బిడ్డ నేర్పిన పాఠం

ఈనాటి నవ తెలంగాణ పత్రిక సోపతి “నెమలీక” శీర్షికలో నేను రాసిన బాలల కథ “బిడ్డ నేర్పిన పాఠం” ప్రచురితం అయింది. నవ తెలంగాణ సంపాదక వర్గానికి నా ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

సాయిలు ఐదో తరగతి చదువుతుండె. చాల తెలివిగలవాడు. సాయంత్రం బండి నించి అచ్చినంక అర్ధ గంట దోస్తులతో ఆడుకొని, ఇంటికచ్చి ముఖం కడుక్కున్నాడు. అమ్మ ఇచ్చిన సర్వపిండి నములుకుంటా సోషల్ బుక్ తీసి చదువుకుంటుండె. ఇంటి బయట గల్లీలో అంతా ఆగమాగంగా అరుపులు, పెద్దపెద్దగా కేకలు మైకులో నించి ఇనవడుతుండె. ఐదేళ్లకోపాలి వచ్చే ఎన్నికల రోజు దగ్గరవడింది. రెండు, మూడు పార్టీల వాళ్ళు జండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ అస్తున్నట్లుంది. ఇంటి ముంగడే కేకలు. ఆ అరుపులకు సాయిలు చదవలేకపోయిండు.
ఇంతలోనే ఓ పార్టీ నాయకుడు, ఆయనతోటి కొంతమంది పార్టీ కార్యకర్తలు ఇంట్లోకి అచ్చారు. సాయిలు నాయన నర్సింగు వాళ్ళను చూసి ఉబ్బితబ్బిబ్బు అయిండు. వాళ్ళు ‘ఎన్నికల్లో గెలిస్తే మేము అది చేస్తం, ఇది చేస్తం, మీ బతుకుల్ని మంచిగా చేస్తం, మా పార్టీ గుర్తుకు ఓటు వేయండి’ అని చెప్పి నర్సింగు చేతికి పైసలు ఇచిర్రు. నర్సింగు సంతోషంగా పైసలు తీస్కొని వాళ్ళ పార్టీకి ఓటు వేస్తానని చెప్పిండు. సాయిలు ఇదంతా చూస్తా ఉండే.
నర్సింగు నవ్వుకుంటా ఆ పైసలను సాయిలు వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చిండు. ఇంకో పది నిమిషాల తర్వాత ఇంకో పార్టీ వాళ్ళు సాయిలు వాళ్ళ ఇంట్లోకి వొచ్చిర్రు. వాళ్ళు కూడా ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుకే ఓటు వేయమని, ఎన్నికల్లో గెలిస్తే చాల మంచిగా పాలిస్తామని, అవతల పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ గొప్పలు చెప్పి, వాళ్ళ కంటే ఎక్కువ పైసలు ఇచ్చిర్రు నరసింగుకు. వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా తీస్కొని, వాళ్ళ పార్టీ గుర్తుకే ఓటు వేస్తాననిండు నర్సింగు. నర్సింగు చేసిన పని చాల వింతగా అనిపించింది సాయిలుకు.
“అదేంది బాపు. ఆ ఇద్దరి దగ్గర పైసలు తీసుకున్నవు. ఇద్దరికీ ఓటు ఎట్టేస్తవు..?” అనిండు సాయిలు నర్సింగును చూసి. “నీకేం తెల్వదు. చిన్న పోరడివి. పోయి చదువుకో పోరా” అని సాయిలును గదమాయించిండు నర్సింగు.
“నాకు తెల్సు బాపు. ఎన్నికలప్పుడు పైసలు ఇచ్చుడు, తీసుకొనుడు రెండు తప్పే. గిట్ల పైసలు ఇచ్చి, కానుకలు ఇచ్చి ఓట్లు అడిగే నాయకులకన్నా, నిజాయితీగా ప్రజల కోసం మంచి పరిపాలన చేసేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. పేదరికం నిర్ములనా, అందరికి విద్య, ఉపాధి, రైతులకు,వ్యాపారులకు, ప్రతిఒక్కరికి మంచి చేసే నాయకులను ఎన్నుకుంటే మన భవిష్యత్ బాగుంటుంది. లేకుంటే మన చూపుడు వేలితోని మన బతుకులను మనమే నాశనం చేసుకున్నట్లే” అనిండు సాయిలు నర్సింగుని చూస్తా.
“ఇవ్వన్ని నీకెట్ల తెల్సు” అనిండు నర్సింగు బిడ్డ తెలివికి మురుసుకుంటా.
“స్కూల్లో మా సోషల్ సారు చెప్పిర్రు. నువ్వు కూడా నీజాయితీగా ప్రజల కోసం పనిచేసే నాయకుడికే ఓటు వేయి బాపు. నేను పెద్దైనాక మంచిగా చదువుకునేకి, అటువంటి మంచి నాయకులే ఇప్పుడు అవసరం” అనిండు సాయిలు.
“శెభాష్ బిడ్డా. ఈ దినం నీ నుంచి నేను మంచి పాఠం నేర్చుకున్న. నువ్వు చెప్పినట్లే నీజాయితీగా ప్రజలను పరిపాలించేవాళ్ళు ఎవరో తెల్సుకొని, వాళ్ళకే నా ఓటు వేస్తా” అంటూ సాయిలు చేతిలో చేయి వేసిండు నర్సింగు.


రోహిణి వంజారి
3-12-2023