విమల సాహితి ఎడిటోరియల్ 33 – సర్వసత్తాక – సామ్యవాద – ప్రజాస్వమ్య – లౌకిక – గణతంత్ర…!!

“సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర” ఈ నాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి

భారత ఖండం ప్రపంచదేశాల మధ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. అపారమైన ప్రకృతి వనరులు, ఖనిజాలు, జంతు, వృక్ష సంపదలు కలిగిఉన్న దేశం మనది. ఈ సంపదలతో పాటు అసంఖ్యాకమైన మానవ వనరులు కలిగినది మన హిందూస్తాన్. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు అంతా మనదే. అంతా మనకే. ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరంలో ఎన్నో పోరాటాలు సాగించి, మరెన్నో త్యాగాలు చేస్తే వచ్చినది భారత దేశానికి తెల్ల దొరల నుంచి విముక్తి. స్వాతంత్రం వచ్చిన తొలిదశలో ఎన్నో అవకతవకలతో, అస్తవ్యస్తంగా ఉంది మనదేశ పరిస్థితి. దేశ విభజన కోలుకోలేని దెబ్బ. అన్నదమ్ములను విడదీసే కుతంత్రం. జరిగిపోయింది. అంతటా అశాంతి. ఇటువంటి పరిస్థితుల్లో పొరుగు దేశాల పాలనలను పరిశోధించి, ఎంతో శ్రమకోర్చి, ఎన్నో అవమానాలను తట్టుకుని గౌరవనీయులు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ సభ మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు. అది 1950జనవరి 26 న ఆమోదం పొందిందిన రోజుగా భారత దేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

రాజ్యంగంలో వ్యక్తి స్వాతంత్య్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వేచ్ఛ తో పాటు పౌరులకు ఎన్నో భాద్యతలను ఆదేశ సూత్రాల రూపంలో అప్పజెప్పింది రాజ్యాంగం. అయితే ఆ స్వేఛ్చను నేడు దుర్వినియోగం అవుతోందా..? బాధ్యతల పట్ల నిరాసక్తత చూపిస్తున్నామా..? ఇలా దేశ ప్రజలు మారడానికి కారణాలు ఏమిటి..? ఒకప్పుడు దేశమంతా ఒకటే నినాదం ఉండేది. “జై భారత్” అని. ఇప్పుడు నినాదాలు మారుతున్నాయి. కొత్త కొత్త నినాదాలు పుట్టుకొస్తున్నాయి. కులానికొక, మతానికొక, వర్గానికొక నినాదం పుట్టుకొస్తోంది. వ్యక్తి స్వేఛ్చకు భంగం కలుగుతోంది. రాజ్యంగంలో లిఖించినట్లు వ్యక్తులు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అనే మత స్వాతంత్య్ర హక్కు మరుగున పడిపోయిందా. ఇదివరకెన్నడూ లేనంతగా మత ఘర్షణలు, హింస పెచ్చుమీరిపోయినాయా. రాజ్యాంగ విరుద్ధంగా గ్రామాల్లో, పట్టణాల్లో అంటరానితనం వికృతంగా కోరలు చాస్తోందా. ఈ ప్రశ్నలలో కొంత నిజం ఉందనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని ఊర్లలో కులాలు చూసి ఇల్లు అద్దెకివ్వడం ఇప్పటికీ ఉందనేది కాదనలేని సత్యం. ఫలితంగా బాధిత వర్గాలు మతమార్పిడులకు బలవత్తరమైన పరిస్థితుల్లో లోనవుతున్నారు.

ప్రజల ఆకాంక్షలను, ప్రజాస్వామ్య బద్దమైన ధోరణిని వదిలేసి, మత ప్రాముఖ్యమైన పాలనగా మారుస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు. లౌకిక రాజ్యం అనే అర్ధాన్ని మార్చేసి అధికార కేంద్రీకృత రాజ్యంగా మారుస్తున్నారనేది కూడా వీరి అభియోగం. వీరి ఆరోపణలలో అభియోగాలలో వాస్తవం ఎంతో సామాన్య పౌరులకు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసునే వెసులుబాటు ఈ కాలంలో ఉంది.

ఒకరి వేషభాషలు, ఆహారపు అలవాట్లు ఇంకొరకు ద్వేషిస్తూ ఇప్పటికే రెండు ముక్కలైన దేశాన్ని అద్దాన్ని నేలకేసి కొట్టినట్లు ముక్కలు, చెక్కలు చేస్తున్నారు. ఇదంతా పాలకులు సమూహాలకు గుంపులకు ఇచ్చిన అలుసా అనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. ఇటీవలి కాలంలో మణిపూర్లో జరిగిన గొడవలు, మాతృమూర్తుల స్థానంలో ఉన్న స్త్రీ మూర్తులను నగ్నంగా వీధుల్లో ఊరేగించడం, మత ఘర్షణల్లో సర్వం కోల్పోయిన బిల్కిస్ బానో లాంటి అమాయకుల అంతులేని ఆక్రోశం.. ఎవరో అన్న మాటలకు మద్దత్తు పలికాడని వ్యక్తి తలనరికి చేతిలో పెట్టారు కొందరు ఉగ్రవాదులు. ఇదా మహనీయులు కలలుగన్న సర్వసత్తాక, లౌకిక దేశం..

అధికార మధాంధులు, స్వార్ధపరులు, కులమతాల పట్ల పక్షపాత వైఖరి చూపేవారు ప్రజలను విడగొడుతుంటే, ప్రజలు ఇంకా అమాయకంగా, గొర్రెదాటుతనంతో మోసపోతూనే ఉన్నారు. అధికారం కోసం, పదవుల కోసం రాజకీయ నాయకులు వేసిన ఉచ్చులో తాము బంధింపబడ్డాము అని ప్రజలు తెలుసుకోనంతవరకు దేశంలో మత ఘర్షణలు, అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. సుపారిలు ఇచ్చి దుండగులచేత అరాచకాలు చేయించే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి నాయకులను దించివేయడానికి సామాన్య ప్రజలకు ఉండే ఒకేఒక్క బలమైన ఆయుధం ఓటు.

మాకు కులాలు వద్దు, మాకు మతాలు వద్దు. అవి ఎక్కించే మత్తు వద్దు. అవి కూర్చోబెట్టే పీఠాలు వద్దు. మాకు దేవుళ్ళ పేరుతో విద్వేషాలు వద్దు. మనుషుల్లో దైవత్వం నింపగలిగితే చాలు. మా పేర్ల చివరన తోకలు వద్దు. మేమంతా మనుషులమే. మా మధ్య మత చిచ్చు రగిలించి, మమ్మల్ని విభజన చేయకండి.

మాకు కావాల్సింది..

“మాకు జ్ఞానాన్ని అందించే బడులు కావాలి

మాకు ఆరోగ్యాన్ని అందించే వైద్యశాలలు కావాలి

మనుషుల్లో దేవుళ్ళు ధన్వంతరి వారసులు కావాలి కడుపు నిండుగా ఆహరం గుండె నిండుగా ఆశ్లేషం

బ్రతుకు పొడుగునా స్వాతంత్రం

ఇవి చాలు మాకు

మనుషుల్లా బతుకుతాం

మానవత్వపు బావుటాని

దేశ జెండాగా ఎగురవేస్తాం

మనిషి మనిషిని కలుపుకుంటూ పోతూ

మానవహారంగా మారుతాం

స్వేచ్చా విహంగాల్లా ఎగురుతూ

ఊరూరా తిరుగుతాం

మానవత్వపు మరిమళాలను

మనిషి మనిషికీ పంచుతాం

“జై భారత్” నినాదంతో మేమంతా ఒక్కటని

దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తాం”

దేశ ప్రజలంతా కలసి ఐక్యతతో ఈ నినాదానికి అర్థం చేకూరుస్తూ పరిపూర్ణమైన సర్వసత్తాక, లౌకిక, గణతంత్ర భారత దేశాన్ని సాధిస్తాం.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630