మే నెల విశాలాక్షి పత్రికలో నా కవిత “శాంతి కపోతాలు ఎర్రబడవా..!”. ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో ..



అక్కడి కుంకుమ పూల ఖరీదెక్కువ
ప్రాణాల విలువ మాత్రం చాల తేలిక..
అక్కడి కొండ కోనల్లో వినిపించే తుటాల ధ్వని
గుండె గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటుంది..
అక్కడి చెట్టు చేమ మౌనంగా రోదిస్తుంటాయి
వాగూవంకా నెత్తుటి ప్రవాహాలై విహ్వలిస్తుంటాయి..
గూడు విడిచి పిట్టలన్నీ చెట్ల కొమ్మల్లో
రేయిపగలు మరచి విషాదగీతాలు ఆలపిస్తుంటాయి..
మంచుముద్దల హిమ గిరులు కన్నీరై కరిగి
మున్నీటి ధారాలై ప్రవహిస్తుంటాయి
కరగని కర్కశ హస్తాలు ద్వేషపు నెగళ్ళను ఎగదోస్తూంటాయి..
మనుషులొద్దు మతమే ముద్దనే తావు
దురాక్రమణే లక్ష్యంగా మోగే తుపాకులు
ఆహ్లాదమని వెళ్ళిన చోట ఆరిపోయే ప్రాణాలు..
ఎరుపంటేనే బెంగ ఇప్పుడు
ఎర్రటి కాశ్మీరీ ఆపిల్
రక్తవర్ణపు కుంకుమ పువ్వు
మెరుపులీనే అరుణకాంతుల శాలువా
దేన్నీ చూసినా భయమే..
భర్త నెత్తుటి తడితో తడిసి జడిసే భార్య
నాన్న కోసం విలపించే కొడుకు..
నుదిటి మీది ఎర్రటి బొట్టు
విద్వేషపు చిహ్నంగా
మరణశాసనాన్ని లిఖిస్తుంటే..
భూతల స్వర్గమనుకున్న చోట
భూతాలు తిరుగాడుతుంటే..
ఐక్యమత్యమే మహాబలం
అనుకునే శాంతికపోతాలు ఎర్రబడవా ఇక..
రోహిణి వంజారి
9000594630