విరిగిన తల

విరిగిన తల. ఎవరి తల ..? ఎందుకు విరిగింది..? తెలుసుకోవాలంటే ఈ రోజు “ప్రజాశక్తి ఆదివారం అనుభందం స్నేహ పత్రిక” లో ప్రచురితం అయిన కథ “విరిగిన తల” చదవాల్సిందే. “ప్రజాశక్తి ” సంపాదకులకు ధన్యవాదాలతో.. విరిగిన తల చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుతూ..

డుగు డుగు డుగు డుర్ డుర్.. డుర్ర్ర్..
‘ కీ ‘ ఇచ్చి వదిలిన స్కూటర్ బొమ్మ ఇల్లంతా పరుగులు తీస్తోంది. బొమ్మ వెనుకే పరుగు తీస్తున్నాడు ఐదేళ్ళ చిన్నారి చైతన్య. భలే భలే అంటూ చప్పట్లు కొడుతూ బొమ్మని, అన్నని మార్చి మార్చిచూస్తూ ఉంది అతని చిట్టి చెల్లి ప్రణతి. పసుపురంగు స్కూటర్ బొమ్మ మీద నల్ల రంగు మనిషి. హెల్మెట్ ఎరుపు రంగు. స్కూటర్ బొమ్మ కావాలని మారాం చేస్తే వాళ్ళ నాన్న దయాకర్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కొని తెచ్చాడు స్కూటర్ బొమ్మని.
ఈ సారి ‘ కీ ‘ చాల సేపు తిప్పి బొమ్మని చాల గట్టిగా వదిలాడు చైతన్య. బాణంలా దూసుకుపోయి గోడని గుద్దుకుని పక్కకి పడిపోయిందది. స్కూటర్ బొమ్మ నుంచి రెండు చక్రాలు విడిపోయి గది మూలకి దొల్లుకుంటూ వెళ్లాయి. ఎర్రటి హెల్మెట్ ఉన్న మనిషి బొమ్మ తలకాయ విరిగి ఇంకో పక్కకి పడిపోయింది. విరిగిపోయిన స్కూటర్ బొమ్మని చూడగానే చిన్నారి చైతన్య గుండె గుబేలుమంది. అన్న ముఖంలో భయం చూసి ప్రణతి పాప కూడా ఒణికి పోయింది.
పోయిన సారి ఆడుకుంటూ తుపాకీ బొమ్మ విరగొట్టినప్పుడు ఇద్దరినీ అమ్మ కొట్టిన దెబ్బలు ఇంకా మరిచిపోలేదువాళ్ళు ఇద్దరు. వాళ్ళ అమ్మ అర్చన ఏదో పని ఉండి బజారుకి వెళ్ళింది. అమ్మ వచ్చేలోగా ఏదైనా చేయాలి. స్కూటర్ బొమ్మకి చక్రాలు అతికించాలని అన్నా, చెల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినాయి. బొమ్మని, విరిగిపోయిన చక్రాలని,బొమ్మ తలని వంటింట్లో ఉన్న అల్మారాలో పాత సామానుల వెనుక దాచేసాడు చిన్నారి చైతన్య.
వాళ్ళమ్మ అర్చన ఇంటికి వచ్చేసరికి ఏమి ఎరగనట్లు పలక మీద బొమ్మలు వేస్తున్నాడు చైతన్య. రైమ్స్ బుక్ చూస్తోంది ప్రణతి. కొత్త బొమ్మతో ఆడుకోవాల్సిన వాళ్ళు ఇలా బుద్ధిమంతుల్లా కనపడేసరికి ఏదో అనుమానం వచ్చింది అర్చనకి.
” స్కూటర్ బొమ్మ ఏది చైతన్య ? అర్చన. ఉలక్కుండా, పలక్కుండా బిత్తర చూపులు చూస్తున్నారు ఇద్దరు. రెట్టించి అడిగేసరికి
” తెలియదు అమ్మా” భయంగా అన్నాడు చైతన్య . తన అనుమానం నిజమవుతున్నట్లు అనిపించి “పాపా..నువ్వు చెప్పు. స్కూటర్ బొమ్మ ఏది ?” తల అడ్డంగా ఊపింది ప్రణతి పాప ఒణికిపోతూ. గట్టిగా అరిస్తే ఏడ్చేటట్లు ఉన్నారు ఇద్దరు. ఎంతసేపు అడిగినా అలా బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తారేంటి. నాలుగైదు సార్లు అడిగి ఇక వాళ్ళ అమాయకమైన ముఖాలు చూసి, అప్పటికి వాళ్ళని ఏమి అనలేకపోయింది ఆమె. వారం రోజులు స్కూటర్ వేగం కంటే ఎక్కువ వేగంతో వెనక్కి వెళ్లిపోయాయి.
స్కూల్ నుంచి రాగానే పాత బొమ్మలు ముందు వేసుకుని ఆడుకుంటున్నారు చైతన్య , ప్రణతి. మరచెంబు కోసం వంటింట్లో అల్మారా మూలలో వెతుకుతోంది అర్చన. తాను వెదికే మరచెంబు మాత్రం కనపడలేదు కానీ, వస్తువుల మధ్యలో ఉన్న స్కూటర్ బొమ్మ కనపడింది. ఆశ్చర్యంగా బొమ్మని తీసి చూసింది. బొమ్మ తల, చక్రాలు రెండు ఊడిపోయి ఉన్నాయి. అంటే ఆడుకుంటునప్పుడు బొమ్మని విరగొట్టి, విరిగిపోయిందని తెలిస్తే తను కొడతానని బొమ్మని ఇక్కడ దాచాడన్నమాట . తాను అడిగేతే తెలియదని వాడు అబద్దం చెప్పడం ఆమెకి చాల కోపం తెప్పించింది. అంత చిన్న వయసులో అబద్దం చెప్పడం బాధ కూడా కలిగించింది. వెంటనే “చైతన్య ” పెద్దగా ఆమె అరిచిన అరుపుకి బిక్కముఖాలు వేసుకుని నిలబడ్డారు చైతన్య , ప్రణతి.
” బొమ్మ ఏమైంది అని అడిగేతే తెలియదని అబద్ధం ఎందుకు చెప్పావు” కోపంతో అర్చన ముఖం జేవురించింది.
” అమ్మా.. బొమ్మ విరిగిపోయిందని చెప్తే నువ్వు కొడతావని భయం వేసింది” భయంగా తల్లి వైపు చైతన్య .
“అందుకని అబద్దం చెప్తావా..! నిజం చెప్తే ఒక్క దెబ్బ కొడతాను. మరి అబద్దం చెప్తే చాల దెబ్బలు పడతాయని నీకు తెలియదా..?” ఈ సారి గట్టిగా అడిగింది ఆమె.
” అమ్మా.. ఆ ఒక్క దెబ్బకి కూడా భయపడి బొమ్మను దాచేసాను ” ఏడుపు ముఖంతో అన్నాడు చైతన్య. వాడిని చూసి ప్రణతి కూడా ఏడవడం మొదలు పెట్టింది.
మొదటిసారి తను చేసిన పొరపాటు గ్రహించింది అర్చన. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ విషయం ప్రేమగా అడిగి తెల్సుకుని ఈ సారి అటువంటి పొరపాటు చేయకుండా తగిన జాగ్రత్తలు వారికి చెప్పాలి కానీ, కొడితే వాళ్ళు దెబ్బలకు భయపడి నిజాన్ని దాచేస్తారు. క్రమంగా వారికి అబద్దాలు చెప్పడం అలవాటు అవుతుంది. నిజం చెప్పినపుడు వాళ్ళ పొరపాట్లను అర్ధం చేసుకుని, నిజం చెప్పినందుకు వారిని మెచ్చుకుని ఇంకోసారి అటువంటి పొరపాటు జరగకుండా వారికి తగిన సూచనలు ఇవ్వాలి . అలా చేస్తే ఇక ఎప్పుడూ వారు అబద్ధం చెప్పరు. పొరపాట్లు చేయడం కంటే అబద్ధం చెప్పడం చాల ప్రమాదం.
ఈ రోజు తన పిల్లల ద్వారానే తను పాఠం నేర్చుకున్నానని వారిద్దరిని చూసి ” ఇంక ఎప్పుడూ మిమ్మలిని కొట్టను. కానీ మీరు ఇంకెప్పుడు అబద్దం చెప్పకూడదు. నిజమే చెప్పాలి. సరేనా ” అంది వారిద్దరిని ప్రేమగా దగ్గరకు తీసుకుని.
“సరే అమ్మా” అంటూ ఆమె ఒడిలో ఆనందంగా ఒదిగిపోయారు ఆ చిన్నారులిద్దరు.

1 thought on “విరిగిన తల”

Leave a Comment