సినీవాలీ పత్రిక నిర్వహించిన కవితల పోటీ లో బహుమతి పొందిన నా కవిత “పహారా”
గెనెమ గట్టు-నే కొలిచే గుడి మెట్టు
పచ్చని పొలం- నా ప్రార్ధన మందిరం
అన్నం విత్తులతోపాటు, ఆశల విత్తులు
కూడా కొన్నిటిని మడిఅంతా చల్లుకుంటాను
నేల నీరు గాలి వాన
కనిపించే దైవాల కనికరం కొరకై..
కళ్ళు తెరుచుకునే తపస్సు చేస్తుంటాను
అనుక్షణం కరుణించమని..
దేశ సరిహద్దుల్లో తుపాకీతో
జవానన్న పహారా కాస్తుంటే
కంచె వేసిన చేలో మంచె మీద నిలిచి
ఉండేలు తిప్పుతూ పంటని
కాచే పహారాని నేనే ఇక్కడ..
కోతకొచ్చిన పంట మీ నోటికందించేలోగా
ప్రకృతిలోని వినాశకర వికృతులు
నన్ను నిలువునా నిలువరించుతున్నా
వ్యవస్థలోని విధ్వంసక కుశక్తులు
నా నోటికాడి మెతుకులను లాగేస్తున్నా
తీరని రుణాలు కొండలా పోగుపడుతున్నా
ఆవేదనతో చిల్లులు పడ్డ నా ఆకలి పేగులకు
మళ్ళీ మళ్ళీ మాచికలు వేసి కుట్టుకుంటూ
మీ ఆకలి తీర్చడానికి నేను
ఆరుగాలాలు శ్రమిస్తూనే ఉంటాను
ఆశ, నిరాశల త్రిశంకుస్వర్గంలో
ఊగిసలాడే మీ అన్నదాతను నేను