ముంగిట్లో ముత్యాలు

ఈ రోజు 19-12-2021 నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతి లో నా కవిత “ముంగిట్లో ముత్యాలు”

ఓ పక్క చిరు చీకట్లు – మరోపక్క ఒణికించే తెమ్మెరలు
అయినా లెక్క చేయని పడతి మనోరథంలో జీవం పోసుకుని
ఆమె చూపుడువేలు, బొటనవేలు దీక్షగా కదులుతుంటే
మధ్యన పువ్వు నుంచి రాలే పచ్చని పుప్పొడిలా రాలుతూ
కళ్ళాపి చల్లిన పచ్చటి ముంగిట్లో శ్వేతకాంతులను
సృష్టిస్తున్నాయి ముత్యాల చుక్కలు, రత్నాల ముగ్గులు
విశిష్ట ధనుర్మాస ఉషోదయాన ప్రతి అతివా ఓ సృష్టికర్తే
నింగి నుంచి వంగి హరివిల్లు తనలోని రంగుల్ని నేలమీదికి
ఒంపేసిపోయినట్లు ప్రతి ముంగిలి ఇక ఓ వర్ణచిత్రమే
క్రిస్మస్ చెట్టై దారిదీపాలను తనలో ఇముడ్చుకుని
బాలయేసు జన్మదినానికి సమాయత్తం అవుతుంది
ఆంగ్ల అక్షరాలను తనలో పొదువుకుని Happy New Year
అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది
ముక్కోటి రథమై వైకుంఠం నుంచి దేవదేవుని
సరాసరి ఇలకు దింపి మొక్కు తీర్చుకోమంటుంది
భోగి పండుగ నాడు కొత్తబియ్యపు పొంగలి కుండ అవుతుంది
సంక్రాంతినాడు వాకిట్లో కొలువుదీరిన సిరిపద్మమౌతుంది
పండుగ నెలన ఇంద్రచాపం వంటి ముగ్గులున్న ముంగిళ్ళు
లోగిళ్ళు, పచ్చటి తోరణాల వాకిళ్లు సంతృప్తితో నిండిన
సిరికాంతులు వెదజల్లుతూ ఆనందనిలయాలు అవుతాయి

Leave a Comment