పాలకోవా బిళ్ళ

పాలకోవా బిళ్ళ మీకు ఇష్టమేనా..? చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. మరి నాకు ఇష్టమైన పాలకోవాని నేను తిన్నానా లేదా.. ఈ నెల [మార్చి ] సాహితీ ప్రస్థానం లో ప్రచురితం అయిన “పాలకోవా బిళ్ళ” కవిత చదివితే తెలుస్తుంది. సత్యాజీ గారికి ధన్యవాదాలతో..
“పాలకోవా బిళ్ళ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..

మా ఇంటి మొండి ప్రహరీ గోడ కింద
కరీం తాత చిల్లర బంకు
నా బాల్యపు తీపి రెస్టారెంట్..
సీసాలో తెల్లగా గుండ్రంగా పాలకోవా బిళ్ళలు
వెండి చందమామల్లా ఊరిస్తూ ఉంటాయి
అణా పైసలకు వస్తుంది నారింజ దబ్బ పుల్లపుల్లగా
అర్ధణ కే నోరు తీపి చేస్తుంది నువ్వులచిమ్మిరి ఉండ..
అందని జాబిల్లి మీదే కదా అమితమైన ఆశ
పాలకోవా ధర పదిపైసలు మరి
నాయనిచ్చే ఎన్నిఅణాలు పోగేస్తే
అంత రొక్కం అయ్యేను..
బడిలో నాగరాజా కొరికి కొరికి
ఊరిస్తా తింటాడు పాలకోవాని ..

బంకులో సీసా చాయ ఆశగా చూస్తానా
రొక్కం మళ్ళీద్దులే బేటీ అంటూ పాలకోవా బిళ్ళని
చేతికీబోతాడు కరీం తాత నవ్వతా..

ఊరికే తీసుకోవడానికి అభిమానం అడ్డు కదా
ఏనాటికైనా రొక్కమిచ్చి కొనుక్కోవాలని కోరికాయే..

ఆ రోజు పొద్దుపోయాక వచ్చాడు పట్నం బాబాయ్
మద్రాసు రామన్న తొలిసారి మా ఇంటికి ..

వస్తానే పప్పలు కొనుక్కో అమ్ములు అంటూ
పది పైసలు నా చేతిలో పెట్టాడు..

అరచేతిలో స్వర్గం అంటే ఆరోజే తెలిసింది నాకు
ఇక రాత్రి నిద్ర వస్తే ఒట్టు..

పాలకోవా సీసాలన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి
తిరగడం ఆగిపోయినట్లు గోడగడియారం ముళ్ళు
ఎంతకీ ముందుకు కదలడం లేదు..

ఈ రాత్రి గడిచేది ఎట్లని..?
తెల్లవారేది ఎప్పుడని..?
కరీం తాత బంకులో పాలకోవా కొని
నాగరాజా ముందు నేనెప్పుడూ ఎచ్చులు పోయేదని..?

ఏ జాముకో ఓ కలత నిద్ర..కలల నిద్ర
కల నిండా తియ్య తియ్యని పాలకోవాలే..

పంచలో పెంకులనుంచి తొలి వెలుగు కిరణం
నులక మంచమ్మీది ముఖం మీద పడనే పడింది.
లేడికి లేచిందే పరుగైనట్లైంది ఇక నాకు

అరచేతిలో పదిపైసలు గుప్పిట మూసి
చిల్లర బంకు ముందుకు పరిగెత్తా ఆతృతగా
పాలకోవా కొనుక్కోవాలని ..

ఎప్పుడూ లేంది బంకు చుట్టూ గుంపుగా జనాలు
బంకు ముందర కరీం తాత పండుకోనుండాడు
కళ్ళు తెరచుకొని శాశ్వత నిద్రలో..

గుప్పిటిలోని పదిపైసలు ఎక్కడ జారిపడిపోయిందో
నేను వెతకనే లేదు..

వారం దినాల తర్వాత కరీం తాత కొడుకు వచ్చాడు
బంకు ఎత్తేస్తున్నాం అంటూ పప్పరమెంట్లు
పంచేస్తున్నాడు అందరికి..

సీసాలో మిగిలిన చివరి పాలకోవాని
నా చేతిలో పెట్టాడు..

అరచేతిలో అప్పటిదాకా నేను కలలు కన్న స్వర్గం
ఆ రోజు మాత్రం చేదుబిళ్లలా అనిపించింది
కరీమ్ తాత నవ్వుల తియ్యదనం లేక..