బహుళ త్రైమాసిక పత్రికలో నా కవిత “సహచరుడా”. Jwalitha Denchanala మేడం గారికి ధన్యవాదాలతో..సహచరుడా..! చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
చిత్రాలు శిల్పాలు
అధివాస్తవ అభూత
కల్పనల్లోనే మాకు రక్ష
వాస్తవ నిజరూపంలో
అడుగడుగునా మాకు పరీక్ష
పువ్వులు లతలు
లేడికూనలు అరిటాకులు
ఇంకెన్నిటితో సాదృశ్యం మాకు
శంఖం లాంటి మెడ
తామర తూళ్ళ చేతులు
శిఖరాలవంటి కుచాలు
అరిటి బోదెల్లాంటి పిక్కలు
వర్ణనల్లో ఆదమరిచిన మాకు
గొంతులో దిగిన విషపు కత్తి
యదార్ధాన్ని బోధిస్తుంది
మీ సౌందర్యాత్మక దృష్ఠి మాకొద్దు
మీ ఆరాధనలు పూజలు మాకొద్దు
సాటి మనుషులుగా సహచరులుగా
గుర్తింపు చాలు మాకు
అనుమానం అవమానం
మానవతి అభిమానం మీద
ఎన్ని సమ్మెట పోట్లు కొడతారు
మగవాడి పక్కటెముక నుంచి పుట్టారు
దాస్యానికి సేవకే మీ జీవితాలంటూ
ఎంతకాలం నిఘా మూసుకులు మాకు
రూపంలో తప్ప దీపంలా వెలుగివ్వడంలో
నువ్వు నేను సమానం అని తెలుసుకోరెందుకు
పగలు రేయి ఉంటేనే రోజుకు అర్ధం
పట్టాలు రెండుంటేనే రైలు ప్రయాణం
నువ్వు నేను ఉంటేనే జీవన చక్రం
హెచ్చు తగ్గులయిందా
అది అర్ధం లేని గమనం
రోహిణి వంజారి
9000594630