మధు

కాళ్ళు, చేతులు లేవు. అయినా ఆ పసివాడు చక్కగా చిత్రాలు గీస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం. అద్భుతమైన చిత్రలేఖన కళాకారుడు మా ఆత్మీయ తమ్ముడు ఆర్టిస్ట్ హర్ష జైన్, అతని చిన్నారి శిష్యుడు మధుసూదన్ ల మధ్య జరిగిన యదార్ధ సంఘటనలే “ఎమ్మెస్సార్ కథా ప్రపంచం 2020″ సంపుటిలో నేను రాసిన ” మధు ” కథా నేపధ్యం. గురు, శిష్యుల సంబంధానికి అద్భుతమైన అర్ధాన్ని చెప్పిన కథ “మధు ” ఈ గురుపూజోత్సవం రోజున మీ కోసం. మలిశెట్టి శ్యామ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలతో. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..

అది కొత్త ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన ఎన్.సి. యూ. ఐ. ఆడిటోరియం అండ్ కన్వెన్షన్ సెంటర్. దేశ, విదేశాల నుంచి వచ్చిన ఎందరో చిత్రకారులు అక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రముఖ విదేశీ జడ్జెస్ తో పాటు హైదరాబాద్ కి చెందిన శ్రీ రామేశ్వర్ బ్రుటా గారు కూడా న్యాయ నిర్ణేతల స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ చిత్ర లేఖన పోటీ లో దాదాపు నలభై దేశాలకి చెందిన కళాకారులూ పాల్గొన్నారు.
” ఇప్పుడు అండర్ ౧౯ విభాగంలో విజేతల పేర్లు ప్రకటించవలసింది గా జడ్జెస్ ని కోరుకుంటున్నాను ” అంటూ ఆ కార్యక్రమానికి సమన్వయ కర్త గా వ్యవహరిస్తున్న చిత్రలేఖన కళాకారిణి అర్పితా సింగ్ అనగానే అక్కడ నిశ్శబ్డం కొన్ని క్షణాలు. జడ్జెస్ ముందుగా తృతీయ, ద్వితీయ విజేతల పేర్లు ప్రకటించారు. చెప్పట్లు మారుమ్రోగాయి. మళ్ళా ఉత్కంఠత. ప్రధమ విజేత కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
అందరి ఉత్కంఠత కు తెర దించుతూ ” ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈస్ ‘ మాస్టర్ మధుసూదన్ ‘ ఫర్మ్ ఇండియా “. ప్రథమ విజేత పేరు ప్రకటించగానే ఒక్కసారిగా కరతాళధ్వనులు మిన్నంటాయి.
” ఎస్ ఐ వన్ ” , “ఐ ఓన్లీ వన్ ” హర్ష గుండెల్లో ఉప్పొంగిన ఆనంద కెరటాలు కడలి కన్నా విశాలమైన అతని కళ్ళ నుంచి జల జలా రాలి ఉరికే సేలయేటిని మించిన వేగంతో చెంపల మీద నుంచి జారి అతని షర్ట్ ని తడిపేసాయి.
తాను, తన ఎదురుగా తన తపన, తన వేదన, తన లక్ష్యం, తన గెలుపు తప్ప ఇంకేం కనపడడం లేదు హర్షా కి. ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని చేతనాచేతన స్వప్నాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని సవాళ్ళు, ఆకలి, దాహం అనే మాటలు అనుభూతిలోకి వచ్చి ఎన్ని రోజులైంది తనకు. ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో, ఏమైనా తన ఎరుకలోకి వచ్చాయా ఇన్నాళ్ళు.
” సార్, హర్షా సార్ ప్రవల్లిక తనని కుదిపేస్తుంటే ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చాడు హర్షా. ‘హర్షా ది గ్రేట్ ” హర్షా మాస్టర్ ఈస్ గ్రేట్ చుట్టూ ఉన్న తన శిష్య బృందం తనని అభినందనలతో ముంచేస్తోంది. తేరుకుని వేదిక మీదకు చూపు సారించాడు హర్ష.
” ఫస్ట్ ప్లేస్ విన్నర్ మాస్టర్ మధుసూదన్ ప్లీజ్ కం టు ది డయాస్ విత్ యువర్ మెంటర్. ప్లీజ్ రిసీవ్ యువర్ అవార్డు ” రెండు, మూడు సార్లు విజేత మధుసూదన్ ని వేదిక మీదకు రమ్మని పిలిచారు.
అంతా అతని కోసం ఎదురు చూస్తూ తమ సీట్ల నుంచి వెనక్కి వెనక్కి చూస్తున్నారు. హర్ష లేచి నిల్చున్నాడు. ప్రవల్లిక, సంకీర్తన్ వెంట రాగా తన పక్క సీట్లో ఒదిగి ఉన్న మాస్టర్ మధు ని సుతారంగా గుండెలకు హత్తుకుని వేదిక మీదకు వచ్చాడు హర్ష. ఒక్క క్షణం వేదిక మీద తాము ఏం చూసామో తెలియక విభ్రాంతి చెందారు ఆడిటోరియం లోని ప్రతి ఒక్కరు. విదేశీ జడ్జెస్ అదిరి పడ్డారు మాస్టర్ మధుసూదన్ ని చూసి.
” హౌ ఇట్ పాజిబుల్ ” ” హౌ హి పెయింట్స్”. జడ్జెస్ తో సహా అందరిలో ఒకే రకం సందేహాలు. కారణం….మాస్టర్ మధుసూదన్ ప్రాణమున్న ఓ బొమ్మ. అంటే … అంటే … పన్నెండేళ్ళ మాస్టర్ మధుసూదన్ టేబుల్ మీద ఉన్నాడు ఓ విరిగిన శిల్పంలా….
సంకీర్తన్, ప్రవల్లిక టేబుల్ వెనుక నిలబడ్డాడు మాస్టర్ మధుసూదన్ కి ఆసరాగా.
అప్పటికే చిత్రలేఖనంలో విన్నర్ అయిన మాస్టర్ మధుసూదన్ వేసిన పెయింటింగ్స్ అన్ని అక్కడ ప్రదర్శించారు. విశ్వంలో ఉధ్భవించిన గ్రహ గోళాలు, నక్షత్రాలు, నీహారికలు ఆ విశ్వం లోనే లయం అవుతూ. అధ్బుతమైన చిత్ర రాజం ఒకటి, పిల్ల నోటికి పురుగు పుడక అందించే తల్లి పక్షి కళ్ళల్లో పిల్ల పట్ల ప్రేమ, రంగులమయం అయిన ప్రకృతి రమణీయత…. ప్రతి ఒక్క చిత్రంలో జీవ కళ ఉట్టిపడుతోంది. ప్రతి పెయింటింగ్ ఓ సజీవ కళాఖండం.
ఆడిటోరియం లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒకటే సందేహం. ” హౌ ఇట్ పాజిబుల్ టు హిం విత్అవుట్ హాండ్స్ అండ్ లెగ్స్”. అసలు నమ్మశక్యం కానీ విషయం అది. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళు, అత్యంత ప్రతిభ ఉన్న కళా కారులకు కూడా ఆ పోటీలలో ఎంట్రీ దొరకడమే కష్టం. అటువంటిది రెండు చేతులు, రెండు కాళ్ళు లేక కేవలం తల, మొండెం ఉన్న అతను ఏకంగా ప్రధమ విజేత గా నిలవడం ఇంపాసిబుల్. మరి ఆ అసాధ్యం సాధ్యం ఎలా అయింది.
మాస్టర్ మధుసూదన్ చేతులు, కాళ్ళు లేని దివ్యాంగుడు. మరి అంత గొప్ప పెయింటింగ్స్ ఎలా వేయగలిగాడు? అందరి మైండ్ ని తొలిచేస్తున్న ఆ ప్రశ్నకు జవాబు తెలియాలంటే కాలచక్రంని నాలుగేళ్లు వెనక్కి తిప్పి ముందుగా అతని గురువు ‘హర్ష’ గురించి తెలుసుకోవాలి.
హర్ష అమ్మ, నాన్న ప్రేమ వివాహం చేసుకున్నారు. వాళ్ళ కులాలు వేరని అందరి కథలలాగే వారి ఇరువైపు పెద్దలు వారిద్దరిని వెలివేశారు. ఒకరికొకరం బ్రతుకుదాం, ప్రేమను బ్రతికించుకుందాం అనుకున్నారు. విధికి కూడా వారి ప్రేమ రుచించలేదేమో. హర్ష పుట్టి అతనికి ఊహ తెలుసేలోగా అతని తండ్రి రూపం ఊహలలోకి వెళ్ళిపోయింది రోడ్ ప్రమాదం రూపంలో. తాను, అమ్మ అంతే ఇప్పుడు ఒకరికొకరు.
నాన్న సుధాకర్ చక్కగా బొమ్మలు గీచేవాడట. అతను వేసిన చిత్రాలు చాల చూపించింది హర్ష అమ్మ వసుధ . ‘ పూల గుత్తి పట్టుకుని నిలబడ్డ అమ్మ తైల వర్ణ చిత్రాన్ని ఎంత బాగా వేసాడు నాన్న’ అని తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తున్న చిన్నారి హర్ష ని చూసి
” నువ్వు కూడా డ్రాయింగ్ నేర్చుకుని పెద్దవాడివి అయినాక గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకోవాలి, నలుగురూ నిన్ను మెచ్చుకోవాలి. నీ కళని నువ్వు పది మందికి పంచాలి. నువ్వు అలా గొప్ప వాడివైతే స్వర్గంలో ఉన్న మీ నాన్న చాల సంతోషిస్తాడు”. కళ్ళు ఒత్తుకుంటూ తల్లి అన్న మాటలు హర్ష మనసులో నాటుకుపోయాయి. ఆ రోజు నుంచి ఒకటే లక్ష్యం. తాను గొప్ప చిత్రకారుడు కావాలి. అమ్మ కోరిక, నాన్న ఆశయం ని నెరవేర్చాలి. అన్నం తినడం అయినా మరిచిపోతాడేమో కానీ కుంచె తో కాన్వాసు మీద రంగులద్దడం మాత్రం అతను కలలో కూడా మరిచిపోలేదు.
కాలం కళ్లెం విప్పుకుని పరుగేత్తే పంచె కళ్యాణి గుర్రంలా పరుగులు తీస్తోంది. హర్ష కాలేజీ వయసుకు వచ్చాడు. ఇప్పుడు కాలేజీలో డ్రాయింగ్ ఆర్టిస్ట్ హర్ష అంటే తెలియనివారు లేరు. తన గదిలో తన లక్ష్యసాధనలో ఎన్ని మజిలీలు దాటాడని. ఎన్నెన్ని శిఖరాలు ఎక్కాడని. చిత్రలేఖనంలో కొత్త కొత్త ప్రయోగాలు చేసాడు. కళ్ళ ముందు కనిపించిన దృశ్యన్ని చూసి కళ్ళు మూసుకుని కాన్వాసు మీద చిత్రించేవాడు. ట్రెడ్మిల్ మీద పరిగెత్తుతూ పర్ఫెక్ట్ గా బొమ్మ గీచేవాడు. కాన్వాసుని తలక్రిందులుగా పెట్టి చిత్రాన్ని గీచేవాడు.
ఓ సారి ఇరవై నాలుగు గంటల నాన్ స్టాప్ డ్రాయింగ్ ఛాలంజ్ లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాడు. పాతికేళ్ళ వయసులోనే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ ప్రముఖ చిత్రకారుల సరసన తన పేరు కూడా చోటు చేసుకుంది. చిత్రలేఖనమే అతనిని నడిపించే చుక్కాని అయింది. చేతిలో కుంచె లేకుంటే హర్ష లేడు. ” అభినవ రవి వర్మ” అని బిరుదు పొందాడు అతను. ఈ కళ తనతోనే ఆగిపోకూడదు. తనలాంటివాళ్ళు మరో పదిమంది చిత్రకారులు కావాలి. వాళ్ళు మరో పదిమందికి నేర్పించాలి. పేద చిత్రకారులను ఆదుకోవాలి అనుకున్న హర్ష సత్సంకల్పాన్ని నెరవేరుస్తూ ఎందరో అతని దగ్గర శిక్షరికం చేసారు. ప్రతి శని, ఆదివారాలు ఊరూరూ తిరుగుతూ తాను, తన శిక్షులు గీచిన చిత్రాలను ప్రదర్శించి, వచ్చిన డబ్బును పేద చిత్రకారులకు అందించేవాడు. యూనివర్సిటీ చదువు పూర్తయ్యాక తన వృత్తి, ప్రవృత్తి రెండు చిత్రలేఖనమే అయింది హర్షకి.
ఓ రోజు సాయంత్రం తల్లి అరుపు విని పరుగెత్తిన హర్షకి బాత్రూం ముందు పడిపోయిన ఆమె తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ స్పృహ తప్పిన స్థితిలో కనిపించింది. తల్లిని ఆ స్థితిలో చూసిన హర్ష భయపడిపోయాడు. వెంటనే ఆమెను కారులో హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు.
తలకి దెబ్బ తగలడం వల్ల షాక్ కి గురైంది అని. బాగా బలహీనంగా ఉంది రక్తం ఎక్కించాలని అన్నాడు డాక్టర్. అప్పటికే టైం తొమ్మిదవడంతో రాత్రికి హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్ చెప్పడంతో స్పెషల్ రూమ్ తీసుకున్నాడు హర్ష. ఐ.సి.యూ లో డ్యూటీ నర్సు వసుధ చేతికి నీడిల్ గ్రుచ్చి బ్లడ్ బ్యాగ్ ని స్టాండ్ కి తగిలించింది. ఒక్కొక్క రక్తపు చుక్క ఆమె నరాల్లోకి వెళుతూ ఉంటే తదేకంగా తల్లిని చూస్తూ ‘నాన్నని చూడలేదు నేను. ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క ఆలంబన నువ్వే అమ్మ. నీకేం కాకూడదు. దేవుడా.. అమ్మని కాపాడు’ గుర్తొచ్చిన ప్రతిదేవుడికి మొక్కుతూ, తల్లిని చూస్తూ కూర్చున్నాడు హర్ష. ప్రమాదం ఏమి లేదు రూంకి వెళ్ళి పడుకోండి, అవసరం అయితే పిలుస్తాను అని నర్సు చెప్పడంతో ఐసీయూ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న బల్ల మీద కూర్చున్నాడు హర్ష.
హాస్పిటల్ లో ఉన్న వాల్ క్లాక్ లో చిన్న ముల్లు, పెద్ద ముల్లు రెండు కలుసుకున్నాయి. సమయం పన్నెండు అయినా రెప్ప మూతపడలేదు హర్షకి. అమ్మకు బాగైతే చాలు తనకు. ‘నీ కళ పదిమందికి ఉపయోగపడాలిరా, మీ నాన్న ఆశయం నువ్వు నెరవేర్చాలి ‘అమ్మ ఎప్పుడూ చెప్పే మాటలు మననం చేసుకున్నాడు.
‘ హాస్పిటల్ అంతా నిశ్శబ్ధ నిశీథిలోకి జారుకుంది. ఆ నిశ్శబ్ధం లో ఓ హృదయవిధారకమైన ఏడుపు’ ఉలిక్కి పడ్డాడు హర్ష. ఐ. సి.యూ . వార్డుకు కాస్త దూరంగా ఉన్న రూమ్ బయట ఒకామె చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. హర్ష కాస్త ఆందోళనగా వెళ్ళి ” మేడం ఎందుకు ఏడుస్తున్నారు. ఏమైంది ” అన్నాడు. అ రూమ్ నుంచి బయటకు వచ్చిన నర్సు ” మేడం కంట్రోల్ చేసుకోండి. మన చేతుల్లో ఏమిలేదు ” వృత్తి ఇచ్చిన గాంభీర్యంతో ఆమె భుజం తట్టింది.
” సిస్టర్…. వాట్ హాపెండ్ ” హర్ష మాటతో అతనివైపు చూసి, మరోసారి ఏడుస్తున్న ఆమె వైపు చూసి … ” ఇలా రండి సర్ అంటూ దూరంగా వెళ్ళింది. ఆమెని అనుసరించాడు హర్ష.
” ఆమె తొమ్మిదేళ్ళ కొడుకు ‘మధు’ వారం క్రితం వాళ్ళ ఇంటి మేడ మీద ఆడుకుంటూ పొరపాటున పిట్టగోడ మీద నించి కాలు జారీ ఇంటి పక్కాగా వెళ్ళే హై ఓల్టేజీ కరెంటు తీగల మీద పడి తీవ్రమైన ఎలక్ట్రిక్ షాక్ కి గురైనాడు. సివిఎర్ ఇంజూరి వల్ల ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంతో అతని కాళ్ళు, చేతులు రెండు తొలగించాల్సివచ్చింది. ఇంకా కూడా అతను కోలుకోలేదు. ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉంది. కానీ ఆ ఖర్చు భరించే స్తొమత లేని వాళ్ళు వారు. అది కాక ఆపరేషన్స్ చేసినా అతను బతుకుతాడని గ్యారంటీ లేదు. మెర్సీ కిల్లింగ్ ఒక్కటే ప్రస్తుత మార్గం. డాక్టర్లు వాళ్ళని నిర్ణయం తెలుపమన్నారు. పాపం వారికి అతనొక్కడే కొడుకట. పగవారికీ కూడా రాకూడదు అనే కష్టం వాళ్ళకి వచ్చింది. ఏం చేస్తారో ఏమో ” అంటూ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ తేవడం కోసం వెళ్లిపోయింది.
నర్సు చెప్పిన ఆ మాటతో కళ తప్పిన చిత్తరువులా నిలబడిపోయాడు అతను కాసేపు. ఎదుటి వారి కష్టానికి చలించిపోయే జాలి గుండె గల హర్ష డాక్టర్ అనుమతితో మాస్క్ ధరించి లోపలకు వెళ్ళి అక్కడి దృశ్యం చూసి అదిరిపడ్డాడు. అక్కడ బెడ్ మీద కాళ్ళు, చేతులు లేని ఓ నెత్తుటి శిల్పంలా అచేతనంగా పడివున్నాడు తొమ్మిదేళ్ళ మధుసూదన్.
తన కర్తవ్యమ్ ఏంటో బోధ పడింది హర్ష కి మధుని చూసాక. అతని తల్లితండ్రులు, డాక్టర్ అనుమతి తో మధుసూదన్ ని దత్తత తీసుకున్నాడు. మధుకు ప్రాణమున్నంత వరకు తన ప్రాణంలా చూసుకుంటానని వారికి మాట ఇచ్చాడు. మొదట అమ్మ ఏం అంటుందో అని సందేహ పడ్డాడు, కానీ అతని నిర్ణయాన్ని ఆమె మనస్ఫూర్తిగా ప్రశంసించింది.
కాలం కాంతి వేగంతో పోటీపడి ఆరునెలలు ముందుకు పరుగు తీసింది. ఈ ఆరు నెలల్లో మధుకి కొన్ని సర్జరీలు జరిగాయి. కానీ అతను ప్రాణమున్న ఓ బొమ్మ అంతే. మొదట స్పృహ వచ్చాక కాళ్ళు, చేతులు లేకపోవడం చూసుకుని బిత్తర పోయాడు. కనీసం ఒంటిని కదిలించాలన్న మరొకరి ఆసరా ఉండాల్సిందే. చాల రోజులు శారీరక, మానసిక బాధను అనుభవించాడు. మధుకి తోడుగా అతని అమ్మ, నాన్నలను తమ ఇంట్లోనే ఉండిపొమ్మన్నాడు హర్ష. ‘మా కన్న బిడ్డ మాకు భారం అనుకుని మేము వద్దనుకుని ఏ తల్లితండ్రి తీసుకోని పాపిష్టి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా, మమ్ము అడ్డుకుని మా బిడ్డను కాపాడిన దేవుడివి హర్ష బాబు నువ్వు. నీ మాట కాదనే శక్తి మాకు లేదు అన్నారు వాళ్ళు.
వసుధ కూడా తమ ఇంట్లో సందడి మొదలైంది అని సంతోషించింది. ఆ రోజు నుంచి మధు అంటే హర్ష. హర్ష అంటే మధు. రెండు దేహాలు. ఒకటే ప్రాణంగా మధుని చూసుకున్నాడు హర్షా.
మధుని రోజు వాకర్ లో పెట్టుకుని పార్కు కి తీసుకెళ్ళేవాడు హర్ష. అక్కడ పిల్లలంతా కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే, మధు వాళ్ళ వంక దిగులుగా చూసేవాడు. ఊపిరి పీల్చడం తప్ప ఇతరుల సాయం లేకుండా ఏ పని చేయలేనని తెలుసుకున్న ఆ పసి హృదయంలో ఎన్ని బడబాగ్నులు రగులుకున్నాయో. నిద్రలో కలవరింతలు, హృదయాన్ని మెలితిప్పే ఏడుపు. చాల రోజులు ఆ ఇంట్లో ఎవరికి నిద్రలేకపోయింది.
హర్ష మధుని దత్తత తీసుకోవడం చాల మంది విమర్శించారు. దారిన పోయే దరిద్రాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు అంటూ చాల మంది హర్ష నుంచి దూరంగా పోయారు. కొందరు మనుషుల మనసుకు ఉన్న అవిటితనానికి జాలి పడి నవ్వుకునే వాడు హర్ష.
హర్ష, వసుధ చూపే అమితమైన ప్రేమ, ఆలనా, పాలనా చూసే అమ్మ, నాన్నల సంరక్షణ, అనునయ వచనాలతో క్రమంగా దిగులు నుంచి కాస్త కోలుకున్నాడు మధు. ఇంటికి వచ్చిన పిల్లలకు హర్ష బొమ్మలు వేయడం నేర్పిస్తుంటే ఆసక్తిగా చూసేవాడు.
ఎందుకో కొన్ని రోజులుగా మధు దిగులుగా, నిస్తేజంగా ఉండడం గమనించాడు హర్ష. ఓ రోజు హఠాత్తుగా ” హర్ష అన్నా….నాకు చేతులు ఉంటే నేను కూడా వాళ్ళ లాగా బొమ్మలు వేసేవాడిని కదా” అన్నాడు మధు కళ్ళ నిండా తీరని ఆశల కన్నీటి కెరటాలు ఎగిసి పడుతుంటే, జవాబు చెప్పలేని ఆ ప్రశ్న హర్ష ని స్థిమితంగా ఉండనీయలేదు. ఆ రోజు రాత్రంతా పలు ముఖాలతో మధు ‘ అన్నా…నాకు చేతులుంటే నేను బొమ్మలేసేవాడినే కదా..నాకెందుకు ఇలా అయింది అన్నా ‘ అమాయకంగా తనని ప్రశ్నిస్తూనే ఉన్నట్లు అనిపించింది హర్ష కి.
నిజమే తొమ్మిదేళ్ల పసివాడు.. ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపవలసినవాడు. ఏం పాపం చేసాడని వాడికి ఈ శిక్ష. ఇక వాడి జీవితాంతం ఇంతేనా? తనలో తానే ప్రశ్నించుకుంటూ జవాబుల కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు రాత్రంతా అతను.
ఎడతెరిపి లేని ఆలోచనలు నిద్రని తరిమేస్తే ఆరు బైట కొచ్చాడు హర్ష. బాల్కనీలో నుంచి వెన్నెల వెండికాంతులు అద్దుతోంది రాత్రికి. జాబిలి వంక చూస్తున్న హర్షకి మనసులో ఓ ఆలోచన మలయ మారుతం లా స్ఫురించింది. ” యెస్ . మధు తప్పకుండ బొమ్మలు వేయగలడు ” అనుకున్నాడు ఆనందంగా. మనసు ప్రశాంతం అయింది. గదిలోకి వెళ్లి పడుకోగానే నవ్వుతూ పిలిచింది నిద్రాదేవి అతన్ని.
పొద్దునే రంగులు కుంచెలు అన్ని సిద్ధం చేసాడు హర్ష. ” అన్నా… ఈ రోజు పొద్దునే బయటకు పోవాలా నువ్వు ” కాస్త నిరాశగా అడిగాడు మధు తల్లి వడిలో కూర్చుని.
” లేదు మధూ.. ఈ రోజు నువ్వు బొమ్మలేస్తున్నావు ” అన్నాడు హర్ష నవ్వుతూ
“అన్నా..నేనా…బొమ్మలేయడంనా … ఎలా ” అన్నాడు మధు సంబ్రమాశ్చర్యాలతో.
” ఇలా ” అంటూ రంగులు కలిపి కుంచె నోటిలో పెట్టుకుని రంగులద్ది , నోటిలో ఉన్న బ్రష్ తో కాన్వాస్ మీద చక్కటి బొమ్మ వేసాడు హర్ష. మధు చిత్తరువులా ఆ బొమ్మ వంక చూడసాగాడు.
” నేను డ్రాయింగ్ తో ప్రయోగాలు చేసేటప్పుడు నోటితో బ్రష్ పట్టుకుని బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. చేతులు ఉపయోగించకుండా నోటితో బొమ్మలు వేయడం అసాధ్యం ఏం కాదు. ఏకాగ్రతగా నేర్చుకుంటే నువ్వు వేయగలవు మధు ” అంటూ అతన్ని టేబుల్ మీద నిలబెట్టి నోటిలో కుంచె పెట్టాడు హర్ష.
మధు పడిపోకుండా ఆసరాగా హర్ష పట్టుకోగా కుంచెని నోటితో కాన్వాస్ మీద రకరకాలుగా తిప్పుతూ రంగులు అద్దాడు మధు. మొదట చాల కష్టం అనిపించింది మధుకి. వద్దని ప్రయత్నాన్ని విరమించుకుందామనుకున్నాడు. ఓ రెండు రోజులు మెడ పట్టేసి నొప్పితో బాధపడ్డాడు మధు. లేని పోనీ రిస్క్ ఎందుకు అనుకున్నారు అందరు.
కానీ జీవితంలో గెలవాలనే అతని తపన ముందు, లక్ష్యాన్ని సాధించాలనే అతని పట్టుదల ముందు ఈ అడ్డంకులన్నీ తోక ముడుచుకుని పారిపోయాయి. హర్ష ఇచ్చిన ఆసరాతో నిరంతరం సాధన చేస్తూ మధు నోటితో బొమ్మలు వేయడంలో నిష్ణాతుడు అయినాడు. చక చకా మధు బొమ్మలు వేయడం చూసి ఆశ్చర్యపోవడం హర్ష వంతు అయింది. ” కృషితో నాస్తి దుర్భిక్షం ” అనే సామెతకి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు కాళ్ళు చేతులు లేని మధుసూదన్.
” ఇప్పుడు మాస్టర్ మధుసూదన్ గురువు మిస్టర్ హర్ష మాట్లాడాలి ” కరతాళ ధ్వనుల మధ్య అర్పితా సింగ్ స్వరం హిందోళ రాగంలా వినపడగానే ఆలోచనల నుంచి బయట పడ్డ హర్ష మైక్ ముందు నిలబడి ” ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన అందరికి, లైవ్ టెలికాస్ట్ చూసే వారికీ అందరికీ కూడా నా వందనాలు. మాస్టర్ మధు సాధించిన ఈ విజయం ఎన్నో శారీరక, మానసిక ఆవేదనల, ఆరాటాల, పోరాటాల, నిరంతర సాధనాల సమ్మిళితం. నేను అతనికి ఒక గైడ్ గా వ్యవహరించానంతే.
ఈ సందర్భంగా నేను చెప్పేదేంటంటే మధు దేహానికి కాళ్ళు, చేతులు లేవు. కానీ అతని మనసుకి పదిచేతులు ఉన్నాయి. మనలో చాల మందిమి అన్ని అవయవాలతో ఉంటాం. కానీ మనసుకి మాత్రం అవిటితనం ఉంటుంది. అందుకే దేహానికి ఉన్న అవిటితనాన్ని చూసి వారిని చులకన చేస్తాం. కానీ వారి మనసు లోతుల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం మన చులకన మాటల వల్ల వారెంత మానసిక వేదన అనుభవిస్తున్నారో తెలుస్తుంది. కాస్త ఆసరా, మరికాస్త ప్రోత్సహం ఇస్తే వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అందుకే వారికి అండగా నిలుద్దాం. భగవంతుడు సృష్టించిన ప్రతి జీవిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. విధి విలాసం చేత వారు వికలాంగులైనపుడు ఇక వారికి జీవితం లేదనుకోకూడదు. గోరంత ఆశనిస్తే కొండంత వెలుగు నింపుతారు వాళ్ళు. ఇప్పటిదాకా మాస్టర్ మధు డ్రాయింగ్ ఎలా వేసాడనేగా చాల మంది సందేహం. ఇప్పుడు అతను వేసే చిత్రంని ప్రత్యక్షముగా చూడండి ” అంటూ టేబుల్ మీద ప్రవల్లిక, సంకీర్తన్ ల ఆసరాతో ఉన్న మధు ముందుకు కాన్వాస్ జరిపి అతని నోటిలో రంగులద్దిన కుంచెని ఉంచాడు హర్ష .
మాస్టర్ మధుసూదన్ నోటితో పళ్ళ మధ్యన పట్టుకున్న కుంచె తో అకుంఠిత దీక్షగా కాన్వాస్ మీద చిత్రాన్ని గీసుకుంటూ పోతున్నాడు. ఆడిటోరియం అంతా చప్పట్లతో ప్రతిధ్వనించింది.
మాస్టర్ మధుసూదన్ గీచే చిత్రాన్ని చూస్తూ… తన తల్లి కోరిక, తండ్రి ఆశయం , తన అభిలాష ఈ రోజు సంపూర్ణంగా నెరవేరాయని తృప్తిగా మధు వంక చూస్తుండిపోయాడు హర్ష… ఇంద్రచాపంలోని సప్త వర్ణాలన్నీ కలగలిసిపోయి కళ్ళలో హృదయాచిత్రాన్ని ప్రతిఫలిస్తుండగా..

4 thoughts on “మధు”

  1. జేసన్

    చాలా బావుందండీ. దేవుని సృష్టి లో ప్రతి ఒక్కరూ ఏదో రంగం లో ఒక ప్రత్యేకత ఉంటుందని చక్కగా వివరించారు. థాంక్యూ వెరీ మచ్

  2. కాత్యాయని గరిమెళ్ల

    వాస్తవం కళ్ళకు కట్టినట్టుంది రోహిణి. కథ కథనం రెండు బాగున్నాయి.

Comments are closed.