ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో..
వెలుగులీనుతున్న జీవన దీపాలు
“మాతృదేవోభవ -పితృదేవోభవ -ఆచార్యదేవోభవ ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని వరుసక్రమం కూడా చెప్పారు. అంటే తల్లి,తండ్రి తర్వాతి స్థానం గురువుకి ఇచ్చి, ఆ తర్వాతే దైవం అన్నారు. అంటే గురువు దైవం కంటే గొప్పవాడనే కదా అర్ధం. మనిషి జీవితంలో ఎందుకు గురువుకి అంత ఉన్నత స్థానం ఇచ్చారు అంటే గురువు అనే గొప్ప పదానికి అర్ధం తెలుసుకోవాలి మనం.
గురువు అనే పదంలో “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానము అనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు వచ్చింది. “గు” అంటే గుహ్యమైనది, తెలియనిది. “రు” అంటే దానిని రుచ్యము చేసేది. అంటే రహస్యమైనదానిని తెలియచేసేవారు “గురువు” అనే మరొక అర్ధం కూడా ఉంది. జ్ఞానం, ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం.
నిరంతరం విద్యారులను అంటిపెట్టుకుని, వారి సందేహాలను తీరుస్తూ, పుస్తకాల్లోని పాఠాలనే కాక, తమ అనుభవసారంతో విద్యార్థులకు జీవిత పాఠాలను కూడా నేర్పిస్తూ, తగరతి గదిలో పాఠాలతో పాటు, విద్యార్థులు ఉన్నత పౌరులుగా ఎదగడానికి వారికి వినయ, విధేయతలు, క్రమశిక్షణ, నైతిక విలువలను కూడా నేర్పిస్తాడు గురువు. విద్యార్థుల ఎదుగుదలకు అన్నివిధాలా సహకరిస్తూ, తన జీవితాన్ని విద్యార్థుల బాగు కోసమే అంకితం చేసేవాడు ఉత్తమ గురువు. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల గొప్ప గురువులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారు ౧౯౬౧ సంవత్సరం నుండి ౧౯౬౭ సంవత్సరం వరకు భారత దెస ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ భాద్యతలను నిర్వహించారు. అంత కంటే ముందుగా వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేసి, ఎందరో విద్యార్థుల, వారి తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొన్నారు. అంతటి మోహోన్నతమైన వ్యక్తి జన్మదినం సెప్టెంబర్ ౫ వ తేదీన. ఆయన జ్ఞాపకార్ధం ఆ రోజును మనమందరం “ఉపాధ్యాయ దినోత్సవం” గా జరుపుకుంటున్నాము అనే సంగతి మనకందరికీ తెలుసు.
ఈ సందర్భంలో గురుశిక్ష సంబంధం గురించి ఒక శ్లోకం ఇక్కడ గమనిస్తే “తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా.! ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనః “గురువుకు నమస్కారం చేస్తే చాలదు. గురువుకి తమ ఆత్మసమర్పణ చేసుకున్నవాడే నిజమైన శిక్షుడు. అప్పుడు శిక్షునికి వచ్చే పరిప్రశ్నలు అంటే సందేహాలను గురువు నివృతి చేస్తాడు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో గురువుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి నేటి కాలంలో గురుశిక్ష సంబంధాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం.
మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడి కి గురిచేసే టీచర్లు ఉన్నారు. తనకు చదువు సరిగా రాలేదని పరీక్షల్లో ఫెయిలై అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్లు మందలించడంతో మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకుని నేల రాలిన విద్య కుసుమాలు ఎన్నో. పిల్లల తెలివి తేటలు, శక్తి సామర్ధ్యం, వారి ఐక్యూ గురించి తెలుసుకుని, దానికి అనుగుణంగా విద్యార్థులను ప్రోత్సహించేవారే నిజమైన గురువులు.
గురువు స్థానంలో ఉండి, విద్యార్థులను నైతిక విలువలను భోదించాల్సిన గురువులే కొందరు విద్యార్థినుల పట్ల కాముక భావం కలిగి ఉండి వారిని లైంగికం గా వేధించి గురువు అనే పదానికే మచ్చ తెచ్చేవారు నేటి సమాజంలో ఉండడం అత్యంత విచారకరం.
గురువులను అవహేళన చేస్తూ, టీచర్లను, అధ్యాపకులను , వారి వృత్తిని చులకన చేయడం, గురువు అంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా అపహాస్యం చేసేలా నేటి సినిమాల్లో చూపించడం కూడా చాల శోచనీయం. గురుశిక్షుల సంబంధం చాల పవిత్రమైనది. వారి మధ్యన కూడా ప్రేమ, లైంగిక సంబంధాలు చూపించడం కూడా నేటి మన సినిమాల దౌర్భాగ్యం. పవిత్రమైన గురుశిక్షుల బంధాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దే భాద్యతను కళారంగం వారు, సాహిత్యకారులు తమ భుజాలకెత్తుకోవాలి.
“వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. అదే విధంగా ఉపాధ్యాయుడు అన్నవాడు నిరంతరం జ్ఞానార్జన చేస్తూ ఉండాలి. అప్పుడే అతడు తన విద్యార్థుల మనసుల్లో నిరంతరం జ్ఞానజ్యోతులను వెలిగించగలడు” అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. వారిని స్మరించుకుంటూ, ఈ సెప్టెంబర్ ౫ న జరుపుకోబోతున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విమలసాహితి పాఠకులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ..
మీ రోహిణి వంజారి
సంపాదకురాలు
9000594630