మానవతా మూర్తులకు వందనం

ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలిగే టెక్నాలజీ మనకు ఉందిప్పుడు. కానీ మనిషి మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం అసాధ్యం. ఓవైపు సాంకేతికాభివృద్ధి పురోగమనంలో ఉంటే, మానవత్వపు విలువలు మాత్రం తిరోగమన దిశలో పాతాళంలోకి కురుకుపోతున్నాయి. ఇంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న జాత్యహంకారం ఒక్కసారిగా భగ్గున మండి, దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది నిన్నటి మణిపూర్ సంఘటన. మతం రాబందు రెక్కలు విప్పుకుని అంతటా యథేచ్ఛగా తిరుగుతోంది. మనిషన్నవాడు అంతరించిపోయి విద్వేషం రాజ్యమేలుతుంటే ఇక మానవత్వం గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు హాస్యాస్పదం అవుతోంది.
కుటుంబంలోని సభ్యులమధ్యే సఖ్యత లోపిస్తోంది. ఇక కులం, మతం, ప్రాంతం, జాతుల మధ్య వైరం, స్వార్ధం, అసూయ పెరిగిపోతున్నాయి. అలా పెరగడానికి కొన్ని అసాంఘిక శక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో పొంచి ఉండి సమయం చూసి విద్వేషపు విషాన్ని చిమ్ముతూ మనుషుల మధ్య, మనసుల మధ్య విద్వేషపు అడ్డుగోడలు పనిగట్టుకుని మరీ కడుతున్నారు. ఒక్క విషపు చుక్క చాలు కుండెడు పాలు విషతుల్యం కావడానికి. ఒక్క రెచ్చెగొట్టే విద్వేషపూరిత మాట చాలు. హృదయాన్ని మలినపరచడానికి. అడ్డుగోడలు ఇనుపగోడలై ఎత్తుకు పెరుగుతూ మానవత్వపు వంతెనలకు నిట్టనిలువునా కూల్చేవేస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తైతే, నాణానికి మరోవైపు చూస్తే మహోన్నతమైన సేవా మూర్తులు ప్రపంచవ్యాప్తంగా తమ సేవా తత్పరతను చాటుకుంటున్నారు. వారికి కులం, మతం, జాతి, ప్రాంతం అనే విభేదాలు లేవు. ప్రపంచ నలుమూలల ఎక్కడ మహమ్మారులు విజృంభిస్తాయో, యుద్ధభూమిలో తెగిపడిన అవయవాల మధ్య కొనఊపిరితో సాయాన్ని అర్ధించే అభాగ్యులు ఎక్కడ ఉన్నారో, తినడానికి తిండిలేక ఎండిన డొక్కలతో ఎందరు ఆకలికి అన్నమో అని ఆర్తనాదాలు చేస్తారో అక్కడ ఈ సేవా మూర్తులు ప్రత్యక్ష దైవాలుగా తమ సేవలను అందిస్తారు. అటువంటి వారి కోసమే ఓ ప్రత్యేక దినోత్సవం ఉంది అని మనలో ఎందరికి తెలుసు..?సంక్షోభ ప్రభావిత ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మానవతావాదుల అసాధారణ ప్రయత్నాలను గౌరవించడానికి ఈ రోజును నిర్వచించుకుంటారు. సవాళ్ళు, ప్రమాదాలు ఉన్నప్పటికీ, అవసరమైన వారికి అచంచలమైన మద్దతును అందించే వ్యక్తుల, సంస్థల అలుపెరుగని స్ఫూర్తికి ప్రపంచ మానవతా దినోత్సవం నిదర్శనంగా నిలుస్తుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ ప్రపంచ చొరవకు నాయకత్వం వహిస్తుంది. దీనికి ఎటువంటి రహస్య ఉద్దేశ్యాలు, అజెండాలు లేవు. ఉండేది కేవలం సేవా భావం. సామాజిక హింసతో సతమతమౌతున్న ప్రాంతాల్లో కూడా అవసరమైన వారికి ధైర్యంగా తమ సహాయాన్ని అందించడమే వీరి లక్ష్యం. అటువంటి సమయంలో అసువులు బాసిన సేవా మూర్తులను తలచుకుంటూ, వారి నిస్వార్ధ సేవలకు నివాళిగా ప్రపంచ మానవతా దినోత్సవం నిలుస్తుంది.
ఖండాలు, సముద్రాలూ దాటుకుని, ఆస్తులు, అంతస్తులు, అస్తిత్వాన్ని వదులుకుని , దయ, కరుణ, సేవే జీవిత పరమావధిగా చూసుకుని తమ జీవితాన్నంతా సేవకోసం త్యాగం, అంకితం చేసిన మానవతా మూర్తులు ఎందరో ఉన్నారు. మదర్ థెరెసా, సిస్టర్ నివేదితా, డొక్కా సీతమ్మ లాంటి వారు ఈ కోవకు చెందుతారు. ఇంకా మనదేశంలో ఎన్నో మిషనరీలు, రామకృష్ణ మఠం, ఇస్కాన్ లాంటి సేవా సంస్థలు కూడా కులమత బేధాలు లేకుండా సేవలు అందిస్తున్నాయి.
రెండేళ్ళ క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో, ఎందరి ఊపిరుల్లోకి చేరి ఉసురు తీసిందో మనకు తెలుసు. ఆ విపత్కర సమయంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలసిపోయి శవాలు గుట్టలు పేరుకున్నాయో కూడా మనకి తెలుసు. ఆ శవాల గుట్టలో ఉన్నది హిందువా, ముస్లింనా అని ఎవరైనా చూసారా..? శవం పైనుంచి వీచే గాలికూడా తమకు సోకకూడదు అని భయపడుతూ, కుటుంబ సభ్యలే దూరంగా పొతే, ఆ నిర్జీవ దేహాలకు అంతిమ సంస్కరాలు చేసిన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. ప్రాణాపాయం అని తెలిసిన ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు వైద్యం అందించిన ప్రత్యక్ష ధన్వంతురులు ఎందరో ఉన్నారు. పారిశుద్ధ కార్మికుల సేవలు కూడా ఏమి ఎక్కువైనవి కావు. ఆ విపత్కర సమయంలో సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తులు కూడా ఎందరో ఉన్నారు.
వారందరి అభిమతం ఒక్కటే. నిస్వార్ధ సేవా తత్పరత. వారిని స్ఫూర్తిగా తీసుకుందాం . వారంతా గొప్ప సేవలు చేయలేక పోయిన కనీసం మన పక్కన ఉన్నవారికైనా సాయపడదాం. సాయమడిగినవాడు నా కులపోడా, నా మతపోడా అని శల్య పరీక్షలు మానేసి నిస్వార్ధ సేవ చేసి, ప్రజల మనసులు దోచుకున్న మానవతావాదులు అవుదాం. అటువంటి మానవతా మూర్తులందరికి చేతులెత్తి మొక్కుదాం.
19 ఆగష్టు 2023 న జరిపే ప్రపంచ మానవతా దినోత్సవ శుభాకాంక్షలతో..

రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630

Leave a Comment