సంఘర్షణ

నేను వ్రాసిన క్రింది కవిత “సంఘర్షణమాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.

” నిరంతర ఘర్షణ
క్షణ క్షణం కీచులాట
నాలోని నాస్తిక,
ఆస్తికత్వాలకు…
తక్కెడలో తూకపు వస్తువుల్లా
ఒకసారి నాస్తికత్వం పైకొస్తే
మరోసారి ఆస్తికత్వానిది
పై చేయి అవుతుంది…
అరాచకాలు,అబలల
ఆక్రందనలు, పసిమొగ్గల
చిదిమివేతలు చూసినపుడు
మనిషి ఉలితో చెక్కి దేవుణ్ణి
చేసిన రాతిబొమ్మ
హృదయం లేని పాషాణమే
అని నాలోని నాస్తికత్వం
వేదనతో గొంతు చించుకుంటుంది…
మళ్ళీ ఎక్కడో ఓ చోట
ఓ కామాంధుడికి శిక్ష పడి
ధర్మం గెలిచిన నాడు
పాషాణంలా పడిఉన్న
రాతి బొమ్మకు చలనమొచ్చి
ధర్మ సంరక్షణ కావించిందని
నాలోని ఆస్తికత్వం ఆనందంతో
చిందులేస్తుంది…
మళ్ళీ రేపొద్దున ఏవో అరాచకాలు, ఎక్కడో
ఆక్రందనలు వినిపిస్తాయి
షరా మామూలే అన్నట్టు
నాస్తికత్వం మళ్ళా నాలో
మేల్కొంటుంది…
నిరంతర ఘర్షణే ఇక నాలోని
నాస్తిక,ఆస్తికత్వాలకు
అంతమే లేకుండా “