సార్ధకం

శుభోదయం. ఈ నెల “విశాఖసంసృతి” మాసపత్రికలో నా కవిత “సార్ధకం”. సంపాదకులు శ్రీ శిరేల సన్యాసిరావుగారికి ధన్యవాదాలతో..
సార్ధకం చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా..🙏🙏🌹🌹

దిగులు మేఘాలు కమ్మేస్తున్నాయా నిన్ను
నాకెవరు లేరని శోకిస్తున్నావా
నేనెందుకూ పనికి రానని చింతిస్తున్నావా
క్షణికావేశంతో లోకం విడవాలనుకుంటున్నావా
ఓ చిన్ని మొక్కకు రోజు ఓ గుక్కెడు నీళ్ళు పొయి
కొన్ని తరాలకు ప్రాణవాయువు నువ్విచ్చినట్లే కదా
నీ ఇంటి ముందు వాలిన పక్షికి గుప్పెడు గింజలేయి
పర్యావరణ సమతుల్యాన్ని నువ్వు కాపాడినట్లే కదా
ఆకలంటూ వొచ్చిన అన్నార్థులకి కాసింత అన్నం పెట్టు
ఆకలి తీరిన ఆ కళ్ళల్లో కనపడే దీవెనలు
ఇంకే దానం చేస్తే వస్తాయని చెప్పు
నీ కాళ్ళకు చెప్పులు లేవని బాధ పడుతున్నావా
అసలు కాళ్ళే లేని వారి బాధని చూడు
నీ కంటిలో నలుసు పడిందని ఏడుస్తున్నావా
పుట్టు గుడ్డివాళ్ళు పడే యాతనని చూడు
నీ సమస్య ఎంత తేలికైందో తెలుస్తోంది కదా
నీకెంత శక్తి ఉన్నదో అంచనా వేసుకో
కన్నీటిని తుడిచే నీ చేతిదే కదా అసలైన భాగ్యం
ఇతరులకై నువ్వు జార్చే కన్నీటితోనే కదా
నీ జీవితపరమార్ధం అయ్యేది సార్ధకం