రెండరటిపళ్ళు

కాస్త పెద్ద కథ అయినా “రెండరటి పళ్ళ” రహస్యం తెలియాలంటే ఈ నెల [జూన్] సాహితి ప్రస్థానం లో ప్రచురింపబడిన నా కథ “రెండరటి పళ్ళు” చదవాల్సిందే. ఇక్కడ పుస్తకంలోని పేజీలు పెట్టాను. టెక్స్ట్ మెసేజ్ రూపంలో చదవాలంటే నా పర్సనల్ వెబ్సైటు లింక్ ఇక్కడ ఇస్తున్నాను. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ..

దిండుకి ముఖం ఆనించి బోర్లా పడుకున్నా. ఊపిరి ఆగిపోయినట్లయింది. వెనక్కి తిరిగి వెల్లికిలా పడుకున్నా..ఊహు.. నిద్ర కాదు కదా..కంటి రెప్ప కూడా వాలడం లేదు. గడియారంలో చిన్న ముల్లు నత్తతో పోటీపెట్టుకున్నట్లుంది. కదలడం లేదు.
భయంతో చెమటలు పడుతున్నాయి నాకు. పక్కకు తిరిగి చూసాను. శ్రీవారు శేషతల్పం మీద పవళించిన విష్ణుమూర్తిలా తలకింద చేయి పెట్టుకుని నిశ్చింతగా. నేనిక్కడ విపరీతమైన టెన్షన్ తో నిద్ర రాక అవస్థ పడుతూ ఉంటే, ఈయనగారు మాత్రం నిర్మలమైన గాఢ సుషుప్తిలో. కాసింత అసూయ పుట్టింది నాలో
ఓ దీర్ఘమైన నిట్టూర్పు విడిచి పక్కకు ఒత్తిగిల్లాను. రేపొద్దున ఏమవుతుందో ఏమో..? తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. క్షణక్షణానికి బెంగ పెరిగిపోతోంది. ఇప్పుడేమి చేయాలి నేను ..?

***
” త్రిశంకు స్వర్గం ” అంటారు కదా..! అటు స్వర్గం కాదు ఇటు నరకం కాదుట అది. అచ్చం స్కూల్లో ఉన్న ఐదంతస్తుల్లో మా మూడో అంతస్తు లాగా.
నరకం. అంటే…అదే..కింద రెండంతస్తులు అనుక్షణం హెడ్ మేడం సుభాషిణి పర్యవేక్షణలో ఉండడం వల్ల, ఆ రెండు ఫ్లోర్లల్లో టీచర్లకు అనుక్షణం నరకంలో ఉన్నట్లే.. ఒక్క నిముషం కూర్చున్నా”కూర్చోవడానికి కాదు మీకు జీతాలు” అంటూ క్లాస్ పీకుతుంది. అక్కడ టీచర్లు అలెర్టుగా ఉంటారు. అక్కడ నుంచి హెడ్ మేడం కదిలితే చాలు వర్తమానాలు అతివేగంగా టీచర్లు నియమించుకున్న కోవర్ట్ పిల్లల ద్వారా పై అంతస్తులకు అందుతాయి. పైన నాలుగు, ఐదు అంతస్తుల్లో ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు. అక్కడికి మెట్లు ఎక్కి మేడం చేరుకునేలోగా అందరు ఎక్కడివాళ్ళు అక్కడ సర్దుకుంటారు అది స్వర్గం. ఇక మూడో అంతస్తు ఉందే ఇక్కడే అంతా అయోమయం. ఇదే మాపాలిటి త్రిశంకు స్వర్గం.
మేడం ఎప్పుడొస్తుందో సరిగా తెలియక అప్పటివరకు నిలబడి నిలబడి కాళ్ళు లాగేస్తున్న టీచర్లు ఒక్క క్షణం అలా కూర్చోగానే, ఇలా మేడం ఎవరికీ తెలియకుండా పిల్లిలా అడుగులు వేసుకుంటూ మెట్లు ఎక్కినేరుగా కుర్చీలో కూర్చున్న టీచర్ క్లాసులోకి వచ్చేస్తుంది. ఇక ఆ టీచర్ పరిస్థితి..! చూడాలి..! రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగలా..! పగవాడికి కూడా వద్దు ఆ పరిస్థితి అనిపిస్తుంది. ఈ రోజు మా పుణ్యం పుచ్చి మా టీచర్ల కోవర్టు మునెమ్మ ఆయా వర్తమానం మోసుకొచ్చింది ఇప్పుడు.
” టీచర్.. టీచర్ ..హెడ్ మేడం రౌండ్కు వస్తుండే”. మునెమ్మ మాట వినీ వినబడగానే.
ఇక అంతే సంగతులు. ఎక్కడి దొంగలు అక్కడే..గుప్చుప్..సోడా బుడ్డి. అప్పటిదాకా టేబుల్ మీద కాళ్ళు చాపుకుని కూర్చుని ఉన్న రోజారాణి టీచర్ గబుక్కున టేబుల్ మీద నా ముద్దుల పెంపుడు కొడుకు నుంచి దూకి కుదురుగా నిలబడి బోర్డు మీద ఏదో రాసేస్తోంది జెట్ వేగంతో మూడో తరగతిలో. మధ్యాన్నం మొదటి పీరియడ్ నుంచి కునికిపాట్లు పడుతున్న సత్యా టీచర్ వాటర్ బాటిల్ తీసుకుని కళ్ళ మీద నీళ్ళు చల్లుకుంటోంది గబగబా . తను దీపావళికి కొన్న అరిటాకు పచ్చ రంగు జార్జెట్ చీరని నాకు చూపించడానికి వచ్చిన శ్రావణి టీచర్ గబుక్కున తన క్లాసులోకి పరుగెత్తింది.
గంట మూడుంబావు అవుతోంది. నాకు కంగారు ఎక్కువ అయింది. మానస టీచర్ ఇంకా మ్యాథ్స్ హోంవర్క్ పంపలేదు నా దగ్గరకు. అది వస్తే కానీ డైరీ రాత సంపూర్ణం కాదు. ఏ దేవుడు నా మొర ఆలకించాడో కానీ ఐదవ తరగతి నుంచి లోహిత వచ్చి మ్యాథ్స్ హోమ్ వర్క్ చీటీని నాకు ఇచ్చింది.
నాలుగవ తరగతి లోటస్ సెక్షన్లో అరవై మంది పిల్లలకు అజమాయిషీ అధికారిని..అదే ..అదే క్లాస్ టీచర్ని నేనే. నలభై మంది పిల్లలు పట్టే గదిలో అరవై మంది. బస్తాలో కుక్కి వాడిపోయిన వంకాయల్లా ఇరుకిరుగ్గా కూర్చునిఉన్నారు.పొద్దున నందివర్ధనంలా విచ్చుకున్నవాళ్ళు మధ్యాహ్నం అయ్యేసరికి వాడిపోయిన తోటకూర కాడల్లా ఉన్నారు. కోళ్ల ఫారంలో కోడి పిల్లల అరుపులను మించిపోతున్నాయి వాళ్ళ అరుపులు. క్లాస్ అంతా కలయదిరిగి సామ దాన భేద దండోపాయములన్ని ఉపయోగించాక క్లాస్ నిశ్శబ్దం అయింది.
ఈ రోజు ఐదు సబ్జక్ట్స్ లో డైరీ వర్క్ రాయాలి. తెలుగులో రెండు సుమతీ శతకాలు, హిందీలో ఐదు గుణింతాలు వర్క్ బోర్డు మీద రాసి వెనక్కి తిరిగాను. కొందరు వేగంగా, కొందరు నెమ్మదిగా డైరీ రాస్తున్నారు. రెండోబెంచిలో చివర కూర్చున్న నా ముద్దుల పెంపుడు కొడుకు ‘ ముద్దసీర్ అహ్మద్’ మాత్రం డైరీ పేజీలో ఒక్క అక్షరం కూడా రాయకుండా పెన్ పట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. వాడి దగ్గరకు పోయి డైరీ రాయడం మొదలుపెట్టు అని గద్దిస్తుండగా..అదిగో అప్పుడే హెడ్ మేడం క్లాస్ బైట నిలబడి గుర్రుగా చూస్తోంది నా వంక. ఆ చూపులకు శక్తే ఉంటే..! నేను అక్కడే మాడి మసైపోదును.
తడబాటు ఎక్కువైంది నాలో. “ఎంతసేపు డైరీ రాసేది. స్టూడెంట్స్ ని కంట్రోల్ లో పెట్టుకోమని రోజు నూరిపోయాలా నేను మీకు..? త్వరగా పూర్తీ చేసి స్టడీ అవరుకి కూర్చోబెట్టండి.అప్పుడే టైం ముడుంబావు దాటింది. త్వరగా డైరీ సంతకాలు కానీయండి “
a మేడం ఉరుములా ఘర్జించి మెరుపులా మాయమై పక్క క్లాసుకి వెళ్ళింది. పొద్దున్నుంచి ఆవిడ రౌండ్స్ కి రావడం ఇది నాలుగోసారి. ఉత్త అనుమానపు మనిషి. సిన్సియర్గా పని చేసేవారిని, పని చేయకుండా ఆమె ముందు నటించేవారిని ఇద్దరినీ కలగలిపి అనుమానంగానే చూస్తుంది. అందుకే ఆమె మీద చాల కోపం టీచర్లకు. కానీ ఏం చేయగలం. ఆమె ముందు కుక్కిన పెన్లలా పడిఉండాల్సిందే.
ఐదు నిముషాలకు హెడ్ మేడం కిందికి వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ బోర్డు మీద డైరీ వర్క్ రాస్తున్న.
“టీచర్..టీచర్..భావేష్ ఏడుస్తున్నాడు”

” ఎందుకట”
“టీచర్.. భావేష్ స్టాఫ్లర్ పిన్ మింగేశాడట”
దిగ్గున వెనక్కి తిరిగా. చివరి బెంచిలో మధ్యలో కూర్చున్న భావేష్ నల్లమందు తిన్నట్లు ముఖం పెట్టుకుని ఉన్నాడు.
“ఏరా.. పిన్ మింగావా” వెనుక బెంచి దగ్గరకు పరిగెత్తా
తల అడ్డంగా, నిలువుగా, గుండ్రంగా తిప్పి లాస్యవిన్యాసం చేసాడు వాడు. స్టాఫ్లర్ పిన్ మింగిన ధాఖలాలేవీ అంటే గొంతు పట్టుకోవడం, నొప్పి అంటూ ఏడవడం ఏమి కనపడలేదు.
“ఏరా కైలాష్..వాడు పిన్ మింగడం నువ్వు చూసావా “
“టీచర్..వాడు పిన్ పైకి ఎగరేసి నోటితో పట్టాడు. అది కింద పడింది టీచర్ ” అన్నాడు కైలాష్. “ఎగరేసినప్పుడు వాడి నోట్లో పడినట్లుంది టీచర్” స్టాఫ్లర్ మిషన్ని ఒత్తుతూ అన్నాడు వాడికి కుడి పక్క కూర్చున్న అంకిత్.వాడి చేతినుంచి స్టాఫ్లర్ మిషన్ని లాగేసుకున్నాను విసురుగా
బెంచి కిందకి వంగి చూసాను. చిన్న చిన్న స్టాఫ్లర్ పిన్నులు చాల పడివున్నాయి.
ఏరా భావేష్..! నిజం చెప్పు..నువ్వు పిన్ను మింగావా” ఆ కాస్త గద్ధింపుకే వాడు బిక్కమొఖం వేసి “మింగలేదు టీచర్” అన్నాడు ఈ సంకట పరీక్ష ఏంటి నాకు. ఓ పక్క స్టడీ అవర్ టైం అవుతోంది. డైరీ రాయడం పూర్తి చేయక పొతే నా పీక పిసుకుతుంది మా హెడ్ మేడం. ఏం చేయాలిరా దేవుడో..మళ్ళీ ఇంకోసారి వాడిని నఖశిఖ పర్యంతరం గమనించాను. పిన్ను మింగానో లేదో అనే క్లారిటీ వాడికి లేదు. ఏ విషయం ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నాడు వాడు. మనిషి చూస్తే బాగానే ఉన్నాడు. నేను గమనించినప్పుడు మాత్రం ఏడుపు ముఖం పెడుతున్నాడు. ఏం చేయాలో తెలియని కంగారుగా ఉంది. ఒక వేళ వాడు నిజంగా పిన్ను మింగి వాడికేమన్నా అయితే..? ఆలోచనలు నన్ను కందిరీగల్లా ముసురుతున్నాయి. మా హెడ్ మేడం క్రూరమైన చూపుల్లా.
పెద్ద సమస్య వచ్చిపడింది నాకు. వెనక్కి వెనక్కి తిరుగుతూ వాడినే చూస్తూ ఎలాగో డైరీ రాసాను అనిపించాను.. డైరీ పేజీలో ఒక్క అక్షరం కూడా పెట్టని ముద్దసీర్ అహ్మద్ డైరీ లాక్కుని వర్క్ రాసేసాను. మూడే మూడు నిముషాల్లో అందరి డైరీల్లో సంతకాలు బరికేసాను.
***
టీచర్లు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇంటర్నెట్ షాపులకు వెళ్లి ప్రింట్స్ తీసుకునే కాలం కూడా పోయి ప్రతి ఇంట్లో కంప్యూటర్లు, లాప్టాప్లు, ప్రింటర్లు వచ్చి చేరేశాయి. ప్రతి ఇల్లు ఒక ఇంటర్నెట్ సెంటర్ అయింది ఇప్పుడు. ఇక ఇంట్లో, స్కూల్లో వైట్ పేపర్లు, క్రేయాన్స్, కలర్ పెన్స్, స్టాఫ్లర్ పిన్స్ కూడా స్టాక్ పెట్టుకునే చదువుల రోజులు ఇవి. ప్రతి ఒక్కరి పౌచ్ లో ఇవి అన్నీ ఉంటాయి. ఇప్పుడీ వెధవ పిన్ మింగాడా లేదా ఎట్లా తెలుసుకోవడం..?.అందరినీ స్టడీ అవర్ కి కూర్చోబెట్టి చదివిస్తూ, మధ్య మధ్యలో భావేష్ ని గమనిస్తున్నా. వాడు ఓ పక్క అల్లరి చేస్తూనే, మరోపక్క గొంతుని చేత్తో తడుముకుంటున్నాడు దిగులుగా.
వెధవ నిజంగా పిన్ను మింగాడేమో..! వెళ్ళి హెడ్ మేడంకి చెప్పేస్తే.. భూమికను క్లాస్ చూసుకోమని మేడం దగ్గరకు వెళదామనుకున్నా. ఒక వేళ వాడు పిన్ మింగకుంటే..! అనవసరపు అక్షింతలు కదా నాకు. కాసేపు ఎటూ తేల్చుకోలేని డైలమాలో ఉండిపోయాను. అయినా వాడు పసి బిడ్డ. భయపడుతున్నాడు. నేను టీచర్ నే అయినా, ఆ సమయంలో వాడి పరిస్థితి చూసి నా తల్లి మనసు ఊరుకోలేదు. మళ్ళీచివరి బెంచి దగ్గరకు వెళ్ళా.
“చెప్పారా..? నిజంగా పిన్ మింగావా నువ్వు..?” అడిగాను వాడిని. అప్పటికది వందోసారి వాడిని అడగడం.
“టీచర్..నాకు సరిగా తెలియడం లేదు. మింగానేమో అని భయం వేస్తోంది” బిక్క ముఖం వేసాడు.
“మరి గొంతులో ఇరుక్కున్నట్లు నొప్పి ఏమన్నా ఉందా రా..? “
“లేదు టీచర్ కానీ పిన్ మింగాననిపిస్తోంది” ఏడవాలా వద్దా అన్నట్లు ఉంది వాడి వాలకం. స్టాప్లర్ పిన్ మింగితే ఏమౌతుంది. గూగుల్ సెర్చ్ చేసి చూద్దాం అంటే సెల్ ఫోన్ పొద్దునే ఆఫీస్ లో ఇచ్చేస్తిని. ఇక ఏం చేయాలి. అప్పటికే ఇక్కడ జరిగిన సంగతి గురించి పక్క క్లాసులకి ఉప్పు అందిపోయింది టాయిలెట్ కి పోయి వచ్చే పిల్లల ద్వారా.
శ్రావణి టీచర్ వచ్చి “వాడికి నీళ్లు తాగించండి. పిన్ ఉంటే కడుపులో కొట్టుకుపోయి రేపు పొద్దునే వచ్చేస్తుంది” అని సలహా పడేసి వెళ్ళింది. అప్పటికే రెండు వాటర్ బాటిల్స్ నీళ్లు తాగించా వాడిచేత. పొట్ట ఉబ్బిపోయి వాడు కూడా రెండు సార్లు టాయిలెట్ కి వెళ్ళివచ్చాడు. అయినా అనుమానం చావలేదు నాకు.
ఒక్క క్షణం ఆలోచించాను. అప్పుడు టక్కున వచ్చిందో ఐడియా. చైతు గాడికి మూడేళ్ళప్పుడు కర్పూరం బిళ్ళ మింగేసి ఇంట్లో అందరికీ కంగారు పుట్టించి ‘నాకేమో అయిపోతోంది’ అంటూ నానా రభస చేసి, అందరినీ డాక్టర్ దగ్గరకి పరుగులు పెట్టించాడు. డాక్టర్ వాడిని పరిశీలనగా చూసి,పొట్ట మీద ఒత్తి, వాడికి ఏం కాదు అని చెప్పి మందులు ఏమి రాయకుండా “ఇంటికెళ్లి వీడికి మెత్తటి అరటిపండు తినిపించండి ” అని సలహా ఇవ్వడం, అరటిపండు తిని వాడు నిద్రపోవడం గుర్తుకు వచ్చింది.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని నేను సంబరపడుతూ భావేష్ గాడిదగ్గరకి వెళ్ళాను. “భావేష్..చెప్పారా. ఇప్పుడు ఎలా ఉంది నీకు. కడుపులో నొప్పి ఏమైనా ఉందా..? ” అన్నాను నా ఐడియాని అమలుపరచాలని.
వాడు అడ్డంగా తలూపాడు నొప్పి లేదని.
” అయితే ఇంటికెళ్ళాక రెండు మెత్తటి అరటిపళ్ళు తిను. పిన్ ఉంటే వచ్చేస్తుంది రేపు మోషన్ లో “
ఎందుకైనా మంచిదని ఓ ఉచిత సలహా పడేసాను.
వాడు “అలాగే టీచర్ ” అని ఆముదం తాగినట్లు ముఖం పెట్టాడు.
అంతటితో ఊరుకుంటే బతికిపోదును. కానీ నేను ఒకటి అనుకుంటే జరిగింది ఇంకొకటి. విధి వక్రీకరణ.
ఈ ఒక్క ఆలోచన నన్ను ఎన్ని మలుపులు తిప్పుతుందో,ఎన్ని చెరువుల నీళ్లు తాగిస్తుందో ఆ క్షణం నాకు అర్ధం కాలేదు.
“భూమికా.. ఐదో తరగతిలో ఉన్న భావేష్ అక్క శృతిని నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురా” మాట పూర్తిగా వినకుండానే క్లాస్ బయటకి పరుగుతీసింది భూమిక.
ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్లు, పక్కవాళ్ళ బాధ తమకి ఎంత వినోదం కలిస్తుందో..భూమిక వెళ్లి ఏం చెప్పిందో భావేష్ అక్కతో పాటు పక్క క్లాసుల టీచర్లు శ్రావణి , శోభారాణి, సత్య తొంగి తొంగి చూసి , వారికి తోచిన సలహా ఇచ్చివెళుతున్నారు నన్ను ఉడికిస్తూ..
“శ్రుతీ..! మీ తమ్ముడు స్టాఫ్లర్ పిన్ మింగానంటున్నాడు. కాసేపు మింగలేదంటున్నాడు.వాడు పిన్ మింగడం నేనైతే చూడలేదు. వాడి ఫ్రెండ్స్ కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. అందుకని ఇంటికెళ్ళాక వాడికి రెండరటిపళ్ళు తినిపించు. ఒకవేళ పిన్ను మింగినా ఏంకాదు”
బొమ్మలా తలఊపి వెళ్ళిపోయింది శృతి. అమ్మయ్య..! మేడం కి తెలియకుండా ఎలాగో మేనేజ్ చేసేసాను. ఈ రోజుటికి గండం గడిచినట్లే. గాఢంగా ఊపిరి పీల్చుకున్నాను.
ఏదో జరుగుతుందని సరదా చూడాలని మహా ముచ్చట పడి ఎన్నో ఊహించుకున్న టీచర్లు ఏమి జరగలేదని నిరాశగా తమ క్లాసులకు వెళ్లిపోయారు.
భావేష్ గాడు మాత్రం మహా హుషారుగా, నేను చూసినప్పుడు మాత్రం గొంతు పట్టుకుని బాధగా ఆస్కార్ మహా నటుడిని మించిపోయాడు. అయినా అనుమానం చావక వాడ్ని నఖ శిఖ పర్యంతరం గమనించి, నాలుగోసారి వాడిని నీళ్లు తాగమని చెప్తుండగా లాంగ్ బెల్ మ్రోగింది ఇక నీ పని అయిపోయింది అని.
పిల్లలందరూ వెళ్ళాక మెట్లు దిగి ఆఫీస్ రూంలో కి వెళ్ళి అటెండర్ సాయిలుని అడిగి సెల్ ఫోన్ తీసుకుని, హెడ్ మేడం కి గుడ్ ఈవెనింగ్ చెప్పి
బయట పడ్డాను. గుడ్ ఈవెనింగ్ చెప్పకుండా వెళ్లిన మాలతీ టీచర్ కి రేపొద్దున హెడ్ మేడం పీకే క్లాస్ గురించి తలచుకుని నవ్వుకుంటూ పిల్లలతో పాటు హుషారుగా షేర్ ఆటో ఎక్కాను.
చెప్పులు వదిలి ఇంట్లోకి అడుగు పెట్టాను. విపరీతమైన దాహంగా ఉంది. కాళ్ళు కడిగే ఓపిక కూడా లేక కుండలో గ్లాసు ముంచి నీళ్లు తీసుకుని గ్లాసు నోటిదగ్గర పెట్టుకున్నాను.
అంతలోనే “నిను వీడని నీడను నేనే ” రింగ్ టోన్ లో పాట. ఛీ..ఛీ ..ఈ పాట రింగ్ టోన్గా వచ్చిందేంటి..ఎవరు మార్చారు. నీళ్లు తాగకుండానే గ్లాసు పక్కన పెట్టి ఫోన్ తీసాను కాస్తా అనుమానంగా. అంతే.
“అసలు నీకు బుద్ధి పనిచేస్తోందా..? ” ఆటమ్ బాంబ్ లా పేలింది హెడ్ మేడం గొంతు. నా అనుమానం నిజమైందన్నమాట. ఇక ఈ రోజుతో నాపని అయిపోయింది. ధైర్యాన్ని కూడకట్టుకుని,
“మేడం” మాట తడబడింది నాలిక మెలికపడినట్లు..
” భావేష్ కి ఏం చెప్పావు నువ్వు..?” నోట్లో ఉన్న కాస్త తడి ఆరిపోయింది.
” మేడం…! భావేష్ స్టాఫ్లర్ పిన్ మింగానని చెప్పాడు. వాడు మింగడం నేను చూడలేదు. కాసేపు మింగినంటాడు. కాసేపు మింగలేదంటాడు. అందుకని..” ఒక్క్కొక్క మాట కూడదీసుకుని అన్నాను. మాట పూర్తి కాకముందే..
“అందుకని నువ్వుఅరటిపళ్ళు తినమని సలహా ఇస్తావా..? నువ్వేమైనా డాక్టరువా..?వాడు పిన్ మింగినట్లు అనిపిస్తే వచ్చి నాకు చెప్పాలి కానీ రెండరటిపళ్ళు తినమని బోడి సలహా ఎవరివ్వమన్నారు నిన్ను..?” ఆమె ముందు నేనుండుంటే నా పీక పిసికేసేదే..
“స్టూడెంట్ కి ఏమైనా జరిగితే నాకు చెప్పాలనే ఇంగితజ్ఞానం లేదా..వాడికి ఏమైనా అయితే ఎవరు జవాబుదారీ..? ఇదిగో భావేష్ వాళ్ళ అమ్మతో మాట్లాడు”మేడం స్వరంలో విపరీతమైన కోపం. నాలో విపరీతమైన దడ.
రాబందును చూసినా పికిలి పిట్టలా వణికిపోతూ సెల్ ని చెవ్వుకి మరింత దగ్గరగా ఆనించుకున్నాను.
అవతల పక్క నుంచి ఎవరెవరివో పెద్ద పెద్దగా అరుపులు, పెడబొబ్బలు, తిట్లు, విపరీతమైన ఏడుపు కలగలిపి వినిపిస్తున్నాయి.
“మేడం..చెప్పండి. మా భావేష్ లేక లేక మాకు పెళ్ళైన పదేళ్లకు పుట్టిన బిడ్డ. వాడిని మేము ఎంత గారంగా, జాగ్రత్తగా చూసుకున్నాం అనుకుంటున్నారు..! వాడు స్టాఫ్లర్ పిన్ మింగాడా. నిజం చెప్పండి..మిమ్మలిని ఏమి అనము. చెప్పండి మేడం ఆమె వెక్కుతోంది.
వెనువెంటనే “ఈ ముండలను అడిగేదేంది అసలు. పద పోలీస్ స్టేషన్ కి పోయి స్కూల్ మీద, ఆ టీచర్ మీద రిపోర్ట్ ఇద్దాం. అప్పుడు నిజం కక్కుతారు” భావేష్ నాన్న అరుపులు అనుకుంటా అవి. ముద్ద ముద్దగా వినపడుతున్నాయి. అతను ఓ సారి మద్యం తాగేసి మేడం మీదకు గొడవకు వచ్చాడు పిల్లల ఫీజు విషయంలో. అతని గొంతు వినగానే నా పైప్రాణాలు పైనే పోయాయి.
వెన్నులో వణకు మొదులైంది నాకు. ఒక్క చిన్న పొరపాటు. వాడు ‘పిన్ మింగాను’ అన్నప్పుడు వెళ్లి మేడం కి చెప్పి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. ఆమె నుంచి తప్పించుకోవాలని పెనుము మీద నుంచి పొయ్యిలో పడ్డాను ఇప్పుడు.
“భావేష్ పిన్ను మింగడం అయితే నేను చూడలేదు. పిలగాడు బాగానే ఉన్నాడు అని మేడం కి చెప్పలేదు” మాట పూర్తీ చేసేలోగా ఫోన్ కట్ చేసారు .
భావేష్ నిజంగానే పిన్ మింగాడేమో.. వాడికి ఏం ప్రమాదం రాలేదుగా..నా మనసులో ఓ పక్క బాధ, వాళ్ళన్న మాటలకు.. మనసు నిలవలేదు.
పది సార్లు ఫోన్ చేస్తే మేడం ఫోన్ ఎత్తింది. “భావేష్ కి ఎలా ఉంది మేడం ఇప్పుడు ” గొంతులో వణకు తగ్గలేదు నాకు.
“నువ్వు చేసిన ఘనకార్యానికి ఎప్పుడూ ఇటు రాని మన కరెస్పాండంట్ సార్ కూడా వచ్చాడు. భావేష్ ని పీ.టీ. సారు డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లాడు”
“మేడం..నేను స్కూల్ దగ్గరకు వచ్చేదా..?” కరెస్పాండంట్ సారు వచ్చాడంటే ఇక ఈ స్కూల్లో నా ఉద్యోగానికి నూకలు తీరినట్లే.
“ఎందుకు..? ఇంకో గంటలో ఇద్దరికీ పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి పోదాం. జైల్లో కూర్చుని తీరిగ్గా అరటిపళ్ళు తిందాం ” విసురుగా ఫోన్ పెట్టేసింది మేడం. అది వ్యంగ్యమో..వెటకారమో..కోపమో.. మేడం స్వరం అంచనా వేయలేకుండా ఉంది.
శ్రీవారు ఇంటికి వస్తూ తెచ్చిన కవర్ చూసి అదిరిపడ్డాను. కవర్ నిండా అరటిపండ్లు. ” ఆ కవర్ అక్కడ దూరంగా పడేయండి ” భయంగా చూస్తూ అరిచాను.
“ఏంటి రజని..! కవర్లో ఉండేది అరటిపండ్లే కదా. ఏదో బాంబు ఉన్నట్లు భపడతావేమి..!” నా వంకా అమితాశ్చర్యంగా చూస్తూ శ్రీవారు.
బాంబు అయినా అంత భయపడేదాన్ని కాదేమో ఆ క్షణం. స్కూల్లో జరిగింది చెప్పక తప్పలేదు. మేడం ఫోన్ గురించి కూడా చెప్పాను.
ఉచిత సలహాలు ఇవ్వకూడదు అనుకున్నాడేమో మౌనంగా రెండు నిముషాలు నా వంక జాలిగా చూసి ఏమి ఎరగనట్లు గదిలోకి వెళ్ళాడు ఆయన. మళ్ళీ కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని పట్టువదలని విక్రమార్కిలా పి.టీ. సారుకి ఫోన్ చేస్తూనే ఉన్నాను.
ఇక శ్రీవారు, పిల్లలు నా వాలకం చూసి, ఇక నేను వంటింట్లోకి పోయే స్థితిలో లేనని రూఢి చేసుకుని వాళ్ళు చేతులు కాల్చుకునేదానికి పోయారు .
పీ.టీ. సారుకి వంద సార్లు ఫోన్ చేశాను. ఊహు. స్విచ్ ఆఫ్ అని వెక్కిరిస్తోంది ఫోన్. రెండరటిపళ్ళ సలహా నా కొంప ముంచుతుందని నేనూహించలేదు అసలు.
నా పరిస్థితి అర్ధమై ” అంత రిస్క్ ఎందుకు పడతావు రజని..స్కూల్ మానేస్తే పోలా..?” ఇక ఉండబట్టలేక ఉచిత సలహా ఒకటి పారేసాడు శ్రీవారు.
అసలు ఈ గండం గడిస్తే కదా..ఏమైనా చేయడానికి. నీ టెన్షన్ తో నాకు ఏంపని,నా డ్యూటీ నాది అంటూ సాయంత్రం నుంచి రాత్రిలోకి మారింది కాలం. చీకట్లు ముసురుకున్నాయి చుట్టుపక్కల. నా మనసులో కూడా.
పీ.టీ. సారు ఫోన్ ఎత్తలేదు. మేడం దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు. ఏ క్షణంలో ఏం వార్త వినాల్సివస్తుందో. భావేష్ గాడు నిజంగా పిన్ను మింగాడేమో. ఎంత పొరపాటు చేశాను. అప్పుడే మేడం కి చెప్పేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు.
గుగూల్ లో వెతికాను. స్టాఫ్లర్ పిన్ ముడుచుకుని ఉంటే ఏం కాదు. కానీ పిన్ తెరచినట్లు ఉంటే దాని సన్నటి కూసుగా ఉన్న కొసలు కడుపులో పేగులకు గుచ్చుకోవచ్చు. అలా పిన్ కడుపు లోపల ఉంటే స్కానింగ్ చేసి చూసి ఆపరేషన్ చేసి తీయాలి” ఆ సమాచారం చదువుతూ ఉంటే ఇక నాకు శ్రీకృష్ణ జన్మస్థానానికి బదిలీ తప్పదు అనిపించింది. అంతకన్నా ముందు నిజంగా పిన్ మింగి ఉంటే “భావేష్” పరిస్థితి ఏమిటో ఇప్పుడు..! ఎలా ఉన్నాడో బిడ్డ. వాడికి ఏం కాకూడదు. వరద పోటు వచ్చిన నదిలో నీళ్ళలా ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఇక ఆకలి, దాహం, నిద్ర దూరం అయినాయి నాకు
అందరు నిద్ర పోతున్నారు హాయిగా. రేపు నా పరిస్థితి ఏమిటి..? ఇప్పుడు నేను ఏమి చేయాలి..?
కళ్ళు మంట పుడుతున్నాయి తప్ప నిద్ర రావడం లేదు. శ్రీవారు చెప్పినట్లు స్కూల్ మానేస్తే పోతుంది. ఎనిమిది గంటలు నిలబడి, గొంతు చించుకుని పాఠాలు చెప్పాలి. బోర్డు మీద రాయాలి. చాక్ పీసు పొడి అంతా ముక్కుల్లో నింపుకుని ఉబ్బసం తెచ్చుకోవాలి. ఇంకా ఇదిగో ఇలాంటి గండాలు ఎప్పుడొస్తాయో తెలియదు. ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉద్యోగం అంటేనే దినం గండం..నూరేళ్లయస్సు.
పొద్దున ఆరు గంటలకే ఇంటిముందర ఏదో కలకలం. గుండెలు బితుకు బితుకు మంటున్నాయి నాకు. వాకిట్లోకి పోలీసులు వచ్చి ఉన్నారు. వెనుకే భావేష్ తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోతూ. నన్ను బూతులు తిడుతూ. ఆ వెనుకే భద్రకాళిలా హెడ్ మేడం. వెళ్లి వ్యాన్లో కూర్చోండి మేడం. మిమ్మల్ని విచారించాలి” కటువుగా పోలీస్ స్వరం.
“ఎందుకు..భావేష్ కి ఏమైంది” భయంతో నా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి.
“అవన్నీ స్టేషన్ లో మాట్లాడుతారు. పదండి ముందు” లేడి కానిస్టేబుల్ నా జబ్బ పట్టి లాగి వ్యాన్ లో కూర్చోబెట్టింది. వ్యాన్ కదిలింది.
“ఆపండి. నేను ఏ తప్పు చేయలేదు. వాడు పిన్ను మింగడం నేను చూడలేదు. చూడకుండా మింగాడని నేను ఎలా చెప్పను. స్కూల్ లో ఉన్నంతసేపు వాడు బాగానే ఉన్నాడు. పిన్ మింగానని వాడు కూడా ఖచ్చితంగా చెప్పలేదు. నేను ఏ పొరపాటు చేయలేదు. రెండరటిపళ్ళు తినమన్నాను. అంతే. అయ్యో..ఏమండీ.. ఏమండీ..! వాళ్ళు నన్ను తీసుకుపోతున్నారు. ఆపండి..ఆపండి..” వ్యాన్ తలుపు బాదుతున్నాను.
” అబ్బా.. అబ్బా .. నాయనో.. రజనీ.. నా వీపు బాదేస్తున్నావు. నీ బాదుడు ఆపు. రజనీ..పొద్దునే నిద్రపోనీకుండా ఏమిటి నీ అరుపులు. ఏం ఆపాలి” శ్రీవారి గొంతులో విసుగు.
దిగ్గున లేచి కూర్చున్నా..అంటే..అంటే..ఇప్పటిదాకా నేను కల కన్నానా..! చెమటలతో ఒళ్ళు తడిసిపోయింది. పక్కన ఉన్న నీళ్ల బాటిల్ ఎత్తి గట గటా తాగేసాను. వేకువజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు..! ఈ కల నిజం కానుందా.. నాకు జైలు యోగం తప్పదా..! లేచి యాంత్రికంగా పనులు చేశాను.
స్కూల్ మానేయడానికి లేదు. ఈ రోజు నా సబ్జెక్టు సైన్స్ యూనిట్ టెస్ట్ ఉంది. లేని ఓపికా,దైర్యం తెచ్చుకుని ఏమి జరిగినా అంగీకరించాల్సిందే అని నిశ్చయించుకుని ఆటో ఎక్కాను.
తొమ్మిది అయింది. దూరం నుంచే నన్ను ఉరిమి చూసింది మేడం. కసాయివాడి దగ్గరకు మేక పిల్ల వెళ్లినట్లు ఆమె ముందుకు వెళ్లి నిలబడ్డాను.
“భావేష్ కి ఎలా ఉంది మేడం..సారీ మేడం .. నా వల్ల మీరు మాటలు పడ్డారు” నా మాటలు పూర్తి కాకముందే
” నీకు ఈ ఒక్క రోజే..నా బతుకు ఎప్పుడూ ఇంతే. నా కళ్ళ ముందు కనిపించకుండా క్లాసులోకి పోండి ముందు” విరుచుకుపడింది మేడం.
నోటికి అడ్డంగా చేయి పెట్టుకుని నవ్వుని ఆపుకుంటోంది శ్రావణి టీచర్ నా వెనుక నిలబడి.
నా సందేహం తీరలేదు కానీ ఈ రోజుకి గండం గడిచినట్లే, భావేష్ కి ఎలా ఉందో ఏమిటో ..!బతుకు జీవుడా అనుకుని మా త్రిశంకు స్వర్గం మెట్లను పరిగిస్తూ ఎక్కాను వెనక్కి చూడకుండా.
ఉదయపు ప్రేయర్ అయిపోయింది.అసెంబ్లీ హాల్ నుంచి పిల్లలు క్లాసులకి వస్తున్నారు. నా కళ్ళు భావేష్ కోసం వెదికాయి. ఎక్కడా వాడి జాడ లేదు. పీ.టీ. సారు కూడా కనపడలేదు.
ఈ రోజు నా గతి ఏమిటో..?ఇక ఈ స్కూల్లో నా అస్తిత్వం ఏమిటో..?
క్లాసులోకి పిల్లలందరూ వచ్చారు. ఒక్క భావేష్ తప్ప. మునెమ్మ వచ్చి అటెండెన్స్ రిజిస్టర్, చాక్ పీసులు ఇచ్చివెళ్ళింది. మళ్ళీ ఒకసారి ఆశ చావక బయటకు చూసాను. ఊహు. భావేష్ జాడ లేదు.
నిరాశగా అటెండెన్స్ రిజిస్టర్ తెరిచాను. ” భూమికా.. “ఎస్ టీచర్”,. లోపా ముద్రా.. “ఎస్ టీచర్” , అంకిత్ ..”గుడ్ మార్నింగ్ టీచర్”
వరుసగా పేర్లు పిలుస్తున్నా.
“ఎస్క్యూజ్ మీ టీచర్ “
గొంతు వినగానే రిజిస్టర్ పక్కన పడేసి దిగ్గున లేచి పరిగెత్తా.. ఎదురుగా మహా ఉషారుగా భావేష్. వాడిని చూడగానే నా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి.
“భావేష్..ఎలావుందీ నీకు..! “
“బాగుంది టీచర్”
“మరి నిన్న పీ.టీ. సారు డాక్టర్ దగ్గరకి నిన్ను తీసుకువెళ్లాడు కదా”
“అవును టీచర్”
“స్కానింగ్ చేసారా నీకు..? పిన్ కనపడిందా నీ పొట్టలో..?
“స్కానింగ్ చేయలేదు టీచర్ “
మరి డాక్టర్ ఏం చెప్పాడు..? ” ఉద్వేగం ఆపుకోలేక పోతున్నా నేను
“రెండరటిపళ్ళు తినమన్నాడు టీచర్” నోరంతా తెరచి నవ్వుతూ భావేష్
“ఆ …….”

7 thoughts on “రెండరటిపళ్ళు”

 1. పిల్లల మీద అంతులేని ఆపేక్ష అవ్యాజమైన ప్రేమ, అత్యున్నత భాధ్యత కలిగిన ఒక ఉన్నత సున్నిత మనస్కురాలయిన ఉపాధ్యాయురాలు తన ప్రమేయమేమీ లేకుండా జరిగిన చిరు సంఘటనకు పొందిన, మానసిక క్లేశము, తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, ఆ విద్యార్థికి హానీ ఏమీ జరుగలేదని తెలిసి పొందిన అనంత ఆనందం, ఆమెలో పొంగిన తల్లిప్రేమ ఈ కథను అతున్నత స్థాయిలో నిలిపాయి. రచయిత్రి కథా మంజరి రోహిణి వంజారి గారికి నా హృదయపూర్వక అభినందనలు💐💐👏👏🌷🌷👌👌🎉🎉

  Reply
 2. కథ బాగుంది … అలా చదివేయలని అనిపించింది. బాగా వ్రాసారు. Tention క్రియేట్ చేసారు. అందుకే ఆపాలి అనిపించలేదు. మధ్యలో యమగోల కల లా చెప్పారు. కథ సుఖాంతం అయింది. All the best madam

  Reply
 3. చాలా సంతోషం రోహిణిగారూ! హృదయాన్ని కదిలించిన ప్రతి సందర్భాన్నీ సన్నివేశాన్నీ కథా కవితావస్తువులుగా తీసుకొని సాహిత్యసృజన శీలురుగా సృజన చేసి , ఇటు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ అటు హృదయభారాన్ని తగ్గించుకుంటున్నారు.సమాజ బాధే మన బాధ కదా! సామాజిక బాధల్ని మన బాధలుగా ఆత్మీకరణ చేసుకున్నప్పుడు మన హృదయంలో నుండీ వెలువడే అక్షరాలు కూడా పాఠకుల్ని కదిలిస్తాయి.అప్పుడే అది సాహిత్యమవుతుంది.Go a head.

  Reply
 4. హాస్యమూ ఉత్కంఠ కలగలిపి నింపారు. కథ చాలా బాగుంది. రోహిణి గారికి అభినందనలు.

  Reply
 5. కథ ఆపకుండా చదివించింది .చివరి అక్షరం వరకూ ఉత్కంఠ రేపింది .ప్రైవేట్ స్కూళ్ల లో టీచర్ల పట్ల అధికారుల ప్రవర్తన ఎలా వుంటుందో చక్కగా చెప్పారు .నేను ఈ రచయిత్రి రాసిన కథల్లో చదివిన మొదటి కథ ఇది .మిగిలిన కథలు కూడా చదవాలనిపించేలా ఉంది కథ .అభినందనలు రోహిణీ గారూ

  Reply
 6. Stapler pin ..రెండు అరటి పళ్ళు…. ఎంతో ఇంటరెస్టింగ్ గా సాగింది…నైస్ మేడం. అభినందనలు..

  Reply

Leave a Comment