నెల్లూరు లో ప్రముఖ వైద్యులు డా. ఈదూరు సుధాకర్ గారి అకాల మరణానికి చింతిస్తూ ఆయన స్మృతి చిహ్నంగా రాసిన ఈ కవిత “శ్వేత గులాబీల తోట” విశాలాక్షి మాస పత్రికలో మే 2019 సంచికలో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.
————————————————————————————————————————–
శ్వేత గులాబీ తోట చిన్న బోయిందిపుడు.
తోటమాలి చిరునవ్వుల పలకరింపు లేక
ఒక్కొక్క పాదులో ఒక్కో మొక్క వేసి
, చెట్టు చెట్టుకు ఒక్కో పేరు పెట్టి,
స్పర్శ, ప్రకృతి, స్వర్గం,బడి,గుడి
మాతృత్వం, మానవత్వం అంటూ
ఎంతో ముద్దుగా పేర్లు పెట్టుకున్న గులాబీ తోట
ఇపుడు మోడు బారి పోయింది.
ప్రేమగా తోటను పెంచిన తోటమాలి,
హఠాత్తుగా నింగికెగసి చుక్కల్లో కలిసిపోతే
పలకరించే దిక్కు లేని గులాబీలన్నీ
వాడి పోయాయిపుడు..
మానవతావాది, స్నేహశీలి,
పేదల వైద్యుడు, చిత్రకారులు,
కవితా కోకిల చిరునవ్వుల డాక్టర్ సర్
చెప్పాపెట్టకుండా సెలవంటూ వెళ్ళిపోతే,
ఆయన నిర్మించుకున్న స్నేహ లోకం శోక సంద్రమైంది .
ఆయన గీసిన రంగుల చిత్రాలన్నీ
కళతప్పి శూన్యాన్ని పులుముకున్నాయి..
ఆయన కవితా బిడ్డ శ్వేత గులాబీ తోట
మీదకు దిగులు మేఘం కమ్ముకుని
తెల్ల గులాబీలన్నీ చీకటి రంగుని
అద్దుకుని వెలవెల పోయాయిప్పుడు.
(డా. ఈదూరు సుధాకర్ గారి అకాల మరణానికి చింతిస్తూ…)