిరిలోకి
ఉప్పెనలా దూసుకొస్తోంది
నాకేం కాదనే ధీమాని వదిలిపెట్టి
పునఃశ్చరణ పాఠాలు మొదలుపెట్టు
లేకుంటే నీతో పాటు నా అయిపు కూడా
శవాల గుట్టల్లోనే..
రోహిణి వంజారి
19-04-2021