#story వివాహం ఎంతో ఘనమైనది అని అన్నీ మత గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి వివాహం ద్వారా వదువరులు ఒకటయ్యే శుభ సందర్బంగా రిటర్న్ గిఫ్ట్ గా అతిథులకు ఏవేవో ఉపయోగం లేని గిఫ్ట్స్ కన్నా, మంచి పుస్తకాన్ని ముద్రించి అతిథులకు ఇవ్వడం అనేది మంచి ఆలోచన. కొత్త ఒరవడి.
కవులు సాగర్ల సత్తయ్య గారు “వివాహ సందర్భంగా ఒక మంచి కథ రాసి పంపండి మేడమ్. సంకలనం వేస్తున్నాం. కథని రెండు రోజుల్లో రాసి పంపండి” అని ఫోన్ చేశారు.
కాపురాలు కూల్చడం తేలిక. కానీ వివాహ బంధం తో ఒకటైన జంట జీవితాంతం ప్రేమ, నమ్మకం, భరోసా కలగలిసి నడవడానికి అభిరుచులు కలవడం కన్నా, జీవిత భాగస్వామి అభిరుచులను గౌరవించడం చేయగలిగితే ఆ జంట అనురాగాన్ని ఏ పరిస్థితులు వేరుచేయలేవు.
October నెలలో కథ రాయమని అడిగారు. దసరా ల సమయంలో బొమ్మల కొలువు నేపధ్యంలో రెండు రోజుల్లో ఈ కథని రాసి పంపాను. నాతో పాటు మరో 19 మంది రచయితలతో కథలు రాయించి, “చేతిలో చెయ్యేసి” సంకలనం తెచ్చారు. శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. “బంగారు బొమ్మ రావేమే” కథని చదవండి. కథని చదివి చాలా బాగుంది అని కొందరు మెసేజ్ లు చేశారు. మంచి కథ రాయమని ప్రోత్సహించిన శ్రీ సాగర్ల సత్తయ్య గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. వివాహ బంధం తో ఒకటైన దంపతులకు శుభాకాంక్షలు![]()
మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి










సెప్టెంబర్ నెల. నవరాత్రులు మొదలైనాయి. సాయం సంధ్య వేళ విసన కర్రతో మెల్లగా విసిరినట్లు పిల్లతెమ్మెరలు మేనుని చల్లగా తాకుతున్నాయి.
“హలో..మిస్టర్..అలా గుడ్లప్పగించుకుని చూడకపోతే కాస్త కింద పడిన కవర్ తీసి ఇవ్వచ్చుగా” అవంతిక స్వరం అతన్ని ఏమాత్రం కదిలించలేకపోయింది. చిత్తరువులా కూర్చుని సృష్టిలో ఇదివరకెప్పుడూ చూడని అద్భుతాన్ని చూస్తున్నట్లు రెప్పవేయకుండా ఆమె వంకే చూస్తుండిపోయాడు సంకీర్తన్.
“హలో..మిస్టర్..మిమ్మల్నే..ఆ కవర్ తీసివ్వండి” అవంతిక స్వరంలోని తీవ్రత కి ఉలిక్కి పడి, తన ప్రమేయంలేకుండానే కిందికి వంగి నేలమీద పడి ఉన్న కమలాపండుని కవర్లో వేసి అవంతిక చేతికిచ్చాడు మరబొమ్మలా.”థాంక్స్” అంటూ రెండు చేతుల్లో ఉన్నప్రసాదాల కవర్లను ఓసారి సరిచేసుకుని, ముందుకు పడిన జడని వెనక్కి వేసుకుంటూ, ఇంటి లోపలికెళ్ళింది అవంతిక.
లోపల పెద్ద హాల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఉంది. ఎత్తుల వారీగా పేర్చబడిన బల్లల మీద తెల్లటి గుడ్డలు పరచి, వాటిపైన రంగురంగుల బొమ్మలను చూడముచ్చటగా అమర్చి ఉన్నారు. మన సంస్కృతి, ఇతిహాసాలను తెలిపే రామాయణ, భారత గ్రంధాల్లోని కొన్ని ఘట్టాలను బొమ్మల రూపంలో తెలుపడంతో పాటు, ఆధునిక భారతంలో వచ్చిన మార్పులు, టెక్నాలజీ కి సంబంధించిన రాకెట్, చంద్రయాన్ లాంటి బొమ్మలు కూడా పెట్టారు. హాల్లోనే ఒక మూలకు ఇసుకపోసి, పార్క్ లాగా ఏర్పాటు చేశారు. గడ్డిమొక్కలు, ఆవాల మొక్కలు చిన్నవిగా ఎదిగి, పార్క్ చుట్టూ కంచె లాగా పెంచి తమ హస్తకళా నైపుణ్యమంతా ఆ బొమ్మల కొలువులో చూపారు స్పందన, అవంతికలు. మూడు రోజుల నుంచి అదేపని వాళ్ళిద్దరికి. హాల్లో మరో మూల బతుకమ్మను పేర్చారు. గొబ్బెమ్మ, గౌరమ్మలను కూడా ఏర్పాటు చేశారు. పేరంటానికి వచ్చినవాళ్ళందరూ బొమ్మల కొలువును అబ్బురంగా చూస్తున్నారు. స్పందన అందరికీ పసుపు, గంధం పూస్తుంటే, కుంకుమ బొట్లు పెట్టి పచ్చిశెనగలు,తమలపాకుల తాంబూలం ఇస్తోంది అవంతిక. బతుకమ్మ, గౌరమ్మ పాటలు కూడా లోపల నుంచి వినిపిస్తున్నాయి వరండాలో కూర్చున్న సంకీర్తన్ కి.
ఇంటిలోపల్నుంచి అప్పుడు వచ్చాడు జయంత్ వరండాలోకి. ” అరే..సంకీర్తన్..ఎంతసేపైంది నువ్వొచ్చి..!” భుజం తడుతూ అడిగాడు. ఎక్కడ చూపు నిలిపాడో తెలియనట్లు గాల్లోకి పరవశంగా చూస్తున్న సంకీర్తన్ ఉలిక్కి పడి, “ఆ..జయంత్..ఇప్పుడే లోపలకి వెళ్ళింది కదా ఆ అమ్మాయవరు?” అన్నాడు ఇంకా వీడని వివశత్వంతో సంకీర్తన్.
“ఎవరూ..! ఆ జీన్స్, టీ షర్ట్ అమ్మాయా” అన్నాడు జయంత్
చ..చ….ఆ అమ్మాయి కాదు. పొడవైన జడ, జడ నిండా కనకాంబరాలు, ముదురాకు పచ్చ పావడా, గులాబీ రంగు పరికిణి, పెద్ద బొట్టు, కలువ పువ్వుల్లాంటి కాటుక కళ్ళు, బ్రహ్మ దేవుడు అమితమైన ఇష్టంతో తీర్చిదిద్దినట్లు, మన బాపు బొమ్మలా ఉందే..తను ఎవరూ? తన పేరేంటి?” తనను తన్మయపరచిన సౌందర్యాన్ని వర్ణిస్తూ పరవశంగా చెప్పుకుపోతున్నాడు సంకీర్తన్.
“ఓ..తనా..మా చెల్లి స్పందన ఫ్రెండ్ అవంతిక. అయినా తనని ఎంతసేపు చూసావని, అంతలా వర్ణింస్తున్నావు. కొంపదీసి” అనుమానంగా చూస్తూ అన్నాడు జయంత్.
“అబ్బే..అలాంటిదేమి లేదు. జస్ట్ చూసింది చెప్తున్నాను” అంటూ భుజాలు ఎగరేసాడు కానీ తనది ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని మిత్రుడికి చెప్పడానికి మొహమాటపడ్డాడు సంకీర్తన్. జయంత్, సంకీర్తన్ చిన్నప్పటినుంచి ప్రాణస్నేహితులు. బి. టెక్ దాకా ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి. జయంత్ హైదరాబాద్ లో చేస్తుంటే, సంకీర్తన్ కి జాబ్ ఆస్ట్రేలియాలో వచ్చింది. రెండేళ్ళనుంచి అక్కడ ఉంటున్నాడు. నెల రోజులు సెలవు పెట్టుకుని ఇండియాకి వచ్చాడు. వచ్చిరావడంతోనే జయంత్ ని చూడాలని వచ్చి, అంతకంటే ముందే బాపుబొమ్మని చూసాడు .సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనివుందని జయంత్ ని కూడా రమ్మన్నాడు. ఇద్దరూ కల్సి బయటకి వెళ్ళారు.
ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తూ కూడా మాటిమాటికి పరవశంలోకి మునిగిపోతూ వాళ్ళ అమ్మ, నాన్నలు అడిగే ప్రశ్నలకు “ఆ..ఉ..ఉహు” పొడిపొడి సమాధానాలు చెప్తున్నాడు. సంకీర్తన్ కి ఏమైందో అని కంగారు పడ్డారు వాళ్ళు. పక్క మీద వాలినా కంటి మీదకు రెప్ప వాలలేదు. కళ్ళ ముందు కావ్య నాయికలంటి అవంతిక అతని నిద్రని దోచుకెళ్ళింది. ఇక లాభం లేదని టైం చూసాడు. పన్నెండు దాటి అర్ధగంట అయింది. సెల్ ఆన్ చేసాడు. “హలో..ఏం రా..ఇప్పుడు కాల్ చేసావు” ఆవలింతలు ఆపుకుంటూ అవతలనుంచి జయంత్.
“జై..ప్లీజ్ రా..నాకు అవంతికని పరిచయం చేయవా” బతిమిలాట సంకీర్తన్ స్వరంలో.
“అందుకోసం..ఇంత అర్ధరాత్రి నా నిద్ర చెడగొడతావా..” చిరు కోపం జయంత్ గొంతులో.
“ప్లీజ్ రా. ఈవెనింగ్ నువ్వన్నావు కదా. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని. నీ అంచనా కరెక్ట్ రా. తనని చూడగానే ఆ భావన కలిగింది నాలో. ఇదిగో ఇప్పుడు నిద్రపోకుండా నీకు ఫోన్ చేసాను అంటే తను ఎంతలా నన్ను కలవరపరచిందో అర్ధం చేసుకో రా ప్లీజ్” అర్ధింపు గా అన్నాడు సంకీర్తన్.
“ఓకేరా కీర్తి.. కానీ అవంతిక ట్రేడిషన్లగా కనిపించిందని తనని పల్లెటూరి అమ్మాయి అనుకుంటున్నావేమో..తను, మా చెల్లి స్పందనతో పాటు మైక్రో చిప్ సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తోంది. స్పందన వాళ్ళ గ్రూపుకి తను టీం లీడర్. అందం ఒక్కటే కాదు. ఆత్మవిశ్వాసం చాల అధికంగా ఉన్న ఈ కాలపు అమ్మాయి. తనతో చాల జాగ్రత్తగా డీల్ చేయాలి” అన్నాడు జయంత్.
“వావ్..సూపర్ రా. తన సంగతి నాకు తెలుసు” అని అవంతిక తో తనకి జరిగిన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ “రేపొద్దున మీ ఇంటికి వస్తున్నాను. అవంతికని మీ ఇంటికి రమ్మని పిలవమని స్పందనకి చెప్పు” మరోమాటకి చోటు ఇవ్వకుండా సెల్ ఆపేసాడు సంకీర్తన్.
***
“అవంతికా..తను మా జయంత్ ఫ్రెండ్ సంకీర్తన్” పరిచయం చేసింది స్పందన.
“ఓహ్. నిన్న బొమ్మల కొలువు టైములో మీరు వరండాలో కూర్చున్నారు కదా”
“హా. అవంతిక గారు. మీరు మైక్రో చిప్ కంపెనీలో టీం లీడర్ అని జయంత్ చెప్పాడు” అన్నాడు తడబాటుగా ఇంకేం చెప్పాలో తెలియక.
“మీరు జయంత్ అన్నయ్య ఫ్రెండ్ అని, అబ్రాడ్ లో జాబ్ చేస్తున్నారని స్పందన నాకు చెప్పిందిలేండి”
“ఎస్..ఎస్.. అందరం అలా బయటకి వెళ్ళి స్టార్ బక్స్ కి లో కాఫీ తాగివద్దాం. మన పరిచయాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం ప్లీజ్” అభ్యర్ధన గా చూసాడు సంకీర్తన్ అవంతిక వైపు.
“చిరునవ్వు తో చూసింది అవంతిక. అందరూ స్టార్ బక్స్ కి వెళ్ళారు.
***
పది రోజుల తర్వాత. అవంతిక వాళ్ళ ఇంట్లో పెళ్ళి చూపులకు ఏర్పాటు చేశారు. అవంతిక అమ్మ, నాన్నలకి చాల ఆనందంగా ఉంది. తాము అసలు శ్రమ పడకుండా అవంతికనే సంకీర్తన్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఇద్దరికీ ముందే పరిచయం ఉంది కాబట్టి, ఫార్మాలిటీ కోసం ఈ పెళ్లిచూపులు. అవంతిక అమ్మా, నాన్నలతో పాటు స్పందనకూడా టిఫిన్, కాఫీలు అందించడంలో సాయపడుతోంది. సంకీర్తన్ అమ్మ, నాన్నా కళ్ళల్లో కూడా సంతోషం తొణికిసలాడుతోంది. కుందనపు బొమ్మ లాంటి పిల్ల తమకు కోడలిగా వస్తోందని. రెండు కుటుంబాలు సంపద కలిగినవే. ఇక కట్నం, పెట్టుపోతలు లాంటి మాటలేమీ లేవు. అన్నీ క్యాజువల్ మాటలే.
సీ గ్రీన్ కలర్ చీర, కనకాంబరం రంగు బ్లౌజ్లో, జడ నిండా మల్లెపూలతో ఉన్న అవంతికను చూస్తుంటే, మన్మధ బాణం సూటిగా గుండెల్లోకి దిగినట్లు అవంతికను రెప్పవేయకుండా చూస్తున్నాడు సంకీర్తన్.
“కీర్తి..ఇంక చూడడం ఆపు” చెవులో గుసగుసలాడాడు జయంత్.
“అమ్మాయి, అబ్బాయి పర్సనల్ గా ఏమైనా మాట్లాడుకుంటారేమో. వాళ్ళని బాల్కనీ లోకి పంపుదాము” అంది సంకీర్తన్ వాళ్ళ అమ్మ. బాల్కనీ లో ఉన్న పేము కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చున్నారు అవంతిక, సంకీర్తన్.
“చెప్పండి సంకీర్తన్.. నా పైన తొలి చూపులోనే ప్రేమ అన్నారు కదా. నాలో ఏం చూసి ప్రేమించారు” ఎర్రటి పెదవులు విడివడి విడివడనట్లు చిన్నగా నవ్వుతూ అవంతిక.
“అవును అవంతిక. నేను నా సర్కిల్ లో ఇటు ఇండియాలో, అటు ఫారెన్ లో ఎక్కడా నీలాంటి అమ్మాయిని చూడలేదు. అక్కడా, ఇక్కడా జడ చేసుకున్న అమ్మాయి ఒక్కరు కనపడరు. నీలా చీరలు కట్టుకున్న బుట్టబొమ్మ ఇంతవరకు నాకు తారసపడలేదు. అందరూ ఆర్టిఫిషల్ అలంకరణలతో, అతికించుకున్న నవ్వులతో,అల్ట్రా మోడరన్ లుక్స్ తో కనపడ్డారు. వారిలో ఎవరూ నా మనసుని తాకలేదు నీలా” తన్మయం తారాస్థాయి కి చేరిన స్వరంతో సంకీర్తన్.
“మోడరన్ లుక్ తో కనిపించడంలో తప్పేం ఉంది. ఎవరిష్టం వారిది. నాకు ఇలా ఉండడం ఇష్టం అంతే. సంకీర్తన్ గారు, మరి నాలో అందమొక్కటే చూసారా” చురుకైన కళ్ళతో సూటిగా చూసింది అవంతిక.
“అయ్యో..లేదు లేదు అవంతిక. మొదట చూసింది నీ అందమే అయినా, నీ తెలివితేటలూ, ముఖ్యంగా మన తొలిరోజు పరిచయంలోనే నీ ఆత్మవిశ్వాసం, ధైర్యం నన్ను వివశుడిని చేసాయి. నీ ఇష్టానికి ఎప్పుడూ నేను అడ్డురాను. మన పెళ్ళి అయినాక, అబ్రాడ్ వెళదాం. యూ.స్.ఏ. కంపెనీలో ట్రై చేస్తున్నాను. అక్కడ జాబ్ వస్తే అమెరికా లో వెల్ సెటిల్డ్ గా లైఫ్ గడపాలని నా ఎయిమ్” చెప్తూ పోతున్నాడు సంకీర్తన్.
***
వారం రోజులు నత్త నడకలా వెళ్లిపోయాయి. పెళ్ళికి ముహుర్తాలు ఎప్పుడూ పెట్టుకోవాలో ఇంకా కబురు చేయలేదు అవంతిక వాళ్ళ అమ్మ,నాన్నా. ఇండియాకి ఒంటరిగా వచ్చిన తను అవంతికని పెళ్ళి చేసుకుని, జంటగా అబ్రాడ్ వెళ్ళాలని తపన పడుతున్నాడు సంకీర్తన్. అవంతిక వాళ్ళ ఇంటినుంచి వచ్చే కబురు కోసం చకోర పక్షిలా, వానకారు కోయిలలా ఎదురుచూస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నని అవంతిక వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి కనుక్కోమన్నాడు.
“అలా వద్దురా. వాళ్ళ ముందు చులకన అయిపోతాము. అయినా పెళ్ళిచూపులై వారం అవుతోంది. అప్పట్లో అబ్బాయి వాళ్ళు ఏం కబురు చెప్తారా అని అమ్మాయిలు ఎదురు చూసే రోజులు కావివి. అమ్మాయికి అంగీకారమైందా లేదా అని ఆశగా అబ్బాయిలు ఎదురు చూసే కాలమిది. కాస్త ఓపిక పట్టారా. వాళ్ళే కబురు పంపుతారు” అంది అమ్మ.
ఇక ఉండబట్టలేక జయంత్ కి కాల్ చేసాడు సంకీర్తన్. రెండు సార్లు కాల్ తీయలేదు జయంత్. అసహనంగా మూడోసారి కాల్ చేసాడు. “ఆ చెప్పు సంకీర్తన్”అన్నాడు జయంత్ చాల తక్కువ స్థాయి స్వరంతో
“అదేరా..వారం అవుతోంది. అవంతిక వాళ్ళ ఇంటినుంచి ఫోన్ రాలేదు అన్నాడు” ఆతృతగా.
“సారీ రా కీర్తి” అన్నాడు జయంత్ “అయ్యో. ఏమైంది రా. అందరూ ఓకేనా. అవంతిక కూడా ఈ వారంలో ఒక్కసారికూడా ఫోన్ చేయలేదు. అందరూ ఓకే కదా” అన్నాడు సంకీర్తన్ కంగారుగా.
“హా. కీర్తన్ నీకోమాట చెప్తాను. లైట్ తీసుకో. అవంతిక నీతో పెళ్ళికి ఒప్పుకోలేదురా..సారీ రా” అన్నాడు జయంత్. పొంగుతున్న పాలమీగడ లాంటి ఆశల మీద ఒక్కసారి నీళ్ళు చల్లినట్లు కృంగిపోయాడు సంకీర్తన్.
“ఏ..ఎందుకురా” తడబాటుగా వచ్చింది సంకీర్తన్ మాట.
“అదే తెలియడం లేదురా. నిన్న స్పందన అడిగితే పెళ్ళి ఇష్టం లేదని చెప్పిందట. ఇప్పుడు స్పందన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వివరాలు కనుక్కుని నీకు ఫోన్ చేస్తాను” అంటూ కాల్ కట్ చేసాడు జయంత్.
పెంచుకున్న ఆశలు, నిదుర రాని మెలకువలో కన్నకమ్మని కలలు, కట్టుకున్న పొదరిళ్ళు కుప్పకూలి పోయినట్లు కొడుకు బాధతో విలవిలాడాడడం చూసి సంకీర్తన్ అమ్మ నాన్న కంగారు పడసాగారు.
***
“అసలేంటే నీ ప్రాబ్లెమ్. ఒకరికొకరు నచ్చి, మాటలు పెళ్ళిదాకా వచ్చాక సడన్ గా ఇప్పుడు నువ్వు తనతో పెళ్ళి ఇష్టం లేదంటే ఎలా అర్ధం చేసుకోవాలి నిన్ను” స్పందన అడిగినదానికి జవాబు చెప్పకుండా నేల చూపులు చూస్తోంది అవంతిక.
“చదువు, సంస్కారం, మంచి ఉద్యోగం అన్ని ఉన్న యోగ్యమైన సంబంధం. ఆరడుగుల మంచి రూపంతో ఉన్న వాడు తనని వెతుక్కుంటూ వస్తే, కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకుంటోంది అవంతిక. మేము చెప్పి చెప్పి అయిపోయింది. నువ్వన్నా తనకి అర్ధమయ్యేలా చెప్పు స్పందన” అంటుండగానే వచ్చాడు గంగాధర్.
తను ఢిల్లీ యూనివర్సిటీలో సీనియర్ సైకాలజీ ప్రొఫెసర్. అవంతిక వాళ్ళ నాన్న కబురు పెట్టగానే, లోహ విహంగంలో ఎగురుకుంటూ హైదరాబాద్ కి వచ్చాడు. కాఫీ, ఫలహారాలు, పరామర్శలు అయిన వెంటనే అసలైన పాయింట్ కి సూటిగా వచ్చాడు అతను. “అవంతికా బేబీ..అమ్మ నీ గురించి అంతా చెప్పింది. సంకీర్తన్ జెంటిల్మాన్.ఇక్కడకు వచ్చే ముందే జయంత్ వాళ్ళింటికి వెళ్ళాను. అక్కడే సంకీర్తన్ ని కలిసాను. నువ్వంటే ప్రాణం పెడుతున్నాడని తన మాటలవల్ల తెలిసింది. నీ నిర్ణయం తర్వాత తను చాల అప్సెట్ అయినట్లున్నాడు. అతని మనసులో బాధని కళ్ళల్లో చూసి చదివాను తల్లి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు” అతను మాట్లాడడం ఆపగానే,
“అదేంలేదు బాబాయ్. నేను తనకి కరెక్ట్ కాదు అనిపించింది” అనేసి మౌనంగా తలవంచుకుంది అవంతిక.
“అది కాదురా బంగారు. అమ్మ, నాన్నల దగ్గర నువ్వు ఫ్రీగా మాట్లాడలేకపోతే, లోపలిగదిలోకి వెళదాం. అతని మీద కలిగిన అయిష్టమో, నిరసన భావమో, ఏ విషయమైనా ఈ మనసులు చదివే బాబాయికి నిస్సంకోచంగా చెప్పవచ్చు నువ్వు. నీ కారణాలు సరైనవే అనిపిస్తే అందరం నీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఓకేనా అంటూ అవంతిక వాళ్ళ అమ్మ వైపు చూసాడు అతను. గంగాధర్ చూపులను అర్ధం చేసుకుని స్పందనని తీసుకుని లోపలి గదిలోకి వెళ్ళింది అవంతిక వాళ్ళ అమ్మ. హాల్లో అవంతిక, గంగాధర్ మిగిలారు.
‘ఇప్పుడు చెప్పు తల్లి’ అన్నట్లు చూసాడు అతను అవంతిక వైపు.
“పెళ్ళి చూపుల రోజు పర్సనల్ గా చాల మాట్లాడుకున్నాము బాబాయ్. అన్నీ విధాలా మా అభిరుచులు కలిసాయి. ఒకే ఒక్క విషయం నాకు నచ్చలేదు” అంది చీర కొంగుని మెలితిప్పుతూ.
“ఏంటి అవంతిక ఆ విషయం” వృత్తి పరమైన నైపుణ్యంతో ఆతృతను కప్పిపుచ్చుకుంటూ అడిగాడు.
“పెళ్ళి అయినాక ఫారెన్ వెళ్ళి అక్కడే సెటిల్ అవుదాం అన్నాడు సంకీర్తన్. అది నాకు నచ్చలేదు బాబాయ్” సూటిగానే బాబాయ్ కళ్ళల్లోకి చూసింది అవంతిక.
“ఈ కాలం అది చాల సహజం కదా . కష్టపడి చదివి పి. జి. లు, ఏం.ఎస్., లు చేసి ఫారెన్ లో జాబ్ సంపాదించడం అంటే మాటలా..! ఇంత పైకి వచ్చాక అక్కడే స్థిరపడాలనుకోవడంలో వింతేమి లేదు కదా. ఇందులో అభ్యంతర పెట్టాల్సిన విషయం ఏం ఉంది రా” అన్నాడు గంగాధర్ అనునయంగా.
“ఉంది బాబాయ్. అమ్మ, నాన్నలకు నేను ఒక్కదాన్నే. తోబుట్టువులు ఎవరూ లేరు నాకు. నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళని ఎవరూ చూసుకుంటారు..? నా స్వార్ధం నేను చూసుకుని తనతో వెళ్ళిపోయి, వయసు పైబడ్డ వాళ్ళను ఒంటరిగా వదిలివెళ్ళలేను బాబాయ్. సంకీర్తన్ కి కూడా తోబుట్టువులు లేరు. వయసు పెరుగుతున్న పేరెంట్స్ కి ఎన్నో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఎంత డబ్బున్నా, పది మంది పని వాళ్ళు ఉన్నా, కన్నబిడ్డల ఆసరా లేకుండా మలివయసులో కాలం వెళ్ళదీయడం పెద్దవాళ్ళకు దుర్భరం. నా పేరెంట్స్ ని ఆ పరిస్థితిలోకి నేను నెట్టలేను. అందుకే అతనితో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాను” దృడంగా పలికింది అవంతిక స్వరం.
అవంతిక మనసులో రగులుతున్న ఆవేదనకు, సమస్యకు మూల కారణం తెలిసింది. ఇక పరిష్కరించడం చాల సులువు అనుకున్నాడు గంగాధర్. వాళ్ళు ఎంత చిన్నగా మాట్లాడుకున్నా, గదిలో ఉన్న అవంతిక పేరెంట్స్ కి, స్పందనకి వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు. తమ పట్ల అవంతికకి ఉన్న ప్రేమ, తమ ఆరోగ్యం, ఆసరా గురించి అవంతిక ఆలోచిస్తున్న తీరుకి వారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కూతురిపట్ల కొండంత ఉన్న ప్రేమ, అమాంతం విశ్వమంత విస్తరించింది.
***
స్పందన వాళ్ళఇంటికి వచ్చేసింది. అవంతికకి, వాళ్ళ బాబాయి గంగాధర్ కి మధ్య జరిగిన సంభాషణనంతా పూస గుచ్చినట్లు సంకీర్తన్ కి చెప్పింది.
“ఇంతకాలం నేను, నా చదువు, ఉద్యోగం, విదేశాల్లో స్థిరపడడం. ఇలా ఆలోచించానే కానీ, అవంతికలా అమ్మ, నాన్నల కోసం ఆలోచించలేకపోయాను. పాపం నేను విదేశాలకు వెళ్లుతున్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో దాచలేని దిగులు కనిపించేది. నాన్న గొంతు మూగపోయేది. కానీ నా ఇష్టానికి ఎన్నడూ వాళ్ళు అడ్డుచెప్పలేదు. అవంతిక ఇప్పుడు నా కళ్ళు తెరిపించింది. ఇక్కడ మన దేశంలోనే ఉండి, ఎన్నో ఉపాధి వనరులను పొందుతూ, కష్టపడి జీవితంలో ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. ఇక అమ్మ, నాన్నలను ఒంటరిగా వదిలి నేను విదేశాలకు వెళ్ళనుగాక వెళ్ళను. అవంతిక అభీష్టాన్ని గౌరవిస్తాను” అంటూ కన్నీళ్ళు తుడుచుకున్నాడు సంకీర్తన్.
జయంత్, స్పందనలు తృప్తి నిండిన కళ్ళతో సంకీర్తన్ వంక చూసారు.
కోరి వలచిన చెలికాడు తన నిర్ణయాన్ని గౌరవించడంతో అవంతిక మనసులో కూడా సంకీర్తన్ పట్ల ఏర్పరచుకున్న విముఖత గాలికి ఎగిరిన దూది పింజలా తేలికైపోయి, బుగ్గల్లో కొత్తకొత్తగా ఎర్రటి సిగ్గుమొగ్గలు మొలవసాగాయి.
సరిగ్గా నెల తర్వాత..ఆకాశమంత పందిరి కింద పెళ్ళిపీటల పైన బుగ్గచుక్క పెట్టుకుని, తలకి బాషికాలు కట్టుకుని, చేతిలో పూల చెండుతో పెళ్ళికొడుకు సంకీర్తన్ అవంతిక రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
ఎర్రటి పట్టుచీరలో మల్లెలు, కనకాంబరాల అట్టజడతో, నుదుటన మెరిసే బొట్టుతో పెళ్లికూతురు అవంతిక మెల్లగా అడుగులేస్తూ వస్తోంది పందిట్లోకి.
“బంగారు బొమ్మ రావేమే. పందిట్లో పెళ్ళి జరిగేనే” పాటతో మంగళ వాయిద్యాల హోరు జోరందుకుంది.
——- శుభం ——-