చిన్న రోగానికే పచారిసామాన్ల చీటీ అంత పొడుగున పరీక్షలు, మందులు రాసేసి ఆసుపత్రి అంటేనే బెదిరిపోయేలా చేసే డాక్టర్లు ఉన్న ఈ కాలంలో కూడా వారివారి స్తోమతని బట్టి ఎంత ఫీజు ఇస్తే అంత తీసుకుని, తన ధైర్య వచనాలతోనే సగం రోగాన్ని తగ్గిస్తూ, చక్కని వైద్యం చేసే ఓ డాక్టర్ కథే ఈ “రూపాయి దేవుడు”. ఈ నెల [డిసెంబర్] “నవమల్లెతీగ” మాసపత్రికలో నా కథ “రూపాయి దేవుడు”. “నవమల్లెతీగ ” సంపాదకులు “కలిమి శ్రీ” గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో..”రూపాయి దేవుడు” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ..
ఉగాది పండక్కి ఐద్రాబాదు నుంచి అక్కావోళ్ళు వొచ్చిన సంబరం రవంతసేపు కూడా నిలవకపాయనే.
ఏకోజామునే నల్లరామ్మూర్తి ఇంటి కాడ ఉండే ఏప చెట్టెక్కి ఏప పూత కోస్తా పెళుసు కొమ్మ మీద కాలేసి కొమ్మతో గూడా కింద పడినాడు మోహనన్న. కాలు మెలిక పడింది. కుంటుకుంటా ఇంటికాడికి వొచ్చి నొప్పి అంటా ఏడుపు ఎత్తుకున్నాడు.
అక్క కొడుకు విసిగాడు ఉగాది పచ్చడి చానా రుచిగా ఉండాది అంటా అమ్మని అడిగి మరిగింత చింతపండు రసం ఏపిచ్చుకోని రెండు లోటాల ఉగాదిపచ్చడి తాగేశాడు. మధ్యాన్నం అన్నంలోకి మినప వడలు, సగ్గుబియ్యం పాయసం, చేమగడ్డల పిండిమిరియం బాగుంటాదని అమ్మ చేత చైపిచ్చుకోని అది కూడా దండిగా తినేసాడు. అన్నాలు తిని అందరం బాతాఖానికి కూర్చున్నాం. చార్మినార్ కాడ లాడ్ బజార్ లో రంగురంగుల రాళ్ళ గాజులు భలే ఉంటాయని, జూ పార్కులో చానా ఏనుగులు ఉండాయని, ఈడ మనం వీధులు అంటే ఆడ గల్లీలు అంటారని అక్క ఐద్రాబాదు విశేషాలు చెప్తా ఉండాది.
అర్ధగంట కూడా అవలే, విసిగాడు దొడ్లోకి లగెత్తినాడు. అమ్మ పోయి వాడికి చెంబుతో నీళ్లు ఇచ్చోచ్చింది. మళ్ళీ పది నిముషాలు కూడా కాకముందే రెండోతూరి దొడ్లోకి పోయినాడు. వాడికి బేదులు మల్లుకున్నాయి. పది తూర్లు ఇంట్లోకి, దొడ్లోకి పోయొచ్చి వాడిపోయిన తోటకూర కాడ మాదిరి నీరసంగా నులక మంచమ్మీద వాలిపోయినాడు. అమ్మ వాడికి బార్లీ జావా కాచిచ్చింది. మెంతులు మింగిచ్చింది. అయినా బేదులు కట్టుకోలా.
ఒకపక్క మోహనన్న కాలుబెణికిందని ఏడస్తా ఉండాడు. వాళ్ళిద్దరి బాధ చూసి అమ్మ, ఉమక్క బయపడతా ఉండారు.
టైం సాయంత్రం ఐదు అయింది. ఇకనిట్టగాదని నాయన ఉండుకొని వాకిట్లోకి పోయి చెక్క తలుపు తీసి తాగుబోతు రవనడిని కేకేశాడు రిక్షా కట్టమని.
మోహనన్నని, విసిగాడిని రిక్షా ఎక్కించి, రిక్షా ఎనకీడతానే నేను, నాయినా నడస్తా పుల్లయ్య డాక్టర్ ఇంటికాడికి పోయినాం. యెద్దలరేవు సంఘం మొదట్లో ఉండే మా బడికి ఎదాళంగానే పుల్లయ్య డాక్టర్ వోల్ల ఇల్లు ఉండేది. రెండంతస్తుల పెద్ద ఇల్లు. ఇంటిముందర పెద్ద వరండా. దానికి అనుకుని ఒక రూము ఉండాది .ఆ గదిలోనే టేబుల్, దానిమీద మందులు, ఇంకో పక్క ఆకుపచ్చటి తెర ఎనక ఇనప మంచం, దాని మీద గుడ్డ ఏసి ఉండాది. ఆ మంచం మీద పనుకోబెట్టి డాక్టర్ పరీక్షలు చేస్తాడు. ఇంటి ముందర పక్క గేటుకమ్మిడిగానే మందుల అంగడి ఉండాది.
మేము ఇంటిలోపల పొయ్యే తలికే వరండాలో బల్లల మీద చానా మంది కూర్చొని ఉండారు. ఇంటిలోపల నుంచి మంత్రాలూ ఇనిపిస్తా ఉండాయి. దేవుడి కాడ ఎలిగిచ్చిన సాంబ్రాణి కడ్డీల వాసన వరండాలోకి వస్తా ఉండాది. పూజ అయితేనే పుల్లయ్య డాక్టర్ బయటకి వచ్చేది.
మోహనన్న, విసిగాడిని కూర్చోబెట్టి నాయన నిలబడుకోని ఉండాడు. అప్పుటికే వరండా అంతా పేషెంట్స్ తో నిండిపోయి ఉండాదికొంతమంది మిద్దిమెట్లమీద కూచోని ఉండారు. ఇంకా వస్తానే ఉండారు. నేను బల్ల మీద పెట్టి ఉండే డబ్బా చాయ చూస్తా ఉండాను. డబ్బాలో డబ్బుల కాయితాలు, పావలా, రూపాయి బిళ్ళలు సగందాకా నిండి ఉండాయి.గదిలోపల మంత్రాలు ఆగిపోయి దేవుడి గంట శబ్దం వినిపిస్తా ఉండాది. అందరం డాక్టర్ కోసరం ఎదురుచూస్తా ఉండాము.
ఐదు నిముషాలు అయినంక పుల్లయ్య డాక్టర్ వరండాలోకి వొచ్చాడు. తెల్ల చొక్కా, పంచె, మెళ్ళో సెతస్కోప్, నుదుటి మీద విభూది రేఖలు, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకొని ఉండాడు. అందరిచాయ చూసి నవ్వతా వరండాలోకి వచ్చాడు.
వస్తానే పేషెంట్స్ అందరిని ఓ తూరి కలయచూసినాడు. అందరు ఓ తూరి లేచి నిలబడి పుల్లయ్య డాక్టర్కి రెండు చేతులెత్తి దండం పెట్టినారు. షుగర్, ఒళ్ళు నొప్పులకు రోజు చూపిచ్చుకునే వారిని కాస్త వెనక కూర్చోమని ఎక్కువ జరంతో నొప్పులతో బాగాలేనివాళ్ళను ముందుకు పిలిచాడు.
” ఏం చలమయ్య..రాత్రి, పగలు రిక్షా తొక్కతా ఆ వాటాన కష్టపడకపోతే, రెండు దినాలు విశ్రాంతి తీసుకో. జరం, దగ్గు ఎగిరిపోతాయి” అంటానే ధర్మామీటర్ పెట్టి జరం చూసి, చిన్న మందు సీసాలోకి సూది ఎక్కించి సిరంజిలోకి మందులాగి, చలమయ్య జబ్బమీద సూది గుచ్చాడు నవ్వతానే. చీటీ మీద మాత్రల పేర్లు రాసి “నాలుగు రోజులు ఆ సారాయి మందు మానేసి, నేను రాసిన మందులేసుకో, చారాన్నం తిను. అర్థమైందా” అన్నాడు.
“అట్నే సారూ” అంటా మందుల చీటీ తీసుకొని చిన్నగా దగ్గుకుంటా వెళ్ళిపోయాడు చలమయ్య.
నాయన చాయ చూస్తా “ఏం సత్తెయ్య..!పిలకాయలందరిని తీసుకొని వొచ్చావు” అన్నాడు కృపావతమ్మకి బి.పి. పరీక్ష చేస్తానే.
“మనవడు విశ్వనాధ్ కి పొద్దన్నుంచి బేదులు మల్లుకున్నాయి. మోహనుడు చెట్టు పైనుంచి పడి కాలు బెణికి నొప్పి అంటా ఉండాడు” అన్నాడు నాయన.
“వీళ్ళకి తోడుగా వొచ్చావా బుజ్జమ్మా” అంటా నా బుగ్గ గిల్లి, అందరిని పలకరిస్తా, పరీక్ష చేస్తా చకచకా మందులు రాసి, అవసరం అయినోళ్ళకి సూది మందు యేసి పంపిస్తా ఉండాడు పుల్లయ్య డాక్టర్. ఒక్కరిని కూడా ఫీజు డబ్బులు ఇంత ఇమ్మని అడగలేదు ఆయన.
అక్కడ బల్ల మీద ఉన్న డబ్బాలో ఎవరికి తోచినంత డబ్బు వారు వేసి పోతారు. సంఘంలో ఉండే చెంచురాముడు అయినా, పెద్ద మిద్దె లో ఉండే రమణారెడ్డి అయినా ఆ డబ్బాలోనే డబ్బులు వాళ్ళకి ఇష్టమైనంత వేస్తే అదే డాక్టర్ ఫీజు అవుతుంది. రూపాయి వేసినా, పది రూపాయలు వేసిన వారికైనా ఒకటే చిరునవ్వుతో, ఆప్యాయంగా వైద్యం చేస్తాడు పుల్లయ్య డాక్టర్. అసలు అణాపైసా కూడా లేదన్న పేద వాళ్లకు మందులు కూడా ఉచితంగా ఇస్తాడు. ఆయన ఇచ్చిన మందుల కంటే ఆయన చెప్పే మాటలకే సగం రోగం నయమైపోతుంది అంటారు అందరు.
ఆయన హస్తవాసి చాల మంచిది అని నెల్లూరు అంతా పేరు ఉండాది పుల్లయ్య డాక్టర్కి. బాలాజీనగర్, యెద్దలరేవు సంఘం, హరినాధపురం, రైలు కట్ట అవతల ట్రంక్ రోడ్ పక్కనుంచి కూడా జనాలు వొచ్చి పుల్లయ్య డాక్టర్ కాడ వైద్యం చేయించుకుంటారు. చక్కిలాల సుబ్రహ్మణ్యం డాక్టర్ చనిపోయాక చాల రోజులు జనాలు పొగతోటలో ఎక్కువ ఫీజులు ఇచ్చి డాక్టర్లకి చూపించుకోలేక తనకలాడిపోయినారు. అదిగో ఆ టైంలోనే పుల్లయ్య డాక్టర్ ప్రాక్టీస్ మొదులు పెట్టాడు. ఐతే నాంకేవాస్తుగా రూపాయి ఫీజు తీసుకుని వైద్యం చేస్తుండడంతో ఆయన్ని కొందరు రూపాయి డాక్టర్ అని, మరి కొందరు డాక్టర్ దేవుడని పిలిచేవారు. యెద్దలరేవు సంఘంలో ఉండే పేద జనాలకు ఆయన ప్రత్యక్ష ధన్వంతరే.
మోహనన్న కాలు బెణికిన దగ్గర ఆయింటుమెంట్ రాయమని ఇచ్చి, విసిగాడిని పరీక్ష చేసి బేదులు కట్టుకునే దానికి మాత్రలు రాసిచ్చాడు పుల్లయ్య డాక్టర్.
“ఈ మాత్రలు మింగి, రాత్రికి మళ్ళా మీ అమ్మమ్మ నడిగి చేమగడ్డ పిండిమిరియం చేయించుకుని తిను”. అంటా నవ్వతా విసిగాడి భుజం తట్టాడు పుల్లయ్య డాక్టర్. విసిగాడు ఆయోమయముగా ఆయన చాయ చూసి తలవూపాడు.
“ఓరి నీ దుంప తెగ. నేను తమాషకంటే, నువ్వు నిజంగా పిండిమిరియం తినేటట్లు ఉండావే. రాత్రికి వీడికి మజ్జిగన్నం పెట్టండి. పొద్దన ఓ తూరి వొచ్చి కనిపించండి” అన్నాడు పుల్లయ్య డాక్టర్.
“అట్నేమని తలూపి నాయన బల్ల మీద ఉన్న డబ్బాకి దండం పెట్టి ఐదు రూపాయలు దానిలో వేసాడు. రెండు రోజులకి విసిగాడికి బేదులు తగ్గిపోయాయి. అక్కవాళ్ళు నెల్లూరులో వారం రోజులు ఉండి హైద్రాబాదుకి వెళ్లిపోయారు.
పొద్దన తొమ్మిది అయింది. నేను స్కూల్ కి పోలేదు. ఇంటికాడనే ఎక్కాలు నేర్చుకుంటా ఉండాను. నాయన సంతపేటకి పోతానని అమ్మకి చెప్పి వీధి చెక్క తలుపు తీసాడు. ఎందుకో వీధిలో జనాలు చానా మంది పరిగిస్తా పోతా ఉండారు. నాయన వెనకే నేను వీధిలోకి పోయినా.
” అబ్బయ్యా కరిముల్లా..ఏంది అందురు అట్టా పరిగిస్తా ఉండారు” నాయన అడిగినాడు .ఆందోళనకి నాయిన చేతులు ఒనకతా ఉండాయి.
“పుల్లయ్య డాక్టరుకి యాక్సిడెంట్ అయిందట. అందురూ డాక్టర్ ఇంటికాడికి పోతా ఉండారు సామే” అన్నాడు కరీముల్లా రిక్షా టైర్ కి పంచరేస్తా
ఆ మాటతో కూడా నాయన సంతపేటకి పోకుండా యెద్దలరేవు సంఘం తట్టుకి పొయ్యేదానికి మళ్లుకున్నాడు. నాయిన వెనకే రిక్షా సుధాకరు, పిండిమిల్లు శీనయ్య, చీటీల అరుణమ్మ అందరం డాక్టర్ ఇంటికాడికి పోయినాం.
డాక్టర్ ఇంటి ముందర అప్పుటికే జనాలు గుంపులు గుంపులుగా చేరి ఉండారు. కొంతమంది చేతల్లో పూలమాలలు ఉండాయి. యెద్దలరేవు సంఘం జనాలు అందురూ అక్కడ గుమిగూడి ఉండారు.
“ఓ లమ్మో.. పుల్లయ్య డాక్టర్ కి ఏమైనాదో దేవుడా..! మాఅందరికి ఆయినే దేవుడు. డాకటరు బాబు చల్లంగా ఉండాలి దేవుడో” అంటా ఆడోల్లు ఎన్నవలు పెట్టి యాడస్తా ఉండారు.
రాత్రి బంధువులింట్లో పెళ్లికి పోయి ఎకువజామునే మద్రాసు నుంచి వ్యానులో వస్తా ఉంటే సత్యవేడు కాడ ఎదురుగా వొచ్చిన లారీ డాక్టరోళ్ళ బండిని గుద్దేసిందని ఎవరో పొద్దనే ట్రంకాలు చేసి చెప్పినారంట. అంతే ఇకన “అదిగో పులి అంటే ఇదిగో తోక” అన్నట్లు పుల్లయ్య డాక్టరు కి పెద్ద ప్రమాదం జరిగిందనే విషయం పుకారు మాదిరిగా క్షణాల్లో ఊరంతా పాకింది. మధ్యాన్నం పన్నెండు అయింది. ఎండ కి తలకాయలు మాడిపోతా ఉండాయి అందురికీ. అయినా సరే ఒక్కరు కూడా ఆడనించి కదల్లే. డాక్టరు కి ఏమైందో ఎవురికీ సరిగ్గా తెలీదు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉండాడో అనే సంగతి డాక్టరు వాళ్ళ ఇంట్లోవాళ్ళు కూడా చెప్పలేకపోయారు. ఈ లోపల జరిగిన ప్రమాదం గురించి రకరకాల ఊహాగానాలు విని డాక్టరు పిలకాయలు కూడా ఏడుపు ఎత్తుకున్నారు.
మూడు గంటలప్పుడు పెద్ద వ్యాను వొచ్చి డాక్టరు ఇంటిముందు ఆగింది. జనాలు అందరు వ్యానుని చుట్టుముట్టారు. కొందురు ఇంటి చేపట్టు గోడలు ఎక్కి చూస్తా ఉండారు. వ్యాను లో నించి ఇద్దరు మనుషులు దిగినారు. అందరం భయంగా చూస్తా ఉన్నాం. కొందరు పెద్దగా ఏడుపు ఎత్తుకున్నారు. వ్యాను ముందు తట్టు నుంచి డ్రైవర్, ఇంకో ఇద్దరు మనుషులు కూడా దిగినారు. బిత్తర ఎక్కువ అయింది మాకు. గుండె దడ దడ కొట్టకుంటా ఉండాది అందురికీ ఏం చూడాల్సివస్తుందనో అని.
అప్పుడు నల్ల చలవ కళ్లద్దాలు పెట్టుకుని, ప్యాంటు, చొక్కా, చొక్కా మీద కోటు వేసుకుని దిగినాడు.
ఆయన్ని అట్టా చూడగానే అందరికళ్ళల్లో మెరుపులు. చిచ్చుబుడ్లు కాలిస్తే వొచ్చినంత మెరుపులు, అందరి కళ్ళల్లో సంతోషం. అందరూ పుల్లయ్య డాక్టరు కాళ్ళ మీద పడిపోసాగారు.
“మీ పాసుగాల. కాస్త డాక్టరు కి ఊపిరి ఆడనీయండి. దూరంగా జరగండి. మద్రాసు నుంచి వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగింది నిజమే. కానీ యాక్సిడెంట్ అయింది వేరే వాళ్ళ వ్యానుకి. డాక్టరు ఉన్న వ్యాను అనుకుని ఎవురో పొరపాటుగా మీకు ట్రంకాలు చేసారు. అక్కడ ప్రమాదంలో దెబ్బలు తగిలినోళ్లని మళ్ళీ మద్రాసుకు పోయి ఆసుపత్రిలో చేర్పించి వొచ్చేతలికి ఈ టైం అయింది ” అన్నాడు పుల్లయ్య డాక్టర్ తో పాటు వచ్చిన నేతాజీ స్కూల్ సుబ్బారెడ్డి.
సెంటర్లో టెంకాయలు అమ్మే సుజాతమ్మ టెంకాయమీద కర్పూరం ఎలిగిచ్చి డాక్టరు చుట్టూతా దిగదుడిచి దిష్టి తీసి టెంకాయని రోడ్డు మీద పగలకొట్టింది. సంఘంలో ఉండే వీరయ్య తాత పెద్ద గుమ్మడికాయలో పసుపు,కుంకుమ పెట్టి డాక్టరు ముఖం చుట్టూ తిప్పి రోడ్డు మీదకి తీసకపోయి గట్టిగా నేలకేసి కొట్టాడు. దబామని పగిలింది గుమ్మడికాయ. పుల్లయ్య డాక్టర్కి తగిలిన దిష్టి ఈ దెబ్బతో వదిలిపోయినాది అనుకుంటా సంఘం జనాలు అందురు చప్పట్లు కొడతా డాన్సులు ఏసేదానికి మల్లుకున్నారు. డాక్టర్ కి ఏమి కాలేదని మేము కూడా తేలికగా ఊపిరి పీల్చుకున్నాం.
పుల్లయ్య డాక్టరు చేతులెత్తి దణ్ణం పెట్టి అందరి తట్టు చూస్తా “నాకోసరమని ఇంత మంది వొచ్చారా..! మీ అందరి అభిమానం చూస్తా ఉంటే నాకు కన్నీళ్లు వస్తా ఉండాయి. మిమ్మల్ని వొదిలి నేనేడకి పోతానని” అంటా చేతి గుడ్డతో కళ్ళు తుడుచుకుంటా.
పూల మాలలు తెచ్చినోళ్ళు పుల్లయ్య డాక్టరు మేడలో పూలమాలలు వేసి “నువ్వు మా దేవుడివయ్యా” అంటా దణ్ణాలు పెట్టినారు. మెడ నిండా పూలమాలలతో పుల్లయ్య డాక్టర్ దేవుడిమాదిరిగానే అవపడ్డాడు మాకు.
వారం దినాలు గడిచినాయి. పొద్దన నుంచి నాకు జరం. నాయన నన్ను పుల్లయ్య డాక్టరు కాడికి తీసుకపోయినాడు. పూజ అయిన కాసేపటికి పుల్లయ్య డాక్టరు బయటకి వొచ్చాడు.
“ఏం బుజ్జమ్మా..ఈ తూరి నీకు జరమొచ్చిందా” అంటా నవ్వతా వొచ్చి నన్ను నోరు తెరవమని ధర్మామీటర్ను ఇదిలిచ్చి నా నాలిక కిందా పెట్టినాడు. అయితే ఎప్పటిలా తెల్ల చొక్కా, పంచె తో కాకుండా ఆ రోజు నల్ల రంగు ప్యాంటు, బులుగు రంగు చొక్కా, చొక్కా పైన మల్లె పువ్వు మాదిరిగా ఉండే తెల్లకోటుతో అవపడ్డాడు మాకు రూపాయి డాక్టరు, దేవుడు డాక్టరు అని మేము ఆప్యాయంగా పిలుసుకునే పుల్లయ్య డాక్టరు.
పుల్లయ్య డాక్టర్ కొత్తగా అవపడతా ఉండాడు అని సంఘం జనాలు చానా రోజులు చెవులు కొరుక్కుంటానే ఉండారు.
Congratulations 🎉🎉
అమ్మా రోహిణీ,
ఎంత బాగా వ్రాశావమ్మా. కళ్ళకు కట్టినట్లు. పుల్లయ్య గారు స్వయంగా నాకు బాగా తెలుసు. Dr నారాయణయ్య వద్ద ఆయనా, పట్టయ్యా, జయమ్మా staff. ఎప్పుడూ బాగా పలకరించి అభిమానంగా ఉండేవారు.
కథనం, అందులో వాడిన నెల్లూరి యాస excellent.
త్వరలో మరో కథ.