షీ

షీ.. ఈ కథలో పాత్రలకి పేర్లు లేవు. ఇది అందరికత. బహుళ త్రైమాసిక పత్రికలో చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి.

అదిరిపడ్డాను ఒక్కసారిగా..!
మిన్ను విరిగి మీద పడ్డట్టు. ప్యూపాని ని బద్దలు కొట్టుకునిబయటకు వచ్చి , రంగురంగుల లేలేత రెక్కలను చాచి అప్పుడప్పుడే ఎగరడం నేర్చుకుంటూ పైపైకి ఎగిరే ప్రయత్నం చేస్తున్న సీతాకోక చిలుక చిన్ని చిన్ని రెక్కలను విరిచేస్తే, ఎగరలేక నేలమీద పడి గిలగిలా కొట్టుకున్నట్లు గుండెల్లో సుడులు తిరుగుతున్న బాధ.
ఫోటోని, కామెంట్ ని మార్చి మార్చి చూడడం వందోసారి అది. ఇదేమి ఘోరం. ఇదేమి అన్యాయం. గబా గబా ఆ ప్రొఫైల్ ఎవరిదో చూసాను. మెసెంజర్లోకి వెళ్ళాను. చేతులు వణుకుతున్నాయి. రాయాలనుకున్నది టైపు చేశాను. సెల్ ఆపేసి, మంచం మీదికి విసిరేసాను. తడబడే అడుగులతో, అదురుతున్న గుండెలతో హాల్లోకి వచ్చాను. హాలుకి వంటింటికి మధ్య కుడిపక్క మూలన మనిషంత ఎత్తున్న ఫ్రిడ్జ్ తలుపు తీసి, చల్లటి నీళ్ళ సీసా ఎత్తి గడగడా తాగేసాను.
***
జుట్టు పట్టి లాగి ఈడ్చి ముఖం మీద బలంగా కొట్టాడు అతను. ఆ దెబ్బకి విసురుగా పోయి, టేబుల్ కి గుద్దుకుంది ఆమె తల. టేబుల్ అంచు నుదుటికి తగిలి బొటబొటా ఎర్రటి, చిక్కటి నెత్తురు కట్ట తెగిన వరదలా నుదుటి మీదనుంచి కిందికి కారింది.
తల్లికి తగిలిన దెబ్బను, అబ్బాజాన్ ను భయం భయంగా చూసి, తల్లిని హత్తుకుని ఏడుపు ఎత్తుకుంది ఆ పసిపిల్ల. “హిజాబ్ వేయకుండా దాన్ని స్కూల్ కి పంపవద్దని ఎన్ని సార్లు చెప్పాలి నీకు” నిప్పులు చెరుగుతున్నాయి అతని కళ్ళు కొలిమిలో మంటల్లా
“యూకేజీ చదివే ఐదేళ్ల పసిదది. ఇప్పటినుంచే దానికి హిజాబ్ ఎందుకు. కాస్త పెద్దైనాక ఎలాగూ తప్పదుగా అని వేయలేదు” ఆమె కళ్ళల్లో దైన్యం నిస్సహాయంగా పాము నోటికి చిక్కిన కప్పలా.
“చిన్నదని ఇప్పుడు వదిలేస్తే రేపు పెద్దయినాక ఏకు మేకై కూర్చుంటుంది నీలాగే. నేను ఊర్లో లేనపుడు నువ్వు కూడా బురఖా తీసేసి ఆ పక్కింటి ముండలతో తిరుగుతున్నావట కదా. అందుకే నీకీ శిక్ష” ఆమెను హత్తుకుని ఏడుస్తున్న పసిపిల్లను లాగి, ఇద్దరినీ తోసేసి, విసురుగా బయటకు వెళ్ళాడు అతను.
నుదిటి మీది నెత్తురు గాయం కన్నా, అతని మాటలు గుండెల్లో కత్తిపెట్టి మెలితిప్పినట్లై, పసిదాన్ని గుండెల్లో పొదువుకుంది. కన్నీళ్లు ఇంకిపోయి కళ్ళు పొడిబారాయి ఎడారుల్లో నీళ్లు లేక ఎండిపోయిన మడుగుల్లా. ఎన్నాళ్ళు అనుభవించాలి నేను, నా బిడ్డ ఈ నరకం. మందు తాగి వచ్చినప్పుడల్లా అయినదానికీ, కానిదానికీ గొడ్డును బాదినట్లు తనని బాదడం అలవాటు అతనికి. మొగుడనే ఒక్క హక్కుతో బంధించి, పురుగును చూసినట్లు చూస్తాడు తనని. ఎట్లా ఇతని చెర నుంచి తను, తన బిడ్డ బయటపడేది.
***
బెడ్ రూమ్ లోకి వచ్చాను. సెల్ ఫోన్ చూస్తుంటే ఏదో గగుర్పాటు, జుగుప్స కలిగించేదాన్ని చూసినట్లు అసహ్యం, అణుబాంబును చూసినంత భయం కలిగాయి. అయినా మళ్ళీ ఇంకోసారి సెల్ ఫోన్ ని చేతులోకి తీసుకున్నాను. ఆన్ చేశాను. మళ్ళీ మరోసారి ఆ కామెంట్ ని చదివాను. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. ఆ కామెంట్ తర్వాత వరుసగా నాలుగు ఫ్రెండ్స్ విషెస్ చెప్పిన కామెంట్స్ ఉన్నాయి.
‘వీళ్ళు ఆ కామెంట్ ని చూశారేమో..మేడం కి తెలిస్తే ఎంత నామర్ద..! పని గట్టుకొని నేను అడగడం ఏంది, మేడం అంగీకరించడం ఏంది. ఛీ ఛీ.. ఇంకా ఎవరు చూడక ముందే కామెంట్ ని డిలీట్ చేసేయాలి. అనుకున్నదే తడవుగా కామెంట్ దగ్గర నొక్కి పట్టుకుని డిలీట్ సింబల్ రాగానే నొక్కేసాను. కామెంట్ ఎగిరిపోయింది. కామెంట్ అక్కడ నుండి మాయం అయింది కానీ సరాసరి నా మనసులోకి వచ్చి తిష్ట వేసింది. ఎంత డిలీట్ చేద్దామన్నా సాధ్యం కావడంలేదు.
చేతిలో సెల్ మోగింది “హలో..ఏం చేస్తున్నావే..! నీ పోస్ట్ దగ్గర ఆ కామెంట్ ఏంటే..? మేడం చూసి ఉంటారు. ఎంత బాధ పడుతుందో” పుండు మీద కారం చల్లినట్లున్న దాని మాటలు వినలేక సెల్ ఆఫ్ చేశాను.
బెడ్ మీద పడుకున్నాను. వారం రోజుల నుండి ఆతృతగా ఎదురు చూసాను ఈ రోజు కోసం. నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ పాట గుర్తుకు వచ్చింది. కంగారు నిద్రతో వేకువజామున నాలుగింటికే మెలుకువ వచ్చేసింది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు పొద్దునే తయారై పదిగంటలకు ఒక్క క్షణం అటుఇటు కాకుండా మేడం చెప్పిన సమయానికి ఆమె ముందు ఉన్నాను.
ప్రోగ్రాం గంట పైనే జరిగింది. ప్రోగ్రాం వీడియోని స్క్రీన్ మీద చూపిస్తుంటే అసలు నేనేనా అది, ఎంత అందంగా ఉన్నాను, ఎంత ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పాను. నా మీద నాకే అసూయ పుట్టేలా, అని ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఇక ఎడిటింగ్ అయినాక చూస్తే ఇంకెంత బాగుంటుందని. వెళుతూ వెళుతూ మేడం తో ఫోటో దిగాలన్నాను. సంతోషంగా సరే అన్నారు. మేడం కూడా ఆ యెల్లో డ్రెస్సులో ఎంత అందంగా, హుందాగా ఉన్నారని. ఆత్రంగా ఇంటికి వచ్చి ఫేస్బుక్ లో మా ప్రోగ్రాం గురించి రాయడం ఏంటి, మేడంతో తీయించుకున్న ఫోటో పోస్ట్ చేయడం. ఎంత ఎగ్సైట్మెంటని.
ఈ సంతోషం రాత్రి వరకు కూడా మిగల్లేదు. కోపం, బాధ..ఎలా..? ఏం చేయగలను నేను. సెల్ ఆన్ చేశాను. మెసెంజర్ ఓపెన్ చేసి చూసాను. చేతులు తడబడుతున్నాయి. ఇందాక పోస్ట్ దగ్గర కామెంట్ చేసినవాడు. మెసెంజర్ లో నేను రాసిన దానిగా జవాబుగా వరుసగా ఐదారు మెసేజ్లు. అతి వక్రంగా, అతి రోతగా, అతి జుగుప్సాకరంగా. కాసేపు బుర్ర పని చేయలేదు. కోపం, రోషం స్థానే నిస్సత్తువ ఆవరించింది నన్ను. వెంటనే మెసెంజర్ బ్లాక్ చేశాను. ఇంతలో వాట్సాప్ నుంచి మెస్సేజ్లు. ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే విధంగా. మెసెంజర్ బ్లాక్ చేసానని ఇక్కడికి వచ్చినట్లు ఉంది. ఇక్కడా బ్లాక్ చేశాను ఆ నెంబర్ ని.
బెడ్ మీద పడుకుని దిండులో ముఖం దాచుకున్నాను. కన్నీళ్లు దిండుని తడుపుతున్నాయి. ఎంత పొగరు. ఎంత లేకీ తనం. నేనేం చేయలేనా. మైండ్ బ్లాంక్ అయింది. నిద్ర కూడా దూరం అయింది.
అన్యమనస్కంగా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి, మా టీం లీడర్ కి మెయిల్ చేశాను. తల మిగిలిపోతోంది ఆలోచనలతో. కాంటీన్ కి వెళ్లి వేడివేడి కాఫీ తాగాలనిపించింది. సిస్టం క్లోజ్ చేసి, మేనేజర్ కి చెప్పి కాంటీన్ వైపు నడిచాను.
వెనుకే వచ్చింది తను. ” ఏంటే..వాడు..ఆ రోగ్, మేడం గురించి అంత నీచంగా కామెంట్ పెడితే నువ్వు వాడిని ఊరికే వదిలేస్తావా..? “
“మరి ఏం చేయను చెప్పు”
“వాడిని అలా వదిలేస్తే, మనం చేతకానివాళ్ళం అనుకుంటాడు. ఈసారి ఇంకొ అమ్మాయి గురించి నీచంగా కామెంట్ చేస్తాడు”
“అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనం. ఏం చేయగలం మనం వాడిని ” ఎడతెగని ఆలోచనలతో తల పగిలిపోతోంది. ఆ నీచుడిని తల్చుకుంటే గుండె భగ్గున మండుతోంది. నాకు శక్తి ఉంటే ఆ మంటల్లో వాడిని నిలువునా తగలబెట్టాలని ఉంది. రేపు ఏం జరుగుతుందో అనే ఆత్రుత మొదలైంది మా ఇద్దరిలో.
***
బంజారా హిల్స్ ఏరియా లోనే పెద్ద పబ్ అది. లోపల డీజే సౌండ్ చెవులు చిల్లులు పడేలా మ్రోగిపోతోంది. అంతా ఫారెన్ సరుకే. తాగేవాళ్ళు తాగుతున్నారు. తినే వాళ్ళు తింటున్నారు. మందేసి, చిందేసి మత్తులో ఊగిపోతున్నారు మరికొందరు. అప్పటికే ఫుల్ బాటిల్ విస్కీ అతని కడుపులోకి పోయి అక్కడ తకిట తధిమి ఆడుతోంది. ముద్ద ముద్ద మాటలతో
“డార్లింగ్..ఆ గుండెల మీద చున్నీ ఎందుకు. నీ అందాల్ని కప్పేసే ఆ చున్నీ వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు” బలంగా కుడిచేత్తో చున్నీని ఆమె గుండెలమీద నుంచి లాగి పక్కకు విసిరేసాడు అతను.
అతని ఎడం చేతిని బలంగా పట్టుకున్నారు వెనుకనుంచి ఎవరో.
తల తిప్పి చూసాడు. అతని చేతిని పట్టుకుంది ఆమె. పోలీస్ శాఖలో రాష్ట్ర షీ టీమ్స్ ఉన్నత అధికారి. ఆమె వెనుకే నలుగురు లేడీ కానిస్టేబుల్స్.
” ఆ నీచుడిని అరెస్ట్ చేయండి మేడం” అరిచింది ఆమె
అతను తేరుకునేలోగానే అతని రెండు చేతులకు బేడీలు వేసింది లేడీ కానిస్టేబుల్
“అడ వాళ్ళు అంటే అంత చులకనగా ఉందిరా నీకు..? సోషల్ మీడియా లో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి నువ్వు చేసిన నీచపు కామెంట్స్ కి,నీమీద చాల మంది అమ్మాయిలు కంప్లైంట్స్ చేసారు. నీమీద ఎఫ్. ఐ .ఆర్ నమోదు అయింది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం”
ఈడ్చుకెళుత్తోంది అతడిని పోలీస్ వాన్ దగ్గరకు కానిస్టేబుల్.
వ్యాన్ కి కాస్త దూరంగా పసిబిడ్డను ఎత్తుకుని ఆమె. కళ్ళు ఒత్తుకుంటూ.
“ఇంకో మాట. రోజు తాగి వచ్చి ఇంటిదగ్గర భార్య,బిడ్డను కొడుతున్నావని, బానిసలుగా చూస్తున్నావని, నీ భార్య గృహహింస కేసు నీ మీద పెట్టింది. ఈ రెండు కేసుల్లో బలమైన సాక్షాలు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. నీకిక కటకటాల మధ్య చిప్పకూడే గతి. ఎక్కరా వ్యాన్. ముందుకు బలంగా తోచింది షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ మేడం వాడిని.
నా కళ్ళల్లో వాడిమీద విజయం తాలుకు తృప్తి కదలాడింది ఆ క్షణం

2 thoughts on “షీ”

  1. Excellent stories simple style with meaningful advice.Your stories are inspiration to many and I wish to listen more and more from your pen.

    Reply

Leave a Comment