విమల సాహితి ఎడిటోరియల్ 23 – “హితేన సహితం సాహిత్యం” ..ఇప్పుడంతా హితమేనా?

ఈ వారం విమల సాహితీ పత్రికలో “హితేన సహితం సాహిత్యం” లో ఇప్పుడు హితమెంత? సంపాదకీయ వ్యాసం చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

కాలం బండరాయి కాదు. ఒకేచోట స్థిరంగా ఉండడానికి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లు కూడా కాదు. కాలచక్రం నిరంతర సంచారి. అలుపెరుగని బాటసారి. గమ్యం తెలియని తెరువరి. కాలంతో పాటు సమాజంలో మార్పులు కూడా సహజం. సర్వసామాన్యం. రెండు రాళ్ళను కొట్టి నిప్పును పుట్టించిన ఆదిమానవుడి నుంచి, ఆ మంటనే వాడి చర్యకు ప్రతిచర్యగా రాకెట్లను తయారుచేసి, కథల్లో చెప్పుకునే చందమామను స్వయంగా చేరుకునే ఆధునిక మానవుడి దాకా జరిగిన మానవ వికాసం, అంతులేని మేధోమధనం మనిషి సాధించిన ఘనవిజయం.
వైజ్ఞానిక వికాసంతో పాటు, సామాజిక స్థితిగతుల్లో మార్పులకు సాహిత్యం చూపిన ప్రభావం కూడా తక్కువేమి కాదు. సాహిత్య వికాసాన్ని దశలవారీగా పరిశీలిస్తే ప్రాచీనయుగం నుంచి ఆధునిక యుగం దాకా అనేకానేక మార్పులు జరిగాయని మనకందరికీ తెలుసు .ప్రాచీన యుగపు సాహిత్యంలో ప్రధానంగా నీతిబోధనలు, జానపద కథలు, ఇతిహాస రచనలుగా సాగింది. ఆ తర్వాత భక్తి యుగంలో సాహిత్యాన్ని భక్తిరసం ముంచి తేల్చింది. పోతన వంటి భక్త పండితులు తమ రచనలను దేవుడికే అంకితం చేస్తాం అన్నారు. తదుపరి భావావేశం, శృంగారం సాహిత్యంలో పైచేయి సాధించాయి. భావ కవిత్వం, శృంగార రచనలు పాఠకులను ఊపిరాడనీయకుండా చేసాయి. శ్రీనాథుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటివాళ్లు శృంగార, ఆత్మాశ్రయ రచనలు చేసారు.
కాల చక్రం ఇంకాస్త ముందుకి తిరిగాక భావావేశ రచనలు పలచబడి అభ్యుదయ సాహిత్యం కొత్తపుంతలు తొక్కింది. ఓ పక్క పేదరికం, ఆకలితో డొక్కలు ఎండుతుంటే, మరోపక్క బానిసత్వం వేసిన సంకెళ్లను తెంచుకోలేక మనుషులు అవస్థ పడుతుంటే శృంగారం, భావావేశం ఎవరికి కావాలి? శ్రీ శ్రీ లాంటి కవుల నుంచి అభ్యుదయ రచనలు పుట్టుకొచ్చాయి. సమాజ పోకడల మీద కసితో దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం దూసుకొచ్చాయి. ఎంత కాలం వంటింట్లో అంట్లకు, మసిగుడ్డలకు, పడకటింట్లో విలాసానికి తప్ప స్త్రీ మనసుని తెలుసుకోలేరా! “ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగా” పురుషునితో సమానంగా అన్నిపనులు చేయగలిగిన స్త్రీని తక్కువచేసి చూడడం నేరం అంటూ ‘ఫెమినిజం’ పెల్లుబికి, అదుపుదప్పిన పురుష పుంగవుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ స్త్రీ వాద సాహిత్యం సర్రున ఎగబాకింది. ఆ తర్వాత దళిత వాద సాహిత్యం అనుభూతి వాద సాహిత్యం వచ్చాయి. ఇలా సాహిత్యంలో నూతన పోకడలు ఎప్పటికప్పుడు అబ్బురపరస్తూ వస్తున్నాయి .
ఇవన్నీఒకెత్తయితే ఇప్పుడు ఈ ఆధునికయుగంలో ముఖ్యంగా కరోనా అనంతరం వచ్చిన సామాజిక, ఆర్ధిక, మత సంబంధమైన మార్పులకు అనుగుణంగా వస్తున్న నేటి సాహిత్యాన్ని పరిశీలిస్తే మాత్రం సాహిత్యం అనేది పిచ్చివాడి చేతిలో రాయి చందంగా మారిపోయింది. ముద్రణ పత్రికలు మూతపడ్డాయి. ఆన్లైన్ పత్రికలు తామర తంపరగా పుట్టుకొస్తున్నాయి. ఇక కొందరు తాము కవులు, కథకులు అనుకున్నవాళ్ళు తమ రచనలను నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తర్వాత వాటిని పుస్తకరూపంలోకి తెచ్చుకోవడం. ఆ తర్వాత అవార్డులు, సన్మానాల కోసం తపించడం. ఇంతవరకు బాగానే ఉంది. అవార్డులు, పేరు తెచ్చుకోవడాలు అనేవి ఎవరికైనా ఉండే సామాన్యమైన కాంక్షలే. కానీ ఇందుకోసం తమ రచనల్లో కులమతాల అడ్డుగోడలు కట్టడం, ద్వేషాన్ని ఎగదోయడం ఎంతవరకు సమంజసం? ఈ మధ్య తానొక యువ కవిని అని చెప్పుకునే వ్యక్తి ” గాజా యుద్ధ భూమిలో ఎందరు చనిపోయినా పర్వాలేదు, ఎంత మంది చిన్నారులు బలిపశువులుగా మారినా పర్వాలేదు. మతం ఉనికి కోసం, అస్తిత్వం కోసం రక్తం చిందించాలి. పోరాటమే జరగాలి. అందరు చావాలి” అంటూ ఓ కవిత రాసుకుని సోషల్ మీడియాలో పెట్టారు. ఇటువంటి వారిని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇంకో బ్యాచ్ తయారైంది. ఎప్పుడో జరిగినవో లేదా ఋషుల కల్పనో ఏదైతే ఏం, ఇతిహాసాల పాత్రలను తీసుకువచ్చి, ఆ పాత్రలను ఇప్పుడు శీల పరీక్షకు నిలబెట్టడం. ఓ పక్క శీలం అంటే శరీరానికి సంబంధించినది కాదు, గుణం, వ్యక్తిత్వం అంటూనే ఆ పాత్ర ప్రతినాయకుడిని ఇష్టపడింది. ఇంకొన్ని రోజులు ఉంటే ఆ స్త్రీ పాత్ర నాయకుడిని వదిలేసి ప్రతినాయకుడితోనే ఉండడానికి సిద్ధపడేది అంటూ ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకునేలా చేసిన రచనలు చూస్తే దిమ్మతిరిగిపోతోంది. అంతకు ముందు లేని ఈ వెర్రి ధోరణులు తలకెక్కించుకుని, తమని తాము కించపరచుకుని, తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుని, పాతాళంలోకి పడిపోతుంటే, ఇక సాహిత్యాన్ని సంరక్షించడానికి ఏ గ్రహం నుంచో ఆధునిక యుగ మానవులు ఆవతరించాలో ఏమో అనిపిస్తోంది. రామాయణ ఇతిహాసంలో రావణాసురుని దళితుడు అని, వానరులను ఆదివాసీలు అని విపరీత వింతపోకడలను రచనల్లోకి తెస్తున్నారు. మానవులను సన్మార్గంలోకి నడిపించడానికి ఋషులో, కవులో, ప్రవక్తలో కొన్ని కాల్పనిక రచనలు చేస్తారు. వాటిలో మంచితో పాటు కాస్త మూఢత్వం, అల్పత్వం ఉండవచ్చు. ఏ వ్యక్తి ఎన్నటికీ పరిపూర్ణుడు కాలేరు. ప్రతిఒక్కరిలో ఏదో ఒక లోపం ఉండవచ్చు. కాలి వెలికి చీముపట్టి కుళ్ళిపోయిందని మొత్తం కాలును నరుక్కొము కదా. వేలుని మాత్రం తీసేసి కాలుని రక్షించుకుంటాం. సాహిత్యంలో కూడా అంతే. రచనల్లో ఎక్కడైనా చెడు ఉందనిపిస్తే ఆ రచనని ప్రోత్సహించకుండా ఉంటే చాలు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే రచనలను తిప్పికొడితే చాలు. అందుకు పత్రికలను నడిపే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఉత్తమ పాఠకులు ఎలాగూ ఆ పనిని చేస్తారు. సర్వ సాహిత్య జన సుఖినోభవంతు.


రోహిణి వంజారి
9000594630
సంపాదకీయం