విమల సాహితి ఎడిటోరియల్ 50 – రాముడినైనా, అల్లానైనా కీర్తిస్తూ కూర్చుంటామా?

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నేను రాసిన సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
దేవుళ్ళందరినీ కీర్తిస్తూ కూర్చుంటామా..?

ఒక్క రోజు తేడాలో ఒకదానితర్వాత ఒకటి వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయి ఉగాది, రంజాన్ పండుగలు. ఆ తర్వాత శ్రీరామ నవమి వచ్చి వెళ్ళింది. అసలు పండుగలు ఎందుకు? పండుగలు మనకి ఏం చెప్తున్నాయి? పండుగల పరమార్ధం ఏమిటి?

కొన్ని దశాబ్దాల ముందు ఏదైనా పండుగ వస్తోందంటే ఊరు ఊరందరికీ చేతినిండా పని. వినాయక చవితి వచ్చిందంటే అచ్చుల్లో బంకమట్టి వేసి గణపతి బొమ్మ చేసే కుమ్మరి రమణయ్య నుంచి ఎండ పెట్టిన ఆ గణపతి ప్రతిమకు రంగులద్దే రహీం సాహెబ్ వరకు, అందరికీ సంబరమే. మొహరం పండుగ వచ్చిందంటే పీర్లు ఎత్తడానికి ఊరంతా పోటీలు పడేవాళ్ళు. అప్పటి మనుషుల్లో మచ్చుకైనా కానరాని మత దురహంకారం. మనిషిని మనిషి ప్రేమించే తత్వం. వినాయకుడి కుడుములు ఊరంతా చేరేవి. షీర్ కుర్మా ఘమఘమలు పక్క ఊర్లకు కూడా పాకేవి. మరి ఈనాడు ‘ఏవీ నిరుడు కురిసిన హిమ సమూహాలు” అని గత వైభవానికి మురిసి , నేటి దుస్థితికి వగచి. నిజంగా మతసామరస్యం అంతా గతకాలపు జలతారు వెన్నెలేనా? మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ? సమాజంలో మనుషులు దేనికి విలువ ఇస్తున్నారు?

ఈనాడు మన సమాజంలో ఏదైనా పండుగ వస్తోందంటే కాళ్ళల్లో వణుకు పుడుతోంది. గుండెల్లో రైళ్ళుపరిగెడుతున్నాయి. ఏ మతోన్మాద శక్తులు ఎక్కడ నుంచి దూసుకు వస్తాయో! ఏ పచ్చని పందిరికి నిప్పు పెడతారో, ద్వేషంతో రగిలిపోతూ ఎన్ని దూషణ తీరస్కారాలు ఎదుర్కోవాలో అని ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. పండుగలనాడు ఆలింగనాలు, అలయ్ బలయ్ చెప్పుకుంటూ సరదాగా విందుభోజనాలు ఒకరికొకరు పంచుకుంటూ అందరం ఒకటి అనుకునే సామరస్య ధోరణికి పాతరేసి, మత విద్వేషాలతో ఒకరినొకరు దూషించుకుంటూ, కొట్టుకు చచ్చే రోజులు దాపురించాయి ఈనాడు సమాజంలో. సామాజిక మాధ్యమాల్లో కూడా పండుగలు వస్తే చాలు. తమ గొప్పలు చెప్పుకుంటూ, ఇతరులను కించపరిచే చిల్లర జోకులు, మత ద్వేషంతో పోస్టులు పెడుతూ, మనిషిని మనిషిగా కాక, కుల మతాలను బట్టి మనుషులను వేరు చేసి పచ్చగా ఉన్న చేలకు, చిచ్చు పెట్టే కలుపు మొక్కల్లాంటి మనుషులు అంతటా విస్తరించారు . మొన్న ‘శ్రీరామనవమి’ రోజున శ్రీ రాముడిని బాబా సాహెబ్ అంబేద్కర్ కాలితో తొక్కిపెట్టి ఈడ్చుకు వెళుతున్నట్లు ఫోటో, దానికింద కొన్ని విద్వేషపు మాటలు పోస్ట్ చేసారు కొందరు నీచులు. ఆ పోస్ట్ వైరల్ అయింది. అలాగే రంజాన్ పండుగ నాడు కూడా కొన్ని మతదురహంకార దుష్ట శక్తులు అనుచిత వాఖ్యాలతో పెట్టిన పోస్టులు కూడా ట్రోల్ అయినాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి? మతోన్మాద శక్తులు దేశమంతటా కలుపు మొక్కల్లా వ్యాపిస్తే ఏమైపోతుంది ఈ భరత ఖండం?

ఇక్కడ విచారించాల్సిన సంగతి ఒకటి ఉంది. కొందరు రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉంటూ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకులు కొందరు బహిరంగసభల్లో, ఎన్నికల ప్రచార సభల్లో, పనిగట్టుకుని కొన్ని మతాల మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈసారి ఎన్నికల్లో అటువంటి నాయకులకు పదవులు దక్కకుండా, నీతి, నిజాయితీ, పరమత సహనం, కులాలు, మతాల వారిగా కాదు. మనుషులంతా సమానం అని చెప్పి. ఆచరణలో చూపించే నాయకులను ఎన్నుకోవడంమీద ప్రజల బాధ్యత. లేకపోతే కలుపు మొక్కల్లాంటి మనుషులు, నాయకులు దేశంలో మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి, మారణహోమం సృష్టించి దేశాన్ని దుంపనాశనం చేస్తారు .

అసలు గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రాముడు, అల్లా, జీసెస్ లాంటి మహనీయులు ఏం చెప్పారో తెలుసుకోకుండా గుడ్డిగా, గొర్రెల మందల్లా ఒకరిని విమర్శించడమేనా మనుషుల పని? మహనీయులైన వారు ఎవరూ సాటి మనిషిని ద్వేషించమని చెప్పరు.

సర్వమతాల సారం మానవత్వం. సాటి మనిషిని ప్రేమించడం. సాటి జీవులను ప్రేమించడం. ఎదుటి మనిషిని లేదా జీవిని హీనంగా చూడమని ఏ మత గ్రంథం చెప్పలేదు. “ఆత్మవత్సర్వ భూతాని” అని గీతాచార్యుడు చెప్పనట్లు ప్రతి జీవిలోను, తన రూపం ఉంది, తనలాంటి ఆత్మే ఉంది అనుకున్నవారికి తరతమ బేధాలు తెలియవు. నువ్వు నేను వేరు వేరు అనే అన్యత్వ భావన నుండి అందరం ఒకటే అనే అనన్య ఆత్మ భావన వైపు ప్రతి ఒక్కరి మనసు మరలాలి. “నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు” అన్నాడు యేసు ప్రభువు. పొరుగు వారు అంటే మన పక్కింటి వారే కాదు. మన సమాజంలో ఉండే ప్రతి వారు. మహాత్ములను మాటలను అనుసరించడమే కాదు. లోకకళ్యాణానికి వారు ఏమి చెప్పారో తెలుసుకుని, వారు చూపించిన సన్మార్గాన్ని అనుసరించాలి. ఆచరణాత్మకం చేయాలి. మంచితనాన్ని, మానవత్వాన్ని, ప్రేమను విశ్వ వ్యాప్తం చేయాలి. ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడాలి. ఆ మహనీయుల బోధనలను అనుసరించి సత్యం శాంతి ధర్మం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులు కావాలని కోరుకుందాం. కులాల మతాల కుమ్ములాటలను వదిలి విశ్వశాంతిని ఆకాంక్షిద్దాం.

రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630