ప్రొజెక్షన్

స్త్రీ ల ఆహార్యం గురించి Facebook వాల్స్ దగ్గర అనుచిత కామెంట్స్ చేసే మేక వన్నె కాదు కాదు నీతివన్నె కాముకుల పట్ల నిరసన, జుగుప్సలతో రాసిన కవిత ఇది. ఈ నెల సాహిత్య ప్రస్థానం లో..

మేము పంజరాలు బద్దలుకొట్టి
బయటపడి చాల కాలమైంది
మళ్ళీ కొత్తగా నీ ఆదిపత్యం ఏంది
దేవత మహా ఇల్లాలు మహా పతివ్రతా
బిరుదులిచ్చి వేసిన సంకెళ్లు చాలు ఇక
మా నవ్వులమీద మా తిండి మీద
మా బతుకులమీద నీ మనువు ముసుగు
ఎంతకాలం వేసుకోమంటావు
పొడుగు పొట్టి లావు సన్నం తెలుపు నలుపు
మా ఒంటి కొలతల చుట్టూ
నీ నిఘా ఎందుకు అనుక్షణం
మా గుండెలను చున్నీతో కప్పుకోమనడం కాదు
ఎన్ని ఒంపుసొంపులున్నాయని
తొమ్మిది నెలల పసిదాన్ని కాటు వేస్తివి
నడుంమీద ఎన్ని మడతలున్నాయని
జేజమ్మను చెరపడితివి
బీగామి పాలియాండ్రి చిన్నిల్లు
ఇవిచాలక ఎదురుపడిన స్త్రీని
వెకిలి చూపులు చూసే నీ మకిలి బుద్ధికి
జ్ఞానపు అద్దాలు తొడుక్కో ఇక
నువ్వు దొరవి కాదు నేను బానిసని కాదు
నీ ఆధిపత్యం సాగదిక్కడ
శ్రామిక తల్లి కొంగుని నడుముకి బిగిస్తుంది
రెజ్లర్ చెల్లి బరిలో దిగితే టీ షర్ట్ తొడుక్కుంటుంది
లోహవిహంగపు మహిళ డ్యూటీలో కోటును వేసుకుంటుంది
ఆథ్లెట్ పరుగుపందెంలో షార్టు వేసుకుంటుంది
ఎప్పుడెలా ధరించాలి ఏమి ధరించాలి
అది పూర్తిగా మా ఇష్టం
మా వస్త్రాలమీద నీ శల్యపరీక్షలు కాదు
మదపు సమాధిలో కూరుకుపోయిన నీ మనసుపైన
వివేకపు చెద్దరు కప్పుకోవాల్సింది నువ్వే
విజ్ఞానం నేర్చిన వాళ్ళం
విజ్ఞత ఉన్న వాళ్ళం
వివేచనా పొందిన వాళ్ళం
విలువలు తెలిసిన వాళ్ళం
నీ అజ్ఞానపు ఆదిపత్య ప్రొజెక్షన్ ఆపుకో ఇక
లేకుంటే నీ వినాశనం చాల దగ్గరలోనే ఉందిక

Leave a Comment