యుద్ధం

విజయ తీరం చేరాలంటే యుద్ధం తప్పనిసరా..? “జోర్దార్” పత్రికలో నా కథ “యుద్ధం”. సంపాదకులకు ధన్యవాదాలు.
“యుద్ధం” కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్తారు కదూ..🙏🙏🌹🌹

సమాచారం అందిన వెంటనే ఆందోళనగా ఆసుపత్రికి బయలుదేరాడు కరుణాకర్ మాస్టారు. ఏం జరిగిందో తెలియక, ఆతృతగా వెళుతున్న ఆయనకు ట్రాఫిక్ జాం అడ్డు పడుతూ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తన ప్రియ శిష్యుడు గౌతమ్ కి ఏమైందో తెలియక అతని మనసు ఆరాటపడుతోంది. మోపేడు బండిలో ఆసుపత్రికి చేరుకునేదానికి అర్ధగంట పైనే పట్టింది కరుణాకర్ మాస్టారుకి.
అక్కడ ఆసుపత్రి గదిలో మంచం మీద నిస్సారణంగా పడివున్నాడు గౌతమ్. చేతికి గుచ్చియున్న సిరంజీ నీడిల్ నుంచి సెలైన్ వాటర్ గౌతమ్ ఒంట్లోకి ఎక్కుతోంది. మంచం పక్కనే అతని తల్లిదండ్రులు ఉన్నారు. ఒకపక్క బాధ, ఆందోళన, మరోపక్క కోపం, ఆవేదన కొట్టొచ్చినట్లు వాళ్ళ కళ్ళల్లో కనపడుతున్నాయి. కరుణాకర్ మాస్టారిని చూడగానే గౌతమ్ వాళ్ళ అమ్మ సుధీర చీర కొంగు నోట్లో కుక్కుకుని బావురుమంది.
గౌతమ్ వాళ్ళ నాన్న ప్రభాకర్ కరుణాకర్ మాస్టారిని చూస్తూ
“చూడండి సర్, గౌతమ్ ఎంత పని చేసాడో.. వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. వాడి ఫీజుల కోసం మేము ఖర్చులు తగ్గించుకుని వాడిని మంచి కార్పొరేట్ కాలేజీలో చేర్పించాం. వాడిని ఇంజనీర్ గా చూడాలని ఎంతో తపించిపోయాం. వాడి చదువు కోసం ఊర్లో పొలం కూడా కొంత అమ్మాల్సివచ్చింది. ఈ రోజు వీడు పాలపొంగు మీద నీళ్ళు చిలకరించినట్లు మా ఆశలను అడియాసలు చేసాడు. అనుకున్నారు. ఎంత ఖర్చు వీడిమీద పెట్టాం అనుకున్నారు. అంతా బూడిదలో పోసిన పన్నీరు చేసాడు. వీడు సరిగా చదవక ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ సూసైడ్ కోసం ప్రయత్నించి నలుగురిలో మా పరువు తీసాడు” అన్నాడు గౌతమ్ వంక చూస్తూ.
కన్న బిడ్డ ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు అనే బాధ కన్నా, వాడికి ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు, తమ పరువు పోయే పనిచేసాడు అనే విషయాలు గౌతమ్ తల్లిదండ్రులను ఎక్కువ బాధించాయి అనిపించి వాళ్ళ మీద కోపం, జాలి ఒకే సారి కలిగాయి కరుణాకర్ మాస్టారికి.
“మీరు ఏం అనుకోనంటే నాదొక మాట ” అన్నాడు ఆయన.
ఏమిటన్నట్లు చూసాడు గౌతమ్ తండ్రి ప్రభాకర్.
” తల్లిదండ్రులుగా మీకు గౌతమ్ ఎంత ముఖ్యమో, చిన్నప్పటినుంచి నా ప్రియ శిష్యునిగా వాడు నాకు అంతే ముఖ్యం. గౌతమ్ పదవ తరగతి వరకు చాల బాగా చదివాడు. అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు కదా” అన్నాడాయన అచేతనంగా పడుకుని ఉన్న గౌతమ్ వంక బాధగా చూస్తూ.
” అవును సార్. ఆ తర్వాతే వాడి బుద్ధి గడ్డి తినింది. చదవడం తగ్గించేసాడు” ఇద్దరు కూడబలుక్కుని అన్నారు కొడుకు వంక చూస్తూ..
“ఇప్పుడు నేను అడిగినదానికి సమాధానం చెప్పండి” కాస్త అసహనంగా అన్నాడాయన
గౌతమ్ అమ్మ, నాన్న ఇద్దరు మౌనంగా ఆయన వంక చూసారు.
కాలేజీలో చేర్పించేటప్పుడు గౌతంకి ఏ గ్రూప్ ఇష్టమో, వాడు ఏం చదవాలనుకుంటున్నాడో వాడిని అడిగారా మీరు..?” సూటిగా వారి వంక చూస్తూ అడిగాడు మాస్టారు. సమాధానం చెప్పలేక తలదించుకున్నారు వారు. ఎందుకంటే గౌతమ్ సోషల్ గ్రూప్స్ తీసుకుంటానన్నా వారించి, బలవంతంగా వాడిని మ్యాథ్స్ గ్రూప్లో చేర్పించారు వాళ్ళు.
” అందరు తల్లిదండ్రుల్లా మేము కూడా మా బిడ్డ ఏ ఇంజనీరో, డాక్టరో కావాలని ఆశపడ్డాం “అన్నాడు గౌతమ్ నాన్న
“సరే ఇప్పుడు వాడికి ప్రాణగండం తప్పింది కదా. వాడికి స్పృహ వచ్చాక నాతో తీసుకు వెళ్ళి కొన్నాళ్ళు మా ఇంట్లో నా దగ్గర ఉంచుకుని చదివిస్తాను. మీకు సమ్మతమైతే” అంటూ వారి అనుమతి కోసం చూసాడు కరుణాకర్ మాస్టారు.
అంగీకారంగా వాళ్ళు తల ఊపారు ఏ భావం లేకుండా.
కాలచక్రంలో నెల రోజులు సెలవంటూ వెళ్లిపోయాయి. కరుణాకర్ మాస్టారి దంపతుల ఆత్మీయ సంరక్షణలో గౌతమ్ ఆరోగ్యం కుదుట పడింది. ముఖం కాస్త తేటంగా కనపడింది. గౌతంకి దగ్గరగా కూర్చుని ” ఇప్పుడు చెప్పారా.. చనిపోవాలని ఎందుకు ప్రయత్నం చేసావు నువ్వు ” లాలనగా అన్నాడు మాస్టారు గౌతమ్ కళ్ళలోకి చూస్తూ..
” సార్..నేను ఓడిపోయాను. నాకు ఇష్టమైన చదువు చదవలేకపోయాను . అమ్మ, నాన్న వాళ్ళు చేర్పించిన గ్రూప్ లో సరిగా చదవలేకపోయాను. ఎంసెట్ ర్యాంక్ రాలేదు. అమ్మ, నాన్న నాకు ర్యాంక్ రాలేదని ఏం చేస్తారో అని భయం వేసింది. జీవితంలో నేను గెలవలేను. ఇక నేను బ్రతికి ఉండి వ్యర్థం అని చనిపోవాలనుకున్నాను” కరుణాకర్ మాస్టారిని పట్టుకుని బోరుమని ఏడ్చాడు గౌతమ్.
” గౌతమ్ ఊరుకో నాయనా. గెలుపు అంటే అర్ధం ఏమనుకుంటున్నావు నువ్వు. ” పసిడి పతకాల హారం, కాదురా గెలుపు తీరం, ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం” అని ఓ సీని కవి అన్నారు.
ఇక్కడ ఆటైనా, చదువైనా గెలుపంటే ర్యాంకులు, బహుమతులు, చప్పట్లు, పొగడ్తలు కాదు. మన గురించి మనం తెలుసుకోవడం. మనకు ఏది ఆసక్తో, మన శక్తి, తెలివితేటలు ఎంతో మనకి తెలిసినప్పుడు మనకి ఇష్టమైన దానికోసం ఎంత కష్టానైనా భరించగలుగుతాం. అప్పుడు గెలుపు, పతకాలు మనలను వెతుక్కుంటూ వస్తాయి. గెలుపు కోసం మనం మనకు ఇష్టమైన రంగంలో ఇష్టంగా పోరాటం చేయాలి. నిరంతరం శ్రమించాలి. ఇంట్లోవాళ్లను ఒప్పించాలి. అంతే కానీ ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికిపంద చర్య. బ్రతికి, గెలిచి నువ్వెంటే ఏంటో లోకానికి చూపించాలి. దానికి కొండంత ఓర్పు, ఇంట్లో వారిని ఒప్పించే నేర్పు, సహనం, కష్టపడే తత్వం అలవరచుకోవాలి. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అర్ధం అయిందా..? ఇక ఎన్నడూ చనిపోవాలని ప్రయత్నం చేయనని నాకు మాట ఇవ్వు ” అన్నారు గౌతమ్ ని అనునయిస్తూ చేయి చాపి.
మాస్టారి చేతిలో చేయి వేసి ” అర్ధం అయింది మాస్టారు. ఇక నుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను” అన్నాడు గౌతమ్ దృఢమైన సంకల్పంతో..
కరుణాకర్ మాస్టారు ఇచ్చిన స్ఫూర్తి, జీవితం పట్ల, గెలుపు పట్ల ఆశాభావం ఆ పసివాడి మనసులో ఆత్మవిశ్వాసాన్ని మెండుగా నింపాయి. రేపు భవిష్యత్ లో ఆ పసివాడు ఓ గొప్ప న్యాయవాదో లేదా జిల్లా కలెక్టరో కావచ్చు. కాలం ఓ ఇంద్రజాలం కదా..ఏమైనా జరగవచ్చు.

1 thought on “యుద్ధం”

  1. Meenakshi srinivas

    మంచి సందేశాత్మక కథలు వ్రాస్తారు మీరు. నిజమే అందరి తల్లి, తండ్రులూ చేసే తప్పు అదే. తమ ఇష్టాలనీ, కోరికలని పిల్లల మీద రుద్దేస్తారు. వారి అభిమతం తెల్సుకునే ప్రయత్నం చేయరు. విలువా ఇవ్వరు. అది చాలా తప్పు.
    అభినందనలు 🌹🌹🌹

Comments are closed.