“విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో ఈరోజు నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
“నాయకులకు నువ్విప్పుడు దేవుడివి
నీ కోసం చేస్తారు ఎన్నెన్నో ఊడిగాలు
నీ చుట్టూ చేస్తారు ప్రదక్షిణాలు
వీలైతే నిన్నెత్తుకుని ఊరేగిస్తారు
మాయలో పడ్డావో నీకుండదు భవిత
చూపుడు వేలే ఇప్పుడు నీ వజ్రాయుధం
అనర్హులకు వేసే ఓటు
అది చేస్తుంది నీకు చేటు
విజ్ఞతతో నీవు వేసే ఓటు
అది వేస్తుంది నీ ప్రగతికి పై మెట్టు”
నవంబర్ మాసంలో చిరుచిరు చలిగాలులు. అయినా అటు నాయకులు, ఇటు ప్రజల మనసుల్లో మాత్రం వేడి సెగలు. క్రికెట్ ఫీవర్ చల్లబడి పోయింది. ఇప్పుడు సరికొత్త ఫీవర్. ఎన్నికల ఫీవర్. నాయకుల కంటికి కునుకు రానీయకుండా చేసే భయం.. ఎలక్షన్లలో గెలిచి అధికారం పొందాలని అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులకు వెన్నులో ఒణుకు పుట్టించే సామాన్యుని ఓటు.
ఎన్నిక అనేది ఒక అధికారిక సమూహ నిర్ణయ ప్రక్రియ. ఎన్నుకోవడం అంటే ” నాయకులను ఎంచుకోవడం లేదా నిర్ణయం తీసుకోవడం. ఇక ఎన్నికలకు సంబందించిన ఫలితాలు మరియు ఇతర గణాంకాల అధ్యయనాన్ని ఎన్నికల పరిభాషలో “సెఫాలజి” అంటారు. ఇప్పుడు ఎన్నికలు సహస్ర అశ్వాలను పూనిన రథంలో సమస్త ఆయుధ సంపత్తితో సర్వసిద్ధంగా అతివేగంగా దూసుకుని వస్తున్నాయి. ఈ నవంబర్ ౩౦ న తెలంగాణలో, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.ఇక గల్లీ నుంచి ఢిల్లీ దాక ఎక్కడ చూసినా ఎన్నికల ముచ్చట్లే. అధికార పార్టీ నాయకులు తమ బలాన్ని, బలగాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంటే, ప్రతిపక్షం పార్టీలు మేమేం తక్కువ కాదు అంటూ ప్రచార అస్త్రాలను వాడిగా, వేడిగా, సూటిగా ప్రజలమీదకు సంధిస్తున్నారు.
ఇక వివిధ రంగాలవారికి విపరీతమైన గిరాకీ దినాలు ఇవి. ప్రజల నాడి కనిపెట్టే యంత్రాలు, మంత్రాలు, నాయకుల భవిష్యత్ గురించి జోతీష్యం, హస్త సాముద్రికం,అంజనం , న్యూమరాలజీ, రకరకాల శాస్త్రకారులకు, జానపద కళాకారులకు, అడ్డా కూలీలకు, పాటలు పాడే వారికి, వీడియోలు ఆడియోలు చేసే వారికి, ప్రచార రధాలు తయారు చేసే వారికి చేతినిండా పని. షామియానాలు, జెండాలు, రంగు రంగుల టోపీలు, కండువాలు, దిష్టిబొమ్మలు తయారు చేసే కుటుంబాలకు ఈ రెండు,మూడు నెలలు ఆటవిడుపు. చేతినిండా ఆదాయం కళ్ళ చూసే తరుణం, కల్పతరువు.
ఎన్నికల తరుణంలో నాయకులు మధ్య జరిగే వింతలు, విపరీతాలు ఓటరు మతిని పోగొడతాయి. పార్టీ టిక్కెట్ రాలేదని ఓ నాయకుడు అలిగి, మరో పార్టీకి మారితే మరో నాయకుడు ఏకంగా పెద్ద పెట్టున ఏడ్చేస్తాడు తన కొంప మునిగినట్టు. అంతవరకు శత్రువుల్లా మాటల అస్త్రాలు దూసుకునే నాయకులు ఉన్నట్లుండి మిత్రులు అయిపోతారు. గెలుపు దరికి దగ్గరగా ఉన్న పార్టీలోకి చప్పున దూకేసే నాయకులు కొంతమందైతే, గోడ మీది పిల్లుల్లా ఎటు దూకాలో తెలియని డైలమాలో మరి కొందరు. ఆహా… అధికారం కోసం ఎన్నెన్ని పాట్లు.. ఫీట్లు.
ఇక నాయకుల ప్రచార రథాలు, పాదయాత్రలు, ర్యాలీలు, ఇంటింటికి తిరిగి ఓటు బిక్ష పెట్టమని, ఒక్క అవకాశం ఇవ్వమని అభ్యర్ధనలు. ఎప్పుడూ ప్రజల ముఖం కూడా చూడని ప్రతినిధులు కూడా వీధుల్లో తిరుగుతూ వింతవింత పోకడలకు పోతారు. వాడవాడలా తిరుగుతూ, ఓటరుని దేవుడి లెక్క నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారు. ఓటరుకి స్నానం చేయించే నాయకుడు ఒకరైతే, పసిబిడ్డల చీమిడిముక్కులు తుడిచే నాయకులు మరొకరు, ఇస్త్రీ చేసే నాయకుడు ఒకరైతే ఇంట్లో అన్నం వండి పెట్టే నాయకుడు మరొకరు.
ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టి మరి ఓటు అడుక్కునే మహిళా నాయకులు. ఓటరుని మెప్పించేదానికి చేయాల్సిన ఫీట్స్ అన్నీ చేస్తారు. ఇక ఓటుకు నోటు, మందు, బిర్యానీ పొట్లాలకు, కుక్కర్లూ, మిక్సీలు, సెల్ ఫోన్లు లాంటి ఖరీదైన బహుమతులకు లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. ఓటరు బలహీన నాడి ఎక్కడుందో చూసి సూటిగా ఆశ సూది గుచ్చుతారు. పధకాలు. బహుమతులు అంటూ ప్రలోభపెడతారు. రాజకీయ రణరంగ పద్మవ్యూహంలో ఓటరును బందీని చేస్తారు.
మరి ఓటరు ఏం చేయాలి ? తేనే పూసిన కత్తుల వంటి నాయకుల మాటలకూ, ప్రలోభాలకు లొంగిపోతే, తన ఐదేళ్ల భవిష్యత్తును, ఆ పైన జీవితాన్ని అంధకారబంధురం చేసుకోవడమే. విజ్ఞతతో వ్యవహరించాల్సిన తరుణం ఇదే. నిజాయితీ గలవాడు, సమర్ధవంతమైన నాయకత్వ లక్షణాలు కలవాడు, ప్రజల కష్టసుఖాలు తనవి అనుకుని, ప్రజలందరినీ తన కంటిపాపల్లా కాపాడేవాడు, కుల, మత, వర్గ, ప్రాంత వైషమ్యాలు చూడకుండా ప్రజలందరి బాగు కోసం నిరంతరం కృషి చేసే నిజాయితీ పరుడైన నాయకుడిని ఎన్నుకోవడం ప్రజలు ఇప్పుడు చేయాల్సిన గురుతర కర్తవ్యమ్. చరితలు చెప్పిన సత్యం ఇది. ప్రజల మనసు చూరగొన్నవాడే అసలైన నాయకుడు. ఆ అసలైన నాయకుడిని ఎన్నుకునే తరుణం ఇప్పుడు మన ముందర ఉంది.
పన్నెండేళ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కర స్నానం చేస్తే చేసిన పాపం పోయి, పుణ్యం వస్తుందో లేదో ఇదమిద్దంగా చెప్పలేం కానీ, ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం సరైన నాయకుడిని ఎన్నుకోకుంటే మాత్రం ప్రజల జీవితాలు అంధకార బంధురమౌతాయి. అందుకే ప్రతి ఓటరు మహాశయుడు విజ్ఞతతో వ్యవహరించాలి. చూపుడు వేలుని ఆయుధంగా ఉపయోగించి, పనికి రాని, పస లేని, నీతిలేని నాయకులను తిప్పికొట్టి, అసలుసిసలైన మేలిమి వజ్రంలాంటి నిజాయితీ పరుడైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలి. అప్పడే రాష్ట్రాలు, దేశం సుభిక్షం అవుతాయి.
ప్రపంచ ప్రసిద్ధ ప్రజాస్వామ్యమా వర్ధిల్లు
బహుజన ఘన భాగస్వామ్యమా విరాజిల్లు
జైహింద్ జై భారత్
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630