సమైక్యంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం చేదెక్కిందా

ఈ వారం విమల సాహితీ ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన స్పందనను తెలుపగోరుతూ. మిత్రులందరికీ విమల సాహితీ బృందం తరపున ముందస్తు ౭౬ వ స్వతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో..

ఇష్టపడి నిర్మించుకున్న సొంత ఇంట్లో “నీ బాంచన్ దొరా, నీ కాలు మొక్కుతా” అంటూ ఒకరికింద బానిసగా బతకడం ఎంత నరకమో, ఆ ఇంటివారిని అడిగితే చెప్తారు. అటువంటిది సముద్రాలు దాటి వ్యాపారం కోసం వచ్చాము అంటూ నక్క జిత్తులు చూపించి, తిన్నఇంటి వాసాలు లెక్కబెట్టి, చివరకు “ఈ దేశం మాదే. మీరంతా మా కింద బానిసలుగా ఊడిగం చేసి మేము విసిరేసే ఎంగిలిమెతుకులు తినండి” అంటే ఎన్ని గుండెలు పగిలాయి. ఎంత నెత్తురు ఉప్పొంగింది. అయినా అప్పుడు ఐకమత్య లేమి, నిస్సహాయత, అమాయకత్వం, ఆధునిక సైనిక సంపత్తి లేకపోవడం, స్థానిక పరిపాలకుల స్వార్థం, అజ్ఞానం విదేశీ తెల్ల దొరల ఇనుప పాదాల కింద భారతావనిని దాస్యం చేసాయి.

ఒకటా, రెండా..! ఎన్ని సంత్సరాలు, ఎన్ని శతాబ్దాలు, ఎన్ని వందల సంవత్సరాలు. ఎంత వేదన, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని గాయాలు, ఎన్ని రోదనలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని జైలు జీవితాలు, ఎన్ని సత్యాగ్రహాలు, ఎన్ని ధర్మాగ్రహాలు, ఎన్ని విప్లవ శంఖాలు, ఎన్ని ఉరితాళ్లు, ఎన్ని నెత్తుటి కాల్వలు..! ఎందరు మహానుభావుల త్యాగఫలం ఆనాడు 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి చిమ్మచీకట్లలో వెలుగు నిండింది భారతావనిలో. తెల్ల దొరల దాస్యపు సంకెళ్లు తెంచుకుని, స్వేచ్చా ఊపిర్లు పీల్చుకున్న భారతీయుల హృదయాలు స్వేచ్చా విహంగాలై నింగినంటిన సంబరాలు చేసుకున్నాయి.

కానీ ఆ సంబరాల తాలూకు ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. విశాల భారతావని రెండు ముక్కలైంది. ఆహార్యం, ఆహారం వేరని అన్నదమ్ముల్లా విడిపోయి కలిసిఉండమని నాయకులు భారతావని గుండె నుంచి ఓ ముక్కని వేరుచేసారు. అయినప్పటికీ భరత ఖండంలో శాంతి, సౌఖ్యాలు ఉన్నాయా..? ఈ భూమిమీద పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడి గాలి పీల్చే మేము ఎక్కడకు పోవాలి, మేము కూడా భారత మాత బిడ్డలమే కదా అంటూ కొన్ని వర్గాలు ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి. సున్నితమైన భావాలను రెచ్చగొట్టే కొన్ని తీవ్రవాద దుష్ట, మతశక్తులు భరత భూమి పైన దృతరాష్ట్ర ప్రేమను చూపుతున్నాయి. “భారత దేశము నా మాతృ భూమి, భారతీయులందరు నా సహోదరులు” ఈ ప్రతిజ్ఞకు ఇప్పుడు విలువ లేకుండా పోతోంది. బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో పేర్కొన్న “భారత దేశం లౌకిక రాజ్యం. ఎవరికి ఇష్టమైన మతం వారు పాటించవచ్చు” అనే వ్యాఖ్యలు పుస్తకంలోని రాతలే అయినాయి. ఆచరణలో ఎక్కడా లౌకికతత్వం కనిపించడం లేదు. బొట్టుని చూస్తే ఒకరికి కోపం. గడ్డంని చూస్తే మరొకరికి ద్వేషం.. పశువులకు ఇచ్చిన విలువ మనుషులకు లేదు. అంటరానితనం, వివక్షలకు అంతే లేదు. కొన్ని రాజకీయ పక్షాలకు ప్రజా సమస్యలకన్నా, అధికార పీఠంపైనే అమితమైన ఆసక్తి. ఐదేళ్లకోసారి ఓట్ల కోసం, అధికారం కోసం తిరిగి, అధికారపీఠం ఎక్కగానే ప్రజల సమస్యలను మరచి, పైపెచ్చు ప్రజలను ప్రాంతాల వారిగా, కులాల, మతాల వారిగా వేరుచేసి విద్వేషాలను రెచ్చగొట్టి, తమ అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్ని ఊసరవెల్లి రంగులు మారుస్తారనేది విజ్ఞులకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఒక సామాన్య మనిషి స్వేఛ్చగా, ధైర్యంగా ఎక్కడ బతకగలడు.

” స్త్రీలు అర్ధరాత్రి స్వేఛ్చగా తిరగగలిగిననాడు అసలైన స్వతంత్రం వచ్చినట్లు ” అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. కానీ ఈనాడు వర్తమాన భారతంలో పట్టపగలు కూడా మహిళలకు రక్షణ కరువైంది. ఇటీవల మణిపూర్లో మహిళల పట్ల జరిగిన ఘాతుకాలకు యావత్భారతం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. ఇక నిర్భయలు, దిశలు ఎందరు రాలిపోయారో లెక్కేలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనమున్నది నిజమైనా స్వాతంత్రంలోనేనా..?

పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానం ఒకవైపు, తరుగుతున్న నైతిక విలువలు మరోవైపు. పోటీపడుతూ మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి. నేను, నాది, నేను బాగుంటే చాలు, అని తప్ప మనము, మనది అనే భావనలు తరిగిపోయి మనుషులు తమ చుట్టూ తామే ఇనుప కంచెలు నిర్మించుకుంటున్నారు. చంద్రుడి మీదకు వెళ్లి అక్కడకి కూడా తమ అవకరాలను ఎగుమతి చేసినా ఆశ్చర్యం లేదు.

అయినా మనిషి ఆశాజీవి. భవిష్యత్ తరాలు అభ్యుదయాన్ని, అభివృద్ధిని ఆనవాలుగా చేసుకొని గొర్రె దాటు స్వభావాన్ని మానుకుని, విశాల దృక్పథంతో సమాజానికీ కొంతైనా తిరిగిచ్చే స్వభావాన్ని అలవర్చుకుని ఆదర్శప్రాయమైన జీవితంతో విశ్వవీధిలో భారతదేశ జెండా ఎగరేయాలి. ప్రజలు కూడా తమ సమస్యలను తీర్చే, వారి కష్టాలను, కడగండ్లను కడతేర్చే నిజాయితీగల పాలకులను, ఎన్నుకున్నపుడే దేశం అన్ని రంగాలలో సుభిక్షం అవుతుంది. అప్పడే కష్టపడి సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు మధురంగా మారుతాయి. సంపూర్ణ అక్షరాస్యత, ఉపాధి, ఆర్ధిక స్వావలంబన, పేదరిక నిర్మూలన, నచ్చిన మతాన్ని అవలంభించే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, స్త్రీ సాధికారత, మహిళలపై జరిగే దాడులకు కఠినమైన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు, చట్ట సభల్లో మహిళలకు పెద్ద పీట, ఇలా సర్వతోముఖాభివృద్ధికి చెందిన అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలి. ప్రతి ఒక్కరు చట్టానికి, సాటి మనిషికి గౌరవం ఇచ్చినప్పుడే మనం జాతీయ జెండాని గౌరవించినట్లు. ఈ సంకల్పంలో ఉక్కు నరాలు, ఉడుకు నెత్తురు ప్రవహించే యువత అతి ముఖ్య పాత్ర వహించి “కొంత మంది యువకులు ముందు యుగం దూతలు” అన్న మహాకవి శ్రీశ్రీ మాటలను నిజం చేస్తూ పావన, నవ జీవన భారతానికి నాంది ప్రస్తావన చేయాలి ఇకనైనా. అప్పుడు సమస్త అవకరాలను అవనతం చేసి, మన భారత దేశ జాతీయ జెండాని , జెండా తో పాటు అవనతం అయిఉన్న మన తలలను కూడా నింగివైపు ఎత్తి, స్వేఛ్చగా, ఆత్మస్థయిర్యంతో, ఆత్మవిశ్వాసంతో, జెండా వందనం చేయవచ్చు.

విమల సాహితీ పాఠకులకు 76 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో..

మీ…

రోహిణి వంజారి
సంపాదకులు
9000594630

Leave a Comment