మమతల దారుల్లో

తెలుగు జ్యోతి పత్రిక ఏప్రిల్ నెలలో ఉగాది కవితల పోటీల్లో ఎన్నుకోబడిన నా కవిత “మమతల దారుల్లో”. తెలుగు జ్యోతి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో🌹🙏

కోటి ఆశలతో మాఇంట్లో అడుగుపెట్టిన మా కూతురు లాంటి కోడలు ” సాయి సాహిత్య” కి ఈ కవిత అంకితం ప్రేమతో ❤️❤️
మమతల దారుల్లో

ప్రయాణం కొత్తమజిలీకి
ఇదివరకెన్నడూ చూడని దారి
ఆశలు దీర్ఘాలై
భయాలు హ్రస్వాలై
ముందుకు సాగే పయనం
అలుపొచ్చి ఆగిపోతే సేదదీరడానికి
అమ్మ పాడిన జోలపాటని
గుండె ఊయల్లో దాచుకుని వెళుతున్నా..
బాటలో పరాకుగా అనిపిస్తే
ఉల్లాసం పొందడానికి
చెల్లి తమ్ముడుతో పెట్టుకున్న
చిలిపి తగాదాలు
వెన్నెల్లో కలిసి పంచుకున్న అన్నం ముద్దలు
వర్షంలో తడుస్తూ ఆడుకున్న ఆటలు
అన్నింటిని జ్ఞాపకాల ట్రంకు పెట్టెలో
భద్రంగా దాచుకుని వెళుతున్నా..
బాటలో అన్నీ కొత్త ముఖాలే
ఎప్పుడూ తారసపడని వ్యక్తిత్వాలు
బెరుకు కలిగితే
కుడిభుజంలా నాన్న ఇచ్చిన ధైర్యాన్ని
ఆసరాగా వెంట తీసుకువెళ్ళుతున్నా..
పయనంలో కొండలు లోయలు
దాటాల్సివచ్చినా
ప్రవాహం వెంట గమనాన్ని
సాగించాల్సివచ్చినా
ఎన్నడూ నీ చేయి విడువనని
అక్కున చేర్చుకున్న
జీవన సహచరుని చిటికిన వేలు పట్టుకుని
కొత్త జీవిత మజిలీలోకి ఇష్టంగా వెళుతున్నా
మమతల పందిరిని అల్లుకుంటూ..

Leave a Comment