శతకోటి వందనాలు

ప్రతిష్టాత్మకమైన “అమ్మకు అక్షర నైవేద్యం” కవితా సంకలనం లో చోటు చేసుకున్న నా కవిత ” శతకోటి వందనాలు”. శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి, శ్రీ ఉడతా రామకృష్ణ గారికి ధన్యవాదాలతో..🙏🌹 అమ్మకు వందనాలు. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగోరుతూ..🙏🌹

ఆషాఢమాసాన అరుదెంచే సింహవాహినీ
శతకోటి వందనాలమ్మా నీకు…
పల్లె అయినా, పట్టణమైనా, ఆలు బిడ్డలు తోడ
అప్ప చెల్లెళ్ళ తోడ నీ దరికి చేరుతామమ్మా
కరుణించవే మా అమ్మా మహంకాళీ
శతకోటి వందనాలమ్మా నీకు…
శివ సత్తులు, పోతురాజు వెంటరాగా
నీకు బోనమెత్తుతానమ్మా..నా ఆడబిడ్డల
మాన,ప్రాణాలు కాపాడవే జగదాంబికా
శతకోటి వందనాలమ్మా నీకు….
వేపాకు,కుంకుమ, కడి తోటి
అలంకరించి బోనం కుండపై దీపముంచి
నిన్ను కొలిచేమమ్మా..మా ఇంటిని
దీపకాంతులతో నిలుపవే నా తల్లి
శతకోటి వందనాలమ్మా నీకు…
అన్నం,పాలు,బెల్లం, ఉల్లిపాయల
బోనాలని నిండుగా వండి
డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు చిందులతో
మా వెంట రాగా, బోనాన్ని తలపైనెత్తుకున్న
మా ఒంటిలోకి నువ్వొచ్చి పూనాలి నా తల్లి..
ఆడబిడ్డలపై అకృత్యమొనరించే
నికృష్టపు మృగాళ్ళ పీచమణచడానికి
ఎల్లమ్మ,మారెమ్మ, మైసమ్మ, పోచెమ్మ
పెద్దమ్మ, డొక్కాలమ్మ,ఆంకాళమ్మ, పోలేరమ్మ
నీ అన్నీఅంశలు మాలోన నింపి
రౌద్రాన్ని చిందించే భద్రకాళివై నీవు
మాకండగా ఉండాలి నా తల్లి
శతకోటి వందనాలమ్మా నీకు…
నిర్భయలు, దిశలు చుక్కల్లోకెక్కినారు
మరే ఆడబిడ్డ మాన, ప్రాణాలు
ఆ లెక్కన పోకుండా ఈ పండుగ నాడు
నీవు అడ్డుకట్ట వేయాలి నా తల్లి
బంగారు సింహవాహినీ
నీకు బొనమెత్తుతానమ్మా, మా ఆడబిడ్డల
మాన,ప్రాణాలు కాపాడవే నా తల్లి
శతకోటి వందనాలమ్మా నీకు…