విమల సాహితి ఎడిటోరియల్ 51 – మనిషి, జంతువు సమానమా?

మనిషిని జంతువు నుంచి వేరు చేసి చూపేది ఏమిటి? విమల సాహితీ పత్రిక లో ఈ వారం నా సంపాదకీయ వ్యాసం “మనిషి -జంతువు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

“ఆహార – నిద్రా – భయ – మైథునం చ సమానమేతత్పసుభిర్నరాణామ్
ధర్మోహితేషామధికో విశేషో ధర్మేణ హీనా: పశు: సమానా:”

ఆకలి, నిద్రా, కామం మనుషులకు, జంతువులకు ఒకే విధంగా ఉంటాయి. కానీ జంతువు నుండి మనిషిని వేరుచేసేది, జంతువులకంటే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది ధర్మం. విచక్షణ. అవి లేకుంటే మనిషి మృగంతో సమానం. ధర్మం, వివేకం తో పాటు మనుషులకు భావావేశాలను వ్యక్తం చేసే శక్తి జంతువులకంటే అధికంగా ఉంది. దుఃఖం, క్రోధం, రౌద్రం, సంతోషం లాంటి సంవేదనలను మనుషులు మాత్రమే భాష ద్వారా వ్యక్తం చేయగలరు.

దుఃఖం, క్రోధం లాంటి సంవేదనలు మనిషిని కృంగుబాటుకు గురి చేస్తే, నవ్వు మనిషికి పూర్ణాయువుని ఇస్తుంది.కానీ ఈ ఆధునిక న్యూక్లియర్ సమాజంలో మనిషి నవ్వడం అనే ఒక అద్భుతమైన భావనావేశాన్ని మరచిపోయాడు. ‘జన్మమెత్తితిరా- అనుభవించితిరా’ అంటూ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనో, ఎవరిమీదో కలిగిన ద్వేషంతోనో, ఆరోగ్యసమస్యలతోనో, అనుక్షణం గాయాలను రేపుకుంటూ మనఃశాంతిని కోల్పోయిన మనుషులకు హృదయపు పూదోట ఎలా వికసిస్తుంది? ఆ తోటలో పూసిన పువ్వులు పెదవులమీద నవ్వుల పరిమళాలను ఎలా వెదజల్లగలరు?

పక్కవారి ఎదుగుదల చూస్తే ఏడుపు. సాటి మతస్తుల మీద ద్వేషం, తమకు కలిగిన దానిపైన అసంతృప్తి, లేనిదానికోసం ఆశ,ఆరాటం. శ్రమ, పట్టుదల లోపం. బద్దకాన్ని నెత్తిన పెట్టుకున్న ఆధునిక వసతులు. అందరికంటే తాము మేధావులమని, అధికులమని పదేపదే చేసుకునే స్వకుచ మర్థన. ఎన్ని అడ్డ దారులు తొక్కి అయినా అనుకున్నది సాధించాలని పేరాశ. ఇక మనుషులకు సంతోషం ఎక్కడ ఉంటుంది? పెదాలమీద నవ్వు పువ్వులు ఎలా పూస్తాయి?

మనుషులు క్రమంగా జీవితేచ్ఛను కోల్పోతున్నారు. చిన్న చిన్న సమస్యలకు కృంగిపోతున్నారు. అప్పుల బాధ తో ఓ డాక్టర్ తన భార్య, పిల్లలను గొంతు కోసి దారుణంగా చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషాదాన్ని నాలుగురోజుల ముందే విన్నాం. ప్రజలకు సేవ చేసే డాక్టర్, విద్యాధికులే ఇలా కృంగుబాటుకు గురైతే, ఇక సామాన్య జనాల పరిస్థితి ఏమిటని? సెల్ ఫోన్ కొనివ్వలేదని, పరీక్షలో మంచి రాంక్ రాలేదని విద్యార్థులు, ఆఫీసులో బాసు అరిచాడనో, అప్పులపాలైనామనో, వ్యాపారం దెబ్బతినిందనో, ఎవరో తమని లైంగిక వేధింపులకు గురిచేసారనో, భర్త లేదా భార్య తనని సరిగా పట్టించుకోలేదనో, ఆరోగ్యం సరిలేదనో, డబ్బు చాలడం లేదనో, సైబర్ మోసాలు ..ఎన్ని సమస్యలు..! ఇప్పటి ఆధునిక తరం మనుషులకు. నిజమే. కాదనలేము. ఇవ్వన్నీ సమస్యలే. మనుషులకు వచ్చేవే. మనుషులు కాబట్టే వచ్చేవి. ఏ చెట్టుకో, పుట్టకు, రాయి రప్పకు ఇటువంటి సమస్యలు రావు కదా. సమస్య వచ్చిందని కృంగిపోయి, ఆత్మ నూన్యతతో, పిరికితనంతో జీవితేచ్ఛ కోల్పోయి, చలనం లేని బండ రాళ్ళలాగా, చైతన్యం లేని జీవులలాగా బతుకీడిస్తే, ఇక మనిషికి సంతోషం, నవ్వులు ఎక్కడ ఉంటాయి?

ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ, గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటారు. పెద్ద పెద్ద ఆశలకు పోయి, చిన్న చిన్న ఆనందాలను కోల్పోతారు. మనుషులు నవ్వడం అనే సంవేదననే మరచిపోతారు. “ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్” అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. అందుకే మనుషులు నవ్వాలి. సమస్యలు చీకటివెలుగుల్లా వస్తూ, పోతూ ఉంటాయి. చిన్న చిన్న ఆనందాలను తనివితీరా అనుభవించాలి. ఎదుటివాడు బాగుపడితే మనకేమి నష్టం లేదు కదా. వారి బాగు చూసి సంతోషించాలి. లేదు మనము మన విజయం కోసం ప్రయత్నించాలి. స్వచ్ఛమైన మనసుతో ఎదుటివారిని ప్రేమించగలగాలి. ఉదయించే సూర్యుడిని చూసి చైతన్యులం కావాలి. మంచులో తడిచి, అరవిరిసిన గులాబీ పరిమళాన్ని గుండెలనిండా పీల్చుకోవాలి. ఆరుబయట పడుకుని వెన్నెల్లో చందమామను చూస్తూ, పిల్లల్లో పిల్లలుగా మారి కథలు చెప్పుకోవాలి. వాన నీటిలో కాగితం పడవలు వదిలి, అవి ఏ దూర తీరాలకో కొట్టుకుపోతుంటే పసిబిడ్డలా చిందులు వేయాలి. ఇంట్లో ఇష్టంగా పెంచుకున్న కుక్కో, పిల్లో ఒడిలోకి వచ్చి కూర్చుంటే, కాస్త దాని వీపు నిమిరిన సంతోషంలో ఆ పిల్లి పిల్ల సంతోషంతో తన చెవులను నీ బుగ్గలకు రుద్దుకుంటే, ఆహా..జీవితానికి ఇంతకు మించిన ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుందని..!

పెద్ద ఛారిటీ హోంలు నడపపల్లేదు. మన ఇంటి ముందుకు వచ్చి సాయమడిగినవారికి లేదు అనకుండా మన శక్తిమేర సాయపడితే చాలు కదా. ఇంటి ముందుకు ఆకలితో వచ్చిన పక్షికో, మరే జంతువుకు అన్ని గింజలో, అంత అన్నమో పెట్టి చూడు. వాటి కళ్ళల్లో కృతజ్ఞత చాలు మనజీవితానికి తృప్తి లభించడానికి. ఉన్నదానితో తృప్తి, చిన్న చిన్న ఆనందాలు కలగలిస్తే నవ్వులుకూడా వాటంతటవే హృదయంలోనుంచి పొంగుకొని వచ్చి, పెదాలమీద నర్తిస్తాయి. అసలు మనిషి నవ్వడం కోల్పోతున్నాడని చింతించి, 1988 లో డాక్టర్ మదన్ కటారియా ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రారంభించారు. తెలియని వ్యక్తిని కూడా నవ్వుతో పలకరిస్తే సానుకూల భావన వస్తుంది. మనవాళ్లే అనిపిస్తుంది. ఒత్తిడిలో, ఆందోళనలో ఉన్నప్పుడు నవ్వేలా వస్తుంది అనుకోవచ్చు. కానీ బాధాకరమైన పరిస్థితుల్లో కూడా జీవితంలో జరిగిన ఆనందకరమైన క్షణాలను, నవ్వు తెప్పించే విషయాలను నెమరు వేసుకుంటే, బాధల గాయాలకు ఉపశమనంలా నవ్వులు మలాము పూస్తాయి. ఎక్కువ నవ్వేవాళ్లకు సానుకూల హార్మోనులు విడుదలై ఆయువు కూడా పెరుగుతుంది.

నవ్వు నాలుగు విధాలా చేటు కాదు. నవ్వు నలభై విధాలుగా లాభకారి. అందుకే జీవితంలో హాస్యానికి పెద్ద పీట వేశారు. చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ లాంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హాస్య నటులు తమ జీవితంలోని విషాదాలను గుండెల్లో దాచి,ప్రపంచానికి నవ్వుల విందు ఇచ్చారు.”నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం” అన్నారు మన తెలుగు సినీ హాస్య దర్శకులు జంధ్యాల. కాబట్టి జీవితంలో వస్తూ,పోతూ ఉండే సమస్యలను కాసేపు పక్కన పెట్టి మనసారా నవ్వుకుందాం. పసి పాపలా నవ్వుకుందాం. నవ్వుల పువ్వులమై పరవశించిపోదాం.

మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా విమల సాహితీ పాఠకులకు వేనవేల నవ్వుల శుభాకాంక్షలు.

రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630