రా రా కృష్ణయ్యా

కృష్ణా….

మన్ను, వెన్నలు తిన్నది ఇక చాలయ్యా

వన్నె,వలువలు దోచింది కూడా ఇక చాలు చాలయ్యా

“దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై సంభవామి యుగే యుగే”

అంటూ దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి వస్తానన్నావు

కలియుగానికి మాత్రం రాకుండా శీతకన్నెసావు ఏమయ్యా…

ఇపుడు కలియుగం అంటే కంసులు,పూతనలు,

మారీచులు,శిశుపాలురూ వందలు,వేల సంఖ్యలో

తిరుగాడుతున్న కలి కాలమిది…

దొంగతనాలు,దోపిడులు, హత్యలు, అత్యాచారాలు,

వివక్షలు,ఊచకోతలు హెచ్చుమీరిన దుష్టయుగం ఇది..

కాలుష్యాలు,కరోనాలు అంతుచిక్కని అంటురోగాలు

ప్రభలిన రోగ లోకం ఇది..

మతి తప్పిన మానవజాతి ద్వేషం అజ్ఞానం అనే ముసలంతో

తాము కూర్చున్న చెట్టు కొమ్మను తామే నరుక్కుంటున్నారు…

తమ వేలితో తమ కంటినే పొడుచుకుంటున్నారు..

ఇన్ని అవకరాలతో కుళ్ళిపోయి కునారిల్లుతున్నా

తన బిడ్డలను చూచి భూమాత శోకంతో తల్లడిల్లుతోంది…

అన్నీ రూపాలలో నేనున్నాను అన్నావు…

కృష్ణ తత్వంతో జగతినిప్రేమ మయం చేస్తావో

ఉగ్ర నరసింహునిలా దుష్టుల పేగులు

చీలుస్తావో నీ ఇష్టం…

నీ విశ్వరూపాన్ని చూపించే వేళయింది…

ఇంకా జాగు చేయక ఈ కృష్ణాష్టమి కన్నా

వడివడిగా రావయ్యా కన్నయ్యా…

మమ్ము బ్రోవుమయ్యా జగన్నాటక సూత్రధారి

నీకిదే మా వందనం…

వంజారి రోహిణి

11-08-2020

Leave a Comment