నేను తిన నీకు బెట్ట

నమస్తే ఫ్రెండ్స్.. నవ తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “సోపతి” 10-01-2021 సంచికలో నేను రాసిన పిల్లల కథ “నేను తిన నీకు బెట్ట” . చదివి మీ అమూల్యమైన అభిప్రాయంని తెలుపుతారుగా.

జోగులాపురంలో ఆంజనేయులు అనే వ్యాపారి ఉండేటోడు. అతను కిరాణా వ్యాపారం, మిత్తి వ్యాపారం జేసి రెండుచేతుల సంపాదించి లక్షలు కూడబెట్టిండు. కానీ అతను పరమ లోభి. అన్నం తినే చేత్తో కాకిని తరిమితే అన్నం మెతుకులు ఎక్కడ కింద పడతాయో అని భయపడేటోడు. పిల్లికి బిచ్చం బెట్టి ఎరగడు. అతని భార్య నరసమ్మ, అతని ఇద్దరు కొడుకులు అజయ్, విజయ్ లు అతని పిసినారితనాన్ని రోజు తిట్టుకొనేవారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం, ఇంట్లో పండగలు కానీ, పిల్లల పుట్టిన రోజులకు కానీ ఒక్క వేడుక జరిపించేవాడు కాదు. ఉన్న సంపదనంతా ఇనప పెట్టెలో దాచి పెట్టి రోజు చూసుకుంటూ మురిసిపోతూ, పైకి మాత్రం ఏమీలేని కటిక దరిద్రుడిగా కనిపించేటోడు. పిల్లలకు కూడా ఏడాదికి ఒకసారైనా బట్టలు కొనేటోడు కాదు. చినిగిన బట్టలు వేసుకుని వాళ్ళు బడికి పోవాల్సివచ్చేది. భార్య, బిడ్డలకు తిండి కూడా సరిగా పెట్టేటోడు కాదు. ఊర్లో అంతా అతన్ని పిసినారి ఆంజనేయులు అనేటోళ్లు.
ఊర్లో కానీ, పక్క ఊర్లలో కానీ కాస్త ముఖ పరిచయం ఉన్న వాళ్ళు అయినా, దూరపు చుట్టాలైనా సరే మాటవరసకు వాళ్ళ ఇళ్లలో జరిగే వేడుకలకు ఆంజనేయులును పిలిస్తే చాలు, మొత్తం కుటుంబంతో సహా హాజరై విందుభోజనం చేసి, ఆ పూటకు భోజనం ఖర్చు మిగిలింది అని ఆనందించేవాడు. తాము ఎవరిని ఏ వేడుకకు పిలువక, ముఖ పరిచయం కూడా లేని వాళ్ళ వేడుకలకు ఆంజనేయులు బలవంతం మీద వెళ్లి, అక్కడ విందుభోజనం తినేదానికి అతని భార్య, పిల్లలు సిగ్గుతో చచ్చేటోరు. పిసినారి ఆంజనేయులు పిల్లలు అని అందరు గుస గుసగా అనుకుంటుంటే వాళ్ళకి తల తీసేసినట్టు ఉండేది. ఆంజనేయులు మాత్రం ఎవరేం అనుకున్న మొహమాటం లేకుండా తిని, విందు భోజనంలో మిగిలినవాటిని పొట్లం కట్టించుకుని మరి ఇంటికి తెచ్చుకునేవాడు. అలా నెలలో సగం రోజులు వాళ్ళ ఇంటిలో పొయ్యి వెలిగేది కాదు.
ఆంజనేయులుకు రోజులు ఇలా గడుస్తుండగా ఓ రోజు పొరుగూరిలో దూరపు చుట్టాల ఇంటిలో పెళ్లి అన్న సంగతి గుర్తుకు వచ్చింది. ఎప్పుడో నెల రోజుల క్రితం సంతలో ఎదురైనా చుట్టం మొహమాటానికి వాళ్ళ బిడ్డ పెళ్లి అని శుభలేఖ ఇస్తే అది గుర్తుపెట్టుకుని ఆ రోజు సాయంత్రం ఆదర బాదర గా భార్య, బిడ్డలతో పక్కూరికి బయలుదేరిండు. పెళ్లి వేకువజామున అవడంతో ఆ రాత్రికి వాళ్ళు పెళ్ళివాళ్ళ ఇంటిలోనే ఉండిపోయారు.
పక్కరోజు పొద్దున ఇంటికి వచ్చిన ఆంజనేయులుకు ఇంటి తాళం తీసినట్టు ఉండడంతో గుండె గుభేలుమని ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇంకేం ఉంది. ఇనుప పెట్టి తాళం పగులగొట్టి డబ్బునంతా ఎవరో దొంగలు దోచుకుపోయారు. డబ్బు, నగలే కాకుండా, ఇంటి ముందర ఉన్న కిరాణా అంగడి సామానంతా దోచుకుని ఇంటిని ఆగమాగం జేసీపోయిండ్రు తాను తినక, ఇంకోళ్ళకి పెట్టక కూడబెట్టిన సొమ్మంతా దొంగలు దోచుకుపోయేసరికి నెత్తి, నోరు బాదుకుంటూ భార్య, పిల్లలతో కట్టుబట్టలతో నిలబడ్డాడు ఆంజనేయులు. పిసినారి ఆంజనేయులుకు తగిన శాస్తి జరిగింది అని ఊరివాళ్ళు సంతోషించినా, సహృదయురాలు అయిన అతని ఇల్లాలు నరసమ్మ, అమాయకులైన పిల్లల ముఖాలు చూసి జాలిపడి ఊరివాళ్ళు అందరు తలా కొంత చందాలు వేసుకుని కొంత సొమ్ము ఆంజనేయులుకు ఇచ్చారు. ఇంత కాలం తాను మిత్తీల కోసం ఊరివాళ్లను పీడించినా వాళ్ళందరూ తనకి సాయపడడం చూసి ఆంజనేయులుకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత కాలం తాను ఏం కోల్పోయాడో తెలిసి వచ్చింది. ఎవరో కవి చెప్పినట్టు” తనుతినక, ఇతరులకు పెట్టక కూడపెట్టిన సొమ్మంతా తుదకు దొరలపాలౌనో, దొంగల పాలౌనో, తేనెటీగలు కూడపెట్టిన తెనేనంతా తెరువరులకు ఇచ్చినట్టు ” తన సొమ్ము అంతా దొంగలపాలైయింది అని ఆంజనేయులు బుద్ధి తెచ్చుకుని ఆ రోజు నుండి మిత్తీ వ్యాపారం మానేసి, ఊరివాళ్ళు ఇచ్చిన సొమ్ముతో, పిల్లలిద్దరి సాయంతో కస్టపడి కిరాణా వ్యాపారంని చేసి ఆనతి కాలంలోనే మళ్ళీ ధనవంతుడు అయినాడు. ఇప్పుడు మాత్రం సంపాదించినా పైసలును తాను, తన కుటుంబం అనుభవించడమే కాకుండా, కొంత సొమ్మును అవసరం అని అడిగిన వాళ్లకు సాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. దాంతో ఆంజనేయులు ఇపుడు పిసినారి ఆంజనేయులుగా కాకా దానం చేసే ఆంజనేయులుగా పేరు తెచ్చుకున్నాడు.

2 thoughts on “నేను తిన నీకు బెట్ట”

Leave a Comment