పుత్తడి బొమ్మ

శుభోదయం. “బహుళ” పత్రిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికలో నా కథ “పుత్తడి బొమ్మ”. జ్వలిత మేడం గారికి ధన్యవాదాలతో. “పుత్తడి బొమ్మ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపాలని కోరుతూ..

తలుపు చాటు నుంచి వారి మాటలు విన్న ఆమె ఏ నిర్ణయం తీసుకుంది..?
ఆమె నిర్ణయానికి వారు తలవంచారా..?
ఇంకా పూర్తిగా తెల్లవారనేలేదు. చిరుచీకట్లు తెరలు తెరలుగా విడివడుతూ ఉన్నాయి. పెరట్లో జామ చెట్టు మీద పక్షులు మాత్రం అప్పుడే ఉదయరాగాలు అలపిస్తున్నాయి తమ తమ విచిత్ర స్వరాలతో.
బంతులు, చేమంతులు, రాత్రి విరబూసిన సన్నజాజులు సుమధుర పరిమళాలను వెదజల్లుతున్నాయి పెరడంతా. ఆ పువ్వుల్లో పువ్వులా పెరడంతా తిరుగుతూ మొక్కల పాదులు చేసి ట్యూబ్ తో నీరు పెడుతోంది వసుంధర. ఆమె వెనుకే పెంపుడు కుక్క స్క్యూబి కూడా పరుగులు తీస్తోంది. కూతురి పనితనానికి అచ్చెరువొందుతూ అపురూపంగా చూస్తున్నారు ఆమె తల్లిదండ్రులు కోటేశ్వర రావు, పార్వతమ్మ.
కోటేశ్వరరావు కి పెద్ద బజార్ లో చిన్న బంగారు అంగడి ఉంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారంని తన నిరంతర శ్రమతో పాటు ఎదుటివారిని ఆకట్టుకునే మాటకారితనం , మార్కెట్లో వచ్చిన కొత్త పరిస్థితులకు అనుగుణంగా తన వ్యాపారాన్ని సాగిస్తూ కోటేశ్వరరావు శెట్టి మార్కెట్లో నమ్మకస్తుడైన వ్యాపారిగా ఖాతాదారుల నుంచి మంచి పేరు పొందాడు.
లేక లేక పుట్టిన తమ గారాల పట్టి వసుంధరకు చిన్నప్పటినుంచి ఏలోటూ రానీలేదు వారు. తను కోరుకున్న చదువు చెప్పించారు. చదువు పూర్తి కాగానే ఓ చిరు ఉద్యోగ్యం కూడా సంపాదించింది వసుంధర.
“వసూ..ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టు తల్లి. నిన్ను చూడడానికి గుంటూరు నుంచి పెళ్ళివారు వస్తున్నారు” పార్వతమ్మ ఇచ్చిన కాఫీ గ్లాసు అందుకుంటూ పెరట్లో వేసిన పడకుర్చిలో కూర్చున్నాడు కోటేశ్వరరావు.
“నాన్న..అప్పుడే నాకు పెళ్ళి వద్దు నాన్న. జాబ్ లో చేరి ఒక్క సంవత్సరం కూడా కాలేదు ” స్క్యూబిని ఎత్తుకుని బుంగమూతి పెడుతూ వసుంధర.
“ఇంకెప్పుడే తల్లీ. పాతికేళ్ళకు దగ్గర పడుతోంది నీ వయసు. నీ పెళ్ళి చేస్తే మేము ఇక నిశ్చింతగా ఉండవచ్చు” అంది పార్వతమ్మ గ్రైండర్లో మినపప్పు వేస్తూ.
“అంటే ఏంటమ్మా.. సంతలో గంగిరెద్దుని అలంకరించినట్లు నేను అలంకరించుకుని వారి ముందు తలవంచుకుని కూర్చుని, వారికి నచ్చుతానా లేదా అని ఎదురుచూస్తూ ఉండాలా..?ఈ రోజుల్లో కూడా ఈ పద్ధతులు ఏంటమ్మా..? అలా అయితే అసలు నాకు పెళ్ళే వద్దు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడకు పోను” తల్లిని హత్తుకుంది వసుంధర.
” నా బంగారు తల్లీ.. మనం పెళ్ళి ప్రయత్నాలు చేయడం ఇదే మొదటిసారి కాదా. ఈ ఒక్కసారికి మా మాట విను. నీకు నచ్చకపోతే ఇక నువ్వు చెప్పినట్లు వింటాం మేము” చిన్న పిల్లాడు తల్లిని బతిమాలినట్లు కూతుర్ని బతిమాలాడు కోటేశ్వరరావు. తండ్రి మాటలకు మెత్తబడింది వసుంధర.
వారు ఎదురుచూస్తున్న సాయంత్రంతో పాటు పెళ్ళి వారు రావడం కూడా జరిగింది. అబ్బాయి దినేష్, అతని అమ్మా, నాన్న, స్నేహితుడు అంకిత్ వచ్చారు పెళ్ళిచూపులకు.పరస్పర పరిచయాలు, ఫలహారం, కాఫీ సేవనం అయినాక వసుంధర లోపలిగదిలో నుంచి వచ్చి సోఫాలో ఒద్దికగా కూర్చుంది.
పుత్తడి బొమ్మలా ఉన్న వసుంధరని చూసి వారి కళ్ళు తృప్తిగా మెరిసాయి. “అమ్మాయిని ఏమైనా అడుగుతారా బాబు ” వినమ్రంగా దినేష్ ని చూస్తూ అడిగాడు కోటేశ్వరరావు.
ఏం లేదని అడ్డంగా తల ఊపాడు అతను.
“అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళండి. మనం మాట్లాడుకుందాం” షరా మాములే అన్నట్లు చూసాడు శంకరయ్య.
తండ్రివైపు సాలోచనగా చూస్తూ లోపలి గదిలోకి వెళ్ళింది వసుంధర.
“వసుంధర మాకు లేకలేక పుట్టిన కూతురు. తనని అపురూపంగా పెంచుకున్నాం మేము. మంచి చదువు, సంస్కారం చెప్పించాం” వారు అడగక ముందే చెప్పాడు కోటేశ్వరరావు.
“మంచిది. మీకు మా రంగనాధం చెప్పే ఉంటాడు. మా దినేష్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇంకో ఆరు నెలల్లో తన ప్రాజెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడకి వచ్చేసి ఏదైనా బిజినెస్ స్టార్తప్ చేయాలని. అందుకని” అంటూ ఆగాడు శంకరయ్య.
అతని భార్య మోచేత్తో నెట్టింది అతన్ని పూర్తిగా చెప్పమని. ఆయన ఏం చెప్తాడా అని ఆత్రంగా వాళ్ళు ఎదురుచూస్తుంటే తలుపు చాటు నుంచి ఆసక్తిగా వాళ్ళ సంభాషణ వింటోంది వసుంధర.
“కట్నం, లాంఛనాల గురించి కూడా మనం ఓ మాట అనుకుంటే బాగుంటుందని” చివరి మాట నానుస్తూ సాగదీసాడు శంకరయ్య.
“మీరు చెప్పింది నిజమే బావగారు. నాది చిన్న బంగారు వ్యాపారం. పెద్దగా కట్నం ఇచ్చుకోలేను. వసుంధర మా ఏకైక సంతానం. మీకు తెలుసుకదా. నేను వ్యాపారంలో నిలదొక్కుకుని కట్టించిన ఇల్లు ఇది. పెద్దల ఆస్తులు ఏవి మాకు వారసత్వంగా రాలేదు. బంగారు వ్యాపారం మాత్రం నాకు మా తండ్రి నుంచి వచ్చింది. కట్నం ఎక్కువ ఇవ్వలేక పోయినా లాంచనాల్లో ఏ లోపం రానీయం” ఎక్కడ వారు పెళ్ళికి ఒప్పుకోరో అని సంశయిస్తూనే అన్నాడు కోటేశ్వరరావు.
“బాగానే ఉంది. కట్నం ఇవ్వలేం అంటున్నారు. మీ తదనంతరం ఈ ఇల్లు మీ అమ్మాయికే కదా. అదేదో ఇప్పుడే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు అబ్బాయి వ్యాపారానికి పెట్టుబడిగా ఇస్తే బాగుంటుంది కదా. పిల్లల సంతోషం కన్నా మనకు ఇంకేం కావాలి చెప్పండి. మీరు ఏమంటారు..?” తెలివిగా మాట్లాడాను కదా అని భార్య వంక గర్వంగా చూస్తూ శంకరయ్య సైగ చేసాడు. దినేష్ వంక నిరసనగా చూసాడు అతనికి తోడుగా వచ్చిన మిత్రుడు అంకిత్.
వారినుంచి ఊహించని ఆ మాటలకి బిత్తరపోయారు కోటేశ్వరరావు, పార్వతమ్మ. కాస్త తమాయించుకుని సమాధానం చెప్పేలోగా
“ఆగండి నాన్న. నన్ను చెప్పనీయండి” తలుపు చాటు నుంచి సివంగిలా దూసుకువచ్చిన వసుంధర ని చూసి విస్మయం చూస్తున్నారు అందరు ఆమె ఏం చెప్తుందో అని.
“దినేష్ గారు..! మీ నాన్నగారు చెప్పినదాన్ని మీరు కూడా సమర్థిస్తున్నారా” సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ వసుంధర.
“పెద్దవాళ్ళు ఏదైనా మన మంచికే చెప్తారు. నాన్న చెప్పినదాన్లో తప్పేముంది. ఎటూ ఈ ఇల్లు కొన్ని రోజుల తర్వాత నీకే కదా వచ్చేది. ఇప్పుడే ఇస్తే మన వ్యాపారానికి పనికి వస్తుంది కదా” ఆమె కళ్ళల్లో ఎరుపు చూసి కాస్త తడబడ్డాడు దినేష్.
“ఇక చాలు ఆపండి. మీ నిర్ణయం చెప్పారు కదా. ఇక నా నిర్ణయం కూడా వినండి. మా అమ్మ, నాన్న నాకు కష్టం తెలియకుండా చిన్నపటినుంచి బంగారు బొమ్మలా అపురూపంగా పెంచారు. నాన్న రాత్రి, పగలు వ్యాపారంలో కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న మా ప్రేమ మందిరం ఈ ఇల్లు. ఈ రోజు ఇంటిని నా పెళ్ళి కోసం అమ్మేస్తే ఇక వారు ఎక్కడ ఉండాలని. వారికి కొడుకైనా, కూతురైనా నేనే” కాస్త ఆగి గాఢంగా ఊపిరి తీసుకుని
“అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కష్టపడి చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మరి ఈ పెళ్ళి దగ్గరకి వచ్చేసరికి అమ్మాయిలు మాత్రం ఈ కట్నం ఎందుకు ఇవ్వాల్సివస్తోంది..?
ఏం..ఆడపిల్లలు ఇచ్చే కట్నం డబ్బులు లేకపోతే అత్తగారింటి వాళ్లకు గతిలేదా..? ఆడపిల్ల తల్లిదండ్రులు ఇచ్చే కట్నంతోనే మగపెళ్ళివారి బతుకులు గడుస్తాయా..? భర్త అనేవాడు కష్టపడి సంపాదించి భార్యని పోషించుకోలేడా..? అలాంటప్పుడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవడం..? ఇలా కట్నాలు, లాంఛనాలు ఇచ్చిపుచ్చుకుంటే అది కళ్యాణం కాదు. వ్యాపారం. దంపతుల మధ్య ఉండాల్సింది అనురాగబంధం కానీ ఆర్ధికబంధం కాదు. అది బంధనం అవుతుంది అమ్మాయికి, వారి తల్లిదండ్రులకు”ఆవేశంగా వసుంధర సంధించిన ప్రశ్నల బాణాలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు దినేష్.
అతని అమ్మ,నాన్నల చూపులు నిరసనగా, కోటేశ్వరరావు,పార్వతమ్మల చూపులు ఆందోళనగా, దినేష్ మిత్రుడు అంకిత్ చూపులు వసుంధర పట్ల ఆరాధనగా. అందరిమనస్సులో ఆలోచనలు రకరకాలుగా.
“అయితే ఇప్పుడు ఏమంటారు. పెళ్ళిచూపులకని ఇంటికి పిలిచి కూతురిచేత మాటలాడిగించి మమ్మల్ని అవమానపరుస్తారా” కోపమో ఆశాభంగమో తెలియలేదు దినేష్ అమ్మ కళ్ళల్లో.
“మరి..మీ మాటలకు గంగిరెద్దులా తలఊపి మా బంగారు పొదరింటిని తెగనమ్మి మీ చేతుల్లో డబ్బు పోయాలా..? ఒక వేళ మా అమ్మ,నాన్న ఇంటిని అమ్మేస్తే ఇక వాళ్ళు ఎక్కడ ఉండాలని..? ముందే చెప్పాను కదా, కొడుకైనా, కూతురైనా నేను ఒక్కదాన్నే వాళ్ళకి. పెళ్ళి తర్వాత నాతో పాటు మా అమ్మ, నాన్నలను కూడా జీవితాంతం మీరు చూసుకోగలరా..?”
వసుంధర అడిగిన మాటలకు జవాబు రాలేదు వారినోటి నుంచి.
“హు..మీరు చెప్పలేరు. ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులను చూసుకునే ఉదారస్వభావం మీకు లేదు కనుక. కానీ కన్న కూతురిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత జీవితాంతం నాకు ఉంది. ఈ ఇల్లు అమ్మేది లేదు. అత్యాశతో మీరు అడిగినంత కట్నాలు ఇచ్చే ఉద్దేశ్యం కూడా మాకు లేదు. ఇదే నా నిర్ణయం. నా నిర్ణయాన్ని మా అమ్మ,నాన్న కూడా కాదనరనే నమ్మకం నాకు ఉంది. ఇక పొమ్మని చెప్పకుండానే మీరు వెళ్ళిపోతే మీకు, మాకు కూడా మర్యాదగా ఉంటుంది” వసుంధర మాటల్లో ఆత్మవిశ్వాసం పొంగిపొర్లింది.
“ఇంటికి పిలిచి అవమానిస్తారా..? ఆడపిల్లకు ఇంత బరితెగింపు మాటలు పనికి రాదు. మీ అమ్మాయికి పెళ్ళి ఎలా చేస్తారో చూస్తాం ” గొణుక్కుంటూ, తిట్టుకుంటూ దినేష్ అమ్మ, నాన్న ఇంటిబయటకు నడిచారు. వారి వెనుకే మౌనంగా అనుసరించారు దినేష్, అతని మిత్రుడు అంకిత్.
కొండంత ఎత్తుకి ఎదిగిన ఆదర్శాలను పుణికి పుచ్చుకుని, తమపై అంతులేని అనురాగాన్ని కురిపించిన కూతురిని చూసి సంతోషించాలో, పెళ్ళి చూపులు ఇలా రసాభాసం అయినందుకు విచారించాలో తెలియని డైలమోలో పడిపోయారు కోటేశ్వరరావు, పార్వతమ్మలు.
వారం రోజులు మౌనంగా, విచారంగా వెళ్లిపోయాయి.
ఆఫీస్ నుంచి వచ్చిన వసుంధర స్క్యూబితో ఆడుకుంటోంది. కోటేశ్వరరావు కాఫీ తాగుతూ దినపత్రిక చూస్తున్నాడు.
గేటు తీసుకుని లోపలకు వచ్చాడు అంకిత్. అతను దినేష్ మిత్రుడు. అతని రాక వారిలో రకరకాల ఆలోచనలకు తావిచ్చింది.
“రా బాబు. నువ్వు ఆ రోజు పెళ్ళివాళ్ళతో వచ్చావు కదా” అన్నాడు కోటేశ్వరరావు అతనికి కుర్చీ చూపించి కూర్చోమని.
“అంకుల్, నేను ఇప్పుడు మీ ఇంటికి రావడం మీకు ఆశ్చర్యం కలిగించి ఉండచ్చు. నేను మీతో కాసేపు మాట్లాడొచ్చా” అతని చూపుల్లో వసుంధర పట్ల ఆరాధన కనిపిస్తోంది.
“ఏం చెప్పాలనుకుంటున్నారు. దినేష్ వాళ్ళు మీ చేత సంధి రాయభారం పంపారా..?” వసుంధర మాటకి చిరునవ్వుతో
“లేదు వసుంధర గారు. నేనే మీతో మాట్లాడాలని వచ్చాను. ఆ రోజు అలా జరగడం చాల విచారకరం. దినేష్ స్వార్ధపరుడు. తల్లిదండ్రుల అత్యాశకు అతను వంతపాడి మీలాంటి నిజమైన పుత్తడిని వదులుకున్నాడు. నేను మీలాగే కట్నం తీసుకోవడానికి వ్యతిరేకం. నాకు కొన్ని ఆదర్శభావాలు ఉన్నాయి. చదువుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే. నేను చేసుకోబోయే అమ్మాయి అమ్మ,నాన్నలను కూడా నేను జీవితాంతం చూసుకోవాలని అనుకుంటున్నాను. ఆ రోజు మీ ఆదర్శాలు, మీ దైర్యం చూసి మీ పట్ల ఆరాధన భావం కలిగింది. మిత్రుడికి తోడుగా వచ్చి ఆ రోజు మీతో మాట్లాడే సాహసం చేయలేకపోయాను. మీకందరికీ ఇష్టమైతే నేను వసుంధరని వివాహం చేసుకోవాలని ఆశ పడుతున్నాను” మనసులో అనుకున్నదంతా చెప్పేసాడు.
వసుంధర కళ్లలో కనపడిన కాంతుల్లో అంకిత్ కి సమాధానం దొరికింది. ఆ ఇంట పెళ్ళి సందడి మొదలైంది.

2 thoughts on “పుత్తడి బొమ్మ”

Leave a Comment