ప్రతిష్టాత్మకమైన “ఖమ్మం ఈస్తటిక్స్ 2024” కథల సంకలనం లో ప్రచురితమైన నా కథ “అమ్మోరి భ్రమరాంబ” చదవండి. ఈ కథకి ముగింపు లేదు. మీరైతే ఎలాంటి ముగింపు ఇస్తారు తెలుపండి.











“ఒరే..అబ్బయ్యా..కేశవా..హైద్రాబాద్లో యుగంధరన్న ఉండాడనే ధైర్యంతోనే నిన్ను పంపిస్తా ఉండాను. అన్నచెప్పినట్లిని బాగా చదువుకోరా. ఈడ మాదిరిగా ఆడ సావాసగాళ్ళతో జేరి ఏడికిబడితే ఆడికి తిరగబాక”.
“సరేలే మా. ఎన్ని తూర్లు చెప్పినమాటే చెప్తావు. ఇకన రైలు కదలతాది. ఇంటికాడ నాయిన, నాయనమ్మ ఎదురుజూస్తా ఉంటారు. నువ్వింటికి పో, నేను బండి ఎక్కుతా” కళ్ళల్లో ఊరే నీళ్ళు అమ్మ కంట పడకూడదని విశ్వప్రయత్నం చేస్తూ, రైలెక్కి కిటికి దగ్గరరుండే సీట్లో కూర్చుని, ఆమె చాయ చూస్తూ కిటికీలోనించి చెయ్యి బయటకి పెట్టి ఊపాడు.
సిగ్నల్ ఇచ్చారు. పచ్చలైట్ వెలిగింది. ఆమె గుండె మాత్రం చీకటవుతోంది. బండి నెమ్మదిగా ముందుకు కదిలింది. చేతిని ఊపుతూ నెమ్మదిగా ఆమెకి దూరమవుతున్నాడు కేశవ. ఏదో గుర్తుకు వచ్చిన దానిమాదిరి గబగబా బొడ్లో తోపుకుని ఉన్న చిన్న తిత్తిని బయటకు లాగి ముడి విప్పి ఐదొందల నోటు, రెండొందల నోటు తీసి, తిత్తిని బొడ్లో దోపి, “అబ్బయ్యా..కేశవా..ఇంద, ఈ డబ్బులు తీసుకో”
రైలు వెంట పరిగెత్తింది. నుదిటి మీద చేత్తో కొట్టుకుంటా “మొ..చెప్తే ఇనవా..దూరంగా పోమా..”కంగారుగా కిటికీలోనించి చేతిని బయటికి చాపాడు కేశవ. డబ్బులు కొడుకు చేతిలో పెట్టి గబాల్న రవ్వంత దూరం జరిగి నిలబడుకొని రైలు వెళ్ళే తట్టు చూస్తూ ఉండిపోయిందామె రాతిబొమ్మమాదిరిగా. నేనెవరికోసమాగను అన్నట్లు పట్టాలమీద కట్ల పాములా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోయింది రైలు. తన దేహం నుంచి అతిముఖ్యమైన భాగమేదో విడిపోయి, తన నుంచి దూరంగా పోతున్నట్లు విలవిలలాడిందామె మనసు.
కళ్ళ నించి కట్ట తెగిన చెరువు మాదిరిగా నీళ్ళు కారతా ఉండాయి. “అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని’ సెల్ ఫోన్ మ్రోగడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిందామె చుట్టూ చూస్తూ. రైలెళ్ళిపోయాక ప్లాట్ఫారం నిర్జనమైంది తన మనసు ఖాళీ అయినట్లు. సెల్ ఆన్ చేసి “ఆ..చెప్పు శీనన్నా” అభావంగా ఉందామె గొంతుక. “భ్రమరమ్మా.. ఏడుండావు ?” అన్నాడు ఆత్రుత అతని గొంతుకలో.
“పిలగాడిని రైలెక్కించడానికి స్టేషన్ కాడికొచ్చానులే, ఇంత పొద్దు పోయి, ఏం పనుండి ఫోన్ చేశావన్నా?” కన్నీళ్ళు తుడుచుకుంటా ఆమె.
“మా అల్లుడు కొత్త ట్రాక్టర్ కొన్నాడు. రేపు ఏకోజామున గుడికాడికికోస్తాం. నువ్వు కొత్తబండికి పూజ చేయలమ్మా. నీ చేత్తో పూజ చేయించుకుని కొత్త ట్రాక్టర్తో కయ్య దున్నితే బంగారం పండుద్ది తల్లీ. ఈ మందల నీకు చెప్పాలని” అతని మాట నోట్లో ఉండాగానే ” ఆ..ఆ..అట్నేలే శీనన్నా, పొద్దన్నే అందురూ బండి తీసుకొని గుడికాడికి బిన్నా వొచ్చేయండి. పూజకి కావల్సిన సామాన్ల లిస్టు రాసి వాట్సాప్ లో పెడతా ఇంటికాడికి పొంగానే”. సెల్ ఆపేసి రైల్వే స్టేషన్ బయటికొచ్చి, ఆత్మకూరు బస్టాండ్ కి షేర్ ఆటో ఎక్కిందామె. బస్టాండ్ బయటే ఊరి బస్సు కదలబోతా ఉండాది. గబాల్న ఎక్కి కూర్చుంది.
ఇంట్లోకి అడుగుపెడతా ఉంటే గుప్పున కొట్టిన కంపుకి కడుపులో పేగులు మెలితిప్పినట్లయింది. భ్రమరాంబని చూస్తానే మంచం మీదినించి లేవడానికి విఫల ప్రయత్నం జేస్తా ఉండాడామే భర్త నారాయణ. తననుకున్నంతా అయింది. ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. “మామిడి పండు పెట్టద్దని ఎన్ని తూర్లు చెప్పినా మీయమ్మకి. యాడకుబోయింది ఇంతలో. నన్నాట్ట పోనిచ్చి తిన్నారా ఇద్దురూ. తింటే పారుకుంటావని తెలిసి కూడా. నా మాట ఎవరింటారు”. భర్తవంక కోపంగా చూస్తూ, పడుకుని ఉన్న అతన్నినెమ్మదిగా కొంచం పైకి ఎత్తి, మెల్లగా దుప్పటి లాగి కిందేసి, పంచె తీసి, తడి గుడ్డతో తుడిచి, ఇస్త్రీ పంచె చుట్టబెట్టింది. బయటకు వెళ్ళిన శేషమ్మ భయంభయంగా ఇంట్లోకొచ్చింది. చెంబు నిండా ఉన్న మజ్జిగ ఒలికి కింద పడతా ఉండాయి ఆమె చేతులు వొణికేతలికి.
“నేనింటికొచ్చేలోపు నువ్వు బయటకు పోవాల్నా? కాసేపు నీ కొడుకు దగ్గర ఉండకూడదా” కోపంలో పేలిపోయింది భ్రమరాంబ.
“వాడికి బేదులైనాయి. రొవ్వన్ని మజ్జిగ నాయుడోలింట్లో అడిగి తెద్దామని” ఇంకో మాట అనేందుకు ధైర్యం చాల్లేదామెకు.
“నేనులేని టైం చూసి అడ్డమైన తిండ్లు తింటే అట్నే వస్తాయి. అయినా మిమ్మల్ననేం లాభం. నా బతుకే అంత. మీ ఇద్దరికీ సేవచేయాలని నాకు రాసి పెట్టి ఉండాది” కంఠశోష తప్ప మరో లాభం లేదని తెలిసినా అరుస్తూనే, అన్నం మెత్తగా పిసికి మజ్జిగ పోసి కలిపి, గ్లాసులో పోసి మొగుడికి తాగించింది. శేషమ్మ కంచంలో అంత అన్నం పెట్టుకుని, చారు పోసుకుంది. భ్రమరాంబని తినమని బతిమాలింది శేషమ్మ. ఆకలి లేదని, వసారాలోకొచ్చి లైటేసింది. చిన్న పుస్తకంలో పూజకి కావాల్సిన సామాన్ల లిస్టు రాసి, ఫోటో తీసి, శీనయ్య వాట్సాప్ కి పంపింది.
నారాయణ కళ్ళుమూసుకుని గమ్మున పడుకోనుండాడు. శేషమ్మ వాకిట్లో గడప మీద తలపెట్టి నడుం వాల్చింది. భ్రమరాంబ వసారాలోనే చాప మీద వాలింది. ఇంటి చుట్టూ చిమ్మ చీకటి. నిశ్శబ్డం భీతిగొలిపేలా ఉంది. ఇంటెనక బూరుగ చెట్టు మీదున్న జెముడుకాకి ఉండుండి ‘గుహు గుహు’మని అరస్తా ఉండాది. ఇంటి పక్కనే ఉన్న పాచినీళ్ళ గుంటలోనించి కప్పల బెకబెకలు. సందులో కట్టెల కింద నించి చిమట ఒకటేమని ‘కీసు కీసు’ మంటా గోల చేస్తావుండాది. ఒకపక్క దోమలు, మరోపక్క మనసును తొలిచేస్తున్న దిగులు పురుగుల రొద నిద్రకి దూరం చేస్తున్నాయామెని. చాప మీద అటుఇటు దొల్లుతోంది. బోరున ఏడవాలనిపిస్తోంది. ఇప్పటి తన దుస్థితికి కారణమెవరు?
బుర్ర కొలిమిలో పెట్టినట్లుండాది. పిలగాడు ‘కేశవ’ లేకుంటే తనెప్పుడో చావాలనుకుంది. తను నల్లగా ఉంటాది. ఏడవ తగరతిలోనే చదువాగిపోయింది. తను పెద్ద మనిషి అయ్యేలోగానే, పెద్ద రోగం వచ్చి నాయిన పోయాడు. అన్నకి చదువబ్బలేదు. మెకానిక్ షాపులో ఏవో చిన్న చిన్న పనులు చేస్తాడు. అమ్మ,తను, అన్న కుటుంబం నడవాలి. ఒకపూట తింటే, రెండో పూట నీళ్ళతో కడుపు నిండక నిద్రపట్టేది కాదు. ఆ లేమి నుంచి తప్పుకోవడానికే, ముప్పై ఏళ్ళ వయసులో భార్య చనిపోయిన ఏభై ఐదేళ్ళ నారాయణకు రెండో భార్యగా బుచ్చిరెడ్డిపాళెం నుంచి, ఏభై గడపలు ఉండే ఆ చిన్న ఊరికి కోడలిగా వచ్చింది.
అప్పటికే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు భర్త నారాయణ. పెళ్ళైన ఏడాదిలోగానే ‘కేశవ’ కడుపులో పడ్డాడు. ఆ తర్వాతి సంవత్సరం నారాయణ మంచం మీద పడ్డాడు. భారీ కాయం. ఒంటి నిండా చెక్కర ఫ్యాక్టరీ. ఒంట్లో అదుపు తప్పిన బ్లడ్ ప్రెషర్. అడ్డమైన తిండ్లు తిని తెచ్చుకున్న రోగాలు. ఓ రోజు పొద్దున్నే మంచం మీద నించి లేచిలేవగానే మూతి వంకర పోయి, చేయి వెనక్కి తిరిగి, నేలమీద దబ్బున పడ్డాడు. మాట పోయింది. ఒక కాలు, చేయి కదలడం మానేశాయి. అది మొదలుకొని ఈ రోజు దాకా నారాయణకి మంచం మీద నుంచే అన్ని సేవలు చేస్తోంది. ఎన్ని మందులు, పసర్లు వాడినా నయం కానీ పక్షవాతం. చికిత్సకు కరిగిపోయిన డబ్బు. మిగిలింది రెండు గదుల చిన్న రేకుల ఇల్లు. అత్త శేషమ్మది కూడా కొడుకు బాటే. రోగాల పుట్ట.
తమ పుట్టింటి పేదరికం మీద, తన ఒంటి నల్ల రంగు మీద అసహ్యం తనకి. అయినా తనూ ఒక ఆడదే. తనూ అందరు ఆడపిల్లల్లాగే యవ్వనపు కలలు కన్నాది. ఆశల పల్లకిలో ఊరేగుతూ పంచవన్నెల ప్రపంచాన్ని ఊహించుకుంది. తన ఊహలు ఆశలు అన్నీతనకంటే పాతికేళ్ళు పెద్ద వాడైనా నారాయణతో జరిగిన పెళ్ళితో తుడిచిపెట్టుకుపోయినాయి. అప్పుడప్పుడు దేహ తపన, ఒంట్లోని నెగడ్లు తనని నిలవనిచ్చేవి కాదు. అర్ధరాత్రి బావి దగ్గరకి వెళ్ళి, నీళ్ళు చేదుకుని నెత్తిన గుమ్మరించుకునేది. నిర్లిప్తంగా చూసేవాడు నారాయణ ఆమె వైపు. ఆ చూపులకు మండుకొచ్చేది. తన యవ్వనపు కలలను కాలరాచిన భర్త మీద అసహ్యం. పెళ్ళాం పోయిన ఆర్నెల్లలోపే తనలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని అంజనం వేసి వెతికారు అమ్మా, కొడుకులు. కూటికి దిగులుండదని నారాయణకు తనని కట్టబెట్టి, చేతులు కడుక్కున్నాడు తన అన్న.
తన ఈటిదే అయిన అత్త కూతురు కమలకు పెళ్ళైన ఏడాదికే మొగుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినాడు. ఒక్కరంటే ఒక్కరు కూడా కమలకు మళ్ళీ పెళ్ళి చేయాలనే ఆలోచనే చేయలేదు. బొట్టు తీసి ముండమోపిని చేసి, మూల కూర్చోబెట్టారు. దానికి తోడు కమలకు ఓ బిడ్డ. ఇక జీవితమంతా అన్నావదినల పంచన, వారు జాలితో విదిల్చే అన్నం మెతుకులు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ, అందుకు కృతజ్ఞతగా కమల, ఆమె బిడ్డా జీవితాంతం వాళ్ళకి జీతం లేని పనివాళ్లుగా సేవలు చేస్తా ఉండారు. అంతకంటే తన బ్రతుకే అంతో, ఇంతో మేలు. ఇన్ని బాధల మధ్య తనకి మనఃశాంతినిచ్చేది ఒక్కటే. ఆలోచనలు పొయ్యిలో కట్టెల్లా మండుతుంటే, గుండెల్లో మంట పుడుతోంది కానీ నిద్ర రాలేదామెకు.
“కొక్కొరొక్కో..కొక్కొరొక్కో” కోడి పుంజు అరుపులకు ఉలిక్కి పడి లేచింది. పళ్ళు తోముకుని, బావిలో నీళ్ళు చేదుకుని, ఒంటిమీది చీర తడిసేటట్లు, బొక్కెన నీళ్ళు నెత్తిన గుమ్మరించుకుంది. చప్పుడు చేయకుండా ఇంట్లోకి వచ్చి, దండెం మీది పొడి చీర కట్టుకుని, స్టవ్ మీద నీళ్ళు కాచి, ఫిల్టర్లో కాఫీ పొడి వేసి, వేడి నీళ్లు పోసింది. పాలు కాచింది. గోడకి తగిలించిన కొయ్య స్టాండ్ మీద ఉన్న దేవుడి పటాల ముందర దీపం వెలిగించింది. కాఫీ కలుపుకుని తాగి, చిన్న తిత్తిని బొడ్లో దోపుకునింది. టైం ఆరైంది. చీకటి దుప్పటిని ఇంకా పూర్తిగా తొలగించలేదు ఆకాశం. శేషమ్మని నిద్రలేపి గుడి దగ్గర పూజ ఉందని చెప్పి, సెల్ ఫోన్ తీసుకుని మసక చీకట్లోనే బయటకి అడుగేసింది. ముఖానికి రాసుకున్నపసుపు, నల్లని ఒంటిఛాయతో కలిసి వింతరంగులో కాంతివంతంగా ఉండాది భ్రమరాంబ. కూసుగా ముక్కుకి పెట్టుకున్న తెల్లరాళ్ళ ముక్కుపుడక చీకట్లో తళుక్కున మెరస్తా ఉండాది. నుదుటి మీద రూపాయి కాసంత ఎర్రబొట్టు, కాస్త కిందుగా విభూది, పాపిడిలో సింధూరం బొట్టు, రెండు చేతులనిండా ఎర్ర రంగు మట్టి గాజులు, ఆకుపచ్చ నూలు చీరతో పెద్ద ముతైదువులా ఉందామె. రెండు వీధుల అవతలే గుడి. ఊర్లో ఉన్నవి రెండే గుడులు. ఊరి చివరున్న చెన్నకేశవ స్వామి గుడిలో రోజు దీపం పెడతాడు వడ్డెర పెంచలయ్య. ఊరి మధ్యలో ఉన్న అమ్మవారి గుడిలో ఊరందరి కోసం పూజలు చేస్తుంది భ్రమరాంబ. గుడి అంటే పెద్ద గుడేం కాదు. కొమ్మలు బాగా విస్తరించి ఉన్న పెద్ద వేపచెట్టు కింద చిన్న గర్భగుడిలో అమ్మవారి నల్లని విగ్రహం. పక్కనే చిన్న గణపతి. ముందు చిన్న గ్రిల్సు వరండా.
ఆమె వెళ్ళేసరికి శేషయ్య, అతని భార్య, కూతురు, అల్లుడు గుడి కాడికి వొచ్చేసి ఉండారు. గుడి తలుపులు తీసింది భ్రమరాంబ. వాళ్ళు తెచ్చిన పూజ సామాన్ల సంచి ఆమె చేతికిచ్చారు. పసుపుతో గణపతిని చేసి, తమలపాకులో పెట్టింది. మైకు సరిచేసి స్విచ్ వేసింది. “శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం” భ్రమరాంబ స్వరం ఊరి నలుదిక్కులకు వ్యాపిస్తోంది అత్యంత శ్రావ్యంగా. ప్రతిరోజూ సూర్యోదయపు వేళ గుడి నుంచి వినిపించే ఆమె స్వరం ఊరందరికీ మేలుకొలుపు రాగం .శేషయ్య వాళ్ళ గోత్రనామాలు అడిగి, సంకల్పం చెప్పి అమ్మవారికి కుంకుమ, చామంతి పువ్వులతో పూజ చేసింది. గుడి బైట నిలిపి ఉన్న ట్రాక్టరుకి రెండుపక్కలా పసుపుతో అరచేతి ముద్రలు వేసి, కుంకుమ బొట్లు పెట్టింది. ట్రాక్టర్ ముందు పూలమాల వేసి, విడి పూలతో పూజ చేసింది. శేషయ్య కోడలిని టెంకాయ కొట్టమని, కర్పూర హారతి ఇచ్చింది. ట్రాక్టర్ చక్రాలకు నాలుగు పక్కల నాలుగు నిమ్మ కాయలు పెట్టి, శేషయ్య అల్లుడిని ట్రాక్టర్ తోలమంది. ఆమె చెప్పినట్లు చేసారు వాళ్ళు. పూజ పూర్తి అయినాక, వంద రూపాయల కాగితం, రవిక గుడ్డ, అరటిపళ్ళు పెట్టి భ్రమరాంబకు తాంబూలం ఇచ్చింది శేషయ్య భార్య. సంతోషంగా ట్రాక్టర్ని తీసుకుని వాళ్ళు వెళ్లిపోయారు. అప్పటికి గంట ఏడున్నర దాటింది. ఒకరిద్దరు గుడికి వచ్చి, హారతి తీసుకుని, పదో పరకో చిల్లర నాణాలు హారతి పళ్లెంలో వేసి వెళుతున్నారు. పది గంటల దాకా గుడిలోనే ఉండి, లలితా సహస్ర నామాలు అన్నీ చదివి, ఇంటికొచ్చింది. వంట చేసి అత్తకి, మొగుడికి పెట్టింది. మధ్యాన్నం పడుకోకుండా, లక్ష కొమ్ముల నోము కోసం పసుపు కొమ్ములు సేకరించాలని, పక్కింటి పెద్దామె లక్షమ్మతో కలిసి బయటకి పోయింది.
తను అనుభవించే యాతనలకు ఉపశమనమిచ్చేది ఇప్పుడు ఆమె ఇతరుల కోసం చేసే పూజలు మాత్రమే. చిన్నప్పుడు తండ్రి పూజలకు పోయినంతవరకు వారింట్లో తిండికి లోటు లేదు. ఆమె అన్నకు చిన్న మంత్రాలు చదవడానికి కూడా నోరు తిరిగేది కాదు. ప్రతిరోజూ పొద్దున్నే తండ్రి దేవుళ్ళ అష్టోత్తరాలు, పూజల మంత్రాలు వల్లించుకుంటుంటే చిన్నారి భ్రమరాంబ శ్రద్దగా వినేది. విన్న వెంటనే తాను తిరిగి తండ్రికి ఒప్పచెప్పేది. ఏకసంధాగ్రాహి ఆమె. భ్రమరాంబని తన వారసురాలు అని ఆమె తండ్రి మెచ్చుకునేవాడు. తండ్రి ద్వారా పూజలన్నీ చిన్నప్పుడే నేర్చుకుంది. అమ్మవారి అష్టోత్తర శతనామాలు, పూజ అంటే మరీ మక్కువ ఆమెకి. మనిషికి దుఃఖపు తలుపులన్నీ మూసుకుంటే, ఒక్క సంతోషపు తలుపైనా తెరిచి ఉంటుందన్నట్లు, చిన్నప్పుడు తండ్రి దగ్గర నేర్చిన పూజలు, మంత్రాలే ఆమెకిప్పుడు కాస్త సంతోషాన్నిచ్చేది.
‘ఆడ మనిషి పూజలు చేయడం ఏమిటి!’ అని మొదట్లో నొచ్చుకున్నా, ఆమె మంత్రోచ్చారణకి, మధురమైన స్వరానికి దాసోహమై శిశుర్వేత్తి, పశుర్వేత్తి అన్నట్లు ఆ ఊరిప్రజలు ఆమెతో పూజలు చేయించుకోవడానికి అలవాటు పడిపోయారు. ఆ ఊర్లో భ్రమరాంబని మించి, పూజలు, మంత్రాలు వచ్చినవాళ్లు కూడా ఎవరు లేరు. అందుకే ఏ ఇంట వ్రతమైనా, ఏ చిన్న పూజ అయినా, అక్కడ భ్రమరాంబ స్వరమాధుర్యం, మంత్రాల ఝరీ గంగా ప్రవాహంలా సాగాల్సిందే. వీనులకు భక్తి విందు చేయాల్సిందే. ఆ పూజలో, వ్రతాలో జరిగిన వేళా విశేషమో లేదా యాదృచ్చికమో ఏమో కానీ, ఆమె అడుగుపెట్టిన ప్రతి ఇంట్లో ఏదో ఒక మంచి జరిగేది. భ్రమరాంబ హస్తవాసి మంచిది అని ఊరందరికీ బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. తాను పూజ చేస్తే తన ఇంట్లో తప్ప, అందరికీ మంచే జరుగుతుంది. నిర్వేదంగా నవ్వుకుంటుందామె.
ఆ రోజు పొద్దునే లేచి భర్త, అత్త పనులన్నీ చక్కబెట్టింది. ఇద్దరికీ ఇడ్లీలు చేసి పెట్టి, వంట చేసింది. నారాయణ మంచం మీద మగతగా పడుకోనుండాడు. శేషమ్మ గడప దగ్గర కూర్చుని పత్తితో ఒత్తులు చేస్తోంది. సుమంగళి నోము చేయించాలని ఊరి చివర ఉన్న ఒకే ఒక్క భవంతి ‘స్వర్ణలతా రెడ్డెమ్మ’ ఇంటికి పోయివస్తానని అత్తకి చెప్పి బయలుదేరింది. స్వర్ణలతా రెడ్డెమ్మ ఇంట్లో అమ్మవారికి పంచామృత స్నానం, అభిషేకాలు చేయించింది. రోజాలు, చామంతులు, బంతి పూలతో అమ్మవారిని అలంకరించారు. మధ్యాన్నానికి వ్రతం పూర్తి అయింది. పూజకు వచ్చిన అందరికీ పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు తాంబూలాలు ‘స్వర్ణలతా రెడ్డెమ్మ’ చేత ఇప్పించింది భ్రమరాంబ. పూజ చేయించిన భ్రమరాంబకి బంగారు రంగు అంచులో మెరిసిపోయే ఎర్రటి పట్టు చీర, గాజులు, పూలు, పండ్లు, దక్షిణ తాంబూలం ఇచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి, ఆమె ఆశీస్సులు అందుకున్నారు స్వర్ణలతా రెడ్డెమ్మ దంపతులు. పూజకు వచ్చిన వాళ్ళు కూడా భ్రమరాంబకి కుంకుమ బొట్లు పెట్టి, పండు, తమలపాకులు ఇచ్చారు. ఆమె నుదురంతా కుంకుమతో నిండి సూర్యోదయపు వేళ తూరుపు దిక్కంత ఎర్రగా మారింది. ఇక ఇంటికి వచ్చేద్దామని లేచింది. లలితా సహస్త్ర నామాలు చదివి వెళ్ళమని అర్ధించింది స్వర్ణలతా రెడ్డమ్మ.కాదనలేకపోయింది భ్రమరాంబ. అందరూ మళ్ళీ అమ్మవారి ముందు కూర్చున్నారు. “శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమస్సింహాసనేశ్వరి” భ్రమరాంబ స్వర చాతుర్యానికి అమ్మవారు కూడా పరవశించిపోతున్నట్లుంది, మంత్రముగ్ధులై వింటున్నారందరూ.
“భ్రమరమ్మా….త్వరగా ఇంటికి బయలుదేరు ” బయట నుంచే పెద్దగా కేకేశాడు పక్కింటి లక్షమ్మ కొడుకు.
ఊర్లోనో, వీధిలోనో శవం లేస్తే గుడిని మూసేయడం ఊరి ఆనవాయితీ. నారాయణ చనిపోయి కరమంత్రపు దినాలు కూడా అయిపోయినా, అమ్మవారి గుడి తలుపులు తెరుచుకోలేదు. గుడిని పాడుబెడితే ఊరికి అరిష్టం. కానీ ఇప్పుడు భ్రమరాంబ విధవరాలు. తూర్పు సింధూరంలా ఉండే ఆమె నుదురిప్పుడు నల్లటి మేఘాలు తిష్టవేసిన ఆకాశంలా చీకటిగా ఉంది. విషాదంగా ఉంది. నిర్వేదంగా ఉంది. నిర్లిప్తంగా ఉంది. తన నుదిటిన కుంకుమ బొట్టు లేనందుకు బాధ లేదామెకు. ఆ కారణంచేత అమ్మవారి పూజకు తనను దూరం చేయడమే భరించలేకపోతోంది. మొగుడు నారాయణతో తానేనాడు సుఖపడింది లేదు. ఇప్పుడు ఆ మొగుడుకూడా లేదు. చదువు కోసం పోయి, పిలగాడు కూడా తనకి దూరంగా పోయినాడు. ఎన్ని బాధలు ఉన్నా, గుడిలో అమ్మవారి ముందు నిలబడి పూజ చేస్తూ ఉంటే ఈ లోకాన్ని మర్చిపోయేది తను. అమ్మవారి సన్నిధిలో మాత్రమే తనకి మనఃశాంతి లభించేది. ఇప్పుడు తనని అమ్మవారి నుంచి దూరం చేస్తే తానెలా బతికేది?వేదనతో చితికిపోయిందామె. భ్రమరాంబ దుఃఖమంతా చూస్తోంది పక్కింటి లక్షమ్మ. కానీ ఆమెని ఎలా ఊరడించాలో తెలియడం లేదు లక్షమ్మకి. ఊర్లోని పూజలు వ్రతాలు ఆగిపోయాయి. బాలసారెలు, అన్నప్రాసనలు, అక్షరాబ్యాసాలు వాయిదా పడ్డాయి. పుస్తకం చూసైనా మంత్రాలు చదివే పరిజ్ఞానం ఊర్లో ఎవరికీ లేకపాయ. ఇక ఊరికి అరిష్టం చుట్టుకుంటుందని అందరు భయపడతా ఉండారు.
తొలిపొద్దు వేళయింది. తూర్పు దిక్కున వెలుగు చుక్క పొడిచింది. స్నానం చేయించి పురిటి బిడ్డ నుదుటన అమ్మ పెట్టే ఎర్రటి బొట్టులా ఉందది. గూళ్ళనుంచి బయటకొచ్చి చెట్ల కొమ్మలమీద కూర్చుని పక్షులు కిలకిలమంటూ పొద్దుపొడుపు రాగాలు పాడుతున్నాయి. ఏకోజామునే లేచింది భ్రమరాంబ. బావి దగ్గర నీళ్ళు చేదుకుంది. బొక్కెన నీళ్ళు నెత్తిన పోసుకుంది. తడిచీరతో ఇంట్లోకి వచ్చి, దండెం మీది పొడిచీర కట్టుకుంది. తడి తల తుడుచుకుని జారుముడేసుకుంది. బొడ్లో తిత్తి దోపుకుంది. మనసులో స్థిరపరచుకున్న గట్టి సంకల్పంతో ముందుకడుగేసింది. ఆమె అడుగులు అమ్మవారి గుడివైపు పడుతున్నాయి. ముక్కుకి తెల్ల రాయి ముక్కెర లేని ఆమె ముఖం బోసిగా ఉంది. ఆమె నుదుటిని చీకటి కప్పి ఉంది. పుట్టెడు దుఃఖంతో ఉందామె. నీటి బుడగల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. భ్రమరాంబ ఏం చేయబోతోందో అని కంగారుగా ఆమె వెనుకే లేని సత్తువ తెచ్చుకుని వడివడిగా నడుస్తున్నారు ఆమె అత్త శేషమ్మ, పక్కింటి లక్షమ్మ.
ఎవరో ఊరికి ఉప్పందించారు. ఊరి పెద్ద మనుషులు, ఊర్లో ఉండే ఆడామగా, పిల్లాజల్లా అంతా అమ్మవారి గుడి ముందరికి చేరుకున్నారు. అంతా భ్రమరాంబని వింతగా చూస్తూ ఉన్నారు. భ్రమరాంబ నడుము దగ్గర చీరకి దోపుకున్న తిత్తిని లాగి, తాళం బయటకు తీసింది. గుడి గ్రిల్సు తలుపుకి వేసి ఉండే పెద్ద తాళాబుర్రలో తాళం చెవి పెట్టబోయింది.
“ఆగు భ్రమరమ్మా..” ఊరి పెద్ద దశరదయ్య కంఠం కంచులా మ్రోగింది. భ్రమరాంబ తాళం తీసే ప్రయత్నం మానుకుని, గుడి ముందర కూలబడింది. అందరూ గుమిగూడి ఆతృతగా చూస్తున్నారు.
“ఏం దశరదన్నా! ఎందుకు నేను గుడిలో పూజ చేయకూడదు?” సూటిగా భ్రమరాంబ వాక్కు. “నువ్విప్పుడు విధవరాలివి. గుడిలో పూజలు చేయకూడదు” కటువుగా అన్నాడు.
“విధవరాలినైతే ఎందుకు పూజలు చేయకూడదు. నేను ఈ ఊర్లో అడుగు పెట్టిన నాటినుంచి ఒక్కరోజు కూడా విడవకుండా అమ్మవారికి పూజలు చేస్తా ఉండాను. నా భర్త చనిపోతే నేనెందుకు పూజ చేయకూడదు. మీ అందరికి మంచి జరగాలని నేను పూజలు చేస్తా ఉండాను. మీకు తెలియనిదా అన్నా” ఆమె కళ్ళు వరదొచ్చె ముందరి తటాకల్లా నీళ్ళతో నిండుగా ఉన్నాయి.
“అప్పుడు వేరే భ్రమరమ్మా. ఇప్పుడు నువ్వు ముత్తైదువవి కాదు కదా. అమ్మోరి పూజలు యెట్లా చేస్తావు” కల్లు గీత శాంతమ్మ అడిగింది. ఆమె మోకులు చేతుల్లో పట్టుకొని ఉంది. “శాంతక్కా.. నీ మొగుడు శరభన్న పోయాడని నువ్వు గమ్మున ఇంట్లో ఉండావా ? మోకులు తీసుకుని, తాటి చెట్లు ఎక్కడం నేర్చుకుని, కల్లు గీస్తా ఉండావు కదా” భ్రమరాంబ మాటకు తలవంచుకుంది కల్లు శాంతమ్మ. “కల్లు గీయడం, పూజ చేయడం ఒకటేనా భ్రమరమ్మా” గుంపులో నుంచి ఎవరో అన్నారు.
“ఏం ఎందుకు కాదు. పోయిన ఏడాది వడ్డెర పెంచెలయ్య భార్య మునెమ్మ చనిపోయింది. దినాలు అయిన పక్క రోజు నుంచే పెంచెలయ్య చెన్నకేశవ స్వామి గుడికి పోయి దీపం, నైవేద్యం పెడతాఉండాడుకదా. పెళ్ళాం పోయినవాడు అని ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదే. ఆయనకో న్యాయం, నాకో న్యాయమా” ఆమె కనుకొలకల్లో నీళ్ళు చెంపలమీదికి జారతా ఉండాయి.
“నొసటన కుంకుమ బొట్టు లేకండా అమ్మవారి పూజ చేయడం అపరాధం భ్రమరమ్మా. ఊరికి మంచిది కాదు. ఇంతమందిమి చెప్తా వుండాము. అర్ధం చేసుకోవేమి తల్లీ” వంగిన నడుముతో ఉన్న పండు ముసలి రమణమ్మ గొంతు బురబరమంది. భ్రమరాంబ పరిస్థితికి ఓ పక్క బాధగానే ఉండాది అందరికీ. ఆమెను మించి పూజలు, మంత్రాలూ వచ్చినవాళ్లు కూడా ఎవరూ లేరు ఊరీమొత్తంలో.జనం అంతా గుడి చుట్టూ మూగిపోయిఉండారు. అందరిని ఒక్క తూరి తేరిపారగా చూసింది భ్రమరాంబ. చిన్నగా దగ్గి గొంతు సవరించుకుంది.
“నా నుదుటన కుంకుమ బొట్టు ఒక్కటే అమ్మవారికి పూజలు చేయడానికి అర్హత అయితే, ఊర్లో ఇంతమంది మొగోళ్ళు ఉండారు. ఎవరో ఒకరొచ్చి నా మెడలో పసుపు తాడు కట్టండి”. ఆమె నోటినుంచి వచ్చిన ఆ మాటతో ఒక్కసారిగా వెయ్యి వోల్టుల కరెంటు షాక్ తగిలినట్లు స్థాణువుల్లా నిలబడిపోయారందరూ. కాసేపు ఊరుఊరంతా ఉలుకుపలుకు లేకుండా పోయింది. అందరివైపు చూసి రెండుచేతులెత్తి దణ్ణం పెడుతూ,
“నాకు పెళ్ళాం హోదా వద్దు. ఎటువంటి సుఖాలు వద్దు. అమ్మవారి నుంచి నన్ను దూరం చేయబాకండి. ఈరోజు నేను అమ్మవారికి పూజ చేసి తీరుతాను” లేచి నిటారుగా నిలబడింది భ్రమరాంబ. ఊడిపోయిన జుట్టుని మెలితిప్పి ముడి వేసుకుంది. చీర కొంగుని చుట్టుతిప్పి, నడుముకి బిగించి చెక్కుకుంది. గుడి తలుపు తీసేదానికి తాళం చేతులోకి తీసుకుని అడుగు ముందుకేసింది.
ఊరి జనాల్లో చైతన్యం వచ్చిందా? ఊరు ముందుకు కదిలిందా? భ్రమరాంబ అమ్మవారికి పూజ చేసిందా? ఊరు ఏ నిర్ణయం తీసుకుందో..!