“దిగులు వర్ణం” కవిత్వం గురించి తొలి సమీక్ష. ఈనాటి “జనం సాక్షి” పత్రికలో. పత్రిక సంపాదకులకు, కవి మిత్రులు Physics Arun Kumar గారికి ధన్యవాదాలతో…

చెట్లు, జంతువులు, పుస్తకాలు నా ఆత్మీయ నేస్తాలంటారు రచయిత్రి “నా గురించి లో”..! ఆలోచిస్తే అన్వేషిస్తే ఇందులోనే రోహిణి వంజారి తాలూకు జీవిత మార్మిక కవిత్వం దాగి ఉంది. దిగులు అక్షర వర్ణంతో..ఆవేశంతో కూడిన ఆవేదనల వర్షంతో మానవీయ సందేశం గట్టిగా వినిపించాలనుకుంటుంది. నల్ల సూరీడు కథలు, విజయ మహల్ సెంటర్ కథలు పుస్తకాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలైన రోహిణి “దిగులు వర్ణం” కవిత్వంతో మనల్ని పలకరిస్తూనే, నవ సమాజాన్ని ప్రభావితం చేయడానికి అడుగులేసారు.
మనుషుల మధ్య ప్రేమ వంతెనలు నిర్మించకుండా మతపు ఇనుప గోడలు కట్టే వాళ్ళని చూస్తున్నప్పుడు, కులం, మతం, ప్రాంతం, వర్గం అంటూ విడదీసుకుంటూ, కొట్లాడుకుంటూ జరుపుకునే పోరులో పావులుగా అమ్మలను వివస్త్రలను చేసి వీధుల్లో ఊరేగిస్తున్నప్పుడు, మతం అడిగి మరీ తుపాకీ గుండును గురిపెట్టి కాల్చిన ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడే వాళ్లను చూసినప్పుడు, కిరాతకంగా అత్యంత హేయంగా దిశను చంపిన హంతకులు అమాయకులు అన్నవాళ్లను చూసినప్పుడు, పసిబిడ్డల మానాల్లోకి దుర్మార్గపు రసిని కార్చుతున్నందుకు, యుద్ధభూముల్లో తెగిపడిన అంగాల నుంచి నెత్తురు ఏరులై పారుతూ, గాయాలను మళ్లీ మళ్లీ రేపుతూ శోకంతో ఆర్తనాదాలు చేస్తున్నందుకు… ఇలా ఎన్నో సామాజిక అనాగరిక, అమానుష సందర్భాలను ఎంచుకొని… అక్షర రూపం ఇస్తూ… దిగులు వర్ణం అవర్ణమై వెలుగు కిరణం కోసం పరితపిస్తున్నారు రచయిత్రి.
నాగలి కర్రతో నువ్వు నా గుండెను చీల్చుతూ ఉంటే పసిబిడ్డడు పాలు తాగుతూ లేత పాదాలతో నా గుండెల మీద తన్నినట్లు పరవశించిపోయానంటూ ‘నేల తల్లి’ ఆరంభ కవితలోనే బలమైన భావోద్వేగాలను పాఠకులకు పరిచయం చేశారు. రైతు జీవన బాధలతో పాటు నేల తల్లి గుండె కోతను వినిపించారు. ప్రపంచ పట శిఖరాగ్రానికి దేశపు మువ్వెన్నల జెండాని ఎగిరేయాలనుకుందంటూ ఒలింపిక్స్ లో వినేష్ ఫొగాట్ 100 గ్రాముల రాజకీయ ఆటను వర్ణిస్తూ, భారత ప్రజల హృదయాలు గెలిచి ఆమె ఏనాడో విజేత అయ్యిందంటారు. ‘జీవన్మృత్యువు’ కవితలో… ఆమె మాతృమూర్తి… అమ్మతనం ఆమెకు శాపమైన వరమా? వరమైన శాపమా? నవ మాసాల పురిటి నొప్పుల్ని సమాజం ఆలోచించేలా అద్భుతంగా ఆవిష్కరించారు.
కాసేపట్లో మాయమైపోయే మనసు బంధాన్ని తనివితీరా చూడనివ్వాలని, ఓదార్పు మాటల తూటాలతో అగ్నిపర్వతాన్ని పేల్చవద్దనీ, దుఃఖపు తెరను తెరిచి చూడవద్దన్నారు. ఓ చెంప జననం మరోపక్క మరణం ద్వంద్వ సమాసంలా ఆనందం దుఃఖం… ఇంకెక్కడో ద్వేషం మోసం అసూయ త్రిక సంధిలా తట్లాడుతుంటాయనీ దిగుడు మెట్లు నిర్మించారు. పోయిన వాడిని మళ్లీ మళ్లీ కులం, మతం, రంగు పేరుతో పొడిచి పొడిచి చంపకండంటూ ఆవేదనా చిత్రానికి అక్షర రూపం ఇచ్చారు. పండుగంటే పదిమంది కలిసిమెలిసి పాడుకునే తీయని పాటంటూనే, మన మనసు వాకిట్లో నాలుగు ప్రేమ చుక్కలు పెట్టి నలుగురు మనుషులను కూడగట్టి ఇంద్రధనస్సు రంగులతో అందమైన ముగ్గులు వేశారు.
“గుండెల పై చున్నీ కప్పుకోవాల్సింది మేము కాదు. నీ మనో నేత్రాన్ని కప్పియున్న కామపు శుక్లాలను తొలగించుకోవాల్సింది నువ్వే ఇక”వంటి సినాప్సెస్ తో సత్వర చికిత్స కావాలి ఇక నీ ఒంటినిండా అని రాస్తూ.. పురుషాధిక్య సమాజాన్ని చాలా గట్టిగానే ప్రశ్నించారు.మానవత్వపు పల్లకి బోయివై ప్రేమను మోస్తూ కన్నీటితో పన్నీటితో గుండె గదిలో నింపుకోని మనిషితనాన్ని ప్రేమగా హృదయానికి హత్తుకోమంటూ శాంతి కపోతాలు ఎగురవేశారు. కాల గతిలో కలిసిపోవడం కామన్ అనీ ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదంటూ జీవిత సారాన్ని చెప్పారు. ఇంకా ఈ పుస్తకం నిండా అనాహత, ఇంద్రధనస్సు, ఉనికి, చీకటి దీపాలు, అభ్యుదయం, మమతలదారుల్లో, చంద్రకాంత చెలి, అతడే, నిత్య ప్రేమికుడు, కవచకుండలాలు, భయం నీడలో, స్వేచ్ఛ ఒక స్వప్నం, ధ్యాన సన్నిధి, మా నాయన ఊరు… వంటి శీర్షికలతో ఉన్న కవితలు పాఠకుల హృదయాల్లోకి సూటిగా దూరిపోతాయి. తీసుకున్న అంశాన్ని బట్టి పదాల తీవ్రతను, అమరికను సున్నితమైన శైలిలో రోహిణి మంచి కవితలుగా మలిచారు.
దిగులే అన్ని రంగుల శ్వేతమనీ, వర్ణాలన్నీ చెదురు మదురై తెలుపు ను మాత్రమే చూడాలంటే దిగులు లోతులు చూడాలని రోహిణి వంజారి తపన, ఘర్షణ,తండ్లాట మార్మిక వర్ణ తాత్విక వివరణ రోహిణి కవిత..!
తెలుపు నలుపుల మసక చీకటి చివరి చిగురు వర్ణం రోహిణి కవిత..! అంటూ బ్యాక్ కవర్ పేజీలో ప్రసెన్ రాసిన అక్షరాలు రోహిణి దిగులు వర్ణం లోతును, సామాజిక చింతనను తెలియజేశాయి.రోహిణి తన సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది కవుల, రచయితల రచనలను అభినందిస్తూ ప్రోత్సహించే మంచి మనసున్న వ్యక్తి. ఈ దిగులు వర్ణం కవిత్వం కూడా సమాజంలోని అసమానతలను తొలగించే ఓ వెలుగు దివ్వె అవ్వాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో రచయిత్రి కలం నుంచి ఇలాంటి ఎన్నో మంచి పుస్తకాలు రావాలనీ ఆకాంక్షిస్తున్నాను.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536