మెట్లు దిగుతూఉంటే నేను
ఏమైనా మర్చిపోయావా బుజ్జీ అమ్మ పిలుపు
వెనుతిరిగి చూస్తే అమ్మ కళ్ళల్లో దిగులు తెర
మెట్లెక్కి వచ్చి అమ్మ చేతిని ముద్దాడి
పదిరోజుల్లో మళ్ళీ వస్తాగదమ్మా అని
వెనుదిరిగిన నా కంట్లో కూడా ఊరిన నీటి చెలమలు
ఉండవే ఆటో వరకు వస్తా అంటూ వడివడిగా
మెట్లు దిగే అమ్మ అడుగుల్లో మమతల మడుగులు
నేను సంచి పట్టుకుని ఆటో ఎక్కి కూర్చోగానే
“కాస్త ఉండు అబ్బయ్యా” అంటూనే అమ్మ
నాలుగురోడ్ల కూడలిలో ఎడంపక్క
మల్లెపూలు, జాజిమల్లెలు, మనోరంజనాలు
పాటల వినపడుతున్న రాజయ్య అరుపులకు
మూర మల్లెలు మూర జాజులు ,రెండు మనోరంజనాలు
బేరమాడి కొని నా జళ్ళో తురిమి
“మల్లె పూలంటే నీకిష్టం కదా బుజ్జీ ” అంటూ
మరోసారి అనురాగానంతా నాపై కురిపించేసింది అమ్మ
ఊరికొచ్చి వెళుతున్న ప్రతిసారి అంతే
అమ్మ ప్రేమ ఎక్కడా తగ్గలేదు
ఇప్పుడు మల్లెలు ఉన్నాయి, అమ్మ లేదు
కానీ అమ్మ ప్రేమ మల్లెల పరిమళంలా
నా గుండెల్లో నా చుట్టూ కమ్ముకొని ఉంది”

రోహిణి వంజారి
9000594630

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.
guest
0 Comments
Inline Feedbacks
View all comments